Monday, December 27, 2010

ఆనందం

ఆనందం, ఆనందం, ఆనందం,
ప్రవహించే నదుల పైన
చెదిరే తుంపరల లోన
సూరీడు ఏడు కళల
వెలుటను చూచుటలో ||ఆనందం||
పూవు పూవు మీద సాగు
పుప్పొడి పాదములంటగ
తేనె కొరకు పరుగు తీయు
తూరీగల హొయలలోన ||ఆనందం||
ఆవు తనదు లేగ కొరకు
అంబా అని అఱచుచు
సాయం గోధూళి వేళ
ఎదురుగ దూడను చూచి,
మురిసే గోమాత ముఖము
లోన తొంగి చూచునట్టి ||ఆనందం||
ఆ ప్రకృతి సొగసులు
ఏవీ,ఏవీ, నేడు
ఆ రోజులు ఆ పల్లెల
అందాలు తిరిగి వచ్చు
నన్న ఆశలోన కల్గు ||ఆనందం||
(పారిశ్రామిక వాడల ప్రణాళికలలో రంగులు తప్పుతున్న పల్లెటూర్ల మిద )
౨౭-౧౨- ౨౦౧౦

Tuesday, December 21, 2010

జడత్వం

జడత్వం,జడత్వం,జడత్వం
ప్రకృతిలో చైతన్యపు దారులకు స్పందింపక
మౌనముగా నివసించుట జడత్వం
వెలుగు రేఖలా కొరకు వెదకుటను మాని వేసి
చీకటిలో రోయుటే  జడత్వం.
మంచి  చూచి స్పందింపక, మానవతను పరికింపక
తన కోసమె తను బ్రదుకుట జడత్వం.
భాధ తనను కుదిపి వేయ,
రోదించుట మాని వేసి,
వేదనలితరుల వైనను
సాధనతో తగ్గించి,
ఆనందపు అవధులను
అందరికీ అందించే
మానవుడిని చూచి పరుగు
తీయు చూడు జడత్వం.
21-12-2010



Monday, December 6, 2010

కీర వాణి 8

స్వామీ!
అర్భకుండనైనాను అలుసత బ్రదికిన వేళ 
తెలియదు బ్రదుకిన్ని గతుల మార్పులు మరి వచ్చుననీ
ఆవేదన, ఆవేశము,  ఆక్రందన అనుకంపన
అనుపదముల కర్థములు అసలే తెలియవు నాకు.
మనసు పొంగ మాటలతో  తనువు పొంగ నాటలతో
గడిపి వేసి, గడిపి వేసి  కనుల తెరిచితొకనాడు
చదువే నా లోకమని బ్రదికితి నా యౌవనమున
లోకపు రీతుల తెలియక గడిపితి నా రోజులను
ఈ అనుక్షణ సాధనలో ఈ తెలియని లోకములో
ఎందుకో  నా మది   ఈ రీతిన ఈ నాడు 
ఆవేశాలకు లోనై   ఆవేదనలకు తావై
అనుక్షణము ప్రతి దినము అలమటించు  నో స్వామీ!
అర్భకుడను  కాను నేను అలుసుదనము లేదు నాలో
లోకములో జరుగు మార్పులను చూచిన ఆవేదన
ఎపుడు ధర్మ పాలన వచ్చునని నిరీక్షణ
తెలుసులే జవాబు రాదు  ఈ ప్రశ్నకు బదులు లేదు.


కీర వాణి 7

అడుగు లోన అడుగు వేసి నడచినాను ప్రతి పదము
ప్రమాదమును సూచింపగ నీ కొరకై వేచినాను
గమ్యము ఏదో తెలియక ఆకసమున రంగులన్ని
క్షణ మాత్రమె నిలుచునని ఎరుగనైతి స్వామి! నేను
అందుకొనగ తలచినాను సొంతమని అరచినాను
అడుగు లోన అడుగు వేసి ఆ వైపుకు నడచినాను
రంగులవే వెలసి పోయె నా మార్గము మారి పోయె
గత స్మృతుల నీడలలో ఆడుకొనుచు నిలిచినాను
అంతు లేని ఆశలతో నా భాధ్యత మరచితినా?
భాధ్యతల భారముతో గమ్యమునే వదిలితినా?
నియమిత మార్గమునెరుగక నిలకడగా మెలగ లేక,
ఈ విధి నేకాకినైతి ఎవరు నాకు తోడు రారు.
నా ధర్మము నెరుగ లేక నీ కొరకై నిలిచినాను
నా మార్గము సూచింపగ  రా రమ్మని వేడినాను
ప్రభూ! ఏల రాజాలవు? ఎద భాధను మాంపవా?
గతి తప్పిన పాంథుడి కొక వెలుగు రేఖనీయవా?

Saturday, December 4, 2010

కీర వాణి 6

మరచినావు నన్ను నీవు ఓ ప్రభూ!
మరచి చితుల రగిలించేవు.
పసితనాన నాలోన ప్రబలిన ఏదో కతమున
ఏ దోషము జరిగినదో ఏల నన్ను మరచితిరే?
అను దినము అను క్షణము అమరమైన దైవ స్మృతితొ
అలరాలగ నా మనసున అనుకుంటిని  నాడు 
అలసటతో మనసు సొలసి అలమటించి నీ సేవల
చేయనైతి నేడు ప్రభూ! ఈ దోసము మన్నింపుము.
నీ ప్రార్థనలోనె నేను నిఖిల జగము నెరిగినాను.
నీ ప్రేమతొ లోకమ్మున ప్రేమను వీక్షించినాను.
ఏ గత కాలపు దోసమొ ఎగతాళిగ మారె బ్రతుకు
ఏల నేను ఏ రీతిన ఎంత కాల మోర్వగలను?
మరచినావు నన్ను నీవు ఓ ప్రభూ!
మరచి ఏల నా ఎద రగిలించేవు?
గుండెలలో నిన్ను నేను నింపుకొని
గుంభనగా నీ పూజల చేసితిని.
అనుకొంటిని ఆ నాడు ఏ దోసము చేసితినో
ఏ గత రీతుల దోసమొ ఎగతాళిగ మారె బ్రతుకు
మరచినావు నన్ను నీవు ఓ ప్రభూ!
మరచి ఏల నా ఎద రగిలించేవు?
కైలాసమ్మున ఉన్నావనుకొని కామితార్థముల నేను కోరగా
నేరక  నాకు ఏమి కావలయు ఎరుగుదు నీవని ఎదనెంచీ,
తండ్రీ, ఓ తండ్రీ, నా  పుర హర హర హర రా రా
అని మరి మరి మరి వేడితి ఏల నీవు రా నేరవు?

కీర వాణి 5

ఆకసమున సాగే ఓ మేఘమా! ఆ నాటి నన్ను గురుతు తెలియునా?
ఆ కాలువ గట్టు మీద ఆ ఇసుక తిన్నెలపై
హాయిగ శయనించిన ఆ వేళలో ఆనందము పొంగి పొరల మేనులో
ఒంటరిగ నడిచిన నా వెంట నీవు యున్నావు.
తుంటరి తలపులు తరుమగ వర్షము కురిపించినావు.
వడిగా సాగిన గాలుల నాపి పెట్టి ఛలి వేళల
కనిపించి నీకు నేను తోడుంటానున్నావు.
ఆకసమున సాగే ఓ మేఘమా! ఆ నాటి నన్ను గురుతు తెలియునా?
ఒటరిగా నున్న నన్ను పల్కరించ లేవు నేడు
నాటి మధుర స్నేహాన్నొక నాటి తోనె మరిచావు.
ఆకసమున హాయిగ నీవు సాగేవు ఒంటరిగా నన్ను నీవు వదిలేవు.
చితికే గుండెల బాధను చిదిమె నెత్తురు రంగును
మఱచినావు ఒక నాటితో మరలి రావు నా కొరకై
ఆకసమున సాగే ఓ మేఘమా! గుఱుతు మఱచి చనినావు తెలియునా?  

Friday, December 3, 2010

కీర వాణి 4

గతమున ఎదలో నిలిచిన గాథలను తిరిగి పలుక
పిచ్చివాడినంటారు ఫలితమేమిటంటారు.
వడిగా నే పరుగు తీసి వడలిన నా ముగము తోనె
చింత చెట్ల కొమ్మలపై ఊయల లూగాను నాడు
కింద పడుదువన్నారు చేయి విరుగనన్నారు.
నా ఎదలో పొంగునట్టి ఆనందము నీగలరా?
పరుగులతో కాల్వ చేరి  ఈత కొఱకు దూకగనే
ఈత రాదు అన్నారు  మునిగి పోదువన్నారు.
ఎదలో నిండుగ నిలిచే ఆనందము నీగలరా?
అకాశమునందుకొనే ఆ కొమ్మల కట్టిన
గడ్డి వెంటులను నూయ లూగ తలచి ఎక్కాను.
జారి పడుదువన్నారు  కాలు విరుగునన్నారు.
ఎదలో పొంగే ఉరుకును ఆపి పెట్ట గలరా?
గతమున ఎదలో నిలిచిన గాథలను నేను పలక
పిచ్చివాడినన్నారు ఫలితమేమిటన్నారు?
గత మధుర స్మృతులు ఇచ్చు ఆనందమునీ గలరా?

Tuesday, November 30, 2010

కీర వాణి 3

ఆకుల తిరిగే పురుగుల హొయలు చూచు వేళ
పసుపు రంగు పుప్పొడులా పూలు విరియు వేళ
ఎద పొంగెను గొంతు పలికె
నవ వసంతు హొరగు చూచి
చల్లని గాలుల వడికి మేను పులకరించె
పచ్చని పుప్పొడులు ఒడలంతా నిలిచె
పరిమళాల ఎద పొంగె
నవ వసంతు నట చూచి
చిన్ని చిన్ని పిందెలతో రసాలములు చెలగె
ఆనందము ఎద నిండగ కోయి గొంతు మార్చె
వగరు వాసనలవె తోచె
కౌమారత పులకరించె
కమ్మని నీలాల తోడి రసాలు కాటు వేసి
రుచులన్నీ చూచినాను ఎద పొంగగ అఱచినాను
రోహిణి తనె వచ్చెనని
మఱచినాను ఎదలోన
వాడి గ్రీష్ముల తాకిడి, ఆర్చినాను సోలినాను
ఎద నిండుగ నిలిచిన మిత్రులకై చూచినాను
ఏడీ ఆ వసంతుడు? ఏదీ మిత్రము కోయిల?
ఎక్కడ త్రాగను నీరు? ఎటు పోదును నేడు నేను?
గొంతెండగ అఱచినాను.
దప్పికతో నిలిచినాను. 

కీర వాణి 2

వింటావా  ఓ చెలియా! నా కథ
విని ఏమంటావు బదులు నా సమస్యకు?
చిన్న నాడు చిరు గాలుల ఇసుక తిన్నెలను నాడుచు
హాయిగా తీయగా అలా గడిపివేశాను.
చిరు కాల్వల అలలలో సొగసుల సాయం సంధ్యను
హాయిగా కలలలో అలా దాచుకున్నాను.
చిరు గాలులు పోయె నేడు సుడి గాలుల నిలిచినాను
రెక్కలవియ ఎగిరినాను, గమ్యమేది కాన రాదు.

సంధ్యారుణ కాంతుల సొగసు నేడు చూడ లేను
చీకటిలో కనలుతూ నా లోనే కుములుతూ,
                         వింటావా?
కమ్మని మామిళ్ళను కాటు వేసి తినినాను
కమ్మని ఆ రుచుల నాదు స్మృతుల దాచుకున్నాను
చేదునైన తీపిగాను జీవితమున తలచి నేను
ఇలా ఇలా నేడు నేను గడపి వేయుచున్నాను
                                విన్నావా?

కీర వాణి 1

ప్రభూ! ...ప్రభూ!
మనసు లోన ఉన్న మాట వినను నీకు కాలమేది?
పలకరించినను నేను పలక వేల స్వామీ!
              బదులు పలకవేల స్వామీ!
ఘడియ ఘడియ జరిగి పోవు కాల గతిని చూస్తావు
ఎడద ఎడద సోకు భక్తి పిలుపులను వినవు.
పైకి రేగు అలల సంద్రమందు నీవు ఉంటావు.
అలల లోన అలమటించు అభాగ్యులను గమనించవు 
మంచి మంచి మావిళ్ళను విరగ పూయమంటావు
నీరు లేక అల్మటించు నిర్భాగ్యుల గమనించవు.
ఓ ప్రభూ! ఓ ప్రభూ!  వినవా?
నాలో రగిలే వ్యథ.
విని నన్ను పలకరించవా?
పలకరించి బాథ తీర్చవా?

Monday, November 22, 2010

కృష్ణ బిలము

నేనొక కృష్ణ బిలాన్ని 
అనంత నిశాంత వ్యోమ వీధుల్లో కాళ రాత్రిని 
అఖండ కాంతి పుంజాలనే హరించే అమావాస్య చంద్రుడిని 
గగన వీధులలోన నా కెదురు లేదు 
హరియించు  ద్రవ్య రాశిని కాక తీక్ష్ణ 
కాంతి పుంజంబుల కనికరము లేక .
నా నుండి కాంతి రేఖలు దాటి పోలేవు.
ఒక నాడు విశ్వంబు ఉద్భవించే వేళ
గగనంబులో వాయు సంద్రంబు నాడు 
అతి గురుత్వాకర్షణ శక్తి కలిసి,
తారలు గా దివి వేలిసినారము నాడు 
నా లోని ఉదజని హీలియమ్ముగా మార
అత్యంత కాంతితో మెరిసితిమి తారలుగ
హీలియమ్మన్తయు కర్బనమ్ముగా  మార 
మధ్య  వయస్సుకు అడుగిడినాము
ఉన్న శక్తంతయు ఉడిగి పోయే వేళ 
మాలోని అణువణువు మథనమ్ము చేసి 
ప్రోటాన్ ఎలేక్త్రాన్స్ నూట్రాన్లుగా మారి
సమ విద్యుత్తుతో సమ విద్వత్తుతో 
న్యూట్రాన్ నక్షత్రముగా మారినాము 
మాలోని కొందరు వణుకు వృద్ధులుగా 
పల్సార్లుగా మారి పల్కరించేరు.

ఎక్స్ రే విద్యుదయస్కాంత తరంగములు
మా లోని శక్తిని మరి మరి పీల్చ 
వృద్ధాప్య దశ దాటి కృష్ణ బిలాలుగ
మారి మీకీ కథ వినిపించినాము


Friday, November 19, 2010

భావుకుడి భ్రమ

ఫెళార్భటులతొ నల విద్యుద్వల్లితో
సాగేనదే ధవళ మేఘం,ప్రాకేనదే అంధకారం.

ముంచెత్తి పోయంగ జలధారలా
ముదముతో పులకించె భూదెవతా,
కాలువలు పారేను, ఏరులై పొంగేను,
గలగలా ధ్వనులతో పుడమి ఉప్పొంగగా||

తెలె తెల్ల వారేను, మబ్బు తెర విడచేను,
ఆకులలో నిలిచిన ఆ నీటి ముత్యాలు,
కిరణాలతో చేరి రంగులే చిమ్మేను.||

భువినుండి దివికి పోయాము మనము,
ఎదలోని భావాలు రాగాలుగా మారి
భావుకుల మదిలోన పదిలముగ నిలిచేను.

కలువ నిరీక్షణ

ఎంత కాలమని వేచేను? ఎంత వఱకెదురు చూచేను?
పసి తనంపు ఆశలతో,సౌగంధపు బాసలతో.

వయసు నాది ముప్పది ఘడియలు వలపు తలపులింకి పోవు,
పెను తుపాను వచ్చినచో,పసితనము అశించి పోవు.
కలత లేని కొలను ఇల్లు కలక బారి ఛిద్రమాయె
ఎదురు చూచి,ఎదురు చూచి, ఎదను ఆశ సమసి పోయె.

రవి కిరణ సహస్రము నా అణువణువును కాల్చి వైచె,
ఏడి, ఏడి, ఏడి ఱేడు? కాన రాడు, కాన రాడు.
మబ్బు పొరలు విచ్చుకొని ఎద కలతను తీర్చి పోడు.

Wednesday, November 17, 2010

లక్ష్య ము

                      ఇది పూర్తిగా తెలుగు బ్లాగు. తీయని తెలుగులో ఆసక్తి యున్న వారితో అభిప్రాయములను పంచుకొనుట దీని యుద్దేశ్యము. అంతే గాక కవితలు, కథలు ఇందు లో యుంచ బడును.