Tuesday, January 25, 2011

ఆశ


కష్టమున సాగు నీ వేళ కలత తీరి
గట్టు చేరిన చాలును గమ్యమదియ
పెను ప్రవాహమ్మునందు పిపీలికముకు
హరిత పత్రము చాలదా ఆశ రేప

Wednesday, January 12, 2011

సాయం సంధ్య



ఇది సాయం సంధ్యా సమయం
గగనమ్మే అరుణ మయం
అటు నింగిన చుక్కలు పొంగులు పోతూ
చంద్రుడి కొఱకై వేచి చూచే
                   సాయం సంధ్యా సమయం.
పక్షులు గూటికి చేరే
తమ శిశువులు వేచి చూడ
తమ మనసున మమతలు వెతలును మఱువగ
ఉద్వేగముతో ముందుకు సాగే
                        సాయం సంధ్యా సమయం
ఏడీ ఱేడు ఏడీ
గగనమ్ముకు రాడేడీ
అని కలువదె మనసున కలతను కలగి
విరహోత్కంథత వేచే
                   సాయం సంధ్యా సమయం
మత్తును గొలిపే మలయానిలము
మన్సున ఆశలు రేప
ఇంతింతై అంతై ఎంతో
ఆశతొ వేచే విరహిణి రాధకు
                  సాయం సంధ్యా సమయం


భ్రమ

పొంగులు వారే ఆనందపు సంద్రమున నీ డెందము
రంగులు చిందే ప్రకృతిలోని హరి విల్లు యొక్క చందం
చూచి, చూచి మనసాలపించి ఎద పొంగి పోయెనా?
వేచినా గతపు రోజుల వెలుగు నేడు చేరునా?
మంద మరుదముకు డెందము పొంగునొ?
అరుణ ధీధితుల చరణము కదులునొ?
అణువణువణువున ఒయ్యారము లొలికెనొ?
కనువిందాయె మయూరపు లేమ.
కాదు కాదు పొరపాటాయెనది
నెమలికాదొక మేఘపు పంక్తి,
ఎదలో రగిలిన భావ మాలిక
విరిసెను ఈ విధి గేయ రూపిక


వాణి

సకల కళా విదుషీ మణి వీణా పాణి వాణి
సంగీత సాహిత్య వైదిక విద్యల రాణి
పలుకుల లోన సాహిత్యం,  పదముల సవ్వడి సంగీతం
వేదములే వాక్కు అట వేరే పోలిక లేదుట
నీటిని పాలను వేరు చేసే హంసయె నీకు వాహనము
మంచీ చెడులను నిరూపించెడు తర్కమె నీకు ఆయుధము.
అనుభూతు లను మనుజుల పంచి హృదయ స్పందన కల్గించే
కవి శిఖామణుల కావ్య మాలికల పరిమళ లహరి నీవేనా?
సరిలయల సరిగమల చరణ కింకిణుల పలికించే
అమర లోకాల దరుల చూపిచు మధుర గీతమ్ము నీవేనా?
తల్లీ నీకు జోహార్లు, కన రావా మాదు లోగిళ్ళ
మధుర గీతముల మనసు మురిపించ మార్చ లేవా మనుజుల.