Thursday, April 7, 2011

శిల్పి 2


(శిల్పి 1 తరువాత )

అణువణువున సొగసులతో
అలరించే ప్రకృతి
భగవంతుడి ప్రతి రూపము
పరవశింప చేయు నిజము
స్పర్శ చేత పరవశింప
చేయు పిల్ల గాలులు
ఆకాశపు మేలి ముసుగు
లాగ సాగు మేఘాలు
 వీటి నుండి తొంగి చూచి
పలకరించు ప్రకృతి
నిజమిది నిజమిది నిజము
అలరించే అద్భుతము 
        సాయంసంధ్యా సమయమయినది. ఆకాశములో పక్షులు బారులు బారులుగా పోతున్నవి. ఆకాశము క్రమముగా నీలి రంగునుండి ఎఱుపు రంగు లోనికి మారుతున్నది. ఆచార్యులుగారు చేతిలొ గుడ్డలతో వేద పథనము చేసుకుంటూ కాలువ దగ్గిఱకు చేరినాడు. వెనుక ఇద్దరు శిష్యులు తోడుగా గొంతు కలుపుతున్నారు.
     కాలువ దగ్గిఱ గుట్ట పైన ఒంటరిగా ఒక యువకుడు రాతి బండ మీద సుద్దతో గీస్తున్నాడు, తుడిపి వేస్తున్నాడు, మళ్ళీ గీస్తున్నాడు. కాంతి తగ్గి పోతున్నది. సాయంత్రమవుతున్నదనే భావన అతడిలో కలుగుట లేదు. ఆచార్యులు గారు అతడి దగ్గిఱకు వెళ్ళినాడు. ముఖములోనికి తేరి పార చూచినాడు. అతడు విశ్వ కర్మ కుమారుడు.
  "నాయనా!  శ్రీ నాథా!" పల్కరించినాడు.
పరధ్యానములో నున్న శ్రీ నాథుడొక్క సారి ఉలిక్కి పడినాడు. వెంటనే లేచి నిలబడినాడు.
"ఆచార్య దేవా! నమస్కారములు."
"శ్రీనాథా! చీకటి పడినది కూడా తెలియ లేదా? ఇక ఇంటికి వెళ్ళూ బాబూ!"
"అలాగే గురు వర్యా!"
"శ్రీ నాథా! ఒక్క నిముషము. నీతో కొన్ని విషయములు ప్రత్యేకముగా మాట్లాడాలి. రేపు ఒక ఘడియ ముందే రావాలి."
"అలాగే గురు వర్యా! నేను పోయి వచ్చెదను.", అని బయలు దేరినాడు.
  శ్రీనాథుడి మనస్సులో ఆ చిత్రము చెఱగటము లేదు.రెండు రోజుల ముందు నగరాధిపతి ఇంట భరత నాట్య ప్రదర్శన చూచినాడు.నాథుడిని విడువ లేక విడువ లేక పుట్టింటికి పొయే యువతి, వస్తానన్న కృష్ణుడు రాలేదేమన్న గోపికల కలవరము, నీవే నా ప్రాణమన్న నాథుడి మురిపాలకు సతి ముఖములో కనిపించే మెఱపు, ఓ...ఒక్కటి కాదు, ఎన్నెన్నో భావాలు, ఒక దాని వెంబడి ఒకటి, పదములో, కదలికలో, కన్నులలో..... మఱపే రావటము  లేదు. తన ఆప్తులతో ఈ విషయమే మాట్లాడినాడు.
       గీతలు గీచినాడు. అది తన ఊహలకనుగుణముగా రాలేదు, మళ్ళీ గీచినాడు, మళ్ళి గీచినాడు.ఆశ్ఛర్యముగా తను అనుకున్న రూపము వచ్చినది. ముఖములో భావములు స్పష్టముగా కనిపిస్తున్నవి. స్నేహితులకు చూపించినాడు. ఇంకేమిటి?రాతి మీద చెక్కమన్నారు.
   చిన్నప్పటినుండి శిల్ప విద్య నేర్చుకోవాలని యున్నది.నాన్నగారందులో నిపుణులు. కానీ, తనకు వద్దంటాడు. కానీ మామయ్య చాలా ఆసక్తితో దగ్గిఱ కూర్చో పెట్టుకొని, తనకు అన్నీ నేర్పించినాడు. ఎటువంటి రాతిని తీసుకోవాలి? ఎలా దానిని తయారు చేసుకోవాలి? పనిముట్లను ఎలా వాడాలి? తనకు వచ్చిన విద్య యంతా మామయ్య పెట్టిన బిక్షే .
    హేమ మామయ్య కూతురు. తను నేర్చుకుంటూంటే అన్నీ దగ్గిఱ యుండి చూచేది.
    హేమకు నేనంటే ఇష్టముందో లేదో తెలియదు.
    హేమ యొక అందాల బొమ్మ. హేమ తనతో యుంటే...ఓహ్... ఇంకేమి? ఇక ఈ కొండలలో హేమ బొమ్మలే యుంటాయి.
      ఈ ఆలోచనలతో  ఇంటికి చేరేసరికి బాగా చీకటి బడినది. నాన్నగారు ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఆయన దృష్టిలో పడకుండా ఇంటి వెనుక వైపుకు నడచినాడు.
(తరువాత భాగము త్వరలో)



Sunday, April 3, 2011

శిల్పి 1


                                        
            (ఈ కథ సుమారు వేయి సంవత్సరాల క్రింద భారత దేశ పరిస్థితుల దృష్టిలో పెట్టుకొని వ్రాయ బడినది. ఆ నాటి కళాకారులలో మారుతున్న పరిస్థితులను అనుసరించి జరిగే సంఘర్షణ దీనికి మూలము. )

లౌకిక జీవితము పారమాత్మిక జీవితము ఒకటి కాదు.కర్తృత్వము, కర్మ భగవంతుడిని తెలుసుకొనుటకు అడ్డము రావు. నిజానికి, కర్మ ఫలాపేక్ష లేకుండా చేసే చేతలే భగవంతుడి దగ్గరికి చేర్చే మార్గాలవుతాయి. సన్యాసమంటే లౌకిక మైన జీవితాన్ని వదలి వేయుట కాదు. అధికత్వ భావాన్ని, స్వార్థాన్ని  వదలి వేయుటే  నిజమయిన సన్యాసము. కర్మాచరణ, కర్మ సన్యాసముల రెంటి యొక్క పరమావధి, మనలోనున్న మనలను గుర్తించుటకు, బ్రాహ్మణమును గుర్తించుటకు, వాటి ఏకత్వాన్ని అవగాహన చేసుకొనుటకు. -ఈశోపనిషత్‌.
ఆచార్యులుగారు ఆపినారు.
          శిష్యులందరూ ఆచార్యుల వారినే చూస్తున్నారు.
        "సాన్దీపా! శ్రీనాథుడేడీ?"
      "ఉదయాన్నే వచ్చినాడు ఆచార్యా! ఏదో ఆలోచిస్తూ ఉండినాడు. ఎప్పుడు వెళ్ళి పోయినాడో, గమనించ లేదు."
        "ఆసక్తి లేనపుడు ఏదియు బలవంతముగా రాదు. అలాగని శ్రీనాథుడు మూర్ఖుడు కాదు, జడుడూ కాదు. చాలా తెలివి గల వాడు. కానీ విలక్షణమైన వ్యక్తి. ఈ తర్క అర్థ శాస్త్రాదుల మీద ఆసక్తి లేదు.
కానీ తన తండ్రికి కుమారుడు ఇవన్నీ అభ్యసించాలని ఆశ."
           "ఆచార్య దేవా! మరి సంఘములో ఉన్నతమైన స్థాయికి రావాలంటే, ఈ విజ్ఞానమవసరమే కదా! మరి శ్రీనాథుడికి ఇవేమి ఇష్టము లేదేమిటి?"
              "ఉన్నతమయిన స్థానమును ఎలా నిర్వచిస్తావు? జయ చంద్రా!"
          "రాజానుగ్రహాన్ని పొందుట, ఆర్థికముగా, సాంఘికముగా రక్షణ పొందుట, ప్రజల చేత మన్నన పొందుట."
          " మరి మీ నాన్నగారిది ఉన్నత స్థాయి కాదంటావ?"
         "అదేమిటి ఆచార్యా! మా నాన్న గారు తలచుకొంటే ఈ దేశాన్ని గడ గడ లాడించ గలరు.  ఆయన సర్వ సేనాధిపతి, అంతే గాక మహా రాజుకు అత్యంత ఆప్తుడు."
          "మరి మీ నాన్నగారు ఈ శాస్త్రాలన్నిటిని చదవ లేదు కదా!"
          "అయినా ఉన్నత స్థాయిని స్వీయ శక్తితో సంపాదించుకున్నాడు."
         "నీవు సరిగా అర్థము చేసుకోలేదు జయచంద్రా! శాస్త్రాలు మనము చేసే పనిని మరింత సమర్థవంతముగా చేయుటకుపయోగ పడుతాయి. మనము చేసే పనులను మరింత సమర్థవంతముగా నిర్వహించుటకు, వివరించుటకు ఉపయోగ పడుతుంది. అంతే కానీ, చేసే పనులను ఎప్పుడూ నిర్దేసించవు. మనిషి ఎదుగదలకు ఎక్కువగా స్వీయ ప్రకృతే కారారణము."
              "అలా అయితే,శాస్త్రాలకొక ప్రత్యేక ప్రయోజనమేమిటి ఆచార్యా!"
            "ఒక ప్రయోజనాన్ని సాధించినపుడే వీటి ప్రత్యేకత  మీకర్థమవుతుంది." అంటూ వాకిట్లో కనిపించిన ఆగంతకుడిని చూచినాడు.
            "రండి విశ్వకర్మగారు! ఇలా వచ్చి ఆశీనులు కండి.", అంటూ ఆహ్వానము పలికినాడు.
           "ఆచార్యా! మా శ్రీ నాథుడేడీ? కన్పించడేమి?",విశ్వ కర్మ అడిగినాడు.
           "పాథము మధ్యలోనే ఎటో వెళ్ళినాడు...." , ఒక నిముషము ఆగి మళ్ళీ  అన్నాడు,"విశ్వ కర్మ గారూ! మీతో నేనొక విషయము ప్రత్యేకముగా మాట్లాడాలి, అలా లోపలికి వస్తారా?"
        ఇద్దరూ లోపలికి వెళ్ళినారు. ఆచార్యుల వారు ఊయల బల్ల మీద , విశ్వకర్మ గారు సముచితమైన ఆసనము మీద కూర్చున్నారు.
           "మా శ్రీ నాథుడి గూర్చి మీరేదో చెప్పాలన్నారు."
            " ఔను, ఇంత వరకు అతడి గురించే ఆలోచిస్తున్నాను. శ్రీనాథుడికి శాస్త్రాదుల మీద అంతగా ఆసక్తి యున్నట్లు కనిపించదు. అన్నీ అర్థము చేసుకుంటాడు, అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతాడు, జడుడు కాదు, తార్కిక దృక్పథము కంటే, తాత్విక పథము మీదే అతడికి ఆసక్తి ఎక్కువని అనిపిస్తుంది. కళ్ళలో సౌందర్యారాధన, నుదుటిలో భావావేశము కనిపిస్తుంది. గొప్ప కళాకారుడవుతాడని అనిపిస్తుంది."
           "ఆచార్యా! కళా కారుల జీవితాలను ఎన్నో చూచినారు కదా? నన్నే తీసుకోండి, శిల్ప కళే నా జీవితమనుకున్నాను. దానితోనే నా మనుగడ యనుకున్నాను, కానీ, రాజ్యాలు మారినవి, రాజులు మారినారు, వారిలో ఆ స్థాయి కళా పిపాసులేరీ?"
         " విశ్వకర్మ గారూ! మీ కున్న కళా పిపాస నాకు తెలుసును. కానీ, మల్లె పూవులను ఎడారులలో పడేసినా ఆ వాసనను మానుకోగలవా? కోయిల ఆకలితో దాహముతో అరిచినా, దాని గొంతులో మాధుర్యము పోతుందా? అనుభవాల సుడులలో అసలు ప్రకృతి మారిపోయేట్లయితే ఈ విశ్వాన్ని ఎప్పుడో కారు చీకట్లు కమ్మి యుండేవి."
        "మరి మా శ్రీనాథుడు  శాస్త్రాధ్యయనానికి  అనర్హుడంటారా?"
        "విశ్వకర్మ గారూ! నేను అలా యన లేదు.అతడి ప్రకృతిని భాధ్యత గల ఉపాధ్యాయుడిగా మరో భాధ్యత గల తండ్రికి వివరించినాను. కానీ, నా శక్తి మేరకు కృషి చేస్తాను. శ్రీనాథుడికి నాకు తెలిసిన విద్యలన్నీ నేర్పిస్తాను."
       "కృతజ్ఞుడిని . ఆచార్యులుగారూ! మళ్ళీ కలుస్తాను."

      (మిగిలిన  కథ మరో సారి )