Monday, January 23, 2012

శిల్పి 5


                                                                     (శిల్పి 4 నుండి )

         అందరికి అన్ని రోజులు ఒకే రకముగా ఉండవు.ఆ రాత్రి పండుకున్న రామ రాయ భూపతి మళ్ళీ
నిద్ర లేవ లేదు. ధర్మమూర్తిగా నిలిచిన రాజు ప్రజలందరిని పూర్తిగా వదలి వేసినాడు.
         రామ రాయ భూపతి చాలా చిన్న వయసు లోనే గద్దె ఎక్కినాడు. ఉదాత్తమయిన ఆశయాల మీద
నిలబడినాడు, ప్రజా సంక్షేమమే తన బ్రదుకనుకున్నాడు. రాత్రింబవళ్ళు అందుకొఱకై శ్రమించినాడు. ప్రజల మెప్పు మాత్రమే కాదు,ఉద్యోగులందరి మెప్పు చూఱ కొన్నాడు. కాని అతడి దురదృష్టమొక్కటే. తన కుమారుడిని చక్కని దారిలో పెట్ట లేక పోయినాడు. కొడుకు నరసింహ భూపతి మిత్రుల సహవాసముతో వ్యసనములకు బానిస అయినా శిక్షింప లేక పోయినాడు. అందుకే యేమో రాజ భక్తి కంటే రాజ్య భక్తి ఉండాలని చెప్పే వాడు.
            రాజు మరణించి పది రోజులయినది. నరసింహ భూపతి తనకు తనే రాజుగా ప్రకటించికున్నాడు. వ్యవస్థను పరిశీలించే వ్యవధి కానీ, ఓపిక కానీ అతడికి లేవు. అతడి కుండేదల్లా మద్యము, మగువల మీద వ్యామోహము మాత్రమే.  ఇక రోజులు తమకంత బాగుండవని నిజయితీ గల ఉద్యోగులందరూ గ్రహించినారు.
           శ్రీ నాథుడు విద్యా సంస్థలు, వాటి ఆర్థిక వ్యవస్థను నిర్వహించే వాడు. మరణించిన రాజుగారి దృష్టిలో ఇది ప్రధానమైన శాఖలలో నొకటి. ఆర్థిక వనరులలో ఇందుకు ఎక్కువ కేటాయింపు ఉంటుంది. ధన దుర్వినియోగము చేసే అవకాశము కూడా ఇందులోనే ఎక్కువ. అందుకే నరసింహ భూపతి యొక్క మిత్ర వర్గము దృష్టి ముందు దీని మీద పడింది.
           ఆ నాడు రవికాంతుడు రాజు శ్రీ నాథుడి దగ్గిరకు వచ్చినాడు, రాజుగారి కొఱకు కొంత పైకము వెంటనే కావాలని చెప్పినాడు. అతడు రాజు యొక్క అంతరంగిక స్నేహితుడు.  కాని రాజముద్రతో ఆదేశము లేకుండా పైకాన్ని ఎలా ఈయ గలడు?
           ఆ మాటే పలికినాడు. రవికాంతుడు రుస రుస లాడినాడురాజును ధిక్కరిస్తున్నావన్నాడు. ఫలితాలు చాలా తీవ్రముగా ఉంటాయని యున్నాడు.
           శ్రీనాథుడేమీ మాట్లాడ లేదు. మరో ఘడియలో నేరుగా రాజ ముద్రికతో లేఖ వచ్చినది, పైకమీయబడినది.
           పరిస్థితులు చాలా తీవ్రముగా ఉన్నాయని శ్రీ నాథుడు తెలుసుక్న్నాడు. తన లాంటి వారికక్కడ  ఇక స్థానము లేదని అనిపించినది. గతించిన రాజుగారిని ఒక సారి తలచుకున్నాడు. తన అసహాయతను తలచుకున్నాడు. మరునాడుదయము రాజుగారిని కలియాలని అనుకున్నాడు.
         అరునాడు ప్రాతః కృత్యాలు కాస్త ముందుగా పూర్తి చేసుకొని, తన కార్యాలయము  వెళ్ళుటకు ముందే నగరుకు వెళ్ళినాడు.
              రాజుగారినుండి ప్రవేశపు అనుమతి లభించి, లోపలికి వెళ్ళీనాడు. ఆ సమయములో తన మిత్రులతో జూదమాడుతున్న రాజుగారిని చూడగానే శ్రీనాథుడికి గుండెలో ముల్లు గుచ్చుకున్నాట్లయినది. తన నెవరూ గమనించ లేదు. ఘడియ కాలము అలానే నిలబడి, ఇక వెనుకకు వెళ్ళి పోదామనుకున్నాడు. రాజుగారు ఏమనుకుంటారో అని సంశయము.మళ్ళి వెనుకకు తిరిగినాడు.
          "శ్రీ నాథా! ఇలా వచ్చి కుర్చో.", రాజుగారి ఆదేశము.
        వెంటనే, "మరో అయిదు వేల వరహాలు పంపించు, లేఖ తరువాత పంపిస్తాను.", మరొక ఆదేశము.
         "మహా రాజా! అది గ్రామాలలో యున్న గురుకులాలకు  పంపించ వలసిన సొమ్ము. ఇది కీర్తి శేషులయిన  మహా రాజు గారి ఆదేశము."
              "ఆయనెటూ లేరుగా, ముందు పని చూడు. ఏవరేమన్నా అంటే నాతో చెప్పు."
             "మహా రాజా! ఇందులో ఎవరు, ఎందుకు, ఏమని, అనుకుంటున్నారు, అన్న ప్రశ్నే లేదు."
            "అంటే మమ్ములనే ధిక్కరిస్తున్నావా?", మీసాల మీదికి చేయి పోయినది.
            "ఇందులో ధిక్కరించడమంటూ ఏమియు లేదు మహా రాజా! స్వర్గీయ మహా రాజుగరికి గురుకులాల నిర్వహణ మీద ఆసక్తి ఎక్కువ. దేశము యొక్క ప్రగతి అంతా ప్రజల యొక్క  విద్యా, వినయ వివేకతల మీదే ఆధార పడుతుందనే వాడు."
          "ఈనాడు నిర్ణయాధికారము మాది. ఉచితానుచితాలను నిర్ణయించే వాళ్ళము మేము. మా తండ్రిగారికి చాలా సన్నిహితులుగా మిమ్ములను గుర్తించినాము. కానీ, మీరు ఈనాడు రాజునే ధిక్కరిస్తున్నారు."
          "క్షమించాలి, మహారాజా! యధర్థాన్ని విన్నవించుకొన్నామే కానీ, నిర్ణయాధికారము మాకేనాడు లేదు....నాదొక చిన్న మనవి, అనుగ్రహిస్తారనుక్న్టాను."
         "తప్పకుండా."
         రాజుగారు తనకు విశేషాధికారాలను ఇస్తూ ఇచ్చిన అంగుళీయకాన్ని వేలినుండి బయటకు తీసినాడు. కన్నులలో నీరు కమ్మినది. ఏ నిర్ణయాన్ని తను తీసుకొన వలసి వస్తుందని ఊహించ లేదోఅదే తీసుకున్నాడు.నిర్ణయాధికారము రాజుదే కావచ్చును.  కానీ,ఫలితాలను అనుభవించ వలసినప్రజలకు కూడా ప్రశ్నించే అధికారమున్నది. రాజు ధర్మ కర్త మాత్రమే నని శాస్త్రాలు పలికినాయి. వీరిద్దరికి సారధే ప్రభుయోద్యోగి. తనకు ఆ అవకాశము ఉండె అవకాశము లేదు. రాజు వ్యసనాలకు బానిస. నామ మాత్రమైన పదవిలో తను ఉండ లేడు.
        "ఒక సారి లెక్కలు చూచుకొని పదవీ భాధ్యతలనుండి నన్ను విడుదల  చేయగలరా?"
          "తప్పకుండా",, రాజుగారన్నారు, "అయినా శ్రీ నాథా! ఒక్క ప్రశ్న వేస్తాను. పరిపాలన సక్రమముగా జరగాలంటే, నగరములో అన్నీ వసతులూ ఉండాలి. మా నాన్న గారు వీటి మీద ఎందుకు  శ్రధ్ధ వహించ లేదో? మీరంతా ఆ తరము లోని వారు. అందుకు ఆసక్తి లేనప్పుడు మీరు ఏనాడయినా మీ దారిన మీరు వెళ్ళ వచ్చును.  రేపుదయాన మీ పదవీ భాధ్యతలను రవి కాంతునకు అప్పగించు."
                           కన్నులలో నీరు తిరిగినది. తను ఎంతో శ్రధ్దగా చూస్తున్న పనులన్నీ రేపొక వ్యసన్‌ లోలుడి చేతుల్లో నడుస్తాయి. ఫలితము అందరికీ తెలిసినదే. భాధ్యతలను మఱచిన రాజుకు ప్రజలే బుధ్ధి చెప్పాలి. శ్రీ నాథుడు వేదనతో వెనుకకు తిరిగినాడు.
                రాజ ధానితో ఋణము తీరి పోయినది. ఆ రోజంతా వేదనతో గడిపినాడు. సాయంత్రము తన మిత్రులందరూ వచ్చినారు. విషయము తెలుసుకొని చాలా బాధ పడినారు. తనను పదవి నుండి తొలగించాలని కుట్ర జరుగుతున్నాదని, తన నిజాయితీని భరించ లేని వారే ఇందుకు కారణమని, తనే ముందుగా బయటికి రావడము వలన మంచి జరిగినదని అన్నారు. రాత్రి పడుకున్నపుడు ఒకతే ఆలోచనలు. ఎదురుగా బల్ల మీద పాల రాతి విగ్రహమున్నది. తన ప్రాణాన్ని పంచి జీవ కళ తెచ్చేనా అనిపించే ఆ మూర్తి హేమది.
              తను రాచనగరులో అత్యున్నత స్థాయిలో యున్నాడని  అందరికీ ఎంతో సంతోషము, ఆ సమయములోనే తన వివాహ నిర్ణయము, తను కన్న కలలు,.....అన్నీ ఏమయినాయి?
             చీ! ఏమిటి? తను ఇంత చపలుడయినాడు. రాచ కొలువు కత్తి మీద సాము అని తనకు తెలియదా? తను కలలు కన్నదేమిటితను చేరిన ఉద్యోగమేమిటిమళ్ళీ, తను ఇంటికి వెళుతున్నానని బాధ ఎందుకు?
         నిజమే, తనకు ఫరవాలేదు. కానీ తనతో బంగారు కలలను పండించుకోవాలని అనుకున్న హేమకు ఎంత నిరాశ? ఇదేనేమో జీవితమంటే?

    (ఇంకా ఉన్నది)