Tuesday, February 28, 2012

శిల్పి 8




                  ఉన్న ఆస్థి రెండు ఉంగరాలు, కొద్ది సొమ్ము మాత్రమే. దక్షణానికి ప్రయాణము మొదలు  పెట్టినాడు.  కొంత దూరము బండ్ల మీద, కొంత దూరము నడక, ధర్మ సత్రాలేమయినా కనిపిస్తే భోజనము, లేదా పండ్లు కొని తినే వాడు. సింహపురి లో శ్రీ రంగ నాయకుని దర్శనము చేసుకున్నాడు. "శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ " అంటూ సంస్కృత మహా భారతమును తెలుగులో పలికించిన నన్నయ భట్టారకుడి కార్యాన్ని కొన సాగిస్తూ తెలుగునే సంస్కృతముగా పలికించిన నన్నయ,తిక్కన సోమయాజికి సంబంధించిన స్థలాలను చూచినాడు.పినాకిని
 ఒడ్డున గణపతి దేవాలయములో భారత రచన జరిగిన ప్రదేశాన్ని చూచి అక్కడే కొన్ని రోజులు గడిపినాడు. పాటూరు వెళ్ళి తిక్కన పుట్టి పెరిగిన ఊరికి గౌరవముతో నమస్కారము చేసినాడు. శ్రీ కాళహస్తీశ్వర వాయు లింగాన్ని దర్శనము చేసుకున్నాడు. తిరుమలలో ఆంధ్రుల ఆరాధ్య దైవము వెంకటాచల పతిని దర్శించుకున్నాడు. విజయనగర రాజుల రెండవ రాజధానిగా పేరుగన్న  చంద్రగిరి శిధిలాలను చూచి కన్నీరు గార్చినాడు. అటునుండి కాంచీ పురము వెళ్ళి పల్లవుల కళారాధనకు అబ్బుర పడినాడు.  దక్షిణాపథాన తమిళ, తెలుగు మరియు మరాథీ సంస్కృతులకు కూడలి, రాజ రాజ చోళుని రాజధాని అయిన తంజావూరును చూచి మైమరచి పోయినాడు. తంజావురు , కుంభ కోణము, చిదంబరము నగరాలలోని దేవాలయముల శిల్ప కళా సంపదకు అచ్చెరువందినాడు. పాండ్యుల ఆరాధ్య దైవమైన మీనాక్షీ సుందరేశులను దర్శించినాడు. సముద్ర స్నానము చేసి, శ్రీ రామ లింగేశ్వరుని దర్శించుకున్నాడు.
       నల్ల రాతి మీద వరుసగా చెక్క బడిన దేవ కన్యలు, పరివారముతో తరలి వచ్చే పాలకులు, వెంట కదలి వచ్చే చతురంగ బలాలు, వాటి ముందు సాగే వాద్య కారులు, ఆస్థాన నర్తకీమణులు, దేవాలయములో నాట్యము చేసే వారి ముఖములో కనిపించే తన్మయత్వము... ఇవి సజీవ శిల్పాలు. కళా కారులకు జీవము  పోసిన కావేరీ జలాలలో మునిగినాడు. శ్రీ రంగ పట్ణములో రంగ నాయకుని, బేలూరు, హళిబేడులలోని, జక్కనార్యుని చెక్కడాలను, గోమథేశ్వరుడి ఏక శిలా విగ్రహాన్ని చూచి  నివ్వెర పోయినాడు. 
                 అంతే గాక వేర్వేరు స్థపతుల దగ్గిర పని చేసినాడు. శిల్పానికి తగిన ఱాయిని నిర్ణయించుకొనుట, ఱాతిలోని దోషాలను నిర్ధారించుట,చెక్కడములో మెళుకువలను ఎన్నో నేర్చుకున్నాడు.
                 అంతే గాక వేర్వేరు స్థపతుల దగ్గిర పని చేసినాడు. శిల్పానికి తగిన ఱాయిని నిర్ణయించుకొనుట, ఱాతిలోని దోషాలను నిర్ధారించుట,చెక్కడములో మెళుకువలను ఎన్నో నేర్చుకున్నాడు.
                 ఒక అందమైన రూపాన్ని శాశ్వతము చేసే విశ్వకర్మలు శిల్పులు. సంసార వ్యామోహాలను, క్షణిక వైభవాలను, మఱచి పోయి, జీవితాన్ని త్యాగము చేసే సృష్టికర్తలు శిల్పులు. హృదయ స్పందనతో ఊహలకు అనుగుణముగా చెక్కే శిల్పులకు, అద్భుతమైన శిల్పాలను చెక్కాలని, నిర్మించే వారికి తేడా యున్నది. మొదతీ వారిది అంతు లేని తపన, దీక్షతో కూడిన ఆరాటము. రెండవ వారిది కీర్తి కాంక్ష. రెండూ శిల్ప కళలే, కాని మొదటిది మాత్రమే జీవ కళ.
               ఎంతో మందితో చర్చలు, వాదనలు జరిగినవి. కొందరు శిల్పులు రాజుల ఆదరణకు లోబడిధనానికి ఆశ పడి, ఇవన్నీ నిర్మించినారని, లేదా బానిసలుగా పని చేసినారని తీర్మానములు చేసినారు. వారి సిద్ధాంతాలకు అనుగుణముగా లేవు కాబట్టి, ఇవి, వారికి  బానిసత్వ చిహ్నాలుగా కనిపించినవి. ఉన్నదొకే ప్రశ్న. బానిస మనస్తత్వముతో నున్న వారు, ఇటువంటి  జీవ కళను నిర్మించ గలరా? కాదు, కానే కాదు.
                శిల్పుల లోని కళా తృష్ణకు  తగిన స్ఫూర్తినిప్రోత్సాహాన్ని ఇచ్చినారు, ఆ నాటి పాలకులు. వికృతులు ఏ రంగములోనన్నా యుండ వచ్చును. అందుకని మొత్తానికి ఒకే న్యాయ నిర్ణయము చేయ గలమా? ఒక శిల్పి రాజు దగ్గిఱ పని చేస్తే మరొకరు రాజాదరణకు నొచుకోక, కొండల మీద, గుహల లోను, శిల్పాలు చెక్కి, తన ఆర్తిని చల్లార్చుకుంటాడు.
             మనసులోని సంచలనానికి వెలి రూపమే ఈ కళా సృష్టి.  సృష్టి, స్థితి, లయాలను తన లోనే చూపించే శివ తాండవ నృత్యముశివుడిని పతిగా కోరిన ఉమా దేవి దీక్ష, గజేంద్రుడి మొరాలించి పరుగిడే విష్ణు విలాసము,              
భగవంతుడి  సర్వాంతర్యామిత్వము విషయములో ప్రహ్లాదుని మాటను నిజమని నిరూపించిన నరసింహుడు, తండ్రి మాటకై అడవికి సాగిన రామ చంద్రుడు, జీవిత రహస్యాన్ని ఛేదించాలన్న తపనతో ఇల్లు వెడలిన సిధ్ధార్థుడుకర్తవ్య దీక్ష, జాలి, ఆవేదన, అనుభూతి, స్పందన ఇవన్నీ చూపించిన వారు శిల్పులు. నాగినుల, నవ రాగిణుల నృత్యోల్లాసములను తమ ఉలుల చేత పల్కింపించ చేసినారు శిల్పులు. 
                       ఒక రోజు సాయంకాలము చల్ల గాలి వీస్తుంటే, ప్రకృతి పరవశింపును సూచిస్తూ పైర్లు తలలూపుతున్నవి. అంతు లేని తన ప్రయాణములో నొక భాగముగా దూరాన నున్న ఒక కొండ వైపు నడుస్తున్నాడు, శ్రీ నాథుడు. ఎక్కడో ఉలి శబ్దము వినిపిస్తున్నది. అక్కడ ఏ శిల్పీ యున్నట్లు ఎవరూ చెప్ప లేదు.
      ఆ ఉలి శబ్దము వైపే నడుస్తున్నాడు. ఆకాశాన మేఘాలు క్రమ్ముకుంటున్నాయి. ప్రకృతిలో లాలిత్యము క్రమముగా తగ్గి పోయినది. తెలియని గంభీరత్వము వెలికి వస్తున్నది. చినుకులతో మొదలయి, క్రమ క్రమముగా వర్షపు జల్లు పెద్దదయినది.
       ఊరినుండి సుమారుగా క్రోసు దూరము వచ్చేసినాడు. దగ్గిరలో ఎక్కడ ఇళ్ళు లేవు. శబ్దము వస్తున్న కొండ వైపే పరుగు తీసినాడు.
      కొండ పైన ఒక గుహ, అందులో నుండి వెలుతురు వస్తున్నది. నెమ్మదిగా లోపలికి అడుగు పెట్టినాడు. అక్కడి దృశ్యాన్ని  చూచి ఆశ్ఛర్య పడినాడు.
            ఎదురుగా నొక వృధ్ధుడు, వయస్సు అరువది ఏండ్లకు పైనే యుండ వచ్చును, నడుము వంగి పోయి యున్నది, గడ్డము గుండెలను తాకుతున్నది, కాగడా వెలుగులో ఏదో చెక్కుతున్నాడు. మరి కాస్త లోపలికి పోయినాడు. ఆ చిత్రమును కాస్త దగ్గిఱగా చూచినాడు.
          సిధ్ధార్థుడు యశోధర ముఖాన్ని చూస్తున్నాడు. యశోధర నిద్ర అనే మాయలో యున్నది. ఆ మాయ నుండి తప్పుకోవాలని అనుకుంటున్నాడు సిధ్ధార్థుడు. అంతు లేని ప్రేమ ఒక వైపు, తెలియ రాని ఆవేదన ఒక వైపు అతడి ముఖములో కనిపిస్తున్నవి.
         శ్రీ నాథుడు అలాగే నిలుచుని చూస్తున్నాడు. మరొకరు లోపలికి వచ్చినట్లు ఆ వృధ్ధుడు గమనించ లేదు.  కొద్ది సేపు అయిన తరువాత  వేరే పనిముట్టు కోసము వెనుకకు తిరిగిన  వృధ్ధుడు శ్రీ నాథుడిని గమనించినాడు.
                 "ఎవరు బాబూ!"
                "నేనొక పాంథుడిని తాతా! ఈ నిర్జన ప్రదేశములో ఉలి శబ్దము నన్నిటకు తీసుకొని వచ్చినది. "
                " కూర్చో, బాబూ!", ఎదురుగా ఒక జనప నార వస్త్రాన్ని చూపించినాడు."
               "ఎక్కడి నుండి వస్తున్నావు బాబూ!"
               "విజయ వాటిక దగ్గిఱ ఒక పల్లెటూరు తాతా! ఇలా ఊళ్ళు తిరుగుతున్నాను."
                "చాలా దూరమునుండి వస్తున్నావు, ఆకలి తీర్చుకో బాబూ!" అంటూ, ప్రక్కన ఒక మూల నుండి కొన్ని కాల్చిన సజ్జ కండెలను పట్టుకొని వచ్చినాడు. కొన్ని శ్రీ నాథుడి ముందు పెట్టి తను కూడా తిన సాగినాడు.
               రాజసపు వరి ధాన్యాన్ని తప్ప వేరు తినని తను ఈ యాత్రలో అన్ని రకాల ఆహారానికి అలవాటు పడినాడు, సత్రాలలో తిన్నాడు, కుటుంబాలలో తిన్నాడు, ఏమీ వసతి దొఱకని రోజు మంచి నీళ్ళతో తృప్తి చెందినాడు. మంచి బట్టలు వేసుకొనే తను బట్టలు చిరిగినాయని కూడా అనుకోవటము లేడు. అందుకే అందిన సజ్జ కండెలను సులభముగానే తిన గల్గినాడు. 
               "తాతా! నీ వయసెంత యుంటుంది?"
               "డెబ్బయి దాటింది బాబూ!"
               "నీ వాళ్ళెక్కడ యున్నారు తాతా!"
               "చూచావుగా బాబూ! వీళ్ళంతా నా వాళ్ళే", తను చెక్కిన శిల్పాల వైపు చేయి చూపించినాడు. "ఇక్కడున్నంత వఱకు నీవూ నా వాడవే బాబూ!"
          "అది కాదు తాతా! కొడుకులుమనవళ్ళూ........"
         "ఉండీ లేని వాళ్ళ కోసము, ఉన్న వాళ్ళము  లేని వాళ్ళము ఎందుకవాలి, బాబూ!"
           శ్రీ నాథుడికి అర్థము కాలేదు. కానీ, తిరిగి ప్రశ్నించ లేదు.   వర్షము తగ్గిందేమో అని  మళ్ళీ  వాకిట్లోకి వచ్చినాడు. చిమ్మ చీకట్లో నొక మనిషిని చూచినాడు, పలకరించినదు పలకరించినాడు, జవాబు రాలేదు. దగ్గిఱకు పోయి పరిశీలించినాడు. చిరు చీకట్లో విగ్రహము మనిషి మాదిరే కనబడినది. 
        "వర్షము తగ్గినట్లు లేదు, లోపలికి వచ్చి విశ్రాంతి తీసుకో బాబూ!" 
       " అలాగే తాతా! వాకిలి దగ్గిఱ విగ్రహము ఎవరిది?"
        "రంగ రాయ నర పాలుడిది బాబూ! కర్ణాటకమంతా ఒకే పాలనకు తెచ్చిన ధర్మాత్ముడు. "                                  "కానీ, ఈ నాడు ప్రజల లో ప్రశాంతత యున్నట్లు కన బడదే? ధన మాన ప్రాణాలను రక్షించుకొనుటకు కష్ట పడుతున్నట్లు కన బడుతున్నారే? ఇదేమి విపరీతము తాతా!"
          "విధి విలాసమంటే అదే బాబూ! న్యాయ రక్షకుడయిన పాలకుడు మరణించినాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, బుధ్ధిమంతులే, నిస్వార్థ పరులే, ప్రజా హిత కాంక్షులే, కానీ, నైపుణి యున్న వారు కాదు. ఇంటల్లుడు బల హీనుడు, వ్యసన లోలుడు. వీరికి సహకరించడు. తమ్ముడిని తన దారి లోనికి తెచ్చుకొన్నాడు. అన్న దమ్ములకు విభేదాలు కల్పించాలని ప్రయత్నిస్తున్నాడు.  గుండెల మీద పుండులా మారిన తమ్ముడిని ఏమన లేక, బావ గారిని అదుపులో పెట్ట లేక రాజు బల హీనుడయినాడు."
            " ఆ పరిస్థితులలో ఎవరు మాత్రమేమి చేస్తారు తాతా!"                   
           "రాజ ధర్మము  స్వీకరించిన తరువాత స్వ పర భేదముండ కూడదు.  రాజ్యములో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో తెలుసు కోలేని రాజు యున్నా ఒకటే, లేక పోయినా ఒకటే.  అక్కడ ఉన్నత స్థాయిలో యున్న బల హీనత  ప్రతి రాజ సేవకుడికి సరి కొత్త అధికారాలను తెచ్చి పెడుతుంది. ఇక కంచెను చేను మేస్తే అడ్డుకొనేదెవరు?"
          " మరి మీరేమి చేస్తుండే వారు?"
         " భవనాలు కట్టినాను, స్వీయ పర్యవేక్షణలో కట్టించినాను. శిల్ప ఆగమ శాస్త్రానుసారముగా  ఆలయాలు నిర్మించినాను. వయస్సు ఉడిగింది. రాజాశ్రయము తగ్గింది. ఒక వైపు అరాచకము పెరిగింది. ఉద్యోగము పోయింది.  కానీ, శ్రమకు అలవాటు పడిన వాడిని. అయిన వారనిపించుకోలేని నా వారిని వదిలి, ఈ శిల్పాలను చెక్కుతూ కాలాన్ని గడుపుతున్నాను."
                  "మరి రాజాశ్రయము లేనపుడు ఇలా వళ్ళు ముక్కలు చేసుకోవడము ఎందుకు తాతా!"
                 " పొర పాటు పడుతున్నావు బాబూ! వ్యక్తి తన ప్రతిభను మరొక దిశకు మళ్ళించుకో గలిగితే తప్పు  లేదు. కానీ, నాకు తెలిసిన వృత్తి ఇదొకటే.  మరి జీవితాధారమంటావా? ఉన్న దానితో గడపగలను.నేనొకరి మీద ఆధార పడను.  కానీ, ఏ పనీ చేయకుండా సోమరిగా యుండ లేను బాబూ!"
              క్షణము తీరిక దొరికితే చాలు, విశ్రాంతి తీసుకుందామనే రోజుల్లో, కాస్త పని ఎక్కువయితే తప్పుకోవాలని చూచే ఈ రోజుల్లో, పని లేక పోతే బ్రదుక లేనంటున్నాడు, డెబ్బదో వడిలో నున్న ఈ తాత. శ్రీ నాథుడికి ఆశ్ఛర్యము వేసినది.
           " మరి మీ పనికి గుర్తింపేమిటి, తాతా!"        
             " సరిగా ఈ తరపు మాటడిగినావు బాబూ! గుర్తింపు లేదంటే పని చేయని రోజులివి.  లోకుల కబుర్ల తోనే జీవితమంతా వృధా చేసుకొనే రోజులివి. కొబ్బరి చెట్టు అయిదేండ్లకు కానీ కాపుకు రాదని దానిని వేయడము మానేస్తామా? నేరుగా చెబుతాను. దేశానికి చరిత్ర లేకుంటే భవిష్యత్తు యుండదు. త్యాగ మూర్తుల కథలు లేక పోతే అటువంటి వ్యక్తులు  జన్మించే  అవకాశము కూడా ఉండదు.  అభిమన్యుడి  గురించి చదవకుంటే బాల చంద్రులు వచ్చే వారా? తర తరాలుగా మనలో జీర్ణించుకొని పోయిన త్యాగ, వీర, శూర, మాన ధనుల చరిత్రలను, నాకు తోచిన పధ్ధతులలో స్థిర పరుస్తున్నాను.  వారికి నేనందించ గలిగిన కృతజ్ఞతాంజలి ఇంత మాత్రమే.  నేను ఈ రోజు ఉండ వచ్చును. రేపు.... ఏమోకానీ, భవిష్యత్తులోని తరాలకు నేను చేయ గలిగిన, నాకు చేతనయిన పని ఇది మాత్రమే.  రేపటి రోజుల్లో ఎవరో చూస్తారని, ఏదో చేస్తారని, నేననుకోవడము లేదు. ఏ ఒక్కరయినా చూస్తే బాగుండునన్న ఆశ లేక పోలేదు. కానీ ఏదో గొప్ప పనిని చేశానని నేనాడూ అనుకోనుట లేదు. నాకు చేతనయిన చిన్న పనిని చేస్తున్నానంతే."
               ఎన్నో జీవితాల అనుభవాలు ఈ మాటలలో నాకు తోచినాయి. ఆయనను ఎంతో ప్రశ్నించినాడు. ఎంతో నేర్చుకున్నాడు. అంతే కాదు, ఏవో కొత్త నిర్ణయాలు కూడా తీసుకున్నాడు.          
       

Tuesday, February 14, 2012

శిల్పి 7


            తన మనస్సుకు విశ్రాంతి కావాలి. ఊరి బయటకు బయలు దేరినాడు, శ్రీ నాథుడు. పచ్చని పొలాలు, పక్కనే చెరువు, ఎత్తైన కొండ.  చదువు ఎగ గొట్టి అక్కడ కూర్చున్న రోజులు గుర్తుకు వస్తున్నాయి. రామాచార్యులుకు మాట ఇవ్వడముతోనే తన బ్రతుకొక కొత్త మలుపు తిరిగినది. గురువుగారి ప్రేమ, ఋజు మార్గము మరియు సత్య సంధత తనను ఎక్కువగా ఆకర్షించినవి.  ఆ సూత్రాల మీదనే తను బ్రదుకాలని అనుకున్నాడు. అదే మరొక మలుపును తిప్పినది. తను తిరిగి ఇక్కడున్నాడు.
            ఆ కొండను ఎక్కి చల్లని గాలులను ఆస్వాదించినాడు. తిరిగి నెమ్మదిగా క్రిందికి దిగినాడు. చెఱువు గట్టున రాతి గుట్ట దగ్గిఱకు చేరినాడు. తను సగము చెక్కిన చాలా బొమ్మలు అక్కడ చాలా ఉన్నాయి. తను నాటకాలకు వెళ్ళడము, అక్కడ రూపాలను గుర్తు పెట్టుకొనడము, సుద్దతో ఱాతి పలకల మీద గీయుట, కొన్ని అలాగె వదలి వేయుట, కొన్ని పూర్తి చేయుట..............
                     అక్కడ ఎక్కువ సేపు కూర్చున్నాడు. సూర్యుడు నెమ్మదిగా క్రిందికి దిగుతున్నాడు. ఆకాశము అమ్మ వారిలా ఎఱుపు చీర ధరించినట్లున్నది.  దూరాన చెరువు గట్టుకు ఎవరో వస్తున్నారు. భూము మీద బట్టలతో, మరో ఇద్దరు వస్తున్నారు.
             "శ్రీ నాథా! ఎప్పుడు వచ్చావయ్యా?"
             "ఉదయాన్నే వచ్చాను గురు దేవా!"
             "ఏమిటయ్యా, నీ ముఖము వాడి యున్నది. కళ్ళు లోతుకు పోయి యున్నవి. రాజరికపు మాత్రలు నీ మీద దెబ్బ తీయ లేదు కదా!"
             "మీరూహించ గలరు గురు దేవా! ప్రశాంతమైన పల్లెటూరు జీవనాన్ని వదలి, నగరులో మనగలనా అని ఆ నాడు సందేహించాను. మీ ఆశీర్వాద బలము తోనే ఆ నాడుండ గలిగినాను. వృత్తిలో సంతృప్తిని పొందినాను. వ్యవస్థలో అధికారము మారగనే, మనిషిగా నున్న నేను మర మనిషిగా మార లేక పోయినాను. ఎదురీద గల సత్తువ నాకు లేదు.  అందుకే మరో మార్గము వెదుకుకుంటూ ఇలా మరలి వచ్చినాను. నేను తప్పు చేసానాంటారా?"
"నీ మీద నాకు నమ్మకముందయ్యా. రాజ ధాని నుండి వచ్చే వార్తలను వింటుంటే ఈ రోజు కాక పోయినా, రేపు అయినా ఇలా వచ్చేస్తావని  నేను అనుకుంటున్నాను. కానీ, బ్రదుకు దెరువు చూచుకోవాలి కదా! రోజులు బాగు లేవయ్యా."
              "ఫర్వాలేదు గురు దేవా! నాలో కొండంత ఆత్మ స్థైర్యమున్నది. కానీ, ఇక్కడ మనుషులే నాకు అర్థము కావటము లేదు. నేనేదో పెద్ద పొరపాటు చేశానని అనుకుంటున్నారు. హేళనలు వినిపిస్తున్నవి. నాకు ఎక్కడ కైనా కొంత కాలము వెళ్ళి పోవాలని ఉన్నది."
             "వ్యక్తిత్వానికి గౌరవమిచ్చే రోజులు కావివి. హోదాలను చూచి గౌరవిస్తారు.  అన్ని విధాలా నీ నిర్ణయము మంచిదేనయ్యా. పెద్దల అనుమతిని తీసుకొని లోకాన్ని చూచి రా."
             "లేదు గురు దేవా! నాకు ఇంక ఎవరి అనుమతీ అఖ్ఖర లేదు. మీ ఆశీస్సులు చాలు.", అంటూ ఆయన పాదాలకు నమస్కరించాడు. తల్లి దండ్రుల అనుమతి తీసుకొనమని ఎంత చెప్పినా విన లేదు. అక్కడ నుండే లోకము లోకి బయలు దేరినాడు.

Monday, February 13, 2012

దేవులపల్లి


                                                        
            ఒకనాడు:-
                             పాల సముద్రాన్ని సురలు, అసురులు మథియించు వేళ
                             వెలువడిన బడబాగ్నిని ఈశ్వరుడు నిగ్రహింప
                             వెలికి వచ్చె ఏ నాడో, ఏ మహ  సంగ్రామపు
                             ఫలితముగా లోన మునిగి యుండు దివ్య సంపదలు.
                             మహా యజ్ఞమది నిజముగ సంకుల సాగరమునుండి
                             అచ్చరలు, అమృతము, అమరత్వము అవతరించె
                             ఆనందపు తెమ్మెరలు ఎల్లెడలా తొంగి చూచె.
                             కలక తేరినట్టి మహా సముద్రంపు లోతునుండి.
              ఈనాడు:-
                              కలతలలో కలగినపుడు కరగుతుంది మనసు
                              అంతరంగ మథనమ్మె అమృతాన్ని ఇస్తుంది
                              మనలో మన ఎదలో నొక మాథుర్యము నొలకించి
                              మన మాతృక మన నేస్తము మన ప్రకృతి నొక కృతిగా
                             అందిం చి తెలుగు వారికొక మాలిక నిచ్చాడు,
                             ఊర్వశిలో ప్రణయము, ప్రేయసికై విరహము,
                             కృష్ణ పక్ష నిశీధిలో, నిలిచిన నైరాశ్యమును,
                            పంపినారు పల్లకిలో మన కొఱకై శాస్త్రి గారు.
                                  ఉత్తరంపు గవని నుండి వెలికి ఉరుకు హేమంతపు
                             ఛాయలలో శర్మిష్ఠను, చేరునట్టి యయాతిని,
                             కార్తిక రాత్రులలోన కృష్ణుడి కొఱకై వెదికే
                             గోపికలను గానమాల చేసి ఇలకు పంపినారు.
                             ప్రకృతిలో మాధుర్యము పదపదమున చిలికించి,
                             ప్రకృతిని మురిపింప, ప్రతి హృదయము స్పందింప,
                              కవితామృత ధారలలో, క్రొత్త లోకమందించె,
                             మహా కవీ! మీకు నేడు ఏ సత్కృతి సరిపోవు?

(కళా ప్రపూర్ణ శ్రీ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్ర్తి గారు కేంద్ర సాహిత్య
        అకాడమి ఆవార్డు పొందిన సందర్భముగా  తెలుగు సాంస్కృతిక సమితి, ఐ. ఐ. టి., మద్రాసు,
        30-1-79 న ఏర్పాటు చేసిన అభివందన సభలో సమర్పించ బడినది.)

శిల్పి 6


               విషయము తెలిసిన విశ్వ కర్మ గారు విస్తు పోయినారు. రాజులు మారినపుడు ఉద్యోగులు మార వలసిందేనన్నాడు. ప్రజల బాధ్యత రాజుదవుతుంది, కానీ, ఉద్యోగిది ఎలా అవుతుందని అన్నాడు.
               శ్రీ నాథుడు తన బాధను చెప్పుకున్నాడు. తన శాఖకు చెందిన సొమ్మును సరి అయిన పద్దు లేకుండా ఖర్చు పెట్టుట సహించ లేకపోయినానని అన్నాడు.  అది భరించ గలిగినా, తనకు వ్యతిరేకముగా జరిగే కుట్రలను వ్వరించినాడు.
               విశ్వకర్మకు అనిపించినది ఒకటే. ప్రభూత్వోద్యోగ హోదాను సులభముగా వదులుకొని  వచ్చినాడు. అభిమానము, అవమానము అనేవి మనము తగిలించుకున్న తొడుగులు మాత్రమే.
             ఇక ఎదురయిన ప్రతి వ్యక్తీ శ్రీనాథుడిని వెఱ్ఱి వాడిగా జమ కట్టేస్తున్నాడు.
             శ్రీ నాథుడు ఇంకా తన భవిష్యత్తును నిర్ణయించుకొన లేదు. తనకు ఎదురయిన ప్రతి వ్యక్తీ ఒక సమస్యగా కనిపిస్తున్నాడు.రాజు గారికి వ్యతిరేకముగా తను ఎక్కువగా మాట్లాడకూడడు. మాట్లాడితే ఏమవుతుందో తనకు తెలుసు. ఏదో ఒక రోజు తను ఒక రాజ ద్రోహిగా గుర్తింప బడుతాడు. తనకు తెలిసిన వారిలోనే ఎందరో చారులుండ వచ్చును. తను రాజుకు వ్యతిరేకముగా చెప్పినట్లు వారు భావించ వచ్చును.
                       అలా అని తను పిరికి వాడేమీ కాదు. కానీ, కొంత కాలము తను శాంతియుత వాతావరణమును కోరుకుంటున్నాడు. కొంత మార్పును కోరుకుంటున్నాడు.
                    నేరుగా వీరభద్రము మామయ్య ఇంటికి  వెళ్ళినాడు. మామయ్యంటే తనకు ఎంతో గౌరవము. అంతే కాదు, తనను అర్థము చేసుకొన గలిగేది అతడే. చేతిలో పాల రాతి విగ్రహము ఉన్నది. ఈ ప్రిస్థితులలో అయినా తనకు కాబోయే సహచరుడుగా మన్నించి, హేమ మాట్లాడుతుందని, పరిస్థితులకు తట్టుకోలేని తన మనసుకు ఊరట కలుగుతుందని భావించినాడు.
               నేరుగా లోపలికి వెళ్ళినాడు. మామ్మయ ఆచూకి లేదు, ఇంట్లో యున్నట్లు లేడు.
            "హేమా!" అని పిలిచినాడు.
           "బావా! ఎప్పుడు వచ్చావు?", చాలా సంతోషముగా పలకరించినది. హేమ ముఖములో సంతోషముతో బాటు ఒక విధమైన సిగ్గు కూడా కనిపించినది.
           "నాన్న ఊరికి వెళ్ళినాడు బావా!  రాత్రికి వచ్చేస్తానని అన్నాడు"
"ఎలా ఉన్నావు, హేమా!"
             నాకేమి బావా! ఇంట్లో వంట, నాన్నకు సాయ పడడము, ఇంకేమి పని యుంటుంది? ఉద్యోగము ఎల ఉన్నది బావా! ఊళ్ళో అందరూ అంటున్నారు, మీ హోదాయే, హోదా అని."
             "అలాగా హేమా!", శ్రీ నాథుడు ఎక్కువ మాట్లాడ లేక పోతున్నాడు. తన దగ్గిరకు వచ్చే వారికి తన హోదాయే గుర్తుకు వస్తుంది, కానీ, ఆ హోదా వెనుక ఉన్న భాధ్యతలు, క్లిష్టతలూ కనిపించవు.  ఇక హేమ తను ఇంకా ఔద్యోగములో ఉన్నట్లు కలవరిస్తున్నది. నిజమే, ప్రతి యొక్కరికి ఆశ సహజమే.....
           "ఏమిటి బావా! ఆలోచిస్తున్నావు? ఎన్నాళ్ళుంటావు? ఇల్లు నగరుకు దగ్గిరేనట కదా!"
         "హేమ! నా కోసం, లేదా మన కోసము ఒక మాట చెబుతాను. నీకు నేనంటే ఇష్టమా? లేదా, నా హోదా అంటే ఇష్టమా?"
         "అదేమిటి బావా! అలా అంటావు?నిన్నెవరు ఇష్ట పడరు?"
          తనకు జవాబు లేదు.
             " హేమా! నన్ను కాసేపు మాట్లాడనీ, నేను ప్రభుత్వోద్యోగి శ్రీ నాథుడిగా  నేను మాట్లాడుట లేదు. విశ్వ కర్మ కొడుకులా, లేదా నీ బావ గా మాట్లాడుతున్నాను."
            "నేనిప్పుడు ప్రభుత్వోద్యోగిని కాను. నీకు నిరాశ కల్పించినాను కదా!  రాజ ధానిలో ఇంతకు ముందున్న పరిస్థితులు లేవు. రాజులు మారితే రాజ్యాలే మారి పోతాయి. కానీ, నాలాంటి వారు కొద్ది మంది యుంటారు, ఎప్పటికి మార లేని మనుష్యులు. మారిన పరిస్థితులకు ఇమడ లేక, భాధ్యతలను సరిగా నిర్వహించ గలనన్న నమ్మకము లేక దూరముగా పారి పోయి వచ్చినాను.నీ జీవితము సుఖ ప్రదము చేస్తాననే నమ్మకము ఉండేది, ఇన్నాళ్ళు. కానీ, నా జీవితమే ఎగతాళిగా మారినట్లుంది.  నీవు గానీ, మామయ్య గానీ, నన్నర్థము చేసుకొని ధైర్యము చెబుతారని ఆశగా వచ్చినాను."
         "ఎందుకిలా చేశావు బావా! కాస్త సర్దుకోలేక పోయినావా?" అనాలనుకుంది.. కానీ, నోట మాట రాలేదు. తను కోరుకున్న హోదా పరపతి దూరమయినవి. అక్కడ అలాగే కూర్చుండి పోయినది.
             "హేమ కూడా తనను అర్థము చేసుకోలేదు." అనుకున్నాడు, శ్రీ నాథుడు. చేతి సంచిలో హేమ బొమ్మ యున్నది. ఎంతో సంతోషముగా చెక్కినాడు. ఎంతో మెప్పును ఆశించినాడు. తన హోదాను తప్ప తనను కోరని వారి కోసము చేసుకొని కష్ట పడినాడు. లోకమంటే ఇంతేనేమోఆ సంచిని అక్కడె వదిలి వేసినాడు.
              "వస్తాను హేమా!", అంటూ వెనుకకు వచ్చినాడు.
           బావ వెళ్ళి పోతున్నాడు.తననుంచి సాంత్వన వాక్యాల కోసము వస్తే తనేమీ మాట్లాడ లేక పోయింది.
              "బావా!", అని పిలువ పోయినది,కానీ, గొంతు పైకి రాలేదు.మోకాళ్ళ మీద తల పెట్టుకొని కూర్చుంది, హేమ. కళ్ళ నుండి నీరు కారి పోతుంది,బావ కోసము.

దేవులపల్లి


                    
                                                           గోపీచంద్‌
                                                            
          కొమ్మ మీద కోయిలమ్మ
          కూతలోని కులుకులు
          నింగిలోని రాయంచల
          నడకలోని తళుకులు
          చెట్ల మీద చిలకమ్మల
          చక్కని చిరు పలుకులు
        నీ గీతికలో నివశిస్తాయి
        నీ గొంతుకలో నిదురిస్తాయి.

          కొలను లోని కలువ భామ
          జలం మీద అలల భామ
          నేల మీద నెమలి భామ
          అంబరాన చంద మామ
          ఆడుకున్న ప్రతి మాటా
          పాడుకున్న ప్రతి పాటా
        నీ తలపు లోన మెదులుతున్న కవితా రావం
        నీగుండె లోన ఊరుతున్న కమ్మని భావం.
             కురుస్తున్న వెన్నెలలో చల్లదనాలు
           మెరుస్తున్న మెరుపులలో  తెల్లదనాలు
           విరుస్తున్న జాజులలో కొత్తదనాలు
           సాటి రావోయి ఎన్నడూ నీ కవితకు
           మేటి నీ వోయి ఎప్పుడూ ఈ జగతికి
         కాని ఒక్క మాటా దేవులపల్లి
         మరిచి పోకు మళ్ళీ మల్లీ
         కరుణ చిందు కవితలల్లి
         మమత జల్లు మాటలల్లి
నాది నాది నాదంటూ  -లోకమే తనదంటూ
         కామాన్నే నంచుకుంటూ- క్రోధాన్నే నంజుకుంటూ
         అజ్ఞానం భుజిస్తున్న _ ఆవేదన మ్రింగుతున్న
         సాంఘిక సమాజం లో -సమతను రూపొందించు
         మానవాళి మనసులలో -మమతను రేకెత్తించు.
       ఇదేనోయి నాదు మాట దేవులపల్లీ!
       మరిచి పోకు ఎన్నడూ మళ్ళీ మళ్ళీ.


        (కళా ప్రపూర్ణ శ్రీ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్ర్తి గారు కేంద్ర సాహిత్య
        అకాడమి ఆవార్డు పొందిన సందర్భముగా  తెలుగు సాంస్కృతిక సమితి, ఐ. ఐ. టి., మద్రాసు,
        30-1-79 న ఏర్పాటు చేసిన అభివందన సభలో సమర్పించ బడినది.)
(గోపిచంద్‌ గారిని ఈ బ్లాగ్‌ మూలముగా అనుమతి తీసుకున్నట్లు భావించి దీనిని వాడుకుంటున్నాను)