Sunday, March 25, 2012

శిల్పి 9


                            
       శ్రీ నాథుడు తిరిగి వచ్చినాడు. గురువు గారితో తన అనుభవాలన్నీ చెప్పినాడు. తన నిర్ణయాన్ని
 కూడా చెప్పినాడు. ఈ విషయమై తండ్రి  కోప పడినాడు, బెదిరించినాడు, బ్రతిమాలినాడు. తల్లి
కన్నీళ్ళు పెట్టుకున్నది. అయినా తన మనసు మార లేదు.  మామయ్య చేత చెప్పించినారు.
 ఆయన తననేమీ అన లేక పోయినాడు.

            రాజాశ్రయము లేదు, రాజులు వినే వారు లేరు, ఆర్థిక మాంద్యము, అరాచకత్వమే
రాజ్యమును  ఏలుతున్నవి. ఈ పరిస్థితులలో తను ఎవరినుండి ఎటువంటి సహాయమును
ఆశించ లేడు.

            హేతు వాదము అనే పేరుతో చార్వాకత్వము రాజ్యమును ఏలుతున్నది. వావి వరుసలు,
మిథ్యా  కల్పనలు అని అంటున్నారు. నీతి శాస్త్రము వ్యర్థమని, విలాస జీవితమే పరమార్థమని
 అంటున్నారు. స్త్రీ కి సంఘములో ఉన్నత స్థానము పోయి విలాసిని గా నిలబడేటట్లు ఉన్నది.
ఈ స్థితిని చూచి కన్నీళ్ళు కార్చినాడు.

            వీరుడు, గుణవంతుడు, తెలివిగల వాడు అయితేనే కన్యలు వరులుగా కోరుకొనే రోజులు
పోయినవి. భర్త నిలకడగా తన వెంట ఉండాలి, భర్త వెంట నిలకడగా ఆస్తి యుండాలి, లేదా రాజోద్యోగి
 అయి యుండాలి. ఇవీ ఇప్పటి కన్యల, వారి తల్లి దండ్రుల గొంతెమ కోర్కెలు. ఎంత మార్పు వచ్చినది?
ఆశ్ఛర్య పడినాడు.

            కపిలుడి తల్లి దేవ హూతి, యాజ్ఞ్యవల్కుడు తపస్సుకు పోయే వేళ అతడినుండి ఆస్తి వద్దని,
జ్ఞానమే కావాలని కోరిన మైత్రేయి, గణిత శాస్త్ర నిష్ణాత లీలావతి, తన కను సన్నలతోనే  దారి తప్పిన
భర్తలను నిర్భీతిగా ధర్మము వైపు మరలించిన స్త్రీలు, ఇటువంటి వారు ఇపుడేమయినారు? మనస్సు
భాధతో మూగ పోయినది.

            హిమ సుత గా బంగరు పంటలనిచ్చే గంగ, అద్వితీయమైన ఆత్మ శక్తిగా కాశ్మీరు నుండి
కన్యాకుమారి వఱకు మన్ననలను అందిన సతి పార్వతి, కాశ్మీర సర్వజ్ఞ పీథాధి దేవత శారదాంబ,
వీరి ఆంశలో దారి మలుచుకోవలసిన స్త్రీలు నేడు పరిస్థితుల వలన విలాసినులుగా మార్చి
వేయబడుతున్నారేమిటి?

                        కణ్వ సుత శకుంతల చేత పెంచ బడి, ఈ భూమిని అవిఛ్ఛిన్నముగా పాలించిన భరత
 భూమి ఈనాడు స్వార్థ పర ,విఛ్ఛిన్న శక్తుల చేత ఎలా నాశనమవుతున్నది?

            భరత భూమిలో ప్రజలలో ఆత్మ శక్తిగా నిలబడిన భరత మాతా! నీ కోసము నేనేమి చేయ గలనమ్మా?
 ఎంతో విలపించినాడు.

            తనకున్నది ఒకే మార్గము. ఈ సంస్కృతి విశిష్టతను సూచిస్తూ ఒక పవిత్రాలయాన్ని నిర్మించాలి. తన బాల్య స్నేహితులను, తన కొఱకు ఏమైనా చేస్తామన్న వారిని సహాయము అడిగినాడు. ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇది మనము చేయ గలిగిన పని కాదని అన్నారు. అయినా నీవొక్కడవే ఏమి చేయ గలవన్నారు. అంతే కాదు, గుట్టుగా మీ నాన్న చెప్పినట్లు  చేయమన్నారు.

            చరిత్రలో పరిస్థితులు ఇలానే వస్తాయేమో? గురువు గారు చెప్పేవారు, సుమారు పది వేల మంది చదువుకొనే నలందా విశ్వ విద్యాలయాన్ని వారి ఎదురుగానే, కేవలము ఇరువది మంది కంటే ఎక్కువ కాని గుఱ్ఱపు రౌతులు నాశనము చేసినారుట. ఎంత విద్య యున్నా, భయము, నిర్లిప్తత యున్న వారు ఎందుకూ పనికి రారు.  తమ సంస్కృతిని రక్షించు కోలేని వారు ఎంత చదువుకున్నా ఎవరికీ ఉపయోగ పడరు.

            అదే నిర్లిప్తత ఈ నాడు కనిపిస్తున్నది. అంతే కాదు, గురు కులానికి పోషణ లేదు. ఎంతో మందిని గుణవంతులుగా, విద్యావంతులుగా తీర్చి దిద్దిన రామాచార్యులు, ఈ నాడు రాజాదరణ లేక ఊరిలో వారి మీద తన విద్యార్థుల ఉదారత మీద ఆధార పడుతున్నాడు.

            కాని, తనేమి చేయ గలడు? కన్నడ రాజ్యములో తను కలిసిన శిల్పి నరసింహాచార్యులు తోచినారు. ఆయన  ఆలోచనలు తనను కదిలించినవి. ప్రజలు ఈ సంస్కృతిని మఱచి పోగూడదు. ఆ నాటి నిబధ్ధత, త్యాగ శీలత మళ్ళీ రావాలి. అందుకు మొదటి బలి పశువు తనే కావాలి.

            గునపము తీసుకున్నాడు, ఎదురుగా చెఱువు, ప్రక్కనే కొండ, సాయం సంధ్యలో ఆకాశములో అరుణ కాంతులు ఆ చెఱువులో ప్రతిఫలిస్తున్నవి. ఆ నేలనంతా చదును చేసినాడు. ఎవ్వరూ తోడు రాలేదు, వచ్చిన వారికి తను ఎటూ ప్రతిఫలాన్ని ఈయ లేడు. తల్లి దండ్రుల బలవంతము మీద ఏదో తింటున్నాడు. విశ్రాంతి మాత్రము రామాచారి కుటీరము లోనే.

            కొండలో శిల్పానికి అనువైన రాతిని తీసుకున్నాడు. దానిని సమముగా మలిచినాడు. తనకు తెలిసినదొకటే.  శక్తినిచ్చే భవాని, జ్ఞాన రూప శారదాంబ, శీలము కొఱకు స్వీయ త్యాగము చేసుకొన్న కన్యకా పరమేశ్వరి, శుంభ నిశుంభ సంహారిణి దుర్గా మాత, ఈ గుణాలన్నీ కలబోసిన భారత మాత  రూపాన్ని గీయ తలచినాడు. "అమ్మా! భారత మాతా! ఈ నాడూ నీ కడుపున  ఎటువంటి వారు జన్మించినారమ్మా?" కళ్ళళ్ళో నీరు కమ్మినది.

                        సున్నపు సుద్దతో బొమ్మ గీచినాడు. ప్రసన్నత, ధీరత, ప్రౌఢత, అన్నీ తగినట్లు ముఖములో కనిపించేటట్లు చూచినాడు. గీచినది నచ్చ లేదు. మళ్ళీ గీచినాడు, మళ్ళీ....

            ఇదేమిటి? ముఖమిలా వచ్చినది? తను గీచినది హేమ ముఖము. అంతరంగములో తను ఇంకా హేమను ప్రేమిస్తున్నాడా? భౌతిక ఆకర్షణలతో తను ఇంకా కొట్టుమిట్టాడుతున్నాడా? ఇతువంటి తను ఈ యజ్ఞాన్ని పూర్తి చేయ గలడా?
            పూర్తిగా తుడిపి వేసినాడు. మళ్ళీ మార్పులు చేస్తూ మళ్ళీ గీచినాడు. అలాగే యుంది. "ఏమిటి తను ఇంత బలహీనుడయినాడు?" నెత్తి మీద చేయి పెట్టుకొని అలాగే కూర్చున్నాడు.

            "నాయనా! శ్రీ నాథా!", ఆచార్యులు గారి గొంతు వినిపించినది.

            తలెత్తిన శ్రీ నాథుడిని చూచినాడు. కళ్ళు ఉబ్బి యున్నాయి. ముఖములో ఏదో వేదన. గురువుగారు పరిస్థితిని గమనించినారు.
            "ఏమిటయ్యా! ఇంత బేలవైనావు? "
            "ఈ యజ్ఞాన్ని నెను పూర్తి చేయ గలనా? దైవత్వము ముఖములో చిందులేయాలని ప్రయత్నిస్తున్నాను. కానీ చూడండి, ముఖము ఎలా వచ్చిందో?"
            "బాగుగనే యున్నదే?"
            "హేమ ముఖములా కనిపించుట లేదా?"
            "ఓ! అదా? ఎందుకు శ్రీ నాథా! అలా భాధ పడుతావుహళిబేడు లో విగ్రహాన్ని చూచినావు కదా!"
            "చూచినాను గురుదేవా! "
            "అక్కడ దేవి పేరు శాంతలా దేవి. ఆమెలో ఆ నాటి మహా రాణి శాంతలా దేవి పోలికలు ఉన్నాయిట. ఆమె కారణ జన్మురాలు."
            "ఆ మహా మనీషికి హేమకు పోలికలెక్కడ గురు దేవా!"

            "అది నీకూ నాకూ అర్థమయే విషయము కాదు. నీవు ఎంత ప్రయత్నము చేసినా అలాగే వస్తున్నది అంటే, ఖచ్చితముగా అది దైవ సంకల్పము. ఇంక పనిని కొన సాగించు. సత్సంకల్పాలు వెంటనే జరిగి పోవాలి."
            ----------------------------------------
            ఒక పందిరి నిర్మాణమయినది.  ఆ పందిరిలోనే పని చేస్తున్నాడు. శ్రమ అనేది మఱచి పోయినాడు. ఉలి శబ్దమే జీవనమయినది. వెన్నెల రాత్రులలో కూడా పని చేస్తున్నాడు. గడ్డము పెరిగి పోయినది. జీవన విధానమే మారి పోయినది.

            విశ్వ కర్మ తనకున్న ఒకే కొడుకు శ్రీ నాథుడి గురించి ఆశిన్చిన వేవీ జరుగ లేదు. కొడుకు తన మాట విన లేదని ఒకప్పుడు భాధ పడినాడు. ఈ నాడు కొడుకు యొక్క దీక్షను చూచి ఆశ్ఛర్య పడుతున్నాడు.  అటువంటి కొడుకు ఉన్నందుకు తనలో గర్వము కూడా కలుగుతున్నది. ఎంత మార్పు? స్వార్థము కనిపిస్తే కాని పని చేయని తను, ఏ విధమయిన ఆశ లేకుండా పని చేసే  కొడుకును చూచి మెచ్చుకుంటున్నాడు.  క్రమ క్రమముగా అతడి పనిలో పాలు పంచుకుంటున్నాడు. తనకు తెలిసిన కొన్ని మెళుకువలు కూడా చెబుతున్నాడు. అప్పుడప్పుడు వీర భద్రయ్య  కూడా వచ్చి చూచి పోతున్నాడు.
            అందరిలో కొత్త చైతన్యము కనిపిస్తున్నది. అప్పుడప్పుడు స్నేహితులు వచ్చి  సాయం చేస్తున్నారు. కొంత మంది శిలలను గుర్తించి తీసుకొని రావటము లోను, వాటిని సిధ్ధము చేయుట లోను ఉపయోగ పడుతున్నారు.
            మూల విగ్రహము పూర్తి అయే నాటికి, ఊరి వాళ్ళు చుట్టు ప్రక్కలంతా చదును చేయించి, రాతితో గోడ
కట్టించినారు. పెద్ద పాక వేయించినారు. ప్రతిష్ఠ జరిగే లోపల రెండు గడలు నాటి  వాటికి విగ్రహాన్ని ఆనించి పెట్టినారు.                          
       
                       
            
           
           
          

Saturday, March 10, 2012

శివ శక్తి


శ్రీ కరంబైనట్టి శివ శక్తి కృప చేత
ఏ దివ్య లోకాల నేల వచ్చు
శ్రీకరంబైనట్టి శివ యోగ శక్తిచే
సత్య లోకంబుల చేర వచ్చు
శ్రీకరంబైనట్టి శివ నాట్య గరిమ చే
గంధర్వ లోకాల చెంద వచ్చు
శ్రీకరంబైనట్టి శివ సతి ఎద లోన
అమల మాతృ ప్రేమ నంద వచ్చు
యోగ నిద్రలొ మునిగిన ఆది దేవు
అసుర గణముల చంపగ నాన పెట్టి
దివ్య ధీధితి వెలిగెడు దేవి హైమ
పాద పద్మము పూజింప రాదె ముక్తి.