Sunday, May 20, 2012

శిల్పి 11


                                             
            హేమ ఊళ్ళో దోపిడీల వార్త విన్నది, చాలా భయ పడినది. నాన్న గారు, మామయ్య
ఊళ్ళొ లేరు.  గురుకులానికి వెళితే ఆచార్యులు కూడా లేరు. ఊళ్ళో ప్రతి గుడిలో మొక్కుకున్నాది.
ఊరి పెద్దల దగ్గిరకు వెళ్ళీ శ్రీ నాథుడికి రక్షణ ఇమ్మని కోరినది, తండ్రి లాగా కాపాడమన్నది, అన్నలాగా
మన్నించ మన్నది. కానీ, అందరూ భయపడుతున్నారు. ఒక్కరూ ముందుకు రావటము లేదు.
            ఊరి చావడి దగ్గిరకు చేరి అక్కడ నిలబడినది. అసహాయతతో కూడిన ఆవేశముతో,
ముక్కుపుటాలు అదురుతున్నవి. ఒక్క క్షణం శుంభ, నిశుంభులను ఎదుర్కొనటానికి సిద్ధ
 పడుతున్న దేవి వలె కనిపించినది. ఏమి చేయాలో తోచ లేదు. పెద్ద గా అరచినది. "చెల్లెలుగా
వేడుకున్నాను, తండ్రిగా కాపాడమన్నాను, ఈ ఊరి ఆడ పడుచుగా నా బావను కాపాడమని
వేడుకున్నాను. భార్యను కాపాడ లేని భర్తలు, బిడ్డలను కాపాడ లేని తండ్రులు, ...మీరా మగాళ్ళు?
నేనే ... నేనే ... వెళ్ళుతున్నాను. మీరు చేయ లేని పనిని నేనే చేస్తాను. ఈ ఊరి ఆడ పడుచును
కాపాడుకోలేని మీ మగతనానికి సిగ్గు పడండి. ఆ తరువాత జరిగే దానికి కుళ్ళి కుళ్ళి ఏడవండి." 
            ఆమె కళ్ళలో నీళ్ళూ లేవు. పళ్ళు అదిరి పోతున్నవి. ఇంతలో ఎక్కడో దూరాన గుఱ్ఱపు
డెక్కల చప్పుడు వినిపిస్తున్నది.
            "ఒరే, చూస్తూ ఉన్నారేంట్రా? ఆ పిల్ల అలా పోతుంటే.", ఒకరన్నాడు.
            "ఛీ! ఛీ! ఆ పిల్ల కున్న ధైర్యము ఒక్క మగాడికి లేదు." ఓ ముసలాయన్‌ అన్నాడు.
            "మీ కంటే ఆడోళ్ళే నయం.", ఓ ముసలమ్మ అన్నది.
            "గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చోండి, మీరంతా మగాళ్ళేనా?". అక్కడ చేరిన ఆడోళ్ళంతా అన్నారు.
            అంతే చావడి దగ్గిర కుర్రాళ్ళ కు రోషము పొంగినది. చేతుల్లో కఱ్ఱలు పైకి లేచినవి."
అందరూ ఊరి బయట గుట్ట దగ్గిరకు బయలు దేరినారు.
            సుమారుగా పది మంది, గుబురు మీసాలతో క్రౌర్యమంతా కళ్ళలో కనిపిస్తుంటే
గుఱ్ఱాల మీద వస్తున్నారు. సాయంత్రము కావచ్చినది. వారి వళ్ళంతా చమటలు కారి పోతున్నవి.
            "అరే, ఆ చెరువును చూడవొయ్‌"
            "అఛ్ఛా! స్నానము చాలా జరూరు."
            "దిగండి."
            "అరే, వాడిని చూడరా, బొమ్మను చెక్కుతున్నాడు."
            "మనము వచ్చామన్న భయము కూడా లేదు, ఖతం చేయాలి వాడిని."
                  "ఆ తర్వాతే నహానా"
            శ్రీ నాథుడి దగ్గిరకు వెళ్ళినారు.
            "అరే, ఏం చేస్తున్నావా?", ఇద్దరూ చెరి ఒక వైపు నిల బడినారు.
            ", బొమ్మను చెక్కుతున్నావా? వీడి ముందే దీన్ని ముక్కలు చేయాలి."
            "ఆ తరువాత వీడ్ని ఖతం చేయాలి."
            "ఆ తర్వాతే నహానా."
            శ్రీ నాథుడు తలెత్తి పైకి చూచినాడు, పరిస్థితిని గమనించినాడు.
            "ఆగండి", పెద్దగా అరచినాడు.
            "కూత ఘనమే", ఒకడన్నాడు.
                  "నన్ను చంపి గానీ, ఈ విగ్రహాన్ని ఏమీ చేయ లేరు.", అడ్డముగా నిలబడినాడు.
            బయట కలకలము, ముందు హేమ వచ్చినది. వెంటనే పెద్ద గుంపు లోపలికి చొర బడినది.
            దుండగుల్లో ఒకడు శ్రీ నాథుడి మీదికి కత్తి దూసినాడు, వెంటనే ఒక కఱ్ఱ దెబ్బకు వాడి పుచ్చె పగిలినది. కానీ శ్రీ నాథుడి కుడి చేయికి గాయమయినది.
            దుండగులు నివ్వెర పడినారు, ఈ మాత్రపు ప్రతిఘటన కూడ వారికి ఎక్కడా రా లేదు.
వెనక్కు తిరిగే లోపల అందరికి దెబ్బలు పడి అక్కడే పడి పోయినారు.
            "బావా!" అంటూ, శ్రీ నాథుడి దెబ్బ తగిలిన చేతిని పట్టుకున్నది, హేమ.కన్నీళ్ళతో ఆ చేతికి అభిషేకము చేసినది.
            అప్పుడే అచార్యులుగారు వచ్చినారు.
            "శ్రీ నాథా! హేమను చూచావా? ఈ ఊరి ప్రజలను తట్టి లేపినది."
            మళ్ళీ అన్నాడు.
            "హేమా! శ్రీ నాథుడిని చూచావా?ఎంత ఎదిగి పోయినాడో?"
            హేమ సిగ్గుతో శ్రీ నాథుడి చేయి వదిలి వేయ పోయినది.
ఆచార్యులు అన్నారు," వద్దు హేమా! ఇది అద్భుతమైన ముహూర్తము, ఆ చేయినలాగే పట్టుకో, ఇదే
మీ పాణి గ్రహణము. శ్రీ నాథుడు చెక్కే ప్రతి శిల్పానికి నీ చేయి ఇలాగే ఆసరాగా నిలబడాలి."
            ఈ దృశ్యాన్ని చూచుటకు పూర్ణిమ చంద్రుడు నెమ్మదిగా పైకి వచ్చాడు.

ramayanam

బాల కాండము

            శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం,
            సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం,
            ఆజానుబాహు మరవింద దళాయతాక్షం,
            రామం నిశాచర వినాశకరం నమామి.

            రఘు కుల విలసిత దశరథ సుత శ్రీ
            సతి నీ చరణము లొత్తేనా?
            అకలంకిత భక్తిని కొలిచే పావని
            ఆజ్ఞలకై నిను చూచేనా?
            అనుగు సోదరులు దరిన నిలబడి
            అన్న ఆజ్ఞకై నిలిచేరా?
            గుణ గణుడు విభీషణు డాశతొ నిలిచి
            దరిశనమునకై వేచేనా?
           
            రామ దాసులు, తులసీ దాసులు,
            రామ నామా గానామృత దివ్యులు,
            వాకిలి కడ నీ ఆజ్ఞల నిలిచి,
            అనుక్షణమెదురు చూచేరా?