Thursday, February 28, 2013

ఎవరు భాధ్యులు


                                          

                                            

            దేవ లోకములో అత్యవసర సమావేశము జరుగుతున్నది.  ఇంద్రుడితో అష్ట దిక్పాలకులు
ఇతర అధిస్థాన దేవతలు అందరూ సమావేశమైనారు. భూమి యొక్క అధిస్థాన దేవత అయిన
భూ దేవి నుండి సమర్పించ బడిన ఒక వినతి పత్రము మీద చర్చ జరుగుతున్నది. అందులో సమస్య ఒక్కటే,
"భూమి  మీద వర్షాలు సరిగా అడుట లేదు, కరవు కాటకాలతో భూమి మీద జనము అల్లాడి పోతున్నారు."
            ఇంద్రుడు వరుణ దేవుడి వైపు చ్చినాడు," ఎవరూ వర్షము కావాలని అడుగుట లేదు ప్రభూ!",
వరుణుడి నుండి జవాబు వచ్చింది.
            "మరి, ఈ వినతి పత్రమేమిటి?", భూ దేవి వైపు చూచినాడు.
            "వర్షాలు  పడితే గాని, భూమి మీద పరిస్థితులు చక్క బడవు.", చెప్పింది  భూదేవి.
            రెండు వ్యతిరేకమైన జవాబులతో ఇంద్రుడు ఒక నిర్ణయానికి వచ్చి ఇలా అన్నాడు.
            "భూమి మీద జనులు వర్షము  కావాలని కోరుకోవడము లేదు. ఈ మాట నిజమే, కానీ, వారికి
వర్షముతో అవసరము ఉన్నదన్న మాట కూడా నిజమే."
            దేవతలకు అర్థము కాలేదు, వారు ఆ మాటే అన్నారు.
            ఇంద్రుడు వివరించి చెప్పినాడు.
            "భూమి  మీద వర్షము లేదా నీటి మీద ఆధార పడి బ్రతికేది,  ప్రధానముగా రైతులు. వారికి కూడా
నదులకు ఆనకట్టలు కట్టి ప్రభుత్వములు నీరందిస్తున్నవి. అందు వలన వారికి వర్షాలు రాలేదన్న భావన కంటే  కాలువలలో నీరు వదల లేదన్న భావన ఎక్కువ యున్నది. అందు వలన వారు కూడా వర్షము రావాలని
కోరుకోవటము లేదు. నగరాలలో వర్షాలు పడితే కార్యాలయాలకు వెళ్ళే వారికి ఇబ్బంది. సాయంత్రమయితే
వినోదాలకు, విహారాలకు వెళ్ళే వారికి ఇబ్బంది. కానీ జల సరఫరాలో లోపమొస్తే మాత్రము నగరాధికారుల
మీద, ప్రభుత్వము మీద గొడవ చేస్తారు. మన దేవతలకు కూడా వారితో తిరిగి తిరిగి వారి ఆలోచనలకు
అనుగుణముగా చేయడము బాగా అలవాటయింది. ఇంక అధిక సంఖ్యాకులు నగరాలలో నుండి, పల్లెటూర్లలో
జనము తగ్గి పోతున్నారు. ఈ రకముగా దేవతలు కూడా అధిక సంఖ్యాకుల అభిప్రాయాన్నే  అనుసరిస్తున్నారు."
            "ఈ సమస్య ఎలా పోతుంది?", అందరూ అడిగినారు.
            "ఏ సమస్యా లేకుండా,  అలవాటు తప్పి పోకుండా, వర్షాలు ఎక్కువగా సముద్రములోనే కురుస్తున్నవి. అందుకే వరుణ దేవుడు వాయు దేవుడిని తోడు తీసుకొని సముద్రములో కంటే, నేల మీద ఎక్కువ వర్షాలు పడేటట్లు చూడ వలసినదిగా నిర్ణయము చేయడము అయినది.", అంటూ ఇంద్రుడు సభ చాలించినాడు.
            మేఘాలను అనుకున్న చోటికి నడిపించే భాధ్యత వాయుదేవుడిది. వర్షము కురిపించేది వరుణ దేవుడిదే. ఇద్దరూ ప్రపంచము అంతా తిరగడము మొదలు పెట్టినారు.
            ఒక చోట పొలాలు బాగా ఎండి పోతున్నవి. కాలువల్లో నీరు లేదు. పక్క వాడితో యజమాని
అంటున్నాడు. "ఈ ప్రభుత్వము ఇంకా కాలువల్లో నీరు వదలనంటున్నది. ఈ సంవత్సరము ఎలా గడుస్తుందో?"
అని. చుట్టూ అలాగే చాలా పొలాలున్నవి. వాళ్ళ మాటలను దేవతలు విన్నారు. ఒక మేఘము అలా వచ్చింది.
అక్కడ బ్రహ్మాండముగా వర్షము పడింది. ఆ రైతులు చాలా సంతొష పడి యుంటారని వారు అనుకున్నారు.
కానీ, వారి మాటలు వేరుగా యున్నవి.,"ఈ పాడు వాన ఇప్పుడే రావాలా? లక్ష రూపాయల బట్టీ ఇటుకలు
ఎందుకూ పనికి రాకుండా పోయినవి.", దేవతలు నివ్వెర పోయినారు.  
            మరొక చోట ఊళ్ళో నీళ్ళ చెరువు ఎండి పోయింది. నీళ్ళూ ఎలా అందించాలా అని నగర పాలక
వర్గము నాల్గు రోజుల నుండి చర్చిస్తున్నది. ఇక్కడ ఖఛ్ఛితముగా వర్షము కురిపించాలనుకున్నారు.దగ్గిరలో ఒక పాథశాల. పిల్లలు ఆట స్థలములో వరుసల్లో నిల బడి యున్నారు. వారిని చూస్తే దేవతలకు చాలా ముచ్చట వేసింది. ఇంతలో మేఘాలు బాగా కమ్ముకున్నాయి. ఇప్పుడిక్కడ వర్షము పడితే, పిల్లలు
            వానా వానా వల్లప్పా
            చేతులు చాచూ చెల్లప్పా
            తిరుగూ తిరుగూ తిమ్మప్పా
            తిరగా లేనూ నరసప్పా
అని హాయిగా నాట్యము చేస్తారనీ, చూడ వచ్చని, దేవతలు అనుకున్నారు. కమ్ముకున్న మబ్బులను
చూచి పిల్లలు
            రైన్‌ రైన్‌ గో అవే
            కం అగైన్‌ అనదర్‌ డే
            లిటిల్‌ జానీ వాంట్స్‌ టు ప్లే.
            దేవతల ఉత్సాహము చల్లారి పోయింది. అంటే వీళ్ళకు కూడా వాన ఇష్టము లేదన్న మాట.
           
            మరి కాస్త దూరము వెళ్ళినారు. పెద్ద పెద్ద చెరువులు కనిపిస్తున్నవి. " ఈ ప్రాంతములో నీటి
కరవే లేదన్న మాట. ఏమన్నా కురిస్తే ఇక్కడే కురవాలి, ఇంకా కాస్త నీళ్ళు నిలువ వుంటాయి.", అనుకున్నారు.
దగ్గిఱకు వెళ్ళితే భయంకరమైన వాసన,వాసనలను మోసుకు వెళ్ళే వాయు దేవుడు కూడా ఆ వాసన
భరించ లేక తన ప్రభావము తగ్గించి వేసినాడు. ఇంకో వైపు చూచినారు. అప్పుడే రెండు లారీలు అక్కడ ఆగినవి. అందులోనుండీ కుళ్ళీన మాంసపు ముక్కలు, నత్తలౌ, చెత్త అంతా ఆ నీటిలో పోస్తున్నారు."అంటే ఇది
చెత్త కుండీ అన్న మాట", దేవతలు అనుకున్నారు. ప్రక్కనే గుడిసెలున్నాయి. "అయ్యో పాపము వీళ్ళు ఈ నీరే త్రాగాలేమో? ఈ వాసన అంతా వీళ్ళే భరించాలేమో?" ఇలా అనుకుంటేనే దేవతలకు వాంతి వచ్చినట్లయినది. మంచి వర్షము పడితే ఈ వాసన తగ్గి కాస్త మంచి జరుగుతుందనుకున్నారు. అంతే అక్కడ భయంకరమైన
వర్షము పడింది.
            మరుసటి రోజు పత్రికలలో ప్రధాన సంచికలో మొదటి పుటలో వచ్చింది,పెద్ద వర్షము వచ్చి
చేపల చెరువులకు చేపలు చని పోయి రెండు కోట్లు నష్టము వచ్చిందని. అంతే కాదు, ఇరవై వేల ఎకరాల
పంట పొలాలునీటిలో మునిగి పోయాయని జిల్లా ప్రతిలో ఎక్కడో చిన్న అక్షరాలలో వేసినారు. ఇది తెలిసి దేవతలకు ఆశ్ఛర్యమేసినది.కొంత ఆలోచించి నదీ జన్మ స్థానాలలో వర్షము కురిపించుదామని అనుకున్నారు.  కొండల మీద మంచి వర్షము పడింది. ఆ వడికి రాళ్ళు, బండలు క్రిందికి కొట్టుకు పోయి వచ్చినవి. అంతే గాక అంతకు మునుపే కట్టిన కొన్ని ఆన కట్టలు కొట్టుకొని పోయినవి. కానీ, చివరకు వచ్చేసరికి, రైతుల పొలాలకు మాత్రము నీళ్ళు ఎక్క లేదు. నీరంతా సముద్రము లోకే పోయినది.
          కొండల మీద అడవులు నరకి వేయ బడినందున మట్టికి బలము లేక బండలు రాళ్ళు,క్రిందికి దిగి వచ్చినాయని కొందరు శాస్త్ర వేత్తలు నిర్ధారించినారు, పత్రికల్లో వార్తా చానళ్ళలో వివరించినారు, అందుకే ఆన కట్టలు కూలి పోయినాయి అని అన్నారు. అడవులు నాశనం అయినందు వలన ఇది జరిగినదని ప్రచారము అయితే తమ క్రిందికి నీళ్ళూ వస్తాయని భయ పడిన నాయకులు వెంటనే ఒక తమపై విశ్వాసమున్న శాస్త్ర వేత్తల బృందాన్ని నిజ నిర్ధారణ కమిటీ గా వేసి ఆ కొండలూ, రాళ్ళూ, ఎందుకు విరిగి పడినాయో  నివేదీకలో సమర్పించాలని ఆదేశించినారు.
            "అయ్యో, వరదల్లో మా ఊరు కూడా మునిగి పోయిందా?",అని కలల అప్పా రావు కంగారు పడుతూ లేచినాడు.
            "అమ్మయ్య,  ఇదంతా కలేనన్న మాట", అని తేరుకున్నాడు.
            కానీ, వర్షము పడ కూడదు, నీరు కావాలి, అన్నీ ప్రభుత్వమే చూడాలి, మాకేమీ భాధ్యతలు  లేవనుకొనే మనో ప్రవృత్తి లేదా భావ కాలుష్యము వాతావరణ కాలుష్యము కంటే తీవ్రమనుకుంటూ   స్నానపు గది లోనికి వెళ్ళినాడు. కుళాయి తిప్పితే చుక్క నీరు కూడా పడ  లేదు.
                            ********************************