Monday, April 8, 2013

వెలుతురులో వెతుక్కో



ఒక ముసలి అవ్వ తన గుడిసె బయట వెతుకుతున్నదట. ఆ దోవన పోతున్న కుర్రాడు అవ్వా! ఏమి వెతుకుతున్నావు? అని అడిగినాడు.
 నా సూది పోయింది నాయనా! వెతుక్కుంటున్నాను అన్నది.
ఎక్కడ పోయింది అవ్వా! ఆ కుర్రాడు అడిగినాడు.
గుడిసె లోపల పడిపోయింది నాయనా! జవాబిచ్చింది.
మరి ఇక్కడ వెతుకుతున్నవేమిటి?
లోపల చీకటి కదా. కనిపించదు.
మరి ఇక్కడ పడ లేదన్నావు కదా! ఆ కుర్రాడు అడిగినాడు.
ఏదయినా వెలుతురులో వెతుక్కోమన్నారు బాబూ! మా పెద్ద వాళ్ళు వెంటనే జవాబు ఇచ్చింది.
ఇంకా ఆ కుర్రాడికి ఏమి చెప్పాలో తెలియ లేదు.
ఇలానే ఉంటాయి మన నాయకుల పనులు.
ఒక project  కు ఎవరూ అనుమత కాకుండానే వేల కోట్లు పెట్టి కాలువలు తవ్విన్చేసినారు. అయిదేళ్ళు దాటింది. ఇంకా దానికి అనుమతి రాలేదు.


ఒత్తిడి




"రమేశ్‌ వచ్చాడా?"
"ఇంకా రాలేదు. వారము రోజుల పాటు సెలవు పెట్టి వచ్చిన వాడు, తిరిగి బెంగుళూరు వెళ్ళినాడు."
"ఏమయింది?"
"ఏముందీ, వచ్చిన మర్నాడే వాళ్ళ కంపెనీ నుండి ఫోను వచ్చింది. ఎవరో బిజినెస్‌ గూర్చి
మాట్లాడుటకు ఫారన్‌ నుండి వచ్చాడట. ఈ సమయములో ప్రాజెక్ట్‌ హెడ్‌ అవసరమెంతయినా ఉన్నదట.
వెంటనే రమ్మని వరుసగా ఫోనులు."
"మరి నాలుగు రోజుల్లో పెళ్ళి పెట్టుకుని, ఇదేమిటి?"
"నెలకు అంతా కలిపి లక్ష వఱకు ఇస్తున్నారుగా! ఇంక తన పని అంటూ ఏమీ యుండదు. అంతా కంపెనీ కోసమే"
ఇంట్లో అందరూ ఈ విషయమే మాట్లాడు కుంటున్నారు.
--------------------------------------------
            రామ గోపాల్‌, రాజ గోపాల్‌ అన్నదమ్ములు. అన్న పైనాంపురములో వ్యవసాయపు పొలాలు  చూచు కుంటున్నాడు.  ఆయనకు ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు శ్రీనివాస మూర్తి, కూతురు లక్ష్మి. ఆయన భార్య  పేరు సీతా మహ లక్ష్మి.  సాంప్రదాయకమైన పద్ధతిలో ఇల్లును చక్క పెట్టుకుంటూ, ఊళ్ళో అందరి అవసరాలకు సహాయ పడుతూ, సంసారాన్ని గడుపుకుంటున్నది.
            రాజ గోపాల్‌ లేదా రాజు చిన్నప్పటి నుండి చదువులో ప్రథమ స్థానములోనే యున్నందు వలన పోస్టు గ్రాడ్యుయేషన్‌ వఱకు చదివినాడు. మొదట నెల్లూరులో ఒక ప్రముఖ విద్యా సంస్థలో అధ్యాపకుడి గా పని చేసినాడు. ఆ తరువాత ఆర్థికముగా బలముగా ఉండాలనే యుద్దేశ్యము ఒక వైపు, భార్య లహరి యొక్క ఒత్తిడి మరో వైపు, వీటితో విజయ వాడలో నొక వ్యాపార పరమైన విద్యా సంస్థలోకి మారినాడు.  బాగా పేరు వచ్చినందు వలన, అతడిని తమ సంస్థలో తీసుకొనుటకు వేర్వేరు విద్యా సంస్థలు వరుసలో యున్నారు. అయినప్పటికీ, మరీ ఆశ పడితే ఇబ్బందులు వస్తాయని ఒక సంస్థకే కట్టుపడి పనిచేస్తున్నాడు.
            రమేశ్‌ ఒక్కడే కొడుకు. వారి ఆశలన్నీ వాడిని పై స్థాయిలో చూడాలన్నదే. అందు కొఱకు ఎంతయినా
సంపాదించాలన్నది, ప్రధానముగా భార్య లహరి యుద్దేశ్యము.  అందుకే చిన్నప్పటినుండి క్షణము తీరిక లేకుండా చదివించేది. మరీ అంత అతి వద్దని రాజు చెప్పినాలహరి వినేది కాదు. అందుకే రమేశ్‌ ఎప్పుడూ నాన్న వైపే మొగ్గు చూపే వాడు.  కానీ రాజుకు ఎక్కువ గంటలు పని చేయ వలసి వస్తున్నందు వలన కొడుకు కొఱకు ఎక్కువ సమయం ఈయ గలిగే వాడు కాదు.
            శ్రీనివాసు రమేశ్‌ కంటే రెండేళ్ళు పెద్ద. పైనాంపురములో కాలేజి వసతులు లేనందు వలన రామ గోపాల్‌ శ్రీనివాసును తమ్ముడి దగ్గిరే ఉంచినాడు. శ్రీనివాసును  పినతల్లి లహరి ప్రేమగా చూచుకొనేది. అయితే ఇంట్లో ఏ పని అవసరమైనా ఎక్కువగా శ్రీనివాసునే ఉపయోగించుకొనేది. ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ ఇలాటి ఆశలు ఎక్కువ లేనందు వలన శ్రీనివాసు ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి బి.యస్సి. చేరినాదు. శ్రీనివాసుకు గణిత భౌతిక శాస్త్రాలంటే ఆసక్తి ఎక్కువ. వాటిలో ఎప్పుడూ ప్రథమ స్ఠానములో యుండే వాడు.
            ఇందువలన రమేశ్‌ చదువు విషయములో కూడా శ్రీనివాసుకు భాధ్యత ఏర్పడినది. నాన్న ఎప్పుడూ
అందు బాటులో యుండడు కాబట్టి ఏ అనుమానము వచ్చినా రమేశ్‌ శ్రీనివాసు దగ్గిరకే వచ్చే వాడు. శ్రీనివాసు
బాగా శ్రద్ధ తీసుకొని తమ్ముడికి అన్నీ చెప్పేవాడు. ఈ విధముగా లహరికి కూడా శ్రీనివాసంటే చాలా ఇష్టమేర్పడింది. శ్రీనివాసు అవసరాలన్ని జాగ్రత్తగా చూచుకొనేది.
            ఇంతేగాక శ్రీనివాసు స్నేహితులు చాలా మంది వచ్చి చెప్పించుకొనే వారు. ఎవరికీ కాదనకుండా చెప్పి, తను రాత్రి కాస్త ఎక్కువ మేలుకొని చదువుకొనే వాడు.
            రమేశ్‌ స్కూలు చదువు పూర్తయే వరకు అన్నదమ్ములిద్దరు సరదాగా కబుర్లు చెప్పుకొనే వారు. ఎప్పుడు సైన్సు విషయాలే మాట్లాడుకొనే వారు. అందు వలన ఇద్దరి మధ్య మంచి అనుబంధమెర్పడినది.
            పాఠ శాల చదువు పూర్తి కాగానే రమేశ్‌ కష్టాలు మొదలయినాయి. లహరికి అన్నీటికి కంగారే. సెలవులలోనే ఇంటర్మీడియట్‌ పరిచయము పై (బ్రిడ్జి) కోర్సు చేయించమని చాలా కాలేజీల వాళ్ళు ఇంటికి వచ్చినారు. రాజు మాత్రము ఈ సెలవులను హాయిగా గడపనీయనీ అంటూ చెప్పినా, లహరి ఒప్పుకోలేదు. లహరికి రమేశ్‌ ఏ కొద్ది సమయము కూడా వృధా చేయకూడదు. రాజు ఇంక మాట్లాడ లేక పోయినాడు.
            శ్రీనివాసు సెలవులకు పైనాంపురము వెళ్ళిపోయినాడు. ఇంక రమేశ్‌ ఉదయాన్నే కాలేజికి  వెళ్ళి, సాయంత్రానికి రావడము, ఇంటికి రాగానే కాలేజిలో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రయడము, మరో పని చేయడానికి కూడా వీలు లేదు.ఏదో తెలియని మార్పు కనిపిస్తున్నది. తనతో మాట్లాడడానికి శ్రీనివాసు లేడు. నాన్న అందుబాటులో యుండడు. అమ్మకు తన చదువు తప్ప మరే విషయమూ అర్థము కాదు. అప్పుడప్పుడు చిరాకు కలుగుతున్నది.
            ఫలితాలు రాగానే చాలా కాలేజి యాజమాన్యాలు తనకు ఉచిత విద్య అందించుటకై, తనను వారి సంస్థలోనే చేర్చమని అడుగుతూ ఇంటికి వచ్చినారు. రమేశ్‌ ప్రతిభావంతుడి గా గుర్తింపు పొందాడు  కాబట్టి , తన కోసము అన్ని రకాల వసతులు ఇచ్చుటకు సిద్ధ పడినారు. అంతా సమాచారము సేకరించి తను ఏ సంస్థలో చేరాలనేది లహరే నిర్ణయించినది.
            సెలవులు కాగానే శ్రీనివాసు వచ్చినాడు, కానీ, రమేశ్‌ కు ఇంతకుముందున్నట్లు ఖాళీ లేదు. కాలేజి నుండి ఇంటికి వచ్చిన తరువాత రాత్రి 11 గంటల పని యుండేది. తనకు వచ్చినా రాక పోయినా అన్ని ప్రశ్నలకు  జవాబులు వ్రాయ వలసి వచ్చేది. ఇందులో తెలివి తేటలకు అవసరముండేది కాదు. అందువలన నైరాశ్యము పెరిగేది.
            నాన్నతో కబుర్లు ఎప్పుడు తక్కువే, కానీ, అన్నయ్యతో కబుర్లు కూడా తగ్గిపోయినవి.             ఒకటి రెండు సార్లు తనకు పరీక్షలలో ప్రథమ స్థానము రాలేదు. లహరి వచ్చి కాలేజిలో విచారించినది. వారు రమేశ్‌ ను కాలేజ్‌ హాస్టల్లో చేర్చమని సలహా ఇచ్చినారు.
            హాస్టల్లో చేర్పించుటకు రాజు ససేమిరా ఒప్పుకోలేదు. కానీ, లహరి మాటే పై చేయి అయినది,రమేశ్‌ జీవితములో మరో మార్పు మొదలయినది.
            ఇంక ఉదయాన లేచినప్పటినుండి, రాత్రి పండుకొనే వరకు చదువు, రాంకులు, పుస్తకాలు, మరేమీ లేవు. ఆది వారము పూట రాజు, లహరి వచ్చే వారు. శ్రీనివాసుతో మాట్లాడటమే అరుదై పోయినది.
            రాంకు పడిపోతే అమ్మ ఆ ఆదివారము తనకు భాధ్యతలను గుర్తు చేసేది. ఇంక  తనకు మనసులో వేరే ఆలోచనలు రావడము ఆగి పోయినవి.
            స్కూల్‌ లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు బొమ్మలు గీచే వాడు, పాటలు వ్రాసే వాడు, ఇప్పుడవేమీ లేవు. చదువుకోమంటే, నాకు వచ్చు, కావాలంటే మొత్తము చెబుతాను, లేదా వ్రాసి చూపిస్తాను అంటె సరే నీ ఇష్టమనే వారు. ఇప్పుడవేమీ కుదరదు.  పూర్తిగా వచ్చినా, రాని వాళ్ళతో కూర్చొని చదువుతూ ఉండ వలసినదే.

            స్కూల్‌  రోజుల్లో ఖాళీ గా యున్నప్పుడు సైన్సు మాడల్సు చేసే వాడు, లేదా మాజిక్‌ చేసే వాడు. ముఖ్యముగా శ్రీనివాసు విజయవాడలో కాలేజిలో చేరిన తరువాత తను ఎంతో నేర్చుకున్నాడు, స్వంతముగా  ఆలోచించే వాడు.
ఇప్పుడు అలా చేయాలంటే, ముందు బుర్ర పని చేయడము లేదు. ఎప్పుడయినా పని చేసినా కాలాన్ని వృధా చేస్తున్నావని బెదిరింపులు, చివరకు అటువంటివన్నీ ఆగిపోయినవి. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగ్గి పోయినది.

            ఇంటర్మీడియట్‌ అయిపోయినది, ఎంసెట్‌ లొ మంచి రాంక్‌ వచ్చినది. ఒక ప్రభుత్వ కళాశాలలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ లో చదువుటకు బి టెక్‌ చేరినాడు. ఆ రోజుల్లో పాశ్ఛాత్య దేశాల్లో ఆర్థిక మాంద్యము వలన కంప్యూటర్‌ సైన్స్‌ కు కాస్త గిరాకీ తగ్గినది. అందు వలననే ఆ కోర్సు లో చేర లేదు.
            మొదటి రెండు సంవత్సరాల్లో వేసవి సెలవుల్లో  గట్టిగా పట్టుబట్టి పైనాంపురము వెళ్ళినాడు. అక్కద ఊరు, ఉప్పు కాలువ, సముద్ర తీరము అన్నీ చూస్తూ ఆనందించినాడు. పోటీలు పెట్టుకొని తాటి ముంజలు, ముంత మామిడి (జీడి మామిడి) పళ్ళు తిన్నాడు. ఆ సముద్రపు గాలిలో, ఇసుక దిబ్బల మీద మరో లోకములో ఉన్నట్లు అనిపించినది. తిరిగి రాగానే మళ్ళీ మామూలు హడావుడే.  మూడోసంవత్సరపు సెలవుల్లో పారిశ్రామిక శిక్షణకు వెళ్ళ వలసి యున్నందు వలన పైనాంపురము వెళ్ళుట కుదర లేదు.
            నాల్గవ ఏట కాంపస్‌ లో ఇంటర్వ్యూలు మొదలయినవి. తనపు పి జి  చేసి ఆధ్యాపక వృత్తి చేయాలని చాలా కోరిక గా యుండేది. గేట్‌ పరీక్షల్లో మంచి రాంక్‌ కూడా వచ్చినది. కాంపస్‌ ఎన్నికలలో ఒక పెద్ద సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ తనను తీసుకొనుటకు సిద్ధ పడినది.
            ఈ లోపలే అమ్మ (లహరి) అందరి దగ్గిర సమాచార సేకరణ చేసినది. తనను తీసుకున్న కంపెనీ లో తెలిసిన కుఱ్ఱాడికి నెలకు లక్ష రూపాయల వరకు వస్తున్నదట. ఎంత పిజి చేసినా రిసెర్చ్‌ చెసినా అధ్యాపక వృత్తిలో యున్న వారికి నెలకు లక్ష రూపాయలు కళ్ళ చూడటము జరుగదు. అందుకని పట్టుబట్టి తను అందులో చేరుటకు ఒప్పించినది.
            అక్కడ చేరిన తరువాత కూడా ఎప్పుడూ పోటీయే. ఫలితాలు త్వరగా చూపించాలి, లేక పోతే వెనుకకు పడి పోతాడు. రోజుకు 12 నుండి 15 గంటల వరకు పని.  ప్రాజెక్టు పూర్తి అయే రోజుల్లో ఒక్కొక్క సారి రాత్రిళ్ళు కూడా కంపెనీ లోనే ఉండ వలసి వస్తున్నది.
            శ్రీనివాసు అన్నయ్య మీద ఏ ఒత్తిడీ లేదు. ఫిజిక్సు లో పి జి చేసి రిసెర్చి చేసినాడు.  శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయములో అధ్యాపకుడిగా చేరినాడు. తను ఎంత పని చేసినా తన పని తనదిగానే యుంటుంది, ప్రశాంతమైన జీవితమున్నది.
                    -------
            లహరి ఆలోచిస్తున్నది.
            రమేశ్‌ తెలివి గల వాడే. బాగా సంపాదించుకుంటున్నాడు. ఎప్పుడు ఇంటికి వచ్చినా ఎప్పుడూ లోపల గదిలో కూర్చుంటాడు. బయట గదిలో యున్నా, ఎవరయినా వచ్చినా వారిని ఆహ్వానించి, కూర్చోమని మర్యాద చేయడము కూడా తెలియదు. ఎందుకిలా తయారయినాడు?
            బావగారు తనతో చాలా సార్లు అన్నారు, "లహరీ! నీ దగ్గిర శ్రీనివాసు బాగా తయారయినాడమ్మా!. మంచి మర్యాద నేర్చుకోవలసిన సమయములో నీ దగ్గిరే యున్నాడు, మా కంటే బాగా చూచుకున్నావమ్మా!" మరి తన దగ్గిర శ్రీనివాసుకు ఇంత మంచి ప్రవర్తన వచ్చిందే, మరి రమేశ్‌ కెందుకు రాలేదు?.
                            -----------------------------------
            రాజు లేదా రాజ గోపాల్‌ ఆలోచిస్తున్నాడు.
            తను రమేశ్‌ కు అన్నీ ఇచ్చాననుకున్నాడు, కానీ, వాడికి స్వతంత్రాన్ని, వ్యక్తిత్వము పెంచుకునే అవకాశాన్ని ఈయ లేదు. ఎప్పుడూ కాలముతో పరుగులు తీసేటట్లు చేసినాడు. ఇప్పుడు రమేశ్‌ కు తను, తన కంపెనీ తప్ప తన వాళ్ళను గురించి ఆలోచించే మానసిక స్థితి కూడా లేదు.
            ఒక సారి తనతో అన్నాడు, "ఈ ఒత్తిడి నేను భరించ లేక పోతున్నాను నాన్నా!", అని. కాని తనకు ఆ ఒత్తిడితోనే బ్రదుక వలసి వచ్చింది.
                                       -----------------------   
ఇంతలో శ్రీనివాసు భార్య  శారదతో వచ్చాడు. రాగానే,"ఏమిటి చిన్నాన్నా! అలా యున్నారు?", పలకరించినాడు.
"పిన్నీ! నాకు ఒక్క ఫోను చేస్తే వెంటనే వచ్చే వాడిని కదా!  అమ్మ, నాన్న రేపే వస్తున్నారు. ఈ లోపల ఏ ఇబ్బంది లేకుండా నన్ను చూచుకోమన్నారు. శారద నీతో బాటే యుంటుంది. "  
విషయము తెలిసిన తరువాత అన్నాడు." పిన్నీ! నీవేమీ కంగారు పడ వద్దు. నేనిప్పుడే బెంగుళూరు వెళ్ళి రమేశ్‌ ను తీసుకొని వస్తాను. పెళ్ళినాటికి కాదు. రెండు రోజులు ముందు గానే. సరేనా?" అంటూ బయటికి వెళ్ళీనాడు.
                           --------------------------