Friday, December 20, 2013

సిధ్ధార్థ

                                                                                     

           సిధ్ధార్థ అందగాడే కాదు, గుణవంతుడు కూడా, పసి తనములో తల్లి దండ్రులను కోల్పోయినాడు. కానీ అనాథ గా మాత్రము లేడు. ఊళ్ళో అందరికి సాయము చేస్తూ, వారి అండతో, వారిలో ఒకరిగా పెరిగినాడు. తను ఎవ్వరి మాటను కాదనడు. అందుకని పెద్ద వాళ్ళ ప్రేమకు పాత్రుడయినాడు. బాగా మృదు స్వభావి, అందరితో ప్రేమగా మాట్లాడుతాడు. అది కూడా అవసరముంటేనే. స్త్రీలతో కూడా లల్పించుకొని మాట్లాడే వాడు కాదు. అందుకని, వారు కూడా సిధ్ధార్థ మీద ప్రేమాభిమానాలు చూపేవారు.
           వయస్సు పెరిగే కొద్దీ, ఆకర్షణ పెరుగుతున్నది. కానీ, మాట తీరు, స్వభావములో మార్పు రాలేదు.
అందుకని, ఆ వూళ్ళో, చాలా మంది చిన్నప్పటి నుండి తమ మధ్య పెరిగిన సిధ్ధార్థను అల్లుడిగా చేసుకోవాలని భావిస్తున్నారు. తల్లి దండ్రుల మాటలను విన్న అమ్మాయిలు కూడా సిధ్ధార్థ చేత ఆకర్షితులయినారు, కానీ సాంప్రదాయము కట్టుబాటు వలన వారు బయట పడ లేదు.
            ఊరంతా కోలాహలముగా ఉన్నది, జనమంతా చాల సంబరముగా యున్నారు. దీపంకర బుధ్ధుడు ఊరికి వచ్చి యున్నాడు. కొంతమంది ఆయన మీద ప్రేమతో అభిమానముతో వస్తే, మరి కొందరు ఆయన ప్రవచనము వినాలని వచ్చినారు. కొందరు ఆయన సాన్నిహిత్యము కొఱకు వచ్చినారు. ఎక్కువ మంది మాత్రము వాళ్ళ కష్టాలను ఆయనకు విన్నవించుకొనుటకు అవకాశము వస్తుందని, లేదా ఆయన దర్శనముతోనే తమ కష్టాలన్నీ తీరి పోతాయనీ వచ్చినారు. ఆయన కొఱకు ఒక వేదిక నిర్మించ బడినది. వేలాది మంది జనము ఆయన దివ్య దర్శనము కొఱకు వేచి చూస్తున్నారు.
            సిధ్ధార్థకు దీపంకర బుధ్ధుడిని దర్శనము చేసుకోవాలని యున్నది. కానీ, పెద్ద వారి దగ్గిఱకు వట్టి చేతులతో వెళ్ళ గూడదనే నియమాన్ని పాటిస్తున్నాడు. ఆ నాడు తన దగ్గిఱ ఏ మాత్రము డబ్బు లేదు. ఎవరినీ అడుగ లేక పోయినాడు. నెమ్మదిగా సమావేశ స్థలానికి నడుస్తున్నాడు. దారిలో ఒక అమ్మాయి తామర పూల కట్ట తో సమావేశము వైపు వెళ్ళుతున్నది.
            సిధ్ధార్థ ఆ అమ్మాయిని ఒక తామర పూవును ఇమ్మని అడిగితే బాగుంటుందని అనుకున్నాడు. దగ్గిఱకు వెళ్ళి, లౌక్యము తెలియని రీతిలో,
             " అన్ని పూవులు తీసుకొని వెళ్ళుతున్నావు. ఒకటి నాకు ఇవ్వ వచ్చు కదా" అని అడిగాడు.
             "బాగుంది, నేను నీకు ఎందుకు ఇవ్వాలి?"
             "బుధ్ధుడికి సమర్పణ చేసుకుందామని."
            "అలాగా! అయితే నాకేమిటి లాభము?"                       
            "ఇంతకూ, నీకు ఏమి కావాలి?"
            "ఏమి అడిగినా ఇస్తావా? అయితే, నన్ను పెళ్లి చేసుకో"              
          ఆ అమ్మాయి అడిగినది. తను కూడా ఒక పేద అమ్మాయి అయినప్పటికి సిధ్ధార్థ ఆకర్షణ లో ఉన్నది.
తనది అత్యాశ అనిపించినా అతడిని పెళ్ళి చేసుకొని జీవితము పంచుకోవాలన్న కోరిక ఎంతో లోతుగా యున్నది.
ఆ అమ్మాయికి ఇంకో విషయము తెలుసు, సిధ్ధార్థ మాటకు కట్టుబడే వ్యక్తి అని.
            "అలాగే " ,అంటూ ఒక పూవును తనే లాగేసుకున్నాడు. ఆమె చెప్పిన దానికి ఒప్పుకున్నాడు, కాబట్టి, అలా చేయడము తప్పని అతడికి అనిపించ లేదు.
            సమావేశము దగ్గిఱకు వెళ్ళినాడు. వేలాది మంది, వేర్వేరు ఉన్నతమైన స్థితులలో యున్న వారు
ముందు వరుసలలో యున్నారు. వారి దృష్టి అంతా బుధ్ధుడిమీదే యున్నది. సిధ్ధార్థకు ముందుకు వెళ్ళాలని అనిపించినది. కానీ, అలా వెళితే, చాలా మంది భాధ పడుతారని అనిపించినది. అందుకే ఏమి చేయ వలనో తెలియ లేదు. పుష్పాన్ని తన చేతులతో ఈయ వలెనన్న కోరిక ఎంత కష్టమో తెలిసినది.
            తన బలమంతా ఉపయోగించి ఆ తామర పూవును బుధ్ధుడి మీదకు విసరి వేచినాడు. అప్పుడే ఒక విచిత్రము జరిగినది. మామూలుగా అయితే పది అడుగులు కూడా ముందుకు వెళ్ళని తామర పూవు నేరుగా ముందుకు వెళ్ళినది. దీపంకర బుధ్ధుడి తల పైన అలంకారము వలె గాలిలో నిల బడినది. అందరూ అది చూచి ఆశ్ఛర్య పోయినారు.
            అపుడు బుధ్ధుడు ఆ యువకుడిని తన శిష్యుడికి చూపించి దగ్గిఱకు పిలువమని ఆదేశించినాడు.
అన్ని వేల మందిలో అతడిని చూపించినాడు.
                సిధ్ధార్థ కు ఒక అద్భుతమైన అవకాశము వచ్చినది. బుధ్ధుడికి దగ్గిఱగా నిలబడినాడు. బుధ్ధుడు అతడిని ఆశీర్వదించినాడు, ఏవో చెప్పినాడు. తనున్న తన్మయ స్థితిలో బుధ్ధుడు చెప్పినవేవీ సిధ్ధార్థకు అర్థము కాలేదు. బుధ్ధుడు ఇక వెళ్ళి రమ్మన్నాడు. సిధ్ధార్థ ఒక మైకములో యున్నాడు. అక్కడ జరుగుతున్న విషయాలేవీ అతడికి తెలియుట లేదు. అదే మైకముతో తనున్న గదికి వచ్చినాడు.  లోపలికి వెళ్ళి పద్మాసనములో కూర్చున్నాడు.
            ఆ స్థితిలోనే ధ్యానములోనికి వెళ్ళినాడు. తన జీవితమంతా ఒక నాటకము వలె కనబడినది. తనకు తెలియని ఎన్నో లోకాలు కనబడినవి. అక్కడంతా తన ఉనికి కనబడినది. చివరలో దీపంకర బుధ్ధుడు దర్శనము ఇచ్చినాడు. ఆయన మాటలు ఇప్పుడు స్పష్టముగా వినబడుతున్నవి.
            "సిద్ధార్థా! నీవు ఉన్నతమైన పరిణామ స్థితిలో యున్నావు. నా తరువాత ఈ బుధ్ధత్వము అందుకొనే వాడవు నీవే. ఎంతో మందిని ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి లోనికి తీసుకొని వెళ్ళుతావు.
            ఇంత వఱకు నీ సాధనలో ఇతరులతొ ఉన్న కర్మ బంధాలను అన్నీ ఛేదించుకున్నావు. ఆ విధముగా నీవు ముక్తుడివే. కానీ, ఇంకా కొన్ని జీవితానుభవాలకోసము నీ కింకా వైవాహిక జీవితము అవసరము. నీవు  ఎవరి దగ్గిఱ అయితే మాట ఇచ్చి పుష్పాన్ని తీసుకున్నావో, ఆ అమ్మాయితో నీకు కర్మ బంధము ఏఱ్పడినది. అది నీ పొరపాటు వలన కాకుండ మా సంకల్పము వలన జరిగినది. ఇంక నీవు బుధ్ధత్వము అందుకొనే జన్మ వఱకూ తనే నీకు భార్యగా యుంటుంది. ఆమె కూడా ఉత్తమురాలు. నీవడిగినపుడు ఆ పుష్పము నాకు సమర్పణ కోసమని ఎంతో సంతోష పడినది. అందు వలన ఇద్దరి మధ్య యున్న బంధము పైకి లౌకికముగా కనిపించినా అది ఆధ్యాత్మికముగానే యుండి ఇద్దరి యున్నతికి తోడ్పడుతుంది. మీకు నా ఆశిస్సులు."
                        సిధ్ధార్థ మత్తులోనుండి బయట పడినాడు. దైవ సంకల్పము వలన ఏమో ఆ పూలు అమ్ముకొనే అమ్మాయి మీద ఆకర్షణ ఏర్పడినది. కానీ, తటస్థముగా యుండి పోయినాడు.
            ఉదయాన్నే సాధనను పూర్తి చేసుకున్నాడు. బయటకు వెళ్ళ పోతుంటే ఒకరు వచ్చి, ఇలా చెప్పినాడు.         
"నాయనా! సిధ్ధార్థా!  ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. నేను చాలా పేద వాడిని. నిన్న బుధ్ధుడు నన్ను పిలిచి చెప్పినాడు. మా అమ్మాయి యశొధరను నీకు ఇచ్చి పెళ్ళి చేయాలని అది ఆయన సంకల్పమని."
            ఆ రకముగా సిధ్ధార్థుడికి ఆ పూలు అమ్ముకొనే అమ్మాయికి పెళ్ళి జరిగినది. అది జన్మ జన్మల బంధముగా నడచినది.
                         ************************
(ఇది లలిత విస్తారము అంబడు బౌధ్ధ పురాణము లో నున్న గౌతమ బుధ్ధుడి పూర్వ జన్మ  కథ.. శ్రీ ఎక్కిరాల వేదవ్యాస గారి రచన నుండి స్వీకరించ బడినది. ఆ జన్మ లో వారి పేర్లు మాత్రము గౌతమ బుధ్ధుడి జన్మ లో పేర్లతో వ్రాయ బడినది.
          అజంతా చిత్రాలలో బుధ్ధుడికి పైన ఒక తామర పూవు గాలిలో నిలబడి యుంటుంది. అది ఈ కథకు సంబంధించిందే          అజంతా చిత్రాలలో బుధ్ధుడికి పైన ఒక తామర పూవు గాలిలో నిలబడి యుంటుంది. అది ఈ కథకు సంబంధించిందే)
                   

Wednesday, December 18, 2013

ఓంకారము

          
ఏదీ ఆ ఓంకార ప్రణవ నాదం
ఏదీ ఆ దివ్య అరుణ రాగం?
మానవులందరి ఎదలో మెదలే
ఆనంద రాగం ఏదీ? ఏదీ?

సుషుప్తి నుండి మేలుకొలిపే
గుడి గంటలు ఏవీ? ఏవీ?
మంచిని కోరీ ఆచరించే
మానవతా  మూర్తులు ఏరీ?

ఆశా మోహం రాగం ద్వేషం
అలుము కొన్నవా నాల్గు మూలలా
అనురాగ భావనల దివ్య దీధితులు
చెదిరి పోయెనా ఈ నాడు?

మనిషిని మనిషి ద్వేషించేనా
దేశపు ప్రగతి నిలిచేను
దేశము దేశము ద్వేషించేనా
మారణ కాండ సాగేను
ప్రేమభావనలు వెల్లి విరిసినా
వెదజల్లే ప్రకృతి నవ్వులు
హరిత రాగము అంతట నిలబడి
అందించేను చేతులు
ఈ భావనలంతా వెద జల్లే
మహా పురుషులకు జోతలు.


Monday, December 16, 2013

ఆ రోజుల్లో

                                                 

మా ఊరు పేరు పైనాంపురం. ఈ సంఘటన సుమారుగా  యాభయి సంవత్సరాల నాటిది. మా అక్కయ్య  గూడూరులో యున్నది. నెల్లూరు వెళ్లి అక్కడనుండి గూడూరు వెళ్ళాలి.  మాకు నెల్లూరు వెళ్ళడము కూడా కష్టమే.
ఎందుకంటే బస్సు సౌకర్యాలు సరిగా లేవు. మా ఊరికి నేరుగా బస్సు లేదు.  మా అమ్మ, నేను, మా రెండవ అక్కయ్య ఎడ్ల బండి మీద బయలు దేరినాము. మా మొదటి మజిలీ వరకవిపూడి. గంట సేపు ఎదురు చూసినా బస్సు  రాలేదు. ఇంక బస్సు రాదన్నారు. తిరిగి బండి ఎక్కి ఈదూరు వెళ్లినాము. అక్కడ ఒక గంట ఎదురు చూచినా బస్సు రాలేదు. అక్కడ కూడా ఇంక బస్సు రాదేమో యన్నారు.
          మళ్ళీ మామూలే. బండి ఎక్కి తరువాత మజిలీ తోటపల్లి గూడూరు చేరినాము.  అక్కడ నుండి వరిగొండ మీదుగా నెల్లూరుకు బస్సుయున్నది. సరిగ్గా అప్పుడు మిట్ట మధ్యాహ్నము అయినది. అది భోజనము సమయము.
          ఎదురుగా ఒక ఇల్లు యున్నది. వాళ్ళు సుమారుగా గంట నుండి మమ్ములను గమనిన్చినట్లున్నారు. వచ్చి, మమ్ములను భోజనానికి రమ్మన్నారు. మాకేమో కాస్త మొహమాటము గా యున్నది. అసలు వాళ్ళెవరో తెలియదు. అందుకే మేము అందుకు సిద్ధముగా లేము.
          కాని వాళ్ళు,మీరు గంట నుండి ఇక్కడ యున్నారు. భోజనము చేసినట్లు లేదు. ఎదురుగా భోజనము లేకుండా మిమ్ములను పెట్టుకొని మేమెలా భోజనము చేయ గలము? అన్నారు.
          ఇవీ ఒకప్పటి పల్లెటూర్లు. ఆ విలువలు, ఆప్యాయతలు ఇంకాఉన్నాయంటారా? ఏమో? మాకు అక్కడ భోజనము చేయక తప్ప లేదు.
          ఇవీ ఒకప్పటి  పల్లెటూర్లు.






అల్ప జీవి

                                                            

తాము తప్పు చేసి దానికి ఎదుటి వారిని నిందించడము ఇప్పటి ఆధునిక సమాజములో రివాజు అయి పోయినది. ఎవరో లూయీస్ పాశ్చర్ అట. ప్రతి వ్యాధికి సూక్ష్మ క్రిములే కారణమని చెప్పినాదుట. అదే సమయములో బె చాంప్ అనే శాస్త్రజ్ఞుడు వ్యాధులకు సూక్ష్మ క్రిములు కారణము  కావని చెప్పినాడు. అయినా  ఆయన మాటను ఎవరూ ట్టించుకోలేదు.  ఈ యొక్క దురభిప్రాయము భూమిని విష పురితము చేసినది.
ఒక సారి ఒక ఆయుర్వేద వైద్యుడిని అడిగాను.మీ వైద్యములో ఎక్కడైనా వ్యాధికి కారణమయిన సూక్ష్మ క్రిముల ప్రస్తావన ఉన్నదాఅని. ఆయన ఒక మాట అన్నారు. వాత పిత్త కఫములనబడు మూడు తుల్య స్థితిలో  నుండుట పూర్ణ ఆరోగ్య స్థితి అనిరోగిలో ఆ స్థితిని తీసుకొని రావడమే వైద్యుడు చేసే పని అని. అంటే సూక్ష్మ జీవుల యునికి రోగానికి ఏ విధమయిన సంబంధాన్ని కలిగి యుండదు. ప్రకృతి వైద్యములో కఠినమయిన ఆహార నియమాల ద్వారా ఆరోగ్యాన్ని పునరుద్దరిస్తారు. హోమియోపతి లో సోరా, సిఫిలిస్ మరియు సైకోసిస్ అనే మూడు తత్వములను వాటిని సరి చేయడము ద్వారా రోగ నివారణ చేస్తారు. పదార్థములు రెండు రకములుగా తీసుకొంటారు. దేహానికి పుష్టిని ఇచ్చేవి ఆహార పదార్థములు. మిగిలినవి విష పదార్థములు. ప్రతి విష పదార్థము సూక్ష్మీకరణము ద్వారా మందుగా పని చేస్తుంది. అంటే ఆల్కహాల్ లేదా పంచదార లో ఈ పదార్థము యొక్క యునికిని తగ్గించుకుంటూ వస్తారు. ఈ విధముగా  సూక్ష్మీకరణము చేసే  కొద్దీ మందు మరింత  లోతుగా పని చేస్తుంది.
ఈ విధానములో విషయమేమిటంటే వ్యాధులు ఎన్నో లేవు. ఒకే దోషము ఒక్కొక్క దేహ భాగములో పని చేస్తే ఒక్కొక్క వ్యాధిగా కన బడుతుంది. ఈ విధముగా కనిపించే వ్యాధులు అన్నీ ఒకే దోషము భౌతికముగా ప్రకటించుకొనే మార్గాలే.
ఈ సిద్దాంతాల ప్రకారము సూక్ష్మ క్రిములు లేదా వైరస్ లు ప్రకృతిని శుభ్ర పరచేపరికరాలే. వ్యాధి వచ్చిన చోట అవి ఉన్నాయంటే వాటి వలన వ్యాధి వచ్చినదని అర్థము చేసుకొన కూడదు. పెంట యున్న చోట పందులున్నాయంటే, ఆ పెంటను తినడానికి వచ్చాయని అర్థముచేసుకోవాలి. అంతే కాని, ఆ పెంట అంతా అవి వేశాయని అర్థముచేసుకొన కూడదు. మన దేహములో ఏర్పడిన దోషము వలన వ్యాధి ఏర్పడుతుంది. మురికి లేదా చెత్త చేత ఈగలు ఆకర్షింప బదినట్లే, దేహములోని వ్యాధి చేత సూక్ష్మ క్రిములు ఆకర్షింప బడుతాయి. అంతే గాని సూక్ష్మ క్రిముల వలన వ్యాధి రాదు.
ఎందుకంటే ఇవి ప్రకృతిని శుభ్రము చేసే పరికరాలు. ౧౯ వ శతాబ్దములో పాశ్చర్ సమ కాలీనుడు అయిన పియరీ జాక్వెస్ ఆంటోయిన్ బేచాంప్ తన పరిశోధనల ద్వారా దీనినే స్పష్టము చేసినాడు. ఈ సూక్ష్మ క్రిములను బేచాంప్ చిన్న దేహికులు లేదా మైక్రోజైమ్స్ అని పిలిచినారు. కాని ఆయనను ఎవరూ పట్టించు కోలేదు. తరువాత కాలములో పియర్సన్ అనే శాస్త్రజ్ఞుడు మనుషులలో జంతువులలో యున్న సూక్ష్మ జీవులు వ్యాధులకు కారణము కావని స్పష్టము చేసినారు. శామ్యూల్ హనెమాన్ తన క్రానిక్ డిసీజస్ లో ఇదే విషయాన్ని స్పష్టము చేసినాడు.  దీర్ఘ కాల వ్యాధులున్న వారిలో వ్యాధిని పట్టించు కోకుండా సూక్ష్మ క్రిములను నిర్మూలిస్తే రోగి మామూలు జీవన ప్రమాణాని కంటే ముందే మరణిస్తాడని సిద్దాంతీకరించినాడు.
          యూరప్ లోఏ కొత్త వైద్య వ్యవస్థ వచ్చినా ఆధునిక వైద్యుల సంఘాల ద్వారా దాడులకు గురి అయినది. మెస్మరిజం, హోమియోపతి ఈ విధముగా దాడులకు గురి అయినవి. ప్రముఖ భౌతిక శాస్త్ర వేత్త  ఫ్రిజాఫ్  కాప్రా   చెబుతారు, మనిషి దేహము లోని రోగాలను రసాయనాల ద్వారాతగ్గించుట మాని వేసి, మానవుడి దేహములోని చైతన్యము యొక్క ఉనికిని  గుర్తించే వరకు  మానవ జాతికి రోగముల బెడద వదలదని, దీనికి మన దృష్టి ప్రాచ్య విజ్ఞానము వైపు మరల్చాలి అని తన టర్నింగ్ పాయింట్ అనే పుస్తకములో వ్రాసినాడు.

          ఇంకా చెప్పాలని యున్నది, కాని మేము చెబితే ఎవరికీ ఎక్కుతుంది? మేము కూడా మీలాంటి జీవులమే. మానవ జాతిని నాశనము చేయాలన్న పెద్ద కోరికలు మాకు లేవు.  ప్రకృతి సహజమైన విధానాలకు దూరమయిన తరువాత దేహములో వచ్చిన మార్పులే వ్యాధులు.  ఆ సమయములో మేము దేహములో యున్నంత మాత్రాన మా వలన వ్యాధులు వచ్చినాయని సిద్ధాంతము చేయడము అన్యాయము. బె చాంప్ మరియు హనెమాన్ ఉద్దేశ్యములో మేము పాకీ పని వారము మాత్రమె. కానీ, మా నిర్మూలన కొఱకు రోజు కొక విష పదార్థము తయారు చేసి, వాటిని నేరుగా దేహములో వాడుట ద్వారా మానవుడి లోని కణజాలాన్ని నిర్వీర్యము చేస్తున్నారు. అందుకే మనుషులలో రోగ నిరోధక శక్తి తగ్గినది. ఈ విధముగా పాశ్చర్ విధానము వచ్చిన తరువాత రోగాల సంఖ్య పెరిగినది. ఇందు కొఱకు ఏర్పడిన రసాయనిక కర్మాగారాలు తము తయారు చేసిన పదార్థాలతో నేలను విష పూరితము చేస్తున్నాయి.
          ఒక్క సారి ప్రాచ్య విజ్ఞానము వైపు చూడండి. వారి యొక్క ఆయుర్వేద విజ్ఞానములో రోగము కంటే ముందు స్వస్థత గురించి మాట్లాడుతారు.  స్వస్థత అంటే తను తానుగా యుండుట. లేదా తనలో తను యుండుట.  అటువంటి శాస్త్రాలు ఆధునిక వైద్యము యొక్క తాకిడికి కూలి పోయి మళ్ళీ లేస్తున్నవి.  నూటికి తొంబది మంది  చెప్పిన విషయాన్ని సత్యముగా భావించ వలసిన అవసరము లేదు. ఈ విషయము ప్రతి యొక్కరికి తెలుసు. ఇపుడిపుడే చైనా లో ఆకుపంచర్, మన దేశము లో ఆయుర్వేద, ముద్రా విజ్ఞానము, ప్రకృతి వైద్యము లాంటివి ఆధునిక వైద్యము నయము చేయ లేని ఎన్నో రోగాలను నయము చేస్తున్నది. ఈ వైద్య విధానాలలో ఎక్కడా మా ప్రస్తావన ఎక్కడా లేదు. అయినా  మా  మీద దాడులు ఆగటము లేదు.

          అందరూ ఒక్క సారి ఆలోచించండి. మేరు వేసే నిందలను భరించాల్సిందేనా?