Sunday, March 8, 2015

పాపాయి



అతడు నెమ్మదిగా నడుస్తున్నాడు. చుట్టూ ఎడారిలా ఉంది. నైరాశ్యము అతడిని కమ్మేసింది. ఇక్కడ నాతొ మాట్లాడే వారు ఎవరూ లేరా? అటూ ఇటూ చూచాడు.
“ఖచ్చితముగా ఎవరో ఒకరు కనిపిస్తారు, నాకు ఏమి చేయాలో చెబుతారు.”, అనుకున్నాడు.
దగ్గర లో ఒక గొంతు వినిపించినది. “నాయనా! ఏమిటి, ఒక్కడి వే ఎక్కడికి వెళ్ళుతున్నావు?”
తల తిప్పి చూచినాడు. ఆ పక్కనే కొండ కింద ఒక గుహ లా ఉంది. గుహ ముందు ఒక సన్యాసి చేతిలో రుద్రాక్ష  మాలతో నిలబడి వున్నాడు.
తను ఆశ్చర్య పడినాడు. ఇంత వరకు తను చూడని కొండ గుహ ఎక్కడ నుండి వచ్చింది. అక్కడ ఒక సన్యాసి. అది ఒక మాయా లోకము లా ఉన్నది.
నెమ్మది గా ఆయన వైపు నడిచినాడు.
“ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నా వాళ్ళు ఎవరూ నన్ను పలకరించుట లేదు. ఒకటే ఏడుపులు.  ఇంకేమీ వినిపించుట లేదు.”
“మార్పు కలిగినపుడు  ఇలాగే ఉంటుంది, నాయనా! ఇంతకూ నీకు ఏమి కావాలి?”
“అదే తెలియదు. ఇదేమి లోకము?  ఇక్కడ ఎవరూ ఉండరా?”
“ఎందుకు ఉండరు? నీవు గట్టిగా కోరుకుంటే అందరూ నీ ముందే ఉంటారు. ఇలా రా నాయనా! ఇక్కడికి వచ్చి కూర్చో.”
ఇద్దరు చెరొక బండ రాయి మీద  కూర్చున్నారు.
“మీరడిగినారు చూడండి, అదే నాకు తెలియటము లేదు. ఇంతకూ నేను ఎవరిని?”
“ఒక్క సారి అటు చూడు నాయనా! నీకే తెలుస్తుంది.”
హఠాత్తుగా ఎదురుగా ఉన్న ఎడారి మాయమయింది. అపరిమితమయిన కాంతి.  అందులో నుండి ఒక కాంతి కణము బయటికి వచ్చింది.
ఆ కాంతి కణము కొండలో ఉన్నంత సేపు సొంత వ్యక్తిత్వము కలిగి లేదు. బయటికి రాగానే కొత్త కొత్త ప్రశ్నలు ఎన్నో వచ్చినాయి.
“రాక్షసులు, మనుషులు, దేవతలు,... ఇంకా నాగులు, గంధర్వులు, కిన్నరులు, యక్షులు ... ఇన్ని రకాల విభిన్న జీవులు. వీళ్ళంతా ఎవరు? ఋషులు అంటే ఎవరు? కష్టాలు అంటారు. సుఖాలు అంటారు. ఇవన్నీ ఎవరికీ? ఎందుకు?”, అన్నీ ప్రశ్నలే.
గట్టిగా మళ్ళీ అనుకున్నది.
“ఇవి చెబితే తెలిసేవి కావు. ఇవి చర్చకు అందనివి.”, ఎక్కడినుండో జవాబు వచ్చింది.
“ మరి చెప్పక పొతే ఎలా తెలుస్తాయి?”, తనలో ప్రశ్న రేగింది.
“ అనుభవము. అనుభవమే జ్ఞానాన్ని నిలుపుతుంది.”
“ప్రశ్నిస్తే తప్పేమిటి? జవాబు రాదా?”
“ఒక ప్రశ్న వంద ప్రశ్నలకు దారి తీస్తుంది. ఇది ఒక వలయములా కమ్మేస్తుంది. అదే అనుభవమయితే మరో ప్రశ్న ఉండదు.”
“అదే, అనుభవము ఎలా వస్తుంది?”
“కావాలనుకుంటున్నావా?”
 “కావాలి.”
“అయితే నీవొక కొత్త లోకములో ప్రవేశించాలి.  నిన్ను మాయ కమ్మి వేస్తుంది. నీవన్న కష్టాలు, సుఖాలు అన్నీ నిన్ను మరిపిస్తాయి. అందుకు సిద్ధమేనా?”
“సిద్ధమే.”
ఒక్క సారి ఆ దృశ్యమంతా మాయమయింది.
“ స్వామీ ఇదంతా ఏమిటి?”
“ఆ కాంతి కణానివే నీవు. ఆ అనుభవము కోసమే కాంతి రూపము వదలి క్రిందికి దిగినావు.”
“ఆ తరువాత.”
“కష్టాలు, కడగళ్ళు, సుఖాలు వీటితో వచ్చే అనుభవము నీలో సరి కొత్త మార్పును తీసుకొని వస్తుంది. ఒక్కొక్క జన్మలో అనుభవాలు నీలో చేరే కొద్దీ ఈ మార్పు పూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది.  ఒక కాంతి జీవి అబద్ధము చెప్ప వలసిన అవసరము లేదు. కాని ఒక దేహములో ఉన్న జీవికి ఆ అవసరము రా వచ్చును. దానిని ఎలా ఎదురు కోవాలో తన అనుభవమే నేర్పుతుంది.”
“ మరి దేవతలు అంటే ఎవరు?”
“దేవతలు అందరికీ అనుభవాలు ఉండవు. అనుభవము తోనే వారు ఎదుగుతారు. అందుకే  దేవతలు అయినా పై స్థాయిని అందుకోవాలంటే భౌతిక దేహములో జన్మ తీసుకోవలసి ఉన్నది.”
“ మరి ఋషులు.”
“నిరంతర పరిణామముకు తపిస్తూ ముందుకు సాగుతున్న వారే ఋషులు. దేవతలకు కూడా వారు మార్గాన్ని చూపించ గలరు.”
“అయితే వాళ్ళు ఋషులు ఎలా అయినారు?”
“అటు చూడుము..”
అక్కడొక్క దృశ్యము కనిపించింది.
ఎదురుగా ఒక దారి ఉంది. ఆ దారి లో నలుగురు వెళ్ళుతున్నారు. వారి ముందు ముళ్ళ చెట్లు పది దారి మూసుకొని పోయినది.
మొదటి వ్యక్తీ విసుగ్గా ముఖము పెట్టి మరో దారిలో వెళదామని వెనక్కు తిరిగినాడు.
రెండవ వ్యక్తీ పరిస్థితి మారు తుందేమో చూద్దామని అక్కడే కూర్చున్నాడు.
మూడవ వ్యక్తీ తన వరకు కాస్త ముళ్ళ కొమ్మలు తొలగించి, ముందుకు వెళ్ళాలని ప్రయత్నము చేస్తున్నాడు.
నాల్గవ వ్యక్తి మాత్రము చుట్టూ చూచి, పెద్ద కర్ర తీసుకొని, చాలా శ్రమ పడుతూ, ఆ ముళ్ళ కొమ్మలను పక్కకు తొలగించుటకు తంటాలు పడుతున్నాడు. మూడవ వ్యక్తిని సహాయము అడిగినాడు. కానీ ఆ మూడవ వ్యక్తికీ తన దారి కనిపించ గానే వెళ్లి పోవడమే లక్ష్యముగా ఉంది.
“ఇదంతా ఏమిటి స్వామీ జీ!”, అని అడిగినాడు.
“మొదటి వాడు ఈ ఇబ్బందిని ఎదుర్కొనుటకు ఇష్టము లేని వాడు. మార్పు మీద ఆశ కూడా లేని వాడు. రెండవ వాడికి ఆశ ఉంది. శ్రమ పడుట ఇష్టము లేదు. మూడవ వాడికి శ్రమ పడినా తన వరకు చూసుకోవాలి అనుకున్న వాడు. ఇంక నాలుగవ వాడు ఇప్పుడు తను పడుతున్న శ్రమ , ఇబ్బంది మరెవరు పడకూడదని అనుకున్న వాడు. ఈ విధముగా పరుల హితములో తన హితమును  చూచుకొన గలిగిన వాడే ఋషి కా గలడు.”, స్వామీ జీ ముగించినాడు.
తిరిగి మరో దృశ్యాన్ని చూపించినాడు.
“అక్కడ ఒక కాలువ ప్రవహిస్తున్నది. అందులో ఒక తేలు కొట్టుకొని పోతున్నది.  ఒకతడు ఆ తేలు మీద జాలి పడి, దానిని వేగముగా చేతి లోనికి తీసుకొని  గట్టు మీది కి విసిరి వేద్దామని అనుకున్నాడు. అది గట్టిగా కుట్టినా భరిస్తూనే  దానిని గట్టుకు చేర్చినాడు.”
“అంటే ఆయనకు తేలు కుడుతుందని తెలియదా?”
“ అదే మాట ఆయనను అడిగితే, “ఆ తేలు ఎవరి నయినా కుట్టే తన లక్షణము మానుకో లేదు కదా! మరి దేని నయినా రక్షించాలన్న నా లక్షణాన్ని ఎలా మానుకో గలను?” అన్నాడు.”
“ఈ విధముగా ఉండలేని వాడు, పరిస్థితులను బట్టి తన లక్ష్యాలను మార్చుకొనే వాడు ముందుకు వెళ్ళ లేడు. అంటే తేలు చేత కుట్టించుకోవాలని కాదు. పర హితాయచ జీవితమూ అనే భావన ఉన్న  ప్రతి యొక్కరు ఎదుగుతున్న వారే.”
“అయితే స్వామీజీ! అటువంటి పరిస్థితులలో  నాకు రక్షణను లేదా సలహాను ఇచ్చే వారు ఎవరు?”
“ఎలా నడచుకోవాలి అనే విషయములో నీవు చదివిన మంచి  పుస్తకాలు సహాయ పడతాయి. నీవు అలా నడచుకొంటె దైవిక శక్తులతో నీకు సంబంధము ఏర్పడుతుంది. నీవు దారి తప్పుతుంటే నీ అంతస్సాక్షి  గుర్తు చేస్తూనే ఉంటుంది. అన్నిటి కంటే నీకు కావలసింది శ్రద్ధ, సబూరి(విశ్వాసము).”
“అవి నిలబడాలంటే ఎలా? నాకు భగవంతుడితో సంబంధము ఎలా నిలబడుతుంది?”
“భగవంతుడితో నీకున్న సంబంధాన్ని నీవే మరచి పోతున్నావు. సామాన్య పరిభాషలో చెప్పాలంటే నీకు కావలసిన వసతులన్నే భగవంతుడే ఏర్పాటు చేస్తున్నాడు. పుట్టిన నాటినుండి నిరంతరమూ ప్రాణ ప్రవాహము నీలో ప్రవహిస్తూనే ఉంది. ఆ శక్తి ధార తెగి పోయినపుడే మరణము.ఇది కూడా భగవంతుడు నీకు ఇచ్చిన ఉపకరణము. పసి పిల్లాడుగా బయటికి వచ్చినప్పటి నుండి, పంచ భూతాల నుండి  విడి పోయే వరకు,నీకు శ్వాసను ఏర్పాటు చేసినదీ భగవంతుడే. అదీ మరచి పోయినావు.
ఆ శ్వాస లో కూడా ప్రాచ్య దేశాలు  యింగ్ మరియు యాంగ్ అనే పేర్లతో కొన్ని విభాగాలను గుర్తించినాయి. అందులో యింగ్  అంటే భౌతిక శరీరానికి సంబంధించినది. యాంగ్ శక్తి తత్వానికి సంబంధించినది. మొదటిది మనస్సుకు, రెండవది బుద్ధికి, మొదటిది రాత్రికి, రెండవది పగలుకు, మొదటిది చంద్రుడికి రెండవ ది సూర్యుడికి సంబంధించినవి. కానీ ఈ రెండిటి యొక్క సంధిని పట్టుకుంటే దైవీ తత్త్వము దగ్గరకు వస్తుంది. దీనినే భారతీయులు అగ్ని తత్త్వము లేదా కుండలినీ తత్త్వము అని అన్నారు. ఈ శ్వాసను నియంత్రించుట ద్వారా ఆలోచనల మీద నియంత్రణ  ఏర్పడుతుంది.  ఈ విధముగా ఆయనను గుర్తించే తాళాలను ఆయన ఏర్పాటు చేసినారు. ఈ సాధనల ద్వారా అపరిత మయిన అనుభవాలు, జ్ఞానము మనకు లభిస్తాయి. మనము బలహీనులము, అసహాయులము అనే భావనలు మనల నుండి తొలగి పోతాయి.
“ మరి మానవుడు ఎందుకు నిరంతరము బాధలు పడుతూ బల హీనుడుగా తయారవుతున్నాడు?”
“ ఆవు దూడ తల్లి గర్భము నుండి బయటకు రాగానే తనకు తల్లి నుండి పాలు లభిస్తాయి. ఒక పిల్లాడు కుడా తనకు ఇష్టమయిన వాటి వైపు ఆకర్షితుడవుతాడు. పూర్ణ మయిన ఆత్మ కూడా భౌతిక ప్రవేశించినపుడు మొదట అన్నే లభించినా కొంత కాలానికి తన మూల తత్వాన్ని మరచి పోతాడు. దీనిని మాయ అంటారు. ఇది కూడా ఒక రకమయిన మతి మరుపు. తను అనుభవము ద్వారా సాధించిన జ్ఞానము సంస్కారముగా తనలో కారణ శరీరము లో నిక్షిప్తమై తనకు సంస్కారముగా తన తోనే ఉండి పోతుంది. తను నేర్చుకొని (అనుభవము లోనికి రాని సమాచారము )జ్ఞానము కాదు. అందుకే అది మాయ చేత కప్పి వేయ బడుతుంది. పూర్తి జ్ఞానాన్ని అనుభూతి లోనికి తెచ్చుకున్న వ్యక్తి మానవుడు గా కాక దైవీ మానవుడుగా మారతాడు. ఇది పరిణామములో అయిదవ స్థితి.”
“ అయితే మిగిలిన నాలుగు స్థితులు ఏమిటి?”
“పరిణామములో ఖనిజ స్థితిని అనుభవిస్తాడు. అక్కడ కొద్దిగా సూక్ష్మ దేహము ఉంటుంది. అక్కడ అనుభవాలు చాలా తక్కువగా ఉంటాయి. తరువాత వృక్ష స్థాయికి వస్తాడు. వీటికి ప్రకృతి నుండి శక్తిని స్వీకరించుకుంటుంది. ఇక్కడ భావావేశములు ఏవీ ఉండవు? తరువాత జీవి జంతు స్థాయికి వస్తుంది. ఇక్కడ సూక్ష్మ దేహము వృద్ధి పొంది , భావావేశములకు నిలయము అయిన కామ దేహము లేదా ఆస్ట్రల్ బాడి ఏర్పడుతుంది. కామ దేహములో శక్తులను విపరీతముగా ప్రేరేపించ వచ్చును. వీటిని సద్వినియోగము లేదా దుర్వినియోగము చేయ వచ్చును. ఈ కామ దేహ స్థితిలో ఉన్నపుడే జంతు స్థాయినుండి, మానవుడుగా జన్మ లభించును. అట్లాంటిస్ లోని మానవ జాతి కామ దేహమును ఉపయోగించి మొత్తము మానవ జాతిని నియంత్రించడానికి ప్రయత్నించినారు. మనస్సు అనే ఉపకరణము మానవ జాతికి ఏర్పడటము తో మానవ అనే శబ్దముకు అర్థము ఏర్పడినది.   
  మనస్సు మనలను నియంత్రించినపుడు అది అగ్ని లాగ మనలను దహిస్తుంది.  దానిని మనము నియంత్రించినపుడు దాని ద్వారా మనకు అపరిమితమయిన శక్తులు లభిస్తాయి. ఇవి లోక కల్యాణానికి ఉపయోగ పడుతాయి. ఈ స్థితినే దైవీ మానవ స్థితి అన్నారు. ఇప్పటి మానవుల లక్ష్యమదే.”
 “మరి ఉన్నత తలాలని అన్నారు. అవి ఎమిటో చెబుతారా?”
“వీటినే మితి లేదా డైమెన్షన్ అని అంటారు. ఇప్పుడు మనము పృధ్వీ తత్త్వము లోనే ఉన్నాము. అది మూడు మితులకు (అంటే 3 డైమెన్షన్) సరిపోతుంది. కాలాన్ని గుర్తించాము. కాని దాని లోనికి ప్రవేశించడం మానవుడికి చేత కాలేదు అది చేతనయితే మనము నాల్గవ మితి లోకి ప్రవేశిస్తాము. దీని వలన మనిషికి భూత , భవిష్య వర్తమానాలలో సమముగా బ్రదుకుట తెలుస్తుంది. విపరీతముగా మానవుడి శక్తి యుక్తులు పెరుగుతాయి. వీటి గురించి సూచనలు ఉన్నాయి, కానీ వీటిని అందుకొనే స్థితికి మానవుడు చేర లేదు.”
“స్వామీజీ! ఇపుడు మీరు చెప్పిన జ్ఞానమంతా నాతోనే ఉంటుందా?”
“ఉంటుంది. కానీ నీకు అందదు. కారణము ముందే చెప్పాను. అది నీ అనుభవము కాదు. నీవు సంపాదించుకున్నదే నీ కారణ దేహములో ఉంటుంది. మిగిలినది మాయతో కప్ప బడి ఉంటుంది. కారణము ఒకటే. దానిని అందుకునే స్థితిలో మీరు ఉండరు.”
“ఇది అన్యాయము కాదా స్వామీజీ!”
“ ఎ మాత్రము కాదు. ఒక ఉదాహరణ  చెబుతాను. కంప్యుటర్ ఉపకరణాలతో కూడిన కారును నడిపే వ్యక్తీ యొక్క సామర్థ్యము మామూలు అంబాసిడర్ కారు నడపుటలో ఉపయోగ పడదు. యోగస్థితి అందుకున్న వ్యక్తీ మామూలు మానవుడి దేహములో ప్రవేశిస్తే తన పూర్తి స్థితి అందుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతాడు. అంటే దేహము కూడా సామర్ధ్యానికి తగినట్లుగా ఉండాలి. అందుకే యోగ పురుషులు పుట్ట వలసి వచ్చినపుడు యోగుల గృహాలనే ఎన్నుకుంటారు.”
“తన కున్న జ్ఞానముతో తన దేహాన్ని మార్చుకోలేరా?”
“దేహము తట్టుకో గలిగిన  శక్తి కన్నా ఎక్కువ శక్తిని దేహానికి అందిస్తే దేహ కణాలు ఆ శక్తిని తట్టుకో లేక విఘటనము చెందుతాయి. దీని వలన భయంకరమయిన వ్యాధులు రావచ్చును.”
“మరి ఒక జన్మలో ఈ మార్పు తీసుకొని రాలేమంటారా?”
“ చేయ వచ్చును. కానీ దానికి చాలా కఠిన మయిన నియమాలను పాటించ వలసి వస్తుంది. ముందు మనస్సును నియంత్రించాలి. మనస్సును ఆహారము చాలా ప్రభావితము చేస్తుంది కాబట్టి,, శవాహారము (అంటే మాంసము లాటివి )ను పూర్తిగా వదలి వేయాలి. తరువాత తామసిక ఆహారము (నిలవ ఉన్నవి మరియు ఉల్లి, వెల్లుల్లి తో కూడినవి) ను వదిలించుకోవాలి. అటు తరువాత కోపాన్ని పెంచే మసాలాలు కూడిన రాజసిక ఆహారము ను వదిలించుకోవాలి. ఇంతకూ ముందు చేరిన మురికిని ఆసనాలు, ప్రాణాయామములు, ధ్యానము ద్వారా శుద్ధి చేసుకోవాలి. తరువాత వండిన ఆహార పదార్థాలను కూడా వదిలి వేయ వలసి యుంటుంది.. ఇదంతా సమర్థుడయిన గురువు పర్యవేక్షణలో చేస్తే మంచిది.”
“మరి, మనిషి శవాహారాన్నే ఎందుకు ఇష్ట పడుతున్నాడు?”
 “” అది అతడి పరిణామ స్థితి మీద ఆధార పడుతుంది. తన సంస్కార ప్రభావము ఎంత తీవ్రముగా ఉంటుందంటే  ఇంకొకరు చెప్పినా నమ్మడు.”
“ఇప్పుడు మీరు చెప్పిన జ్ఞానము మాకు అందుబాటు లో ఉంటుందా?”
“ఇప్పుడు చెప్పిన వన్నీ ఆకాశములో నిక్షిప్తమై ధ్యానములో ఉన్న వారికి అందుబాటులోనే ఉంటాయి.”
“మరి స్వర్గము, నరకము లాంటివి....”
“ఈ లోకము అద్దము లాటిది. దుష్ట సంస్కారములు కల వారికి ఈ లోకము చెడు అనుభవాలనే ఇస్తుంది. అప్పుడు మన కర్మకు అధినేత  యమ ధర్మ రాజు పేరుతొ చాలా క్రూరుడు గా కనిపిస్తాడు. మంచి సంస్కారములు కలిగిన వారికి ఆయనే ఉపదేశకుడుగా అందగాడుగా, మృదు స్వభావిగా కనిపిస్తాడు.”  
“ఇంకా నాకు తెలుసుకోవాలని ఉంది. మీరు నాకు అందుబాటులో ఉంటారా?”
“చిత్త శుద్ధితో నేర్చుకోవాలని అనుకున్న ప్రతి వారికి భగవంతుడు జ్ఞానాన్ని అందుబాటులో ఉంచుతాడు.”
స్వామీజీ మళ్ళీ చెప్పినాడు.
“మనిషి మరణించినపుడు అతడి పై ఏ గ్రహము ప్రభావముతో ఉంటుందో, ఆ గ్రహము తిరిగి ప్రభావిత మయినపుడు మళ్ళీ జన్మించే అవకాశము వస్తుంది. ప్రస్తుతము నీకు ఆస్థితి వచ్చింది. సిద్ధమేనా?”
“ఖచ్చితముగా వెంటనే జన్మించాలా?”
“పుట్ట వలనా లేదా అనేది నీ నిర్ణయము పై ఆధార పడి యుంటుంది. ఇప్పుడు తప్పితే తిరిగి ఈ స్థితి రావటానికి చాలా కాలము పడుతుంది. నీ నిర్ణయమేమిటి?” 
 “అయితే నేను సిద్ధమే.”
“మరొక విషయము నీవు జన్మించిన తరువాత మూడు నెలల వరకు ఈ జ్ఞానము నీతోనే ఉంటుంది.అందుకే మూడు నెలల వరకు పుట్టిన పిల్లలు దైవీ ప్రజ్ఞతో ఆనందముగా ఉంటారు. ఆ తరువాత నీ సంస్కారాలు నీలో జొరబడి ఆ జ్ఞానాన్ని కప్పి వేస్తుంది.. ఇంక బయలు దేర వచ్చును.”
తిరిగి యాత్ర మొదలయింది. తను తల్లి గర్భమునుండి బయటకు వచ్చినాడు.  ప్రతి యొక్కరు తనను ఎత్తుకొని ముద్దాడుతుంటే చాలా ఆనందముగా ఉంది.
అందరికి తను ప్రత్యేకముగా కనిపిస్తున్నాడు. తల్లి పాలు అమృతము లాగున్నవి. ఆ సమయములో స్వామీజీ చెప్పిన ప్రతి విషయము గుర్తు ఉంది. వాటిని మరచి పోగూడదని గట్టిగా నిర్ణయము చేసుకున్నాడు.
కొన్నాళ్ళ తరువాత తల్లి పాలలో ఏదో తేడా కనిపించినది. బాగా కడుపు నొప్పి వచ్చి, ఏడుపు వచ్చింది. అందరూ హడావుడి చేస్తున్నారు. అప్పుడు ఒకావిడ “పచ్చి బాలింటావు. అంట ఘాటు పచ్చడి ఎందుకు తిన్నావు?”అని అడిగింది.
“ఇన్నాళ్ళు పథ్యము  తిని నోరు చవి చెడింది,”అన్నది.
అప్పుడు అమ్మ మీద కోపము వచ్చింది.
ఇంకో రోజు అమ్మ ఇంకో పిల్ల వాడిని ఆడిస్తుంటే నన్ను వదిలి వేరే వాడిని ఆడిస్తున్నావా? అని బాగా అసూయ వచ్చింది.
ఈ విధముగా రోజుకు ఒక అవతారము ఎత్తినాను. మూడు నెలలు అయేసరికి ఎంత ప్రయత్నించినా స్వామీజీ మాటలు గుర్తుకు రావటము లేదు.

************************************

Tuesday, March 3, 2015

ఉడత 5




ఒక్క సారి గతమంతా కళ్ల ముందు మెదిలింది. తను ధర్మ మార్గములో నడిచే కొడుకు కావాలని కోరుకుంది. అంతా మహా దేవుడి అనుగ్రహము.
ఈ సంఘటనలన్నీ ఆకాంక్ష కు సూచనా మాత్రముగా చెప్పింది. విషయాన్ని తనే కదల్చాలని స్వామీ జీ చెప్పినారు. తను మొదటి ప్రయత్నమూ చేసింది. అంతకంటే ముందుకు వెల్ల లేక పోయింది.
ఆకాంక్షకు కూడా తనకు వచ్చిన కల నిజమవుతుందేమో అని అనిపించింది.
ఆ రోజు సీతమ్మ ఆదిత్య దగ్గర ప్రస్తావన తీసుకొని వచ్చింది.
“ఆ అమ్మాయిని చూచినావా? ఎలాగుంది?”, అని ప్రశ్నలు వేసింది.
“అప్పుడే తొందరేమిటమ్మా!”, అన్నాడు ఆదిత్య.
ఇంకా ఆనంద్ వచ్చిన తరువాత మళ్ళీ ప్రస్తావించాలనుకుంది. ఆకాంక్ష గురించి రామ తీర్థములో తన అమ్మా నాన్నలకు కూడా తెలియ చేసింది. తమ ఆరాధ్య దైవము మహా దేవుడికి నమస్కారము పెట్టుకుంది.
ఒక వారము గడిచినది. ప్రక్క ఇంట్లో ఒక అమ్మాయి భాగవత పద్యాలు పెద్దగా చదువుచున్నది. అందులోను అది రుక్మిణీ కళ్యాణ ఘట్టము.
“ఎవరమ్మా! అంత శ్రావ్యముగా చదువుతున్నది?”, అడిగినాడు ఆదిత్య.
“ఇంకెవరు? అక్కడ ఉండేది, ఆకాంక్షే కదా! వాళ్ళ తాతయ్య , నానమ్మ వచ్చినారుట. వాళ్లకు చదివి వినిపిస్తున్నది.”, అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నది సీతమ్మ.
“చాలా బాగా చదువుతున్నది కదమ్మా!”, అన్నాడు ఆదిత్య. సీతమ్మ మరేమీ మాట్లాడ లేదు.
మర్నాడు ఉదయము ఆకాంక్ష యొక్క నానమ్మ  తాతయ్య వచ్చి సీతమ్మను, ఆదిత్యను  పరిచయము చేసుకున్నారు. కాసేపు తమను గూర్చి చెప్పుకున్నారు. క్షేమ సమాచారాలు మాట్లాడినారు.
తరువాత పెద్దాయన  ఆదిత్యను అడిగినాడు.
“ పెళ్లి అంటే నీ ఉద్దేశ్యమేమిటి బాబూ!”
ఆదిత్య ముందు ఇటువంటి ప్రస్తావన వస్తుందని ఊహించ లేదు. ఎందుకు అడుగుతున్నా డో అర్థము కాలేదు. అయినా పెద్ద వాళ్ళు కాబట్టి నెమ్మదిగానే జవాబు చెప్పినాడు.
“” మనిషి తన పరిమితులను పెంచుకోవడములో ఒక భాగము పెళ్లి. ఇందులో రెండు కుటుంబాలు పరస్పరము సహకరించుకోవడానికి అంగీకరించి , ఒకే కుటుంబముగా మారుతుంది.”
ఆకాంక్ష తాతయ్య గారు ఇటువంటి జవాబు విని ఆశ్చర్య పడినాడు. తను ఆశించే జవాబు కంటే వచ్చిన జవాబు స్థాయి చాల ఎక్కువగా ఉన్నది.
“అంతేనా? ఇంకేమయినా చెబుతావా?” తాతయ్య గారు అడిగినారు. ఎందుకంటే ఆదిత్య యొక్క మాటలు ఆయన్ను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి.
“ఆకర్షణ తో మొదలు అయినా పెళ్లి అనేది ఒక యజ్ఞము. దీనిని ప్రాజాపత్య యజ్ఞమని అంటారు. దీనిని ఒక పరంపరను నిలపడానికి ఒక ఉపాధి లాగా ఋషులు భావించినారు.  ఈ నాడు అర్థాలు మారి పోయి ఉండ వచ్చును. పెళ్లి అయిన తరువాత రెండు కుటుంబాల మధ్య వారధి గా వధువు భాద్యత తీసుకుంటుంది.”
“ఇంతకూ ముందు పరిమితత్వము, అపరిమితత్వము అని అన్నావు. పెళ్లి వలన ఇటువంటి మార్పు ఎల్లా జరుగుతుంది?”
“తన కుటుంబము , తన వాళ్ళు అని ఆలోచించే వ్యక్తీ వివాహము వలన ఆ కుటుంబము కూడా తనదే ఆ భావన లోనికి వస్తాడు. అంటే తనకున్న పరిమితులు దాటి పరిధిని పెంచుకున్నట్లే కదా!”
“ఇవి మన ఆచారాల్లో ఎక్కడ వస్తాయి?  అసలు మేమెప్పుడు ఈ పరిధిలో ఆలోచించ లేదు. కాస్త వివరముగా చెప్పు బాబూ!”
ఈ లోపల సీతమ్మ ప్లేట్లో జీడి పప్పు తెచ్చి పెట్టింది. ఆమెకు జరుగుతున్నదంతా సంతోషాన్నే కలిగిస్తున్న ది.
“ మనకు అన్నీ ఉన్నాయి. భావము పట్టించుకోకుండా చేస్తున్నందున మనకు ఫలితాలు వస్తున్నా నమ్మకాలు సడలి పోతున్నాయి.  అర్థము చేసుకోకుండా చేసినా ఫలితాలు రావచ్చు . కానీ అర్థము తో చేసినపుడు మన మానసిక స్థితి ఒక మెట్టు ఎక్కుతుంది. ఉదాహరణకు మనము చేసే ఆచమనం అనే ప్రక్రియను తీసుకుందాము. ఈ దైవిక ప్రక్రియకైనా ముందు తనను పవిత్రము చేసుకొనుటకు  ఆచమనము చేస్తారు. దీనిని కొన్ని జిల్లాలలో కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహ అను మంత్రాలతో మొదలు పెట్టి ఇరువది నాలుగు కేశవ నామాల స్మరణతో ముగిస్తారు. మరి కొన్ని జిల్లాలలో  అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః లతో మొదలు పెట్టి ద్వాదశ నామాలను స్మరణ చేస్తారు. ఇంకా శివ నామాలతో కూడా ఆచమనము చేయడము కొన్ని శాఖలలో ఉన్నది. నిజానికి నలభై రకాల ఆచమనాలు ఉన్నాయని బోదాయనుడు  తన ఆగమ శాస్త్ర గ్రంథములో వ్రాసినాడు.  వారి వారి ఆరాధ్య దైవము ననుసరించి ఇన్ని రకాలు ఏర్పడినాయి. ఇందులో రెండవ ఆచమనాన్ని గురించి ఒక సారి చూద్దాము. అచ్యుతాయ అనుకున్నపుడు నాశనము లేని స్థితిని, అనంతాయ అనుకున్నపుడు అపరిమితుడననే భావాన్ని గోవిందాయ అనుకున్నపుడు  నేను కాంతి స్వరూపుడనని అనుకుంటే మనము పరిమితత్వము నుండి అపరిమితత్వము లోనికి ప్రయాణము మొదలు పెడతాము. ఇన్ని పేర్లున్నాయి కదా! మరి భగవంతుడు ఎవరని అడిగితే ఉపనిషత్తులు చెప్పాయి కదా, “ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ”. అని. ఇంకా నారాయణ సూక్తములో ఆయనను గూర్చి “స బ్రహ్మ, స శివ , స హరి “ అని అంతా లేదా అన్నీ ఆయనే అని చెప్పినాడు కదా! ఇవన్నీ పరిమితత్వాన్నుండి, అపరిమితత్వానికి ప్రయాణమును సూచించడము కాదంటారా?”
“నాయనా! నీవు చిన్న వాడవు. నీకు అంతకంటే పెద్ద సన్మానము చేయ లేను.”  అంటూ ఆదిత్యను దగ్గరకు పిలిచి కౌగిలించుకున్నాడు.
“ఇవన్నీ ఎక్కడ నేర్చి నావయ్యా?”, అని అడిగినాడు.
“నాకు ఏమీ తెలియదు. కానీ మా అమ్మ యొక్క గురువు స్వామీ శివానంద నాతొ ఎన్నో విషయాలు మాట్లాడే వారు. అందులో పట్టుకున్న చిలక పలుకులే, ఇవన్నీ”, అని ఆదిత్య  తన అణకువను ప్రదర్శించుకున్నాడు.
“నాయనా! నిన్ను చూస్తే చాలా ముచ్చట వేస్తున్నది. నిన్ను గురించి మా మనుమరాలు చెబుతుంటే  ఏమో అనుకున్నాను. నా కొక ఆకాంక్ష కలిగింది. నిన్ను మాలో కలిపేసుకొని దాని ద్వారా మా అపరిమితత్వాన్ని దాటుదామని.”
వాళ్ళ ఉద్దేశ్యము సీతమ్మకు అర్థమయింది.
“మీరన్నది మంచిదే బాబాయిగారూ! ఒక సారి మా ఆయనకు కూడా చెప్పి ముందుకు వెళ్దాము. ఒక సారి మీ మనుమరాలికి కూడా చెప్పాలి కదా!”, సీతమ్మ గారు అన్నారు.
“నిజమేనమ్మా!”, అంటూ  ఆకాంక్ష కోసము భార్యను పంపించినారు.
వాలు మాటల్లో ఉంటే రెండు ఉడుతలు తగవు పెట్టుకుంటూ వచ్చి చేరి ఒక జీడి పప్పును కరుచుకొని వాకిటి వైపు పరిగెత్తాయి. ఈ లోపల ఎదురు వచ్చిన ఆకాంక్ష ను చూచి కంగారు పడి ఆకాంక్ష నెత్తి మీద  వదిలివేసి  బయటకు వెళ్లి పోయినాయి.
అందరికి సమ్మతమై వివాహము జరిగింది. ఆ తరువాత ఉడతల మీద ఆకాంక్ష అభిప్రాయాలను విన్న ఆదిత్య “ఐ  థాంక్ యూ ఉడుతా! “, అంటూ ఆకాంక్ష వైపు చూచినాడు.


నోటు: ౧. నాకు రామ తీర్థములో శివుడి పేరు ఏమిటో తెలియదు కథ కోసము నీల కంఠ  మహా దేవుడిగా తీసుకున్నాను.
౨.ఇందులో సాధనాలు శివోపాసన ఆధారముగా ఇచ్చినా అన్ని రూపాలలో ఉన్న భగవంతుడు ఒక్కడే అన్న విషయాన్ని మనము మరచి పోకూడదు.