Tuesday, March 3, 2015

ఉడత 5




ఒక్క సారి గతమంతా కళ్ల ముందు మెదిలింది. తను ధర్మ మార్గములో నడిచే కొడుకు కావాలని కోరుకుంది. అంతా మహా దేవుడి అనుగ్రహము.
ఈ సంఘటనలన్నీ ఆకాంక్ష కు సూచనా మాత్రముగా చెప్పింది. విషయాన్ని తనే కదల్చాలని స్వామీ జీ చెప్పినారు. తను మొదటి ప్రయత్నమూ చేసింది. అంతకంటే ముందుకు వెల్ల లేక పోయింది.
ఆకాంక్షకు కూడా తనకు వచ్చిన కల నిజమవుతుందేమో అని అనిపించింది.
ఆ రోజు సీతమ్మ ఆదిత్య దగ్గర ప్రస్తావన తీసుకొని వచ్చింది.
“ఆ అమ్మాయిని చూచినావా? ఎలాగుంది?”, అని ప్రశ్నలు వేసింది.
“అప్పుడే తొందరేమిటమ్మా!”, అన్నాడు ఆదిత్య.
ఇంకా ఆనంద్ వచ్చిన తరువాత మళ్ళీ ప్రస్తావించాలనుకుంది. ఆకాంక్ష గురించి రామ తీర్థములో తన అమ్మా నాన్నలకు కూడా తెలియ చేసింది. తమ ఆరాధ్య దైవము మహా దేవుడికి నమస్కారము పెట్టుకుంది.
ఒక వారము గడిచినది. ప్రక్క ఇంట్లో ఒక అమ్మాయి భాగవత పద్యాలు పెద్దగా చదువుచున్నది. అందులోను అది రుక్మిణీ కళ్యాణ ఘట్టము.
“ఎవరమ్మా! అంత శ్రావ్యముగా చదువుతున్నది?”, అడిగినాడు ఆదిత్య.
“ఇంకెవరు? అక్కడ ఉండేది, ఆకాంక్షే కదా! వాళ్ళ తాతయ్య , నానమ్మ వచ్చినారుట. వాళ్లకు చదివి వినిపిస్తున్నది.”, అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నది సీతమ్మ.
“చాలా బాగా చదువుతున్నది కదమ్మా!”, అన్నాడు ఆదిత్య. సీతమ్మ మరేమీ మాట్లాడ లేదు.
మర్నాడు ఉదయము ఆకాంక్ష యొక్క నానమ్మ  తాతయ్య వచ్చి సీతమ్మను, ఆదిత్యను  పరిచయము చేసుకున్నారు. కాసేపు తమను గూర్చి చెప్పుకున్నారు. క్షేమ సమాచారాలు మాట్లాడినారు.
తరువాత పెద్దాయన  ఆదిత్యను అడిగినాడు.
“ పెళ్లి అంటే నీ ఉద్దేశ్యమేమిటి బాబూ!”
ఆదిత్య ముందు ఇటువంటి ప్రస్తావన వస్తుందని ఊహించ లేదు. ఎందుకు అడుగుతున్నా డో అర్థము కాలేదు. అయినా పెద్ద వాళ్ళు కాబట్టి నెమ్మదిగానే జవాబు చెప్పినాడు.
“” మనిషి తన పరిమితులను పెంచుకోవడములో ఒక భాగము పెళ్లి. ఇందులో రెండు కుటుంబాలు పరస్పరము సహకరించుకోవడానికి అంగీకరించి , ఒకే కుటుంబముగా మారుతుంది.”
ఆకాంక్ష తాతయ్య గారు ఇటువంటి జవాబు విని ఆశ్చర్య పడినాడు. తను ఆశించే జవాబు కంటే వచ్చిన జవాబు స్థాయి చాల ఎక్కువగా ఉన్నది.
“అంతేనా? ఇంకేమయినా చెబుతావా?” తాతయ్య గారు అడిగినారు. ఎందుకంటే ఆదిత్య యొక్క మాటలు ఆయన్ను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి.
“ఆకర్షణ తో మొదలు అయినా పెళ్లి అనేది ఒక యజ్ఞము. దీనిని ప్రాజాపత్య యజ్ఞమని అంటారు. దీనిని ఒక పరంపరను నిలపడానికి ఒక ఉపాధి లాగా ఋషులు భావించినారు.  ఈ నాడు అర్థాలు మారి పోయి ఉండ వచ్చును. పెళ్లి అయిన తరువాత రెండు కుటుంబాల మధ్య వారధి గా వధువు భాద్యత తీసుకుంటుంది.”
“ఇంతకూ ముందు పరిమితత్వము, అపరిమితత్వము అని అన్నావు. పెళ్లి వలన ఇటువంటి మార్పు ఎల్లా జరుగుతుంది?”
“తన కుటుంబము , తన వాళ్ళు అని ఆలోచించే వ్యక్తీ వివాహము వలన ఆ కుటుంబము కూడా తనదే ఆ భావన లోనికి వస్తాడు. అంటే తనకున్న పరిమితులు దాటి పరిధిని పెంచుకున్నట్లే కదా!”
“ఇవి మన ఆచారాల్లో ఎక్కడ వస్తాయి?  అసలు మేమెప్పుడు ఈ పరిధిలో ఆలోచించ లేదు. కాస్త వివరముగా చెప్పు బాబూ!”
ఈ లోపల సీతమ్మ ప్లేట్లో జీడి పప్పు తెచ్చి పెట్టింది. ఆమెకు జరుగుతున్నదంతా సంతోషాన్నే కలిగిస్తున్న ది.
“ మనకు అన్నీ ఉన్నాయి. భావము పట్టించుకోకుండా చేస్తున్నందున మనకు ఫలితాలు వస్తున్నా నమ్మకాలు సడలి పోతున్నాయి.  అర్థము చేసుకోకుండా చేసినా ఫలితాలు రావచ్చు . కానీ అర్థము తో చేసినపుడు మన మానసిక స్థితి ఒక మెట్టు ఎక్కుతుంది. ఉదాహరణకు మనము చేసే ఆచమనం అనే ప్రక్రియను తీసుకుందాము. ఈ దైవిక ప్రక్రియకైనా ముందు తనను పవిత్రము చేసుకొనుటకు  ఆచమనము చేస్తారు. దీనిని కొన్ని జిల్లాలలో కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహ అను మంత్రాలతో మొదలు పెట్టి ఇరువది నాలుగు కేశవ నామాల స్మరణతో ముగిస్తారు. మరి కొన్ని జిల్లాలలో  అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః లతో మొదలు పెట్టి ద్వాదశ నామాలను స్మరణ చేస్తారు. ఇంకా శివ నామాలతో కూడా ఆచమనము చేయడము కొన్ని శాఖలలో ఉన్నది. నిజానికి నలభై రకాల ఆచమనాలు ఉన్నాయని బోదాయనుడు  తన ఆగమ శాస్త్ర గ్రంథములో వ్రాసినాడు.  వారి వారి ఆరాధ్య దైవము ననుసరించి ఇన్ని రకాలు ఏర్పడినాయి. ఇందులో రెండవ ఆచమనాన్ని గురించి ఒక సారి చూద్దాము. అచ్యుతాయ అనుకున్నపుడు నాశనము లేని స్థితిని, అనంతాయ అనుకున్నపుడు అపరిమితుడననే భావాన్ని గోవిందాయ అనుకున్నపుడు  నేను కాంతి స్వరూపుడనని అనుకుంటే మనము పరిమితత్వము నుండి అపరిమితత్వము లోనికి ప్రయాణము మొదలు పెడతాము. ఇన్ని పేర్లున్నాయి కదా! మరి భగవంతుడు ఎవరని అడిగితే ఉపనిషత్తులు చెప్పాయి కదా, “ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ”. అని. ఇంకా నారాయణ సూక్తములో ఆయనను గూర్చి “స బ్రహ్మ, స శివ , స హరి “ అని అంతా లేదా అన్నీ ఆయనే అని చెప్పినాడు కదా! ఇవన్నీ పరిమితత్వాన్నుండి, అపరిమితత్వానికి ప్రయాణమును సూచించడము కాదంటారా?”
“నాయనా! నీవు చిన్న వాడవు. నీకు అంతకంటే పెద్ద సన్మానము చేయ లేను.”  అంటూ ఆదిత్యను దగ్గరకు పిలిచి కౌగిలించుకున్నాడు.
“ఇవన్నీ ఎక్కడ నేర్చి నావయ్యా?”, అని అడిగినాడు.
“నాకు ఏమీ తెలియదు. కానీ మా అమ్మ యొక్క గురువు స్వామీ శివానంద నాతొ ఎన్నో విషయాలు మాట్లాడే వారు. అందులో పట్టుకున్న చిలక పలుకులే, ఇవన్నీ”, అని ఆదిత్య  తన అణకువను ప్రదర్శించుకున్నాడు.
“నాయనా! నిన్ను చూస్తే చాలా ముచ్చట వేస్తున్నది. నిన్ను గురించి మా మనుమరాలు చెబుతుంటే  ఏమో అనుకున్నాను. నా కొక ఆకాంక్ష కలిగింది. నిన్ను మాలో కలిపేసుకొని దాని ద్వారా మా అపరిమితత్వాన్ని దాటుదామని.”
వాళ్ళ ఉద్దేశ్యము సీతమ్మకు అర్థమయింది.
“మీరన్నది మంచిదే బాబాయిగారూ! ఒక సారి మా ఆయనకు కూడా చెప్పి ముందుకు వెళ్దాము. ఒక సారి మీ మనుమరాలికి కూడా చెప్పాలి కదా!”, సీతమ్మ గారు అన్నారు.
“నిజమేనమ్మా!”, అంటూ  ఆకాంక్ష కోసము భార్యను పంపించినారు.
వాలు మాటల్లో ఉంటే రెండు ఉడుతలు తగవు పెట్టుకుంటూ వచ్చి చేరి ఒక జీడి పప్పును కరుచుకొని వాకిటి వైపు పరిగెత్తాయి. ఈ లోపల ఎదురు వచ్చిన ఆకాంక్ష ను చూచి కంగారు పడి ఆకాంక్ష నెత్తి మీద  వదిలివేసి  బయటకు వెళ్లి పోయినాయి.
అందరికి సమ్మతమై వివాహము జరిగింది. ఆ తరువాత ఉడతల మీద ఆకాంక్ష అభిప్రాయాలను విన్న ఆదిత్య “ఐ  థాంక్ యూ ఉడుతా! “, అంటూ ఆకాంక్ష వైపు చూచినాడు.


నోటు: ౧. నాకు రామ తీర్థములో శివుడి పేరు ఏమిటో తెలియదు కథ కోసము నీల కంఠ  మహా దేవుడిగా తీసుకున్నాను.
౨.ఇందులో సాధనాలు శివోపాసన ఆధారముగా ఇచ్చినా అన్ని రూపాలలో ఉన్న భగవంతుడు ఒక్కడే అన్న విషయాన్ని మనము మరచి పోకూడదు.


No comments:

Post a Comment