Saturday, April 2, 2016

ఆహారము



రాఘవ తన కొడుకును చూచుటకై మలేసియా  వెళ్ళినాడు. కొడుకు నాలుగు రోజులు సెలవు పెట్టి తన వెంట అన్ని ప్రదేశాలను చూపించినాడు. అక్కడ ఉండే హిందూ దేవాలయాలతో బాటు పెద్ద హోటళ్ళు, భవనాలు, పార్కులు అన్నిటికి వెళ్ళినారు.
రాఘవ స్వతహాగా మాంసాహారి. అయినా వయస్సు పెరిగే కొద్దీ మాంసాహారాన్ని తినుటను తగ్గించుకుంటూ వచ్చినాడు ఎవరయినా బంధువులు వస్తే మొహమాటానికి మాంసాహారాన్ని  నాలుకకు అంటించు కొంటున్నాడు.. అంటే గానీ ఇష్ట పడి తినుట లేదు.
నాల్గవ రోజు వాళ్ళ అబ్బాయి “నాన్నగారు! ఈ రోజు మీకు స్పెషల్ మీల్స్ పెట్టిస్తాను” అన్నాడు.
“”వద్దురా. ఇటీవల నాకు మాంసము నోటికి పడటము  లేదు.”  అంటే “ఇంకొక్క సారి మిమ్ములను పిలువను. మీతో కలిసి నాకు ఆ స్పెషల్ డిష్ తినాలని ఉంది . రండి “ అంటూ బలవంతముగా తీసుకొని వెళ్ళినాడు.
హోటల్ లోకి ప్రవేశించ గానే ఎదురుగా పంజరాలలో ఎన్నో రకాల పక్షులు కనిపించినాయి. అందులో కొన్ని పిచ్చుకలు కూడా కనిపించినాయి.
“ఏమిట్రా? వీళ్ళు  ఈ పక్షులను అంతట ప్రేమగా పెంచుకుంటారా?’ అని అడిగినాడు.
విషయము తెలిస్తే తండ్రి అక్కడి నుండే వెనుకకు తిరుగుతాడని భయముతో  “అవును” అని చెప్పి డైనింగ్ హాలుకు తీసుకొని వెళ్ళినాడు. అక్కడ తెలుగు వచ్చిన వాడు లేక పోవడము కూడా అదృష్టము అనుకున్నాడు. ఉంటే ఆయన ప్రశ్నలకు ఎగతాళి చేస్తారు.
తరువాత లోపల బిరియానీ లాటివి వడ్డించినారు. ఎందుకో రాఘవకు నోటికి వెళ్ళుట లేదు. అయినా కొడుకు కోసము బలవంతముగా కుక్కుకున్నాడు. తినడము అయిన తరువాత అనుమానము వచ్చినది.
“ఇంతకూ మనము తిన్నది ఎ మాంసము రా?” అడిగినాడు.
“ఏదయితే ఏమిటి? తినడానికి బాగుంది కదా.”
ఒక సర్వరును అడిగితే అక్కడ వచ్చీ రాని తెలుగులో ఒక సర్వరు పిచ్చుకను చూపించినాడు.
దానితో రాఘవకు షాక్  తిన్నట్లనిపించినది. వాంతి వచ్చేట్లు అనిపించినది. ఇబ్బంది రాకుండా నోట్లో బిగ గట్టుకున్నాడు. హోటల్ గది లోనికి రాగానే మొత్తం వాంతి అయి పోయింది.
“ఏమయింది నాన్నా!” అని అడిగిన కొడుకుతో వెంటనే ఇలా అన్నాడు.
“ఇది మీకు చెబితే అర్థము కాదురా. నీ మీద గారాబముతో నిన్ను ఎప్పుడు పొలాల మీదకు పంప లేదు.  అందుకే నీకు అక్కడ ప్రకృతితో అనుబంధము ఏర్పడ లేదు. అందుకే మీకు నేను ఏమి చెప్పినా అర్థము కాదు.”
“ఉదయాన్నే పక్షుల కలకలాలు ఎంత బాగుంటాయో మీకు అర్థము కాదు. మైకేల్ జాక్సన్ కేకలు మీ చెవుల్లో హోరేస్తుంటే పక్షుల కలకలాలు మీకు ఎక్కడ వినిపిస్తాయి? పంటలు వచ్చినపుడు ఆ కంకులు వాకిట్లో కడితే అప్పుడు పిచ్చుకలు ఆ కంకులు తింటూ కబుర్లు చెప్పుకొనేటప్పుడు ఆ కల కలలుకు అలవాటు పడిన మాకే తెలుస్తాయి. ఇపుడు ఆ పిచుకలు ఏమయి పోయినాయో? పల్లెటూర్లో మాకే కనిపిచుట లేదు. కొంత మంది మొబైల్స్ తరంగాల వలన అవి నశించిననాయని అంటున్నారు.”
రాఘవ తిరిగి వచ్చిన తరువాత స్వామి శివానందను కలిసినారు.  ఆయన తో కొంత సేపు ఉండి తన అనుమానాలను తీర్చుకోవాలని అనుకున్నాడు.
“స్వామీజీ! మలేసియా లో అన్ని రకాల జీవులను భోంచేస్తారు. ఒక సారి పిచ్చుక మాంసము తిన్న తరువాత  అది ఏమిటో తెలిసింది. కానీ ఈ నా దేహము దాన్ని అంగీకరించ లేదు. వాంతి అయింది. ఎందుకలా జరిగింది? ఆ తరువాత మాంసాహారాన్ని మాని వేయాలని అనిపిస్తున్నది. ఎదో అశాంతి? కారణము తెలియుట లేదు.”
“ రాఘవా! నీ బాధ నాకు అర్థమయింది. రోజు తినే ఆహారము లోనూ జీవ హింస జరుగుతున్నది. కానీ అవి తినడాని కొరకే ఉన్నాయన్న భావన వలన నీ మనస్సు దానిని గుర్తించ లేదు. అదే పిచ్చుకల లాంటి జీవుల మీద నీకున్న అనుబంధము వలన  వాటి మాంసాన్ని నీ మనస్సు అంగీకరించుట లేదు.”
“ మరి మాంసాహారము తినుట వలన ఏ దోషము లేదంటారా?”
“ఖచ్చితముగా దోషముంది. కానీ అది నీ యొక్క పరిణామ స్థితిని అనుసరించి ఉంటుంది. ఈశావాస్య ఉపనిషత్తులో సమస్త జీవులలో నీలో ఉన్న దైవము ఒకటే అన్న విషయాన్ని గుర్తించమంటారు.”
“అంటే నాకు అర్థము కావటము లేదు.”
“ఒక్కొక్క విషయము వారి ఆధ్యాత్మికముగా ఎదిగిన స్థాయి మీద ఆధార పడుతుంది. ఋషులు ఏ విషయాన్నీ ఖచ్చితముగా ఆదేశించారు. ఒక సారి ఒకరు గౌతమ బుద్ద్దుడి దగ్గిరకు వచ్చినాడుట. “దేవుడున్నాడా? “ అని అడిగినాడుట.”ఔను ఉన్నాడు” అని బుద్దుడు చెప్పినాడుట.  తరువాత మరొకరు వచ్చి “దేవుడంటూ ఎవరు లేరు కదా.” అని అడిగినాదుట. బుద్ధుడు,”ఔను లేరు.” అని చెప్పినాదుట. వెంటనే అడిగిన వాడు వెళ్లి పోయినాడు. రెండు జవాబులు విన్న శిష్యుడు అడిగినాదుట. “గురు వర్యా! ఆ విధముగా వ్యతిరేకమయిన జవాబులు చెప్పినారేమిటి?” అప్పుడు శిష్యుడికి బుద్ధుడు జవాబు చెప్పినారుట.
“ఏమన్నారు?”
“మొదట వచ్చిన వాడు దేవుడు ఉన్నాడు అనే నిశ్చయముతో వచ్చినాడు. రెండవ వాడు దేవుడు లేడనే నిశ్చయముతో ఉన్నాడు. ఇద్దరికీ వివరణలు చర్చలు అక్ఖర లేదు. అందుకే వారికి అటువంటి జవాబులు వచ్చినవి. తెలుసుకోవాలి అనుకున్న వారికే చర్చలు, వివరణలు కావాలి. వారి కవసరము లేదు. తమ అభిప్రాయాలు సరి అయినవి అనుకున్న వారికి  వివరణలు అక్ఖర లేదు.”
“మరి తెలుసుకోవాలంటే ఎలా?”
“గురువు మీద సమర్పణ భావము ఉండాలి. నిజముగా తెలుసుకోవాలి అన్న భావన ఉండాలి.. అప్పుడే సరి అయిన సమాదానము వస్తుంది. అంటే కానీ, కథలను వక్రీకరించే కుకవులను దగ్గిరకు చేరనీయ కూడదు.”
“కుకవులంటే?”
“ప్రతి విషయాన్నీ లేదా ప్రతి కథను సత్యానికి కాకుండా తన భావాలకు అనుగుణముగా మార్చి చెప్పే వారిని కుకవులని అంటారు.”
“కుకవి పేరు ఎలా వచ్చిందో చెబుతారా?”
“నిజానికి కవి అంటే ప్రజ్ఞను కలిగిన వాడు. సృజనాత్మకతను కలిగిన వాడు. గురువు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింప చేస్తే  శుక్రుడు లోకములో ఎ పనిని అయినా ప్రజ్ఞతో ఎలా నిర్వహించాలో చెబుతాడు. అందుకే జ్యోతిషములో ఉన్నత మయిన సృజనాత్మకతకు అధిపతి శుక్రుడు. అందుకే మన పురాణాలలో శుక్రుడికి మరో పేరు ఉంది. అది కవి. దీనికి కు ముందు కలిపితే కుకవి ఏర్పడుతుంది. కుమతి కూడా ఇలాటి పదమే. కు శబ్దమునకు పృథ్వి అని అర్థము. పృధ్వీ తత్త్వము అంటే ఎప్పుడు భౌతిక స్థాయిని దాటాడు. తను ఎంత సేపు ఎలా బ్రదకాలి, ఎలా తినాలి అని తప్ప పైకి ఎదగని వారి స్థితిని కు శబ్దము సూచిస్తుంది. భూమికి పుట్టిన వాడిని కుజుడు అంటారు. భూవలయాన్ని కువలయము అంటారు. తన దేహము తన ఉనికి ని మించి ఆలోచించ లేని ఈ వర్గము లోనికి వస్తారు. వీరు పూర్తి స్వార్థ పరులు.”
“మరి దానికి ఉదాహరణ చెబుతారా?”
“నేను చెప్పిన బుద్ధుడి కథనే మరొకరు ఇంకో రకముగా చెప్పడము విన్నాను. ఒకరు బుద్ధుడి దగ్గిరకు వెళ్లి “దేవుడున్నాడా?” అని అడిగితే “లేదు” అని చెప్పినారుట. “మరొకరు వెళ్లి దేవుడు లేడు కదా?” అని అడిగితే “ఉన్నాడు” అని చెప్పినారుట. ఇది నేను ఇప్పుడు నేను చెప్పిన కథకు పూర్తిగా వ్యతిరేకము. వారు చెప్పిన దానికి వ్యతిరేకముగా చెబితే బుద్ధుడు వారి అంతరంగములో విమర్శ పెంచాలని ఇలా చెప్పినారని ఆకథలో చెబుతారు. ఇక జ్ఞాన సముపార్జనలో రెండు మార్గములున్నాయి. అందులో మొదటిది ధ్యాన మార్గము. ఇందులో ఎటువంటి సంఘర్షణ  ఉండదు. ఈ మార్గములో మనస్సు లోతులకు వెళితే మనలో అంతః శక్తులు మేలుకొని వారిని సరి చేస్తాయి. ఇక రెండవది సంఘర్షణ మార్గము. ఇది చర్చ తో కూడినది. ఏది సరి అయినది అని చర్చిస్తూ అవసరమయితే తలలు పగుల కొట్టుకొనే మార్గము. బుద్ధుడి మార్గము మాత్రము ఇది కాదు. ఆయన పద్ధతిలో తర్కానికి స్థానము లేదు. అనుభూతి మాత్రమె ప్రధానము. వ్యతిరేక మార్గములో జవాబు చెప్పుట బుద్ధుడి మార్గము కాదు. ఇది ఎవరిదో స్వయం కల్పితము. ఇక అసలు విషయానికి వస్తాము.”
ఒకప్పుడు కాశ్మీరము శైపాగమ శాస్త్రాలకు ప్రసిద్ధి. విజ్ఞాన భైరవ తంత్రము, శివ సూత్రాలు వంటి గ్రంథాలు అక్కడి నుండే వచ్చినవి. ఇందులో విజ్ఞాన భైరవ తంత్రము లో జగన్మాత పార్వతి పరమేశ్వరుడిని ఎన్నో ప్రశ్నలు వేస్తుంది. ప్రతి ప్రశ్నకు ఒక సాధనా మార్గమును శివుడు జవాబు గా ఇస్తాడు. ఇందులో ఒక సాధనా మార్గమే బౌద్ధము లోనికి వచ్చింది.”
“ఇవన్నీ ఎందుకు చెప్ప వలసి వచ్చిందంటే శాస్త్ర విషయాలను కూడా వక్రీ కరించుట చాలా జరిగిందని చెప్పడానికి. ఇక ఆహారము విషయానికి వస్తాము. మానవేతర జీవి మొదటి సారి మనిషిగా పుట్టినపుడు, గత జన్మ సంస్కారాలు తమతో తీసుకొని వస్తుంది. ఇక మాంసాహారముతో జీపించేటప్పుడు ఆ మాంసము గతములో ఎ జీవి దేహములో భాగమో  ఆ సంస్కారాలు కూడా అందులో చేరుతుంది. అందుకే వారి మానసిక స్థాయి ఎదగడానికి అడ్డు పడుతుంది. ఇక మాంసాహారపువంటకాలలో మసాలాలు కూడా దండిగా చేరుతాయి. నోరు లేదా నాలుక రుచి బాగుందని అంటూనే ఉంటుంది. ఇక బొజ్జలో మంట రేగుతుంది. అందుకే వారిలో కోపముతో బాటు ఇతర గుణాలు కూడా చేరుతాయి. బుద్ధి సునిసితత్వము తగ్గుతుంది.ఇక ప్రసార మాధ్యమాలు వ్యాపారానికి ఎన్నో వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నాయి. ఇక సినిమాల విషయము చెప్పనక్ఖర లేదు. ఒక సినిమాలో కథా నాయకుడు త్రాగుడు, క్లబ్ జీవితాల్లో హుషారుగా తిరుగుతూ కూడా చదువులో అందరికంటే ముందు ఉంటాడు. మరొక సినిమా లో కథా నాయిక అంటుంది,””నేను రోజు చికెన్ తింటున్నా నాకు ఫాస్ట్ మార్కు వచ్చింది” ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికీ వారే నిర్ణయించుకోవాలి.”
“ఇక ఆధ్యాత్మికత లో ఎదుగుదల వచ్చే కొద్దీ కొన్ని మార్పులు తమంతట తాము వస్తాయి. ముందు మాంసాహారాన్ని వదిలి వేస్తారు. తరువాత మసాలాలను వదిలి వేస్తారు. తరువాత వండిన ఆహార పదార్థాలను వదిలి వేసి పచ్చి కూరలకు వస్తారు. అటు తరువాత నీటిని మాత్రమె త్రాగే వారున్నారు. ఇక సూర్యుడి కిరణాలతో బ్రదికే వారున్నారు.
అటువంటి వారి ప్రజ్ఞలో తీవ్రమయిన మార్పు వస్తుంది. అది ఒకరు చెబితే తెలిసేది కాదు. స్వంత అనుభవములో తెలిసేది.
ఈ ఆహారము మంచిదనేది ఒకరు చెబితే తెలిసేది కాదు. అందుకే విని, చేసి, ఎవరూ నేర్చుకోలేరు, అది వారి అనుభవానికి అందితే తప్ప.
ఇక భూమి మీద  ప్రశాంతతకు సహకరించాలనుకున్న వారు, ఆవేశము ప్రశాంతత కావాలనుకున్న వారు ఏదో ఒక రోజు శాకాహారానికి రాక తప్పదు. ఇది శాసనము కాదు.
ప్రకృతి యొక్క అనుశాసనము..”
                     ***************************