Monday, November 14, 2016

యంత్రాలు వస్తున్నాయి జాగ్రత్త. 1


          ఇదేమి పేరు అనుకుంటున్నారా?
గతములో ఒక రచయితా నత్తలు వస్తున్నాయి జాగ్రత్త పేరుతొ  ఎదో వ్రాసినట్లు గుర్తు. మరి అంత ప్రముఖ వ్యక్తీ వ్రాసిన రచనను కూడా గుర్తు పెట్టుకోలేని  మీకు సాహిత్యముతో ఏమి సంబంధమని అంటున్నారా? రావణుడిని, దుర్యోధనుడిని కర్ణుడిని మహా నాయకులుగా అంగీకరిస్తున్న ఇప్పటి సాహిత్య వేత్తల ముందు నేను ఏ విధముగా తుల తూగ లేను, క్షమించాలి.
అంతే కాదు, ఒక ఆధ్యాత్మిక వేత్తగా అనబడుతున్న ఒక వ్యక్తీ ఆవులకు ఉన్న రక్షణ మనుషులకు కూడా ఇవ్వడము  లేదని వాపోయినాడు. ఆయన మరిచి పోయినాడేమో? ఒక మనిషి మీద అత్యాచారము చేస్తే శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి.(అవి ఎలా అమలు చేస్తున్నారనేది మరో విషయము.)  కాని ఒక ఆవును రక్షించు కోవడానికి ఎటువంటి చట్టాలు లేవని.
ఆవును ఎందుకు రక్షించాలి? అది మనకు ఖాద్య వస్తువే అని వాదించే వాళ్ళు ఉన్నారు, ఉద్యమాలు లేపాలని అనే వారు ఉన్నారు. కానీ  నర మాంస భక్షకులు ఉన్న చోట మనిషిని మనిషి తిన్నా దోషము లేదు.
ఒకప్పుడు ఇంట్లో పని, బయట పని అన్నిటిని మనిషే చేసే వాడు. తల్లులు రుచి గా వండి పెట్టి, ఇంటిని అలంకరించి  ఉంచితే మగ వారు పొలానికి వెళ్లి పని చేసే వారు. అక్కడ వారికి తోడుగా ఎద్దులు పొలానికి దుక్కి పని చేసేవి, పొలము  నూర్పిడి లో పని చేసేవి, పంటను బండిలో వేస్తే ఇంటికి ఆ బండి ని లాగు కొని వచ్చేవి. వాటితో ఎంత అనుబంధము ఉండేదంటే  “ఒరే రాముడూ!” అంటే ఎద్దు పరిగెత్తుకొని వచ్చేది. వాటికి ముద్దు ముద్దు గా పేర్లు పెట్టుకొని వాటిని పిలుస్తూ యజమాని వాటిని ఎంతో ప్రేమగా చూసే వాడు. అవి పడిన కష్టానికి ఇంట్లో తగిన ప్రతిఫలముండేది. అందుకే అవి కుటుంబ సభ్యులుగా ఉండేవి.
ఒకప్పుడు ప్రజల సంపదను వారికున్న పశు సంపదతో కొలిచే వారు. మహాభారతములో పశు సంపద కోసము ఉత్తర మరియు దక్షిణ గోగ్రహణ యుద్దాలు జరిగినాయి. ఇప్పటికి శ్రీ కాకుళము జిల్లాలో ఆవులను సొమ్ములని అంటారు. ఇక్కడ మరొక సంఘటన గురించి చెప్పాలి. ఇది నా బంధువు ద్వారా తెలిసింది. మహారాష్ట్ర లో ఒక  రైతుకు చాలా పశువులు ఉండేవి. అడవిలో మేస్తున్న పశువులు ఒక రోజు  మిట్ట మధ్యాహ్నమే మేత మాని వేసి, కాపర్లు అడ్డము పడినా ఆగకుండా ఇంటికి పరుగెత్తుకొని వచ్చినాయిట. విచిత్రము ఏమిటంటే వాటి యజమాని  అంతకు ముందే చని పోయినాడు. అవి అంతగా ప్రేమించిన ఆ యజమాని చని పోయినాడని వాటికి ఎ చైతన్యము తెలిపిందో తెలియదు. ఇంకొక సంఘటన. ఒక సారి బస్ ఎక్కించడానికి వెళ్లి అక్కడ పుచ్చ కాయ  ముక్క ఒక ఆవు దూడకు పెట్టినాను. వెంటనే ఆ దూడ పరిగెత్తుకుంటూ వెళ్లి మరి కొన్ని దూడలను పిలుచు కొని వచ్చింది. వాటికి కూడా పుచ్చ కాయ ముక్కలను ఇప్పించే వరకూ అవి నన్ను వదిలి పెట్ట లేదు.
పాశ్చాత్య దేశాలలో పశు మాంసాన్ని భక్షించే వారు ఎక్కువ. వారికి పశువులతో ఎటువంటి అనుబంధము లేదు.  మన రాష్ట్రములో  కూలీ పని చేసే వారు తక్కువై పని వారు దొరకనందు వలన యంత్రాలు పొలాలలో దిగినవి.  పని వేగము పెరిగింది . లోతుగా తవ్వుట వలన భూమిలో సారము బయటకు వచ్చింది. రసాయనిక ఎరువుల వలన సహజముగా ఉన్న నేల సత్తువ తరిగింది. అందు వలన  అదే పంటకు పూర్తిగా రసాయనిక ఎరువులు వాడ వలసిన పరిస్థితి వచ్చింది. వీటి వలన పంటకు సహజముగా ఉన్న రోగ నిరోధక శక్తి తగ్గి అవి పురుగుల దాడికి గురి అయి, ప్రత్యేకముగా వాటి కోసము పురుగు మందులు వాడ వలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ పంటలను తిన్నందు వలన మన దేహము లోనికి ఈ ఆహారముతో బాటు పురుగు మందులు కూడా ప్రవేశిస్తున్నవి.
ఈ పరిస్థితి వ్యవసాయ రంగము లోనే కాక అన్ని రంగములలో ప్రవేశించింది. సంపద పెరిగే కొద్దీ ఇంకా సంపద కావాలి. ఇంకా.. ఇంకా.. దీనికి అంతు లేదు అన్ని రంగాలలోనూ ఆధునిక యంత్రాల వాడుక పెరిగింది. కమ్మరి, కుమ్మరి, చాకలి వీరి వారి అవసరము సమాజానికి లేదు. అన్ని రంగాలలోనూ యంత్రాలు రోబోలు ప్రవేసించినవి. గుమాస్తాలు పోయి అన్ని రంగాలలోనూ కంప్యూటర్లు వచ్చినవి.ఇంట వరకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల పేరుతొ కంప్యూటర్లకు ప్రోగ్రామ్లు వ్రాస్తున్నారు. త్వరలో కంప్యూటర్లకు కంప్యూటర్లే వ్రాయ వచ్చు అని అంటునారు. అటు తరువాత స్థాయి ఏమిటంటే కంప్యూటర్లు మన చేత మనుషుల చేత పనులు చేయించ వచ్చును.
అందుకే అంటారు, మనుషులు  అద్భుతమయిన యంత్రాలను తయారు చేసినాడు. కానీ మనస్సు కలిగిన మనిషిని తయారు చేయ లేక పోతున్నాడు. ఇంకా మనిషి తను పెంచు కొనే సంపద కోసము కుటుంబానికి , సమాజానికి దూరమవుతున్నాడు. పిల్లల భాద్యత కూడా వదిలి వేసి వారిని కార్పోరేట్ కళాశాలలకు వదిలి వేసి తను వారి కోసము ఎంతో త్యాగము చేస్తున్నానని అనుకుంటున్నాడు. కానీ మానవ సంబంధాలను వారికి నేర్ప లేక పోతున్నాడు. ఇంక పిల్లలు  పోటీ పరీక్షలలో రాంకుల కోసము కష్ట పదుతూ మిగిలిన విషయాలను అన్నీ వదిలి వేసి ఒక రకముగా చెప్పాలంటే యంత్రము లాగా తయారవుతున్నాడు. ఇంక కార్పోరేట్ కళాశాలలు పోటీ మనస్తత్వాని పెంచుతూ పిల్లలకు జీవితమంటూ లేకుండా చేసి యంత్రాలలాగా చేస్తున్నారు. వారిలో సృజనాత్మకతను వివేకాన్ని మాత్రము పెంచ లేక పోతున్నారు.
ఈ యంత్రాలు ఎ పని అయినా చేయ గలవు, కానీ తోటి మనిషిని ప్రేమించ లేవు. కారణము, వీటిని తయారు చేసే వాడికి కూడా ప్రేమ అనే పదాన్ని మరచి పోతున్నాడు. భవిష్యత్తులో యంత్రాలకే అధికారమనిపిస్తుంది. అయినా ఈ యంత్రాలు ఎవరో కాదు మన తోటి మనుషులే. అందుకే గుర్తు పెట్టుకోండి.

                                      యంత్రాలు వస్తున్నాయి జాగ్రత్త.