Friday, August 17, 2018

ప్రస్థానము8




గొపీ ఒక సారి తన  బాంక్ అకౌంర్ చూచుకున్నాడు. తన జీవన విధానము వలన  బాగానే గుల్చుకున్నాడు. సుమారుగా  ముప్పయి  లక్షల వరకు తన ఖాతా లో ఉంది. తండ్రి ఇంకా ఉద్యోగమూ లోనే ఉన్నాడు. అందుకని ఆర్ధిక పరమయిన ఒత్తిళ్ళు  ఏమీ లేవు. తల్లి  ఇంటిని చక్కగా చూచుకుంటూ సాహితీ సేవ చేస్తున్నది. తను వచ్చిన కుటుంబము వలన సాంప్రదాయాలు, విలువలు అంటే  తల్లిక్ మక్కువ ఎక్కువ.
తాతగారి  దైనందినులు  గోపీని ఎక్కువ  ప్రభావితము చేస్తున్నాయి. ఒకప్పుడు పచ్చని పొలాలతో ఏంటో మందిని పోషించన ఆ ఊరు ఖాళీ అయి పోతున్నది. వెళ్లి పోయిన వారు పోగా అనుబంధము పెంచుకున్న వారు ఊళ్ళో బ్రదుక లేక బయటికి వెళ్ళ లేక బాధ పడుతున్నారు.  మంచి నీరు కూడా దొరకక ఉప్పు నీరు త్రాగుతున్నారు.
ఇన్ని మార్పులు వచ్చిన తరువాత కూడా తమ కుటుంబానికి చెందిన  ఆస్తులు ఇంకా ఆ ఊళ్ళో  ఉన్నాయి. .ఉప్పులు తేలిన తమ పంట  పొలాలలో ఇప్పుడెవరూ పంటలు వేయటము లేదు. పని చేయడానికి  కూలీలు కూడా దొరుకుట లేదు. పాడు బడిన  తాత గారి ఇంటి చుట్టూ ఇసుక దిబ్బలున్నాయి. అది ఎవరికీ అమ్ముడు పోలేదు, ఖాళీగానే యున్నది. వరకవి పూడి చెరువు నుండి పంజల మడుగు ద్వారా వచ్చే నీరు కూడా తగ్గిపోయినది. ఏమని అడిగే  సత్తా ఎవరికీ లేదు.
ఒక సంవత్సరముగా తన  ఆలోచనలు అన్నీ ఆ ఊరి చుట్టే  తిరుగుతున్నాయి. అక్కడే ఉండాలంటే  అమ్మా నాన్నా ఏమంటారో అన్న భయము. చెల్లెలు మాత్రము తనను హుషారు చేస్తున్నది. “అన్నయ్యా! ముందు నువ్వు వేళ్ళు, తరువాత  నేనూ వచ్చేస్తాను.”అంటున్నది.
ఒకసారి అమ్మతో ప్రస్తావించినాడు.
“అమ్మా! తాతగారున్న ఊరికి ఒక సారి వెళ్లాలని ఉంది.”
“ఇటీవలే  వెళ్లి వచ్చావు కదా!”
“అక్కడే కొన్నాళ్ళు  ఉండాలని ఉంది.తాతయ్య ఉన్నపుడు ఆ ఊరు ఎంత బాగుండేదో? నీకు తెలుసు కదా!”
“అక్కడకు వెళ్లి  ఎక్కడుంటావు? ఏమి  చేస్తావు? ఇల్లు అంతా కూలి పోయింది కదా!”
అమ్మ గొప్పతనము ఇదే. మరోకరయితే, చేతిలో మంచి ఉద్యోగమంటే, దాన్ని చూచుకోకుండా, ఇవేమీ ఆలోచనలని అనే  వారు. ఆ మాట అమ్మ నోటి నుండి  రాలేదు.
“ఆ ఊరిని తిరిగి పైకి లేపాలని  ఉందమ్మా! మళ్ళీ ఆ ఊరిని ఆదర్శ గ్రామముగా మార్చాలని ఉంది.”
“ఆదర్శాలు బాగానే ఉంటాయి నాన్నా! అవి చేయడానికి తగిన పరిస్థితులు కూడా ఉండాలి కదా! అంతే కాదు, మాకు కూడా నీ మీద కొన్ని ఆశలు ఉంటాయి. నీవు స్థిర పదాలని, నీకు పెళ్లి చేయాలనీ’
“అమ్మా! నీ మాటను ఎప్పుడయినా కాదన్నానా?”
“అంటే”
“నాకు ఒక సంవత్సరము  సమయాన్ని ఇవ్వండి. ఇవిగో ఇవన్నీ చూడు.” అన దగ్గిర ఉన్న వ్రాత  సంకలనాలనన్న్టినీ  ముందు పెట్టినాడు. “ఇవన్నీ ఒక సారి చదివి అప్పుడు నా అభిప్రాయము తప్పనిపిస్తే చెప్పమ్మా!”
అందులో తను అమెరికాలో వ్రాసుకున్న విషయాలు బెంగుళూరు లో తన స్నేహితులతో చర్చలు అన్నీ ఉన్నాయి.
ఒక క్షణము కొడుకు  నిర్ణయము శారదకు బాధను  కలిగించింది. ఈ నాడు తమకు ఎటువంటి  ఆర్ధిక పరమయిన ఒత్తిడులు లేవు. గొపీ తలచుకుంటే ఎటువంటి సంస్థలో నయినా వెంటనే ఉద్యోగమూ వస్తుంది. అంతే కాదు,కావాలంటే తనే  ఒక సంస్థను స్థాపించి  నిర్వహించ గలిగిన సత్తా ఉంది. అందుకే తగిన అమ్మాయితో వివాహము చేసి, ఇంట్లో కోడలు పిల్లలు తిరుగుతూ ఉంటె చూడాలన్న ఆశ ఉంది.
తనకు ఇంతకు ముందున్న భావ జాలము ఆమెకు గుర్తుకు వచ్చింది. విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని తను ఇంట్లో వాదించేది. “చదువుకున్న మనమే పట్టించుకోక పొతే  సమాజాన్ని ఎవరు పట్టించుకుంటారు?” అని వాదించేది. స్వామీ వివేకానంద యొక్క  భావ జాలముతో తన మెదడు ను నింపేసింది.
ఇదే ప్రశ్న ఇప్పుడు మళ్ళీ పైకి లేచింది. “ఎదో చేస్తానంటున్న కొడుకును  ఎలాగైనా  ఆపాలనుకుంటున్నది. అన్నీ తెలిసిన మనమే  ఏమీ చేయక పొతే  మరెవరు పట్టించుకుంటారు?
“అమ్మా! నీవు నాకు ఎన్నో చెప్పే  దానివి. నాన్న గారి దగ్గర కంటే  నీ దగ్గరే నేను ఎన్నో నేర్చుకున్నాను. ఈ దేశము, ఇక్కడి ఋషులు, వారి జీవన విధానము, యోగులు....వీరందరి గురించి  నాకు తెలిసింది నీ నుంచే. నా ప్రణాళిక  ఈ కాగితాలలో ఉంది. అన్నీ చదువు. ఆ తరువాత కూడా నీ మాట కాదని నేను ఏదీ  చేయను.ఎందుకంటే నాలో నున్న భావ జాలము నీ నుండి వచ్చిందే.
ఇంక శారదకు ఏమి చెప్పాలో తెలియ లేదు. ఒక వైపు ఆదర్శాలు, మరొక వైపు ఆశలు.
మామ గారి దైనందినులు తను కూడా చూచింది.గొపీ ప్రణాళికలన్నిటినీ ఒక సారి చూచింది.
భర్త శ్రీనివాసు చదువు ఉద్యోగమూ తప్ప వేరే వాటిని గురించి ఆలోచంచే వాడు కాదు. ఆయనతో ఈ విషయమై ప్రస్తావించింది. మొదట ససేమిరా వద్దన్నాడు. వరే చోట ఉద్యోగములో చేరమన్నాడు.
నెమ్మదిగా స్వంత ఊరి మీద అభిమానముతో సరే  అన్నాడు, అదీ కొన్ని షరతులతో. అవసరమయితే తనూ శారద  అక్కడే ఉంటె బాగుంతున్దన్నాడు. అందుకని తను పదవీ విరమణ కోర వచ్చును. కానీ కూతురు ఉమ చదువు పూర్తీ కాలేదు. ఈ సమయములో ఉమకు తమ అవసరము ఎంతయినా ఉన్నది. అందుకే నీర్నయము తీసుకోలేక పోయినాడు.
చివరకు ఒక మాట చెప్పినాడు.అక్కడ ఉండుటకు ఒక ఇల్లు కట్టి , అది పూర్తీ ఆయె వరకు తన ప్రణాలికను వాయిదా వ్సుకోమన్నాడు.
ఈ నిర్ణయము కఠినమయినదే, కానీ, కాల ప్రవాహములో వచ్చే మార్పులకు అందరూ కొట్టుకొని పోయే వారే. ఆగి, ఆలోచించే వారు కనిపించుట లేదు. ఒక వినోబా భావే, ఒక రాజేంద్ర సింగ్,... ఇటువంటి వారే చరిత్రలో నిల బడుతారు. మిగిలిన వాళ్ళు కాల ప్రవాహములో కట్టుకొని పోతారు.
మన పురాణ పురుషులలో ఒకరయిన బలి శుక్రాచార్యులతో అంటారు.
“కారే  రాజులు   రాజ్యముల్ గెలువరే  గర్వోన్నతిన్  పొందిరే
వారేరీ  సిరి  మూట  గట్టుకొని  పోవం జాలిరే  భూమిపై
పేరైనన్ గలదే శిబి ప్రముఖులున్  ప్రీతిన్ యశః  కాములై
ఈరే  కోర్కెలు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా! 
ఒక్క క్షణము అనిపిస్తుంది,”శిబి లాంటి  వారు  కీర్తి  కోసము  ఈ పని చేసినారా?” అని. నిజానికి  అది కారణము కాదు.ఆర్తి తో అడిగిన వారికి ఇచ్చుట వారి ప్రవృత్తి. తీసుకున్న వారి ముఖములో  ఆనందాన్ని వారు పంచుకుంటారు. అంతే కానీ, ఇది పాపమా, పుణ్యమా,అని ఆలోచించే సంస్కారము వారికి లేదు.
బలి కూడా ఇటువంటి సంస్కారానికి గుర్తు. కానీ శుక్రాచార్యుడు భౌతిక ప్రపంచాముకు ప్రతినిధి. అందుకే బలి రాక్షస రాజు అయినప్పటికీ ప్రాచీన చరిత్రలో చిర స్థాయిని అందుకున్నాడు.
శ్రీనివాసు ఒక సారి పైనంపురము వెళ్ళినాడు. తరువాత తహసిల్దారు కార్యాలయములో తమ ఆస్తి హక్కులకు సంబంధించన కాగితాలన్నీ సేకరించినాడు. మూడు గదులు, వంట గది సమావేశపు  గది ఉన్న ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకున్నాడు.


Tuesday, August 7, 2018

ప్రస్థానము 7




ఒక  సారి  అక్కడ  ఇసుక  దిబ్బల మీద నడుస్తుంటే

“ఎవరబ్బాయివి నీవు?” ఎవరో ఒక ముసలాయన అడిగినాడు.

“శ్రీనివాస్  కొడుకును తాతగారూ!”

“గోపాల  కృష్ణయ్య మనుమడివా? అనుకున్నానులే.అయినా ఇక్కడేముందని వచ్చావు? అన్నీ వదిలి వేసుకొని అందరూ వెళ్ళిపోయారు కదా.”

“ఒక సారి  మా తాత గారున్న ఊరిని చూచి వేళ్ళుదామని  వచ్చాను. అయినా  ఇంకా  మా పొలాలు అమ్మి వేయ లేదు కదా.”

“ఇప్పుడు అమ్మాలన్నా కొనే  వారు ఎవరూ లేరు. ఎవరో  ఫాక్టరీలు  పెడితే  కొందరు అమ్ముదామని  అనుకున్నారు. ఫాక్టరీలు పెట్టారు, మూసేసినారు. తిరిగి వెళ్ళి పోయినారు.”

“ఎందుకని  తాత గారూ!”

“ఆళ్ళు ఫాక్టరీలు పెట్టగానే ఇక్కడ జనాలకు జబ్బులు  చేసి వళ్ళు  పాడయి  ఊరు  ఖాళీ  చేసి  వెళ్లి ఖాళీ  చేసి  వెళ్లి పోయినారు. ఇంకా ఫాక్టరీలు పెట్టిన  వారు ఊరు  పాడయిన తరువాత అనుకున్న లాభాలు రాలేదని, అన్నీ వదులు కొని వెళ్లి  పోయినారు. ఇంతకూ  మీ  నాన్నగారు  ఇక్కడే  పుట్టినాడు. అప్పుడప్పుడు  రావచ్చు కదా! అయినా  ఇక్కడ ఏమున్నదని  వస్తాడులే.”,  ఆయన  గొంతులో  బాధ కనిపించింది.

మళ్ళీ అన్నాడు. “మీ  తాత గారిల్లు తెలుసా? అందులో  పడి పోయిన గోడలు, ఇటుకలు మిగిలినాయి. అందరూ  ఆ కనిపించే  బావిలో నీరే వాడే  వారు. ఈ  ఊరికి ఏమి కర్మ వచ్చిందో  కానీ, రొయ్యల చెరువులు వచ్చిన తరువాత, ఆ నీరు ఉప్పగా తయారయింది.”

“ఇక్కడ  పశువుల  కొఠాము ఉండేది. ఇక్కడ  గడ్డి వాములు ఉండేవి.” దూరముగా ఉన్న ఇంకో నూతిని  చూపించినాడు,” ఆ  బావిలో నీరు అమృతము లా  ఉండేవి. అన్నీ ఉప్పులుగా తయారయినాయి.  ఆ పక్కనే  ధాన్యపు మిల్లు చాలా పెద్దది ఉండేది. ఇవన్నీ ఇప్పుడు కథలుగానే మిగిలి పోతాయి.  చెప్పినా ఎవరు విన్తారులే.”
“మా తాత  గురించి కాస్త చెబుతారా?”

“ఆయన  కేమి? ధర్మాత్ముడు. పెద్ద  ఆస్తులు ఏమీ లేవు, కానీ అందరూ తెలుసు. తనకున్న కొద్ది పోలముతో గుట్టుగా  గడుపుకొనే వాడు. ఊళ్ళో  పోస్టాఫీస్  స్కూలు ఆయనే  పెట్టించాదనే వారు. కొత్తగా  ఎరువు బస్తాల  రూపములో  రసాయనిక ఎరువులు వచ్చినపుడు, అధిక దిగుబడులు వస్తాయని అందరూ ఎగబడితే,  సేంద్రియ ఎరువులే మంచిదని, మన ఆరోగ్యము, ఆదాయము  వ్యాపారస్తుల చేతుల్లో పెడుతున్నామని ఆయన ఏంటో చెప్పినాడు. ప్రకృతి సహజమయిన పంటలను వదిలి వేసి, హైబ్రిడ్  పంటలకు వెళ్ళినపుడు ఇంకా బాధ పడినాడు. ఇంక మన విత్తనాలు కూడా ఉండవని రైతుల బ్రతుకు వ్యాపారస్తుల చేతుల్లో తెల్ల వారుతుందని అన్నాడు. ఎవరూ వినిపించుకోలేదు.”

“ ఆ  రోజుల్లో  మొలగొలకులు, కేసర్లు ముఖ్యమయిన పంటలు. అందులో మొలగొలకులు పంట  తో వచ్చిన బియ్యపు రుచే వేరు. వాటిని రాజనాలు అనే వారు. ఇంక కేసర్లు ఎఱ్ఱ కేసర్లు తెల్ల కేసర్లు అని రెండు రకాలు. వీటన్నిటికి బియ్యపు గింజ పెద్దది. అందుకని వంటలో  ఉడకటము కూడా ఆలస్యము. వాటికి సేంద్రియ ఎరువుల వాడకములో తెగుళ్ళు వచ్చేవి కాదు.  ఇంక  హైబ్రిడ్  పంట వచ్చిన తరువాత తెగుళ్ళకు విపరీతముగా మందులు వాడ వలసి వచ్చేది. ఎరువుల ఖర్చుతో  బాటు ఈ ఖర్చు కూడా పెరిగింది. ఇవన్నీ చూచినా మీ తాత రైతులను షాపుల వాళ్ళు దోచుకుంటున్నారు రా అనే వాడు.”

“మా చిన్నప్పుడు  ఎప్పుడయినా దాహము వేస్తే  పొలములో నీరు ధైర్యముగా తాగే వారు. ఇప్పుడు ఆ పొలాల్లో పురుగు మందుల వాసననే భరించ లేక పోతున్నాము. అన్ని  రకాలుగాత్రాగడానికి నీరు కూడా లేకుండా  బాధ పడుతున్నాము. మా  లాటి  వాళ్లకు ఉన్న ఊరు  వదిలి పెట్టి  వెళ్లడము ఇష్టము లేదు. వెళ్లి  ఎలా బతకాలో  తెలియదు. ఇంక ఉన్న కొద్ది రోజులు  ఎలాగో  గడిపి వేస్తే చాలు అనుకుంటున్నాము. “

“ఇంకో  ఊరు  వెళ్ళ వచ్చును కదా” అని అడగ పోయి ముందే  వచ్చిన జవాబు వలన మాట్లాడ  లేక పోయినాడు.
ఇంతలో సముద్రము వైపు నుండి ఎవరో వస్తూ ఉంటె ఆ  ముసలాయన పిలిచి “మన  గోపాల  కిష్టయ్య మనుమడు. చూ చావా” అన్నాడు.

“ నీ  పేరేమిటి  బాబయ్యా!” వాళ్ళు  అడిగినారు.

“గోపాల కృష్ణ.”

“తాత గారి పేరే. అందుకే కాబోలు. మనలను చూడడానికి వచ్చాడు” అన్నారు. ఆ మాటల్లో వారికి తాత మీద ఉన్న అభిమానము కన బడినది.

“ఎప్పుడొచ్చారు  బాబయ్యా! ఎప్పుదోచ్చారో ఏమో? కాస్త మజ్జిగ తాగండి. రండి. అదే మా ఇల్లు “వాళ్ళ మర్యాదకు ఆశ్చర్య  పడినాడు.

నులక మంచము వాల్చి కూర్చోమని అన్నారు.

ఒకరు తాటాకు  బుట్ట లోంచి  కొన్ని తాటి ముంజలు తీసి ఆకులో పెట్టి  తినమని ఇచ్చినారు.

“ అప్పుడు మీ తాత గారి  మాటలు విని  ఉంటె  ఇప్పడు ఇంట దరిద్రము వచ్చేది కాదు బాబయ్యా!” ఒకరన్నారు.
పేదరికము నిండిన వాళ్ళ జీవితాలలో కూడా వారు చూపించిన అభిమానానికి  కళ్ళల్లో తెలియకుండానే  నీరు పైకి ఉబికింది.

“మీ తాత గారు  మాకు ఏంటో చేసే వారు. ఎవరికైనా ఒంట్లో నలత వస్తే  ఆయనే చిన్న చిన్న మందు ఇచ్చే వాడు. అవసరమయితే తమ ఎడ్ల బండిలో పక్క ఊరికి పంపించే వాడు.. ఇప్పుడు మమ్మలను పట్టించు కొనే వారే లేరు. జబ్బు చేస్తే మూడు మైళ్ళు వెళ్ళాలి.”

వాళ్ళ పరిస్థితిని చూస్తె జాలి వేసింది. పరిశ్రమలు, రొయ్యల చెరువుల పేరుతొ పంట  పొలాలు చవుడు భూములుగా మారినాయి. అక్కడక్కడ ఏవో  చిరు ధాన్యాలు పండిస్తున్నారు.అందుకు కూడా నీరు లేదు.
కొంత మంది అత్యాశకు  ప్రభుత్వపు నిరాసక్తతకు  పంట భూములు చవుడు భూములుగా మారినాయి. ఎవరు మాత్రము ఏమి చేయ గలరు?

వాళ్ళలో మార్పు కోసము ఆర్తి  ఉంది, ఆకలి ఉంది,  ఆ నేల వదిలి పెట్టి వెల్ల కూడదన్న ఆకాంక్ష ఉంది. వేరిని చూచే ఏమో,  ఋషి వాక్యము వచ్చింది,” జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాదపి గరీయసి.”

వాళ్ళు అక్కడే  ఆ నేల  కౌగిళ్ళలో ఎదిగినారు. అందుకే బయటకు వెళ్ళ లేక పోతున్నారు.
తాతగారు అదృష్ట వంతులు. చని పోయిన తరువాత కూడా వాళ్ళలో  జీవిస్తున్నారు.
ఒక్క క్షణము అనిపిస్తుంది,వీరి కోసము ఏదయినా చేయాలని. మరో క్షణము ఎదో నైరాశ్యము,”తానూ ఏమి చేయ గలడు?”