Thursday, February 28, 2013

ఎవరు భాధ్యులు


                                          

                                            

            దేవ లోకములో అత్యవసర సమావేశము జరుగుతున్నది.  ఇంద్రుడితో అష్ట దిక్పాలకులు
ఇతర అధిస్థాన దేవతలు అందరూ సమావేశమైనారు. భూమి యొక్క అధిస్థాన దేవత అయిన
భూ దేవి నుండి సమర్పించ బడిన ఒక వినతి పత్రము మీద చర్చ జరుగుతున్నది. అందులో సమస్య ఒక్కటే,
"భూమి  మీద వర్షాలు సరిగా అడుట లేదు, కరవు కాటకాలతో భూమి మీద జనము అల్లాడి పోతున్నారు."
            ఇంద్రుడు వరుణ దేవుడి వైపు చ్చినాడు," ఎవరూ వర్షము కావాలని అడుగుట లేదు ప్రభూ!",
వరుణుడి నుండి జవాబు వచ్చింది.
            "మరి, ఈ వినతి పత్రమేమిటి?", భూ దేవి వైపు చూచినాడు.
            "వర్షాలు  పడితే గాని, భూమి మీద పరిస్థితులు చక్క బడవు.", చెప్పింది  భూదేవి.
            రెండు వ్యతిరేకమైన జవాబులతో ఇంద్రుడు ఒక నిర్ణయానికి వచ్చి ఇలా అన్నాడు.
            "భూమి మీద జనులు వర్షము  కావాలని కోరుకోవడము లేదు. ఈ మాట నిజమే, కానీ, వారికి
వర్షముతో అవసరము ఉన్నదన్న మాట కూడా నిజమే."
            దేవతలకు అర్థము కాలేదు, వారు ఆ మాటే అన్నారు.
            ఇంద్రుడు వివరించి చెప్పినాడు.
            "భూమి  మీద వర్షము లేదా నీటి మీద ఆధార పడి బ్రతికేది,  ప్రధానముగా రైతులు. వారికి కూడా
నదులకు ఆనకట్టలు కట్టి ప్రభుత్వములు నీరందిస్తున్నవి. అందు వలన వారికి వర్షాలు రాలేదన్న భావన కంటే  కాలువలలో నీరు వదల లేదన్న భావన ఎక్కువ యున్నది. అందు వలన వారు కూడా వర్షము రావాలని
కోరుకోవటము లేదు. నగరాలలో వర్షాలు పడితే కార్యాలయాలకు వెళ్ళే వారికి ఇబ్బంది. సాయంత్రమయితే
వినోదాలకు, విహారాలకు వెళ్ళే వారికి ఇబ్బంది. కానీ జల సరఫరాలో లోపమొస్తే మాత్రము నగరాధికారుల
మీద, ప్రభుత్వము మీద గొడవ చేస్తారు. మన దేవతలకు కూడా వారితో తిరిగి తిరిగి వారి ఆలోచనలకు
అనుగుణముగా చేయడము బాగా అలవాటయింది. ఇంక అధిక సంఖ్యాకులు నగరాలలో నుండి, పల్లెటూర్లలో
జనము తగ్గి పోతున్నారు. ఈ రకముగా దేవతలు కూడా అధిక సంఖ్యాకుల అభిప్రాయాన్నే  అనుసరిస్తున్నారు."
            "ఈ సమస్య ఎలా పోతుంది?", అందరూ అడిగినారు.
            "ఏ సమస్యా లేకుండా,  అలవాటు తప్పి పోకుండా, వర్షాలు ఎక్కువగా సముద్రములోనే కురుస్తున్నవి. అందుకే వరుణ దేవుడు వాయు దేవుడిని తోడు తీసుకొని సముద్రములో కంటే, నేల మీద ఎక్కువ వర్షాలు పడేటట్లు చూడ వలసినదిగా నిర్ణయము చేయడము అయినది.", అంటూ ఇంద్రుడు సభ చాలించినాడు.
            మేఘాలను అనుకున్న చోటికి నడిపించే భాధ్యత వాయుదేవుడిది. వర్షము కురిపించేది వరుణ దేవుడిదే. ఇద్దరూ ప్రపంచము అంతా తిరగడము మొదలు పెట్టినారు.
            ఒక చోట పొలాలు బాగా ఎండి పోతున్నవి. కాలువల్లో నీరు లేదు. పక్క వాడితో యజమాని
అంటున్నాడు. "ఈ ప్రభుత్వము ఇంకా కాలువల్లో నీరు వదలనంటున్నది. ఈ సంవత్సరము ఎలా గడుస్తుందో?"
అని. చుట్టూ అలాగే చాలా పొలాలున్నవి. వాళ్ళ మాటలను దేవతలు విన్నారు. ఒక మేఘము అలా వచ్చింది.
అక్కడ బ్రహ్మాండముగా వర్షము పడింది. ఆ రైతులు చాలా సంతొష పడి యుంటారని వారు అనుకున్నారు.
కానీ, వారి మాటలు వేరుగా యున్నవి.,"ఈ పాడు వాన ఇప్పుడే రావాలా? లక్ష రూపాయల బట్టీ ఇటుకలు
ఎందుకూ పనికి రాకుండా పోయినవి.", దేవతలు నివ్వెర పోయినారు.  
            మరొక చోట ఊళ్ళో నీళ్ళ చెరువు ఎండి పోయింది. నీళ్ళూ ఎలా అందించాలా అని నగర పాలక
వర్గము నాల్గు రోజుల నుండి చర్చిస్తున్నది. ఇక్కడ ఖఛ్ఛితముగా వర్షము కురిపించాలనుకున్నారు.దగ్గిరలో ఒక పాథశాల. పిల్లలు ఆట స్థలములో వరుసల్లో నిల బడి యున్నారు. వారిని చూస్తే దేవతలకు చాలా ముచ్చట వేసింది. ఇంతలో మేఘాలు బాగా కమ్ముకున్నాయి. ఇప్పుడిక్కడ వర్షము పడితే, పిల్లలు
            వానా వానా వల్లప్పా
            చేతులు చాచూ చెల్లప్పా
            తిరుగూ తిరుగూ తిమ్మప్పా
            తిరగా లేనూ నరసప్పా
అని హాయిగా నాట్యము చేస్తారనీ, చూడ వచ్చని, దేవతలు అనుకున్నారు. కమ్ముకున్న మబ్బులను
చూచి పిల్లలు
            రైన్‌ రైన్‌ గో అవే
            కం అగైన్‌ అనదర్‌ డే
            లిటిల్‌ జానీ వాంట్స్‌ టు ప్లే.
            దేవతల ఉత్సాహము చల్లారి పోయింది. అంటే వీళ్ళకు కూడా వాన ఇష్టము లేదన్న మాట.
           
            మరి కాస్త దూరము వెళ్ళినారు. పెద్ద పెద్ద చెరువులు కనిపిస్తున్నవి. " ఈ ప్రాంతములో నీటి
కరవే లేదన్న మాట. ఏమన్నా కురిస్తే ఇక్కడే కురవాలి, ఇంకా కాస్త నీళ్ళు నిలువ వుంటాయి.", అనుకున్నారు.
దగ్గిఱకు వెళ్ళితే భయంకరమైన వాసన,వాసనలను మోసుకు వెళ్ళే వాయు దేవుడు కూడా ఆ వాసన
భరించ లేక తన ప్రభావము తగ్గించి వేసినాడు. ఇంకో వైపు చూచినారు. అప్పుడే రెండు లారీలు అక్కడ ఆగినవి. అందులోనుండీ కుళ్ళీన మాంసపు ముక్కలు, నత్తలౌ, చెత్త అంతా ఆ నీటిలో పోస్తున్నారు."అంటే ఇది
చెత్త కుండీ అన్న మాట", దేవతలు అనుకున్నారు. ప్రక్కనే గుడిసెలున్నాయి. "అయ్యో పాపము వీళ్ళు ఈ నీరే త్రాగాలేమో? ఈ వాసన అంతా వీళ్ళే భరించాలేమో?" ఇలా అనుకుంటేనే దేవతలకు వాంతి వచ్చినట్లయినది. మంచి వర్షము పడితే ఈ వాసన తగ్గి కాస్త మంచి జరుగుతుందనుకున్నారు. అంతే అక్కడ భయంకరమైన
వర్షము పడింది.
            మరుసటి రోజు పత్రికలలో ప్రధాన సంచికలో మొదటి పుటలో వచ్చింది,పెద్ద వర్షము వచ్చి
చేపల చెరువులకు చేపలు చని పోయి రెండు కోట్లు నష్టము వచ్చిందని. అంతే కాదు, ఇరవై వేల ఎకరాల
పంట పొలాలునీటిలో మునిగి పోయాయని జిల్లా ప్రతిలో ఎక్కడో చిన్న అక్షరాలలో వేసినారు. ఇది తెలిసి దేవతలకు ఆశ్ఛర్యమేసినది.కొంత ఆలోచించి నదీ జన్మ స్థానాలలో వర్షము కురిపించుదామని అనుకున్నారు.  కొండల మీద మంచి వర్షము పడింది. ఆ వడికి రాళ్ళు, బండలు క్రిందికి కొట్టుకు పోయి వచ్చినవి. అంతే గాక అంతకు మునుపే కట్టిన కొన్ని ఆన కట్టలు కొట్టుకొని పోయినవి. కానీ, చివరకు వచ్చేసరికి, రైతుల పొలాలకు మాత్రము నీళ్ళు ఎక్క లేదు. నీరంతా సముద్రము లోకే పోయినది.
          కొండల మీద అడవులు నరకి వేయ బడినందున మట్టికి బలము లేక బండలు రాళ్ళు,క్రిందికి దిగి వచ్చినాయని కొందరు శాస్త్ర వేత్తలు నిర్ధారించినారు, పత్రికల్లో వార్తా చానళ్ళలో వివరించినారు, అందుకే ఆన కట్టలు కూలి పోయినాయి అని అన్నారు. అడవులు నాశనం అయినందు వలన ఇది జరిగినదని ప్రచారము అయితే తమ క్రిందికి నీళ్ళూ వస్తాయని భయ పడిన నాయకులు వెంటనే ఒక తమపై విశ్వాసమున్న శాస్త్ర వేత్తల బృందాన్ని నిజ నిర్ధారణ కమిటీ గా వేసి ఆ కొండలూ, రాళ్ళూ, ఎందుకు విరిగి పడినాయో  నివేదీకలో సమర్పించాలని ఆదేశించినారు.
            "అయ్యో, వరదల్లో మా ఊరు కూడా మునిగి పోయిందా?",అని కలల అప్పా రావు కంగారు పడుతూ లేచినాడు.
            "అమ్మయ్య,  ఇదంతా కలేనన్న మాట", అని తేరుకున్నాడు.
            కానీ, వర్షము పడ కూడదు, నీరు కావాలి, అన్నీ ప్రభుత్వమే చూడాలి, మాకేమీ భాధ్యతలు  లేవనుకొనే మనో ప్రవృత్తి లేదా భావ కాలుష్యము వాతావరణ కాలుష్యము కంటే తీవ్రమనుకుంటూ   స్నానపు గది లోనికి వెళ్ళినాడు. కుళాయి తిప్పితే చుక్క నీరు కూడా పడ  లేదు.
                            ********************************





Wednesday, November 28, 2012

విముక్తి ( అహల్య4 )


                             

               శ్రీ రాముడు:  గురు వర్యా!
             విశ్వామిత్రుడు: శ్రీ రామా!
                  శ్రి రాముడు: నవ వసంత సుమ రుచులా,
                                 ననల తోడి పూవనులా,
                                 దరినున్న ఈ కుటీరము
                                 ఎవ్వరిదో? ఎవరిదో?
                                 ఏ మహర్షి దీక్ష ఫలము,
                                 ఏ సతిదీ కృషి ధనమ్ము?
                                 మనల వేగ రమ్మని,
                                 పిలుచునట్లు తోచేను.
                                 మరి మరి మము పిలిచేను.
                    లక్ష్మణుడు: నిజమే అన్నయ్యా!
                                      ఏదో చల్లని పిలుపు,
                                      పిలుచునట్లు అనిపించును.
                                      రా రమ్మని మనలను,
                                     పిలుచునట్లు అనిపించును.
                                      గుండెలలో నిండి యున్న
                                     ఆవేదన ఎద తోచును.
                 విశ్వా : (తనలో)
                              గుండెలలో వేదనలను
                              గుర్తించే స్వాములు
                              పిలుపులకే తనువు మఱచి
                              పులకించే వారలు,
                                    ' రామా! ' యని ఒక్క సారి
                              పిలిచిన చాలును కద ఇల
                              కరుణా దృక్కుల నెల్లెడ
                              పరికించి పలకరించు.
                              ఘన గౌతము సతి అహల్య
                             తన కొ!రకై వేల యేండ్ల
                              పర్యంతము వేచి చూచె
                              పల్కరించి మురిసి పోవు
                              శుభ మంగళ ఘడియలను
                              అనుభవించు స్థితి నాది.                                        
                                                

                                   (పైకి)
                               రామా! ఇది గౌతమ ఋషి
                              నివసించిన పుణ్య భూమి.
                              స్వయభువుడి ప్రియ సూతి,
                              స్వయముగ పెంచిన దీ వని.
                              అడుగిడి ఈ పుణ్య భూమి
                             అనుగ్రహించుమా సతిని.                          .                    
                            
                                (అందరూ)
                             రాముడి పద స్పర్శ తోడి,
                            శిలా రూపు దాల్చిన సతి
                            వెలికి వచ్చి శ్రీ రాముడి,
                            పదముల తాకెను మరి మరి.
                            ఈ శుభ క్షణముల కొఱకై,
                           వేచిన గౌతమ మహర్షి,
                           ఆ క్షణమున, అచ్చటకు,
                           అరుగు దెంచె వెను వెంటనె.
                           ఋషి దంపతుల ఆతిథ్యము
                           అందుకొనీ శ్రీ రాముడు,
                           తమ్ముడు, విశ్వామిత్రుడి తోటి,
                           ప్రవేశించె మిథిలా పురి.
                           గౌతముడికి అహల్య చేర్చి,
                           సీతను చేరగ రాముడు.
(ఈ అహల్యను నాట్య రూపకముగా ప్రదర్శించ దలచిన వారికి దీనిని వాడుకొనుటకు పూర్తి స్వాతంత్ర్యము కలదు. నాకు తెలిపినచో సంతోషకరము)
Email ID:         k.subbaramayya@gmail.com

Monday, November 26, 2012

నిజము


          

పయనించే ఓ బాట సారీ,
వెలుగెక్కడ చూపగ రావోయీ,
ప్రకృతి వెలుగు, ప్రజలకు వెలుగు,
మానవు జీవితమంతకు వెలుగు,
నేడూ, నాడూ, నిస్సంశయముగ,
రశ్మిమంతుడే నిజమగు వెలుగు,

సప్తకరుండగు సూర్యుడు వచ్చెను,
మిత్రు కరంబుల పద్మము విచ్చెను,
ప్రకృతి చర్యలు ప్రారంభవ మవ
ఈప్సితార్థమున కచ్చెరువందితి.

నల్లని మేఘము దినకరు కమ్మె,
వెలవెల్లగ పోయెను భాస్కరుడు,
ప్రకృతి యందలి ప్రాణుల చర్యలు,
స్తబ్దంబాయెను వెను వెంట

సూర్యుడి మించిన నిజమగు వెలుగు,
నిశ్శంశయముగ నీవే,
సుషుప్తిని చేరిన ఆత్మయే నిను
కలవర పెట్టెను ఈ నాడు

నీదు హృదయము ఒక పద్మము,
విచ్చిన కమలము లోనికి సొచ్చిన
సద్గుణ భ్రమరమ్మే వెలుగు,
నీలో మంచిని నిలుపుకొన్నచో,
జగతికి నీవే ఒక వెలుగు.
(దీనిని 1969 లో వ్రాసినాను)


Friday, November 9, 2012

అహల్య3


                                       

                   రుచిర: కల కల రవముల కదిలే ప్రకృతి,
                               కిల కిల పలుకుల కులికే చిలుకలు,
                   పూర్ణిమ: ఏది వసంతము, ఎక్కడ కోయిల?
                                     నీ ఊహలులే నిజము కావులే,
                                     ఆకులు రాల అడవులు సోలె,
                                     చూత వృక్షముల సొగదులు పోయె.
                   సుందరి: రవి కాననిచో కవి కాంచును లే,
                                  శిశిరము వెనుక వసంతము రాదా?
                                  మరు మల్లెల గాలులు ముక్కులు సోక,
                                  తెలియగ లేదా వసంతు పిలుపు.
                                     చక్కని ప్రకృతి సొగసుల చూచి,
                                     చిక్కి పోయెనోయ్‌ వెన్నెల రేడు,
                                     చైత్ర పున్నమికి వెన్నెల కళలను
                                    పుంజుక ప్రకృతినే మురిపింప.

                  రుచిర: ఈ కాలి బాటను చూచితివా? చెలి,
                              మరు మల్లెలు ఈశుని అలంకరింపగ,
                              చేయి తాకితే సోలి పోయేటి
                              శిరీష పుష్పములిల సోకినవి.
                              ఇవి పూచే కాలము హేమంతమని,
                              ఛాయా నాథుడి తీక్ష్ణత ఉండని,
                              మంచు సోకు కాలము లోనే
                              పెంచినాడు ఈశుడు వీటిని.
                 సుందరి:అంతేనా వాటికి ఈశుని
                               అనుగ్రహమ్ము లేనే లేదా?
                               భుజగ భూషణుడి సిగ పాయలలో
                               ఆది మాత కను సన్నలలో
                               అలరు సుఖమ్ము లేని అలరులా,                            
                               నవ సుకుమాలు శిరీష సుమాలు?
                    పూర్ణిమ: దరికి చేరని సుమ రాణులను
                                     తలచి కుములు శిరీష సుమాలను
                                     తననే తలచి, పూజించే,
                                     గడ్డి పూవును అనుగ్రహించాడు.
                   సుందరి: ఎవరు?
                   పూర్ణిమ:ఆర్తుల పలుకుల వినే స్వామి,
                                    పశునాథుడు, ఈశుడు, సర్వేశ్వరుడు.
                       రుచిర: చెలి, చూచావా,అటు చూచావా?
                                  ప్రతి చెట్టూ,ఎదిగి, ఎదిగి,
                                 ప్రతి పుష్పము వికసించి,
                                 ఈ ప్రకృతి సొగసులకు
                                  శ్రీ కారము చుట్టే నే.
                                 ఈ సుమ వసంత వీధిలో,
                                 ఈ వని వెల వెల పోయెను.
                                 ప్రతి పుష్పము పరిమళాల
                                 పఱచే గాలుల వడిలో
                                 పఱవశించు నీ వేళల
                                 కన రావే కోయిలలు.
                                 ఏదీ వసంత మిచట?
               సుందరి  ఇదిగో నొక పర్ణ శాల
                             లేదే సుమ వర్ణ మాల?
                            ఎవరో గృహస్థు ఇచట?
                             ఏమిటో ఈ వింత కథ?
            రుచిర: ప్రకృతి లాస్యము, వైపరీత్యములు,
                        నుదుటి వ్రాతలు తిరుగు లేనివి.
                        సుందర హర్మ్య నివాసము కోరిన
                        సతి కోరికనీశుడు తీర్చ గలిగెనా?
                        భూమండలమును ఏలిన నలుడు,
                        శని బారికి ఎదురుగ నిల్వ గలిగెనా?
                        విధాత ముద్దుల సూతి అహల్య
                        విధి విలాసముకు లొంగి పోయెను.
                 పూర్ణిమ:నే చెబుతా వినవే.
                                 సురపతి గౌతము రూపును దాల్చి,
                                 సుర లోకపు రీతుల భూమికి నడచి,
                                 గౌతము సతినే మోసగించెనే,
                                 భూలోకపు కట్టడినుటంకించెనే.
                                 అనుమానించిన పతిని కనుగొని,
                                 తన దోసము లేదని తెలుపుటం మాని,
                                 సతి దాల్చెను వెంటనె శిలా రూపము,
                                 సరి స్థితికై తాను ఎదురు చూచుచు.
                      ఎఱుపు దిరిగిన కన్నులతో తను
                      చూచిన గౌతము చూడ జాలక
                      దేహమంతట కన్నులు మొలిచే
                      సుర నాథుడి కంతట వణకు పుట్టెను.
                      శిలా సదృశత చెందిన సతి గని,
                      వగచెను యా ఋషి విధి గతికి,
                      తరలి వచ్చు శ్రీ రామ చంద్రుడి
                      పద స్పర్శతో క్షితి పులకింపగ
                      ఏల అహల్య వెలికి రాదు అని,
                       వేరొక చోట్కి వెళ్ళె ఋషి వరుడు.

Wednesday, October 10, 2012

వసంతాగమనము--అహల్య 2


                       
           
           
           
            సుందరి : ఎవరే,..... ఎవరే....
                        అట దాగినదెవరే....
                      విరిసిన పూవుల పొదల మాటున
                        పరిమళ లహరుల పొందు కోరుతూ..
                        ఎవరే ..........దాగినదెవరే......
              రుచిర: సూర్యుడు పైకి లేచిన వేళ
                     విరిసిన పూలు ఉండవా?
                     విరిసిన పూలను సోకిన గాలులు
                        పరిమళ లహరుల చిందవా?
              సుందరి: ఇది యే ఋతువే?......
              రుచిర:    ........వసంతమే.
             సుందరి:   నిజమేనా?
               రుచిర:    ఇది  సుమర్తువేనే .
             సుందరి: ఏది వసంతం? ఎక్కడ కోయిల?
                        ఆకుల రాలగ సోలే అడవి.
                       ఏది వసంతం? ఎక్కడ కోయీ?
               రుచిర : చూడవే అటు చూడవే..
                       పొదల మాటున దాగిన మన చెలి
                           పూర్ణిమ ముఖాన చూడు.
                      పుప్పొడి ఎల్లెడ సోకి పాకెనట
                           పూచిన పున్నాగ మ్రోల.
                       ఇది వసంత మేనే...
                          ఇది  సుమర్తువేనే .
                సుందరి:  మరి కోయిల గొంతుక ఏదే?
                        మద కోయిల గొంతుక ఏదే?
            పూర్ణిమ :సూర్యుడు తూరుపు సోకక ముందే
                          సుందర ప్రకృతి పొంగును చూచి,
                          విరిసిన రంగుల విరి కన్నియల
                           సొగసుల కన్నుల కాంచి,
                           తన సహజ ప్రకృతిని మఱచి కోయల
                            చూత వృక్షపు చిగురుల చేరక.
                           అందుకే
                          దిక్కుల చూచెనదే మరి కోయల
                           ఎటు పోవాలో తెలియక.
            పూర్ణిమ: చెలియా! సుందరి ఇటు రావే,
                      నను తరిమే భ్రమరుడి చూదవే.
            సుందరి: నీ ముద్దుల మోము చంద్రుడి పోల,
                       చంద్రుడి మోమున పుప్పొడి పొడల
                       ఆస్వాదించగ వచ్చిన భ్రమరుడి
                       కంతగ భయ పడనేల?
                       ఓ చెలి! విరి బాలా!
               సుచిర: సరదాగా ఉన్నదే....
                      విరులను చూచి పొంగిన కోయిల
                       ఇలనే మఱచేనే.
                      విరులనుకొని మన చెలి వెంట బడె
                       భ్రమరుడు ఇట నేడే......
            పూర్ణిమ: అటు చూడవే...........
            సుందరి:    ఏమిటే?
          పూర్ణిమ: కుహూ! కుహూ! కోయల వచ్చేనే
                      సుమ మల్లియలే విరిసేనే
                        నవ వసంతమే వచ్చేనే
                       నవ్యత ఎల్లెడ విరిసేనే.
            పూర్ణిమ: వలపులతో వికసించి,
                        పరిమళాల పంపించి,
                        భ్రమరుడి ధాటికి సోలి,
                         పరిపూర్ణత పొందె విరి.
            సుందరి: ప్రతి హృదయము పొంగగా
                           చెలి యెడద పులకించ,
                           నవ వసంతు జంట గాడి
                           చంద్రుడి చూపెను వరుడు.
            ముగ్గురు: ననలు వేసి, పూత పూసె,
                         నిలువెల్లా చూతము.
                            పూతను తిన్న కోయిలకు
                       భూతలమే  సుమవంతము.
                        ఇది వసంత మేనే,
                              ఇది  సుమర్తువేనే.
                 సుచిర: గరిక పూలు, శిరీషాలు,
                           గాలికి వలవల లాడెను,
                           చంద్ర మౌళి శిరసునందు
                            సుందరముగ దాగుటకా? 
              పూర్ణిమ: పొదల లోన పూసిన యా
                          మల్లికలు పిలువ సాగె.
                             అభిసారిక సిగలో నిలువ
                            అభిసారిక వోలె లేచి.
                  ముగ్గురు: ఇది వసంత మేనే
                              ఇది  సుమర్తువేనే .
                     
                    సుందరి: చూచితివా? ఓ చెలి చూచితివా?
                           తియ తీయని పరిమళాల
                           వెదజల్లే సుమ దళాల
                          సొగసుల సుందర హొయలను
                                                                           |చూచితివా|
            రుచిర: అడుగడుగున విరుల వాన
                       అణువణువున సిరుల సోన
                       తియ తీయని పరిమళాల
                       వెదజల్లే సుమ దళాల                           | చూచితివా
            పూర్ణిమ: విరివిరి పై వాలి వాలి
                      పొడి పుప్పొడి పైన సోలి,
                        రంగుల రెక్కల హొయల
                           పొంగులతో భ్రమరుడిని                 |చూచితివా|
                       తియ తీయని పరిమళాల
                         వెదజల్లే సుమ దళాల                  | చూచితివా|

              సుందరి: చిరు రసాల చిగురులను
                           చిరు బొజ్జకు పట్టించి
                           పొంగు హొరంగుల ప్రకృతి
                          పిలిచే కోయిల రాజును.            |చూచితివా|
                                                                          |తియ తీయని పరిమళాల|
                        నారాయణ నామమునే
                          పారాయణ చేయు ఋషులు
                          నవ వసంతు సొగసులలో
                          నవ లోకము చూచితిరే
                                 
                          మదనుడి విరి తూపుల
                         పదనుకు ఎద వేగ లేక
                         వరుడి కొఱకు వేచి చూచు
                           వధూమణుల వేదుకలో
                            మల్లికల వాసనలా
                            కలల కన్ను గీటేనా?
                           కొత్త కొత్త కోరికల
                          ఎడద వేచి చూచేనా?
                           చూడవే, అటు చూడవే......
                      తరాల ప్రకృతిలో
                         తరలి వచ్చు మార్పులతో
                        వాడి, వడలి, పర్ణ హీన
                        అయినది, ఈ పర్ణ శాల.
                        చూచితివా? ఓ చెలి చూచితివా?
                         (ఒక్కొక్కరు లోపలికి వస్తారు.)
            సుందరి: ముని కుటుంబ మిట నాడు
                        పచనము చేసిన పాత్రల
                         అవశేషములా ఇవి,
                        హా! విధి, ఎవరిది గృహము.

                          గాలులు ఈ నాటికైన
                          చొరబడ లేదేమొ గాని
                          ముని యొక్క దర్భ శయన
                          మిదె మరి చూడవె ఓ చెలి.
                          పూజా సుమముల నిచ్చెడి
                         మరుమల్లెల పొదలు
                         మాలి లేక వాడి పోయె
                         మధుర గతము గుర్తు చేయ.

                      ఎవరే ఈ ధీ శాలి,
                      ఎవరే ఈ మహా ఋషి,
                        ఏల గృహము వదిలెనో
                      ఎపుడు తిరిగి వచ్చునో?
            సుచిర: నాదు తండ్రి చెప్పినాడు
                         ఘనుడట ఈ ముని వరుడు
                         కరువులోన ఇల జనంబు
                         ఆకలితో అలమటించ
                       గోదావరినిలకు తెచ్చి
                        కరువును మాపిన ఘనుడట,
                        ఘన నామము గౌతముడట,
                        ఎటకేగెను ఏమో మరి,
                        ఎపుడు తిరిగి వచ్చేనో?                                                           
            

Friday, October 5, 2012

అహల్య 1


                                     అహల్య
            ఓం నమో నారాయణాయ!
            ఓం నమో నారాయణాయ!

            నవ రస భరితం సుమథుర చరితం,
            రఘు కుల సోముడి జీవితం.
                                                                     ......నవరస భరితం
            అందములొలికే సుందర రాముడు,
            చంద్రుడి తెమ్మని వేడిన, తల్లి
            అద్దము నందున చంద్రుడి చూపగ
            సద్దు మణిగెనట బాల రాముడు.
                                                                        ..నవ రస...
            తారా చంద్రుల సుందర లాస్యము
            ఎదను సోకగా రాముడు పొంగె
            రాముడి లాస్యము ఎదను సోకగా
            చంద్రుడి మరి మరి పొంగె.
                                                              ..నవ రస....
            కౌసల్యా సతి కూరిమి పంట
            తండ్రి మాటను జవ దాటడట
            గురు వశిష్టుడి శిక్షణ లోన
            రాజ నీతి నిష్ణాతుడాయె నట.
                                                                ...నవ రస....
            యజ్ఞ రక్షణ నెపమ్ము తోడ
            అపర బ్రహ్మ గాధేయుడి వెంట
            కానల కరిగిన బాల రాముడి
            గాథల వినుటే మరి మరి మథురము.
                                                                 ..నవ రస...