Thursday, December 26, 2019

ఋతుపిలాసము


        
సాగి  పోయెను శిశిరము  తిరిగి వచ్చే వసంతము
మల్లెల తావి వీడ లేదు మాలతులూ  విరగ  పూసే
కొండ మావి కోయిలమ్మ కల రవముల కూయ సాగే.
వేప పూవు  చేదు కూడి  చూతమ్ముల పులుపు చేరి
చెఱకు తీపి జిహ్వ  కమరే వత్సరాది కొత్త వెలుగు.

గడచిన శిశిరము రాగ  రహితము  గడచు వసంతము మనోహరమ్ము
ముందు  ముందు విచ్చేసే  గ్రీష్మము  మండించే నీ జగతి సర్వము
గడచిన శిశిరము తలచ వలదు  ఈ ప్రకృతి తాల్చెను  హరిత వర్ణము
వచ్చు  గ్రీష్మముకు వగవ వలదు కొని తెచ్చు శరత్తును నేత్ర పర్వముగ
బాధలను మరచి పో  బ్రదుకును సరి దిద్దుకో
                                    ************************
మనసు లోని పసిదనముకు మరో రూపు వసంతము
యువ రక్త ప్రభావమును తలపించును గ్రీష్మము
ఓరిమి  సాధన కూడిన ఓనరును సౌభాగ్యంబు
వర్ష శరద్రుతు కన్యలు  వయసు వేడి తగ్గించు
హేమంతము  శిశిరమ్ములు వృద్ధ జీవి నాకడి కాంచి
తమతో  మరి మరి పోల్చి తనివి చెందు పలు మార్లు
గత  జీవిత మంతను తన స్మృతి పథమున నిలిపిన కవి
“విన లేను వసంత రాగ మిక మీదట విన బోను.
గత  వసంత  స్మృతులు  నాలొ ఇసుమంతయు లేవు.
ఝంఝామారుత మాకుల  రాల్చి వేయు శిశిర గతులు
శ్రవణానందము నిచ్చును గత స్మృతులన్ తుడిచి వేయు.
“శిశిరమా! నీ రాగము  నా మదిలో నిలిచెను.
ఈ తృప్తితో జీవితపు చరమాంకము గడిపెదను.””



Thursday, December 19, 2019

దేవులపల్లి కృష్ణ శాస్త్రి



 (కళా ప్రపూర్ణ శ్రీ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్ర్తి గారు కేంద్ర సాహిత్య  అకాడమి ఆవార్డు పొందిన సందర్భముగా  తెలుగు సాంస్కృతిక సమితి, ఐ. ఐ. టి., మద్రాసు,30-1-79 న ఏర్పాటు చేసిన అభివందన సభలో సమర్పించ బడినవి.)
భావ కవితా సారథి
(సినీ  గాయకుడు పి. బి. శ్రీనివాస్ గారు )
కమనీయ మృదుల పథ  మధుర భావ
కవితా సారథి దేవులపల్లి
నీదు కవిత రస హృదయ నవ జీవ
కారుణ్య పద  స్వర  కల్పవల్లి
ప్రాచీనార్వాచీన సురచనా
ప్రజ్ఞా  వారధి  దేవులపల్లి
కృష్ణ శాస్త్రి  దౌ విమల కల్పనా
కృతి కళల  అలల మురిపాల వెల్లి
సహజౌదార్య  సుగుణ  రత్నాకర
సమతా వారధి  దేవులపల్లి
శారదా  పదారాధనా ప్రచుర
సాధనా ప్రసవ  మణి హారమల్లి
మల్లి పరిమళముల వేదం జల్లెడు
మహిత యశోనిధి దేవులపల్లి.
విజ్ఞాన ప్రభయై  విలసిల్లేదు
వీరిని భ్రామాత కళ గన్న తల్లి.  
              
                  ( కార్య దర్శి,  గోపీచంద్‌ గారిచేత సమర్పించ బడినది)
          కొమ్మ మీద కోయిలమ్మ
          కూతలోని కులుకులు
          నింగిలోని రాయంచల
          నడకలోని తళుకులు
          చెట్ల మీద చిలకమ్మల
          చక్కని చిరు పలుకులు
        నీ గీతికలో నివశిస్తాయి
        నీ గొంతుకలో నిదురిస్తాయి.

          కొలను లోని కలువ భామ
          జలం మీద అలల భామ
          నేల మీద నెమలి భామ
          అంబరాన చంద మామ
          ఆడుకున్న ప్రతి మాటా
          పాడుకున్న ప్రతి పాటా
        నీ తలపు లోన మెదులుతున్న కవితా రావం
        నీ గుండె లోన ఊరుతున్న కమ్మని భావం.
             కురుస్తున్న వెన్నెలలో చల్లదనాలు
           మెరుస్తున్న మెరుపులలో  తెల్లదనాలు
           విరుస్తున్న జాజులిలో కొత్తదనాలు
           సాటి రావోయి ఎన్నడూ నీ కవితకు
           మేటి నీ వోయి ఎప్పుడూ ఈ జగతికి
         కాని ఒక్క మాటా దేవులపల్లి
         మరిచి పోకు మళ్ళీ మల్లీ
         కరుణ చిందు కవితలల్లి
         మమత జల్లు మాటలల్లి
       నాది నాది నాదంటూ  -లోకమే తనదంటూ
         కామాన్నే నంచుకుంటూ- క్రోధాన్నే నంజుకుంటూ
         అజ్ఞానం భుజిస్తున్న _ ఆవేదన మ్రింగుతున్న
         సాంఘిక సమాజం లో -సమతను రూపొందించు
         మానవాళి మనసులలో -మమతను రేకెత్తించు.
       ఇదేనోయి నాదు మాట దేవులపల్లీ!
       మరిచి పోకు ఎన్నడూ మళ్ళీ మళ్ళీ.


 (గోపిచంద్‌ గారిని ఈ బ్లాగ్‌ మూలముగా అనుమతి తీసుకున్నట్లు భావించి దీనిని వాడుకుంటున్నాను)                                                        

         (సుబ్బ రామయ్య /నా చేత  సమర్పించ బడినది.) 
 ఒకనాడు:-
                             పాల సముద్రాన్ని సురలు, అసురులు మథియించు వేళ
                             వెలువడిన బడబాగ్నిని ఈశ్వరుడు నిగ్రహింప
                             వెలికి వచ్చె ఏ నాడో, ఏ మహా  సంగ్రామపు
                             ఫలితముగా లోన మునిగి యుండు దివ్య సంపదలు.
                             మహా యజ్ఞమది నిజముగ సంకుల సాగరమునుండి
                             అచ్చరలు, అమృతము, అమరత్వము అవతరించె
                             ఆనందపు తెమ్మెరలు ఎల్లెడలా తొంగి చూచె.
                             కలక తేరినట్టి మహా సముద్రంపు లోతునుండి.
              ఈనాడు:-
                              కలతలలో కలగినపుడు కరగుతుంది మనసు
                              అంతరంగ మథనమ్మె అమృతాన్ని ఇస్తుంది
                              మనలో మన ఎదలో నొక మాథుర్యము నొలకించి
                              మన మాతృక మన నేస్తము మన ప్రకృతి నొక కృతిగా
                             అందిం చి తెలుగు వారికొక మాలిక నిచ్చాడు,
                             ఊర్వశిలో ప్రణయము, ప్రేయసికై విరహము,
                             కృష్ణ పక్ష నిశీధిలో, నిలిచిన నైరాశ్యమును,
                            పంపినారు పల్లకిలో మన కొఱకై శాస్త్రి గారు.
                                  ఉత్తరంపు గవని నుండి వెలికి ఉరుకు హేమవంతపు
                             ఛాయలలో శర్మిష్ఠను, చేరునట్టి యయాతిని,
                             కార్తిక రాత్రులలోన కృష్ణుడి కొఱకై వెదికే
                             గోపికలను గానమాల చేసి ఇలకు పంపినారు.
                             ప్రకృతిలో మాధుర్యము పదపదమున చిలికించి,
                             ప్రకృతిని మురిపింప, ప్రతి హృదయము స్పందింప,
                              కవితామృత ధారలలో, క్రొత్త లోకమందించె,
                             మహా కవీ! మీకు నేడు ఏ సత్కృతి సరిపోవు?





Wednesday, December 11, 2019

కర్పూర హారతి



కాశ్మీర రమ్య  తిలకం భ్రమరామ్బికాయా  అనే తత్వములో కర్పూరము కూడా వస్తుంది. ఇది కొన్ని మొక్కల కాండము నుండి స్రవించిన రసమున్ ఎండ బెట్టి తయారు చేస్తారని విన్నాను. పోతన మహాకవి తన భాగవతములో సరస్వతీ మాతను వర్ణిస్తూ ఇచ్చిన
శారద నీరదేందు ఘన సార  పటీర మరాళ మల్లికా
హార తుషార  ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద
మందార సుధా పయోధి సీతా తామర సామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదికానగ నెన్నడు కల్గు భారతీ!
ఉత్పల మాల పద్యములో తల్లి యొక్క వర్ణాన్ని సూచించే వాటిలో ఘన సారము అంటే కర్పూరమును కూడా ఇస్తారు.  ఈ విధముగా కర్పూరముది తెల్లని తెలుపు.

శుభ సందర్భాలలో కర్పూరముతో హారతి ఇస్తారు. సవ్యముగా తిప్పినపుడు శక్తిని పెంచుట, అప సవ్యముగా తిప్పినపుడు చెడును తీసి వేయుట కర్పూరము యొక్క వెలుగు చేసే పని. మన దేవాలయములలో కూడా మూల విగ్రహాలకు కర్పూరముతోనే  హారతిని ఇస్తారు. పారిశ్రామికీకరణ కొట్టిన దెబ్బ కర్పూరానికి కూడా కొట్టిందంటే  ఆశ్చర్య పడనక్కర లేదు.

ఇప్పుడు  మాకు తెలిసిన  చాలా గుడులలో కర్పూర హారతిని మాని వేసినారు. అందుకు బదులుగా నూనె దీపముతో  హారతిని ఇస్తున్నారు. ప్రిగిన కర్పూరము ధరను తగ్గించుకోనుటకా? ఏమో తెలియదు.  ఇటీవల కర్పూరము బాగా పొగ వస్తున్నాద్. దీనితో గర్భ గృహము యొక్క గోడలు నల్ల బడుతున్నాయి. కర్పూరమును కల్తీ చేస్తున్నారని అనుమానముంది. నిజానికి ఇళ్ళలో కూడా ఇదే పరిస్థితి.

ఒకే పాకెట్ లోని కర్పూరము చెన్నై లో ఐఐటి ప్రాంగణములో అసలు పొగ ఇచ్చుట లేదు. అదే భిమవములో మా ఇంట్లో బాగా పొగను ఇస్తున్నాది. కర్పూరములో కల్తీ ఉంటె ఇలా జరగదు కదా. అంటీ నిజమయిన కారణము కల్తీ కాదు.

ఐఐటి ప్రాంగణములో అడవిలో యున్నట్లు చెట్లున్నాయి. విద్యార్థులు మోటార్ వాహనములను వాడుకపై నిషేధము. ఈ రెండు కారణముల వలన వాతావరణములో కార్బన్  డయాక్సైడ్ శాతము చాలా అక్కవ. మరియు ఆక్సీజన్ శాతము బాగా ఎక్కువ. అందుకని కర్పూరము పూర్తిగా దగ్ధమై పొగ రావటము లేదు. అంతే కానీ కర్పూరములో కల్తీ కారణము కాదు.

భీమవరములో మోటారు వాహనముల రద్దీ ఒక కారణమయితే, చెట్ల పెంపకము కూడా తక్కువ. ఇందుకు తోడు గోదావరి జిల్లాలో చేపల చెరువుల పెంపకము ఎక్కువై ఆక్సిజస్ బాగా తగ్గి పోయింది. అందుకే కర్పూరము పూర్తిగా దగ్ధము కాక పొగ వస్తున్నది.

అన్నీ మాకు తెలుసు అనుకొనే ఆధునిక శాస్త్రజ్ఞులకు ఎక్కువ మందికి తెలియనిది ప్రాణ శక్తి. ఎంత ఆహారము తిన్నా ప్రాణ శక్తి లేక పొతే ఒంట్లో హుషారు ఉండదు. మొక్కల పెంపకము వలన ప్రకృతి లో ప్రాణ శక్తి బాగా పెరుగ్తుంది. ఒక కిరోసిన్ దీపము, నూనె దీపము, నేతి దీపము, కర్పూరము యొక్క వెలుగు ఒక విద్యుత్ దీపము యొక్క వెలుగు వీటికి చాలా తేడా ఉంది. కిరోసిన్ దీపము ఎంత వెలుతురు ఇచ్చినా అన్నిటికన్నా తక్కువ ప్రాణ శక్తిని ఇస్తుంది. ఎంత వాట్టేజ్ ఉన్న విద్యత్ దీపము అంతే ప్రాణ శక్తిని ఇస్తుంది. వీటికంటే నూనె దీపము ఎక్కువ ప్రాణ శక్తిని ఇస్తుంది. కర్పూరము వెలిగించినపుడు నూనె దీపము ఇచ్చే దానికి రెట్టింపు కంటే ఎక్కువ ప్రాణ శక్తిని ఇస్తుంది.అందుకే కర్పూరము యొక్క వెలుగు శుభ ప్రదమని అంటారు.

ఈ విధముగా కర్పూరము యొక్క వెలుగు పర్యావరణము పై ఆధార పడుతుంది. నాకు చిన్నప్పుడు అన్ని చోట్లా చెట్ల పెంపకము వలన పచ్చదనముండేది. రహదారులకు రెండు వైపులా బ్రహ్మాండమయిన చెట్లు ఉండేవి. రహదారుల వెడల్పు పేరుతొ కొన్ని, గృహ నిర్మాణాలతో కొన్ని, పరిశ్రమల పేరుతొ కొన్ని మరియు చేపల చెరువుల తవ్వకాలతో కొన్ని  ఈ విధముగా మనకు రక్షణ ఇస్తున్న వృక్ష అమ్పద చాలా పోయింది. నా అవసరము తీరి పోయింది, చెట్లతో ఏమి పని ? అని సామాన్యులు పట్టించుకోవతము లేదు. ఇంక ప్రభుత్వాలు మనకు ప్రకృతి తో యున్న అనుబంధాన్ని గుర్తిన్చాతము లేదు.

ప్రభుత్వాలు అనుకుంటే ఒక శాసనాన్ని చేయ వచ్చును. ఒక చెట్టును నరికిన వారు, దగ్గిర లోనే రెండు అవే చెట్లను కనీసము నాల్గు సంవత్సరాల వరకు భాద్యత తీసుకొని పెంచాలని. ఇటువంటి చట్టము కొన్ని దేశాలలో ఉన్నట్లు, లేదా విద్యార్థులు కొన్ని చెట్లను పెంచాలని ఉన్నట్లు చదివాను. ఈ విధమయిన చట్టము వస్తే పర్యావరణము రక్షింప బడుతుంది.

అనాస్టాసియ అనే రష్యన్ నవలలో సైబీరియా లో ప్రజలకు వృక్షాలకు ఉన్న అనుబంధాన్ని సూచించారు. అక్కడ దేవదారు వృక్షాలను ఎవరూ ముట్టుకోరు. ఆ చెట్టే ముసలి తనము వచ్చిన తరువాత తనను నరకి వేయమని సూచిస్తుందట. నరికిన దాని చిన్న ముక్కలు తాయత్తులుగా వాడబదతాయట. ఎవరూ అందుకు సిద్ధ పడక పొతే , చెట్టు తనంతట తానె తగల బడి పోతుందట.

జెర్మనీ, నెథర్లాండ్స్ దేశాలలో పెట్రోల్ ఖర్చు తగ్గించి పర్యావరణము కాపాడుకొనుటకు ప్రతి వ్యక్తీ వారానికి కొన్ని రోజులు బైసికేల్ నే వాడుతారుట.

పరిస్థితి అర్థము చేసుకొని పర్యావరణము దృష్టితో వృక్ష జాతిని రక్షిస్తారని ఆశిస్తాము.

                     శుభం భూయాత్. .

Friday, December 6, 2019

అ/మృత భాష



నేను పరిశోధనా విద్యార్థిగా ఉన్న రోజులు. మా భౌతిక విభాగములో వేరే ప్రభుత్వ పరిశోధన శాల నుండి పరిశోధన చేయుటక ఒక బెంగాలీ యువకుడు వచ్చినాడు. నాకు వివిధ భాషల గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత ఎక్కువ. అందుకే ఆయనను అడిగినాను, ”రవీంద్ర  అని అనకుండా రబీంద్ర అని ఎందుకంటారు?” అని.
ఆయన” ఇంతకు ముందు బెంగాలీ లో శబ్దము ఉండేది, ఇప్పుడు లేదు, దానిని తీసి వేసినారు” అని అన్నారు.
“ఎందుకని?” అని అడిగినాను.
“జీవ భాష మార్పు చెందుతూ ఉంటుంది, మాది జీవ భాష.”అని అన్నారు.  ఇటువంటి జవాబును నేను ఎప్పుడూ ఊహించ లేదు.
“ఇది భాషా శాస్త్రము(linguistics) యొక్క నిర్వచనము” అని అన్నారు.
భాష శాస్త్రము లో ఇటువంటి వింత నిర్వచనము ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించ లేదు.  బహుశా ఇటువంటి నిర్వచనము ఇచ్చిన వారి భాష వేరే వారి ప్రభావము వలన మాటి మాటికి మారుతున్నందు వలన ఇటువంటి నిర్వచనము ఇస్తే తప్ప తమ భాషకు గౌరవము రాదను కున్నారేమో? అప్పుడు నాకు తోచింది సంస్కృత  భాషను మృత భాష అని అందుకని అన్నారేమో? అని.
వెంటనే అడిగాను, “అంటే, మీ ముత్తాత మాట్లాడినది లేదా వ్రాసినదీ మీకు అర్థము కాక పొతే  అది ఖచ్చితముగా జీవ భాష గా తీసుకోవలయునా?”  ఆ నిర్వచనములో నాకు అదే అభిప్రాయము వచ్చింది. అన్నిటికి ఈ నిర్వచనము సరి పోతుంది. ఆచారాలు అలవాట్లు మారితే అది జీవ సంస్కృతీ, మారక పొతే అది మృత సంస్కృతీ.  
సంస్కృతాన్ని మృత భాష అని ఎందుకంటారో కూడా అర్థమయింది. గత అయిదు వేల సంవత్సరాల పైన  ఏ మాత్రము మార్పు చూపించ లేదు కాబట్టి అది ఈ నిర్వచనము ప్రకారము ఖచ్చితముగా మృత భాషే.
నిజానికి మన దేశములోనే కాక ప్రపంచములోనే ఎన్నో భాషలకు తన మూలాలను అరువిచ్చిన సంస్కృతము వాడుకలో  ఎక్కువగా లేక పోయినా అది జీవ లేదా అమృత భాష మృత భాష కాదు.  అయినా కొన్ని నిర్వచనాలు ఆశ్చర్యము గానే ఉంటాయి.

Thursday, December 5, 2019

జన్యు సాంకేతికత




రాజు అడిగినాడు,” స్వామీ! ఇటీవల జన్యు సాంకేతికత మీద మరియు ఆ రకముగా ఉత్పత్తి చేయ బడిన పదార్థాల మీద  ప్రపంచ మంతా ఎన్నో విమర్శలు వస్తున్నాయి. శాస్త్ర వేత్తలు పంట దిగుబడి పెంచుటకు ఎంతో కష్టాలు పడుతున్నారు. కానీ అదే స్థాయిలో వారి మీద వ్యతిరేకత వస్తున్నది.  ఎందుకంటారు?”
“మార్పు  వచ్చిన ప్రతి సారి  సమాంతరముగా సమస్యలు వస్తాయి. అది సర్వత్రా సహజము. అయితే ఆ మార్పు మంచిదా కాదా అనేది అది తయారు చేసిన వారి విజ్ఞత మీద ఆధార పడుతుంది. ఒక ధాన్య పదార్థము కావచ్చును. ఒక రసాయనము కావచ్చును.  ముందు అది పరీక్షల్లో నెగ్గితేనే అందరికీ నచ్చుతుంది. ఇందుకు ఒక ఉదాహరణగా వారి ధాన్యాన్ని తీసుకుందాము. చాలా కాలము క్రిందట నెల్లూరు జిల్లాలో  ముఖ్యముగా మూడు  రకాల పంటలు ఉండేవి. అందులో ఒకటి మొలగొలకులు. దీనినే రాజనాలు అనే వారు. ఈ ధాన్యము రాజా లాంటిదని అనే వారు. చాలా రుచిగా ఉండేది. ఒక ప్రముఖ తెలుగు ప్రతినాయకుడు ఇంటి పేరు కూడా ఇదే. ఆయన పేరు చివరకు రాజనాల అయింది. తరువాత కేసర. ఇందులో తెల్ల కేసర మరియు ఎర్ర కేసర అని రెండు రకాలు  ఉండేవి. మధ్య తరగతి వాళ్ళు తెల్ల కేసర అన్నము తింటే  శ్రమ ఎక్కువ పడే వారు ఎర్ర కేసర అన్నము తినే వారు.  నిజానికి ఎర్ర కేసర బియ్యము ముతక బియ్యము అయినా ఎక్కువ బలాన్ని ఇవ్వడము వారు గమనించినారు.  ఈ రెండు బియ్యపు గింజల సైజు పెద్దది. ఇవి పంటకు వచ్చుటకు సుమారుగా అయిదు నెలలు పట్టేది. గింజ ప్రమాణము ఎక్కువ కాబట్టి  వంటకు కూడా సమయము ఎక్కువ పడుతుంది.
ఇంకా హరిత విప్లవము అనీ, తక్కువ కాలములో పండించాలని, తక్కువ కాలములో ఆహారము అందించాలనే ఉద్దేశ్యములో ప్రభుత్వము భారతీయ పద్ధతులను పరిశీలించ కుండా విదేశీ వ్యవసాయ పరిశోధనలను ఆధారము చేసుకొని ముందుకు వెళ్ళింది.  ఇది జన్యు సాంకేతికతను ఉపయోగించుటలో మొదటి మెట్టు అయింది. ఇందులో భాగముగా జీబీ అనే పేరుతొ ఒక పంట వచ్చింది. ఇది సన్న బియ్యము.  తక్కువ కాలము పంట. వెంట వెంట నే ఐ ఆర్  అనే పేరు వెంట సంఖ్యలతో కొన్ని పంటలు వచ్చినాయి. కారణము తెలియదు. బహుశా ఈ పంట ప్రకృతి సహజమయిన ఎరువులు స్వీకరించ లేక పొయినాయా? లేదా రసాయనిక ఎరువులు అయితే మంచి దిగుబడి  త్వరగా వస్తుందని అనుకున్నారా? క్రమ క్రమముగా సేంద్రియ ఎరువుల వాడకము తగ్గి పోయింది. దీని ప్రభావము వలన గ్రామీణ వ్యవస్థలో మరొక చెడ్డ మార్పు వచ్చింది. రైతులకు పశు సంరక్షణ పైన ఆసక్తి తగ్గడము మొదలయింది.
మనిషి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ జ్ఞానమును తెలివి తేటలను పెంచుకుంటూ ఒకప్పుడు నియాండర్తల్  స్థితి నుండి ఇప్పటి స్థాయికి ఎదిగినాడన్న విషయాన్ని ఆధునిక మానవుడు అంగీకరిస్తాడు. ఆధ్యాత్మికతలో కూడా వేరు వేరు మూల జాతులు ఒక దాని వెంట మరొకటి మరింత శక్తివంతమయిన దేహముతో మనిషి ఎదుగుతాడని ఆధ్యాత్మికత కూడా ఒప్పుకుంటుంది. ఇది మనుషులకే కాదు ప్రతి జీవ జాతికి జరుగుతుంది. వారి లాంటి ధాన్యానికి కూడా ఇది జరుగుతుంది. ఆ విత్తనాలకు కొన్ని లక్షల సంవత్సరాల పరిణామము ఉంది. ఈ విషయాన్ని శాస్త్రజ్ఞులు అని చెప్ప బడే వారు అంగీకరిస్తారా? ప్రతి జీవికి మూల సాంకేతికతను దాని లోని మూల కణము నిర్దేశిస్తుంది. ఆధునిక సాంకేతికతలో దానిని డీ ఆక్సీ రిబో నూక్లీ యాసిడ్ లేదా  డీఎన్ఏ  అని అంటారు. దీనిని మార్చి వేస్తె ఈ కొన్ని లక్షల సంవత్సరాల పరిణామ చరిత్ర ఆ కణము లో లుప్తము అవుతుంది. అందు వలన వచ్చే ప్రభావము వెంటనే బయట పడదు. కానీ ప్రభావము మాత్రము ఉంటుంది. ఈ కాల వ్యవధి ఎంత ఉంటుందంటే ఆ మార్పులు వచ్చినపుడు అవి ఇందు వలన వచ్చినాయన్న విషయము గుర్తుకు రాదు.
అనుకున్న పంట రావడానికి ఇప్పుడు ఒక క్వింటాల్  ఎరువు అవసరమయితే మరో రెండేళ్లలో అదే దిగుబడికి రెండు క్వింటాల్ ల ఎరువు అవసరమవుతుంది. ఈ విధముగా ప్రతి ఏడూ రైతుకు పెట్టుబడి పెరుగుతుంది. రైతుకు వచ్చే ఆదాయములో పెద్ద వాటా ఎరువుల పరిశ్రమలకు పోతున్నది. కొత్తగా మరొక సమస్య ఏర్పడింది. ఈ పంటలకు రోగ నిరోధక శక్తి తగ్గింది. వివిధ కీటకాల దాడి కూడా పెరిగింది. మొత్తము పంట పోకుండా ఆ కీటకాలను నిరోధించడానికి విష పదార్థాలను వాటి మీద చల్ల వలసి వస్తున్నది.  అందుకోరకు విష పదార్థాలను తిరిగి తయారు చేయ వలసి వచ్చింది.  అందు కొరకు మళ్ళీ రైతుకు ఖర్చు పెరుగుతుంది.  ఆ విష పదార్థాలు పొలములో ఆహ్లాద కర మయిన వాతావరణాన్ని పాడు చేసి అక్కడ మనము ఉండ లేని స్థితిని ఏర్పరుస్తున్నాయి. ఇంకా పండిన ధాన్యములో కూడా విష పదార్థాలు చేరుతున్నాయి. ఈ విధముగా వినియోగ దారుడు ఎంతో కొంత విషాన్ని దేహము లోనికి చేర వేస్తున్నాడు. దీనితో అతడిలో రోగ నిరోధక శక్తి తగ్గి రోగాల బారిన పడుతున్నాడు. క్రమ క్రమముగా వైద్యాలయాల అవసరము పెరుగుతున్నది.
మరొక మార్పు కూడా వస్తున్నది.  విష పదార్థములు చల్లబడిన కీటకాలలో ఆ ప్రభావము వలన బలహీన మయిన  జీవులు చనిపోతున్నాయి. బలము కలిగిన వాటికి అందు వలన ఎక్కువ ఆహారము దొరికి  వాటి శక్తి ఇంకా పెరుగుతున్నది. ఇప్పుడు శాస్త్రజ్ఞులే ఒప్పుకుంటున్నారు, వాటిలో జన్యు మార్పిడి జరిగినందు వలన అవి విష ప్రభావమును తట్టుకుంటున్నాయని. ఈ జన్యు మార్పిడిని మ్యుటేషన్ అని అంటారు. ఇక్కడ ఒక్క ప్రశ్న ఉంది. కీటకాలలో జన్యు మార్పిడిని తీసుకొని వచ్చే విష పదార్దాలు ధాన్య గింజలలో తీసుకొని రావా? ఇంకా ఈ విష పదార్థాలను తయారు చేసే పరిశ్రమలకు తమ వ్యర్థాలను ఎలా వదిలించు కోవాలో తెలియదు.. అందుకని పెద్ద గుంట లోతుగా త్రవ్వి దానిని వీటితో నింపి వేస్తున్నారు. దీని వల ఒక రాష్ట్ర రాజధానిలో కొన్ని ప్రాంతాలో భూగర్భ జలాలు విష పూరితమయిన విషయము చాలా మందికి తెలిసినదే.
ఈ ఫలితాల వలన పరిశోధన ఇంకొక మెట్టు ఎక్కింది. ముందు ప్రత్తి పంట తో మొదలు పెట్టినారు. వాటి  DNA లో కొన్ని తేలు, సాలె పురుగు లాటి విష జంతువుల నుండి కొన్ని కణ భాగాలను తీసి అంటిస్తున్నారు. అలా చేస్తే ఈ పంటల జోలికి కీటకాలు రావని వారు చెబుతున్నారు. ఇలా చేసిన పంటలను వారు బిటి పంటలని అంటున్నారు. ఒక అమెరికన్ కంపెని ప్రవేశ పట్టిన ప్రత్తి విత్తనాలను వాడి మన రైతులు చావు దెబ్బ తిన్నారు. ఇప్పుడు వారు మొదట బి టి బ్రింజాల్ అంటే వంకాయ అని కొత్తగా బి టి మస్టర్డ్ అంటే ఆవాలు అని అంటున్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో ఈ బి టి పంటల మీద తీవ్రమయిన వ్యతిరేకత వచ్చింది.  మన దేశములో ఇంకా రావాలి. ఇంకా దేశము కొరకు తపన పడే పర్యావరణ శాస్త్ర వేత్తలు(వందనా శివ లాటి వారు) సీడ్ బాంక్స్  లేదా విత్తనాల నిధులు అని మూల మైన విత్తనాలు పూర్తిగా పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వీటి ప్రభావము వలన రైతులు చాలా నష్ట పోతున్నారు .కానీ ప్రభుత్వాలు కొన్ని ఒత్తిడుల వలన వీటిని అనుమతిస్తున్నాయని అనిపిస్తుంది. రైతుకు చేర వలసిన సొమ్ము చేర కూడని చోటికి చేరుతున్నది. కానీ కంపెనీలు తమ కుటిల ప్రయత్నాలను మాత్రము మాన లేదు. విత్తనాలలో కొన్ని మార్పులు చేసినందు వలన పంటలో వచ్చిన గింజలు తిరిగి మొలకెత్తవు. సుమారుగా నలుబది ఏళ్ల క్రిందట రైతుకు విత్తనాలు కొనే అవసరము ఉండేది కాదు. ఈ నాడు విత్తనాల కోసము దళారీల చేతిలో మోస పోతున్నారు.
ఈ విష ప్రభావము ఇంకా పెరిగింది. అన్ని రకాల పండ్లు త్వరగా పక్వము కావాలని వాటి మీద విష పదార్థాలు చల్లుతున్నారు. కొన్ని సంస్థలనుండి కల్తీ పాలు వస్తున్నట్లు వార్తల ద్వారా తెలుస్తున్నది. నాలుగు రోజులు నిలువ ఉండే పండ్లు ఈ విష పదార్థాల వలన త్వరగా కుళ్ళి పోతున్నాయి. ఈ పండ్లు ఎక్కువగా తిన్న వారికి వచ్చే ఆరోగ్య స్థితి ఎలా ఉంటుందో చెప్పనక్ఖర లేదు అన్నిటికి కారణము ఆశ మాత్రము కాదు. ధనార్జన మీద అత్యాశ. కూలి పోయిన నైతిక విలువలు.
మరి దీనికి విరుగుడు ఏమిటి? రైతు ఈ విష వలయము నుండి ఎలా బయటికి వస్తాడు? మన ప్రాచీన సంప్రదాయాన్ని తిరిగి వెలుగు లోనికి తీసుకొని వచ్చిన మహానుభావుడు మహారాష్ట్రకు చెందిన  సుభాష్ పాలేకర్ గారు. తను ఎన్నో ప్రయోగాలు చేసి ఆయన చెప్పి ప్రచారము చేసినారు. ఒక దేశి ఆవు నుండి వచ్చే పేడ ౨౫ ఎకరాల పొలానికి ఎరువుగా సరిపోతుందని ఆయన రుజువు చేసినాడు. రసాయనిక ఎరువులు లేకుండా పూర్తి సేంద్రియ  ఎరువు ద్వారా ఆయన ఆధునిక రైతు పండించే పంటను సాధించినాడు. వ్యవసాయాన్ని తన పిల్లలకు అప్పగించి దేసమంతటా ఈ విషయము ప్రచారము చేస్తున్న కర్మ యోగి ఆయన. ఈ పద్ధతిని అనుసరిస్తే మన రైతు తిరిగి పూర్వ వైభవాన్ని అందుకుంటాడు.
కొస మెరుపుగా ఇంకొక విషయము. కొంత కాలము క్రిందట  యూరప్ లో థాలిడోమైడ్ అనబడు ఒక రసాయనాన్ని తయారు చేసి పరీక్ష చేసి దానిని సర్వ రోగ నివారిణి గా ప్రచారము చేసినారు. ఇంకా గర్భిణీ స్త్రీలు కూడా ఆ మాత్రలను విపరీతముగా వాడినారు.  చాలా పెద్ద సంఖ్యలో వారికి పుట్టిన పిల్లలు కాళ్ళు, చేతులు లేకుండా చేప దొప్పల లాంటి దోప్పలతో జన్మించినారు. చివరకు ఒక పరిశీలనలో ఇలా పిల్లలు పుట్టిన వారందరిక ఉన్న విషయమేమంటే వాళ్ళు  ఈ మందును వాడినారుట. ఇంకొక విషయము ఉంది. విపరీతముగా నొప్పులకు అల్లోపతి మందులు వాడిన వారి మూత్ర పిండాలు నాశనమవుతున్నాయి. ఈ విషయము ప్రతి వైద్యుడికీ తెలుసు. కానీ నియంత్రణ ఎక్కడుంది?
చివరలో మన ప్రాచీన శాస్త్ర వేత్తల్లో గొప్ప జెనెటిక్ ఇంజనీర్ ఎవరు? బహుశా రావణుడేమో? లంక సీతమ్మ చుట్టూ కూర్చున్న రాక్షస స్త్రేల వర్ణన చూసి నాకు ఈ అనుమానము వచ్చింది.
ఒక చిన్న జెనెటిక్ జోక్.ఒక జెనెటిక్ ఇంజనీర్ జన్యు మార్పుల వలన గుమ్మడి కాయంత వంకాయను పండించి ఒక ప్రదర్సనకు పెట్టినాడుట. ఒక్క రైతు అడిగినాడు”దీనికి ఎంత ఖర్చు అయింది?” అని. ఆ ఖర్చును విని “ఇంత ఖర్చు పెట్టాలా? నేను ఒక గుమ్మడి పాదు ఇస్తాను. ఎందుకీ దండగ మారి ఖర్చులు?” అన్నాడుట.
ఈ మార్పులు రావాలంటే ఎదో అద్భుతము జరగాలి. అది జరిగే వరకూ ఎవరూ నమ్మరు. జరిగిన తరువాత దానిని అందరూ మర్చిపోతారు.
              ఓం  స్వస్తి