Tuesday, January 25, 2011

ఆశ


కష్టమున సాగు నీ వేళ కలత తీరి
గట్టు చేరిన చాలును గమ్యమదియ
పెను ప్రవాహమ్మునందు పిపీలికముకు
హరిత పత్రము చాలదా ఆశ రేప

Wednesday, January 12, 2011

సాయం సంధ్య



ఇది సాయం సంధ్యా సమయం
గగనమ్మే అరుణ మయం
అటు నింగిన చుక్కలు పొంగులు పోతూ
చంద్రుడి కొఱకై వేచి చూచే
                   సాయం సంధ్యా సమయం.
పక్షులు గూటికి చేరే
తమ శిశువులు వేచి చూడ
తమ మనసున మమతలు వెతలును మఱువగ
ఉద్వేగముతో ముందుకు సాగే
                        సాయం సంధ్యా సమయం
ఏడీ ఱేడు ఏడీ
గగనమ్ముకు రాడేడీ
అని కలువదె మనసున కలతను కలగి
విరహోత్కంథత వేచే
                   సాయం సంధ్యా సమయం
మత్తును గొలిపే మలయానిలము
మన్సున ఆశలు రేప
ఇంతింతై అంతై ఎంతో
ఆశతొ వేచే విరహిణి రాధకు
                  సాయం సంధ్యా సమయం


భ్రమ

పొంగులు వారే ఆనందపు సంద్రమున నీ డెందము
రంగులు చిందే ప్రకృతిలోని హరి విల్లు యొక్క చందం
చూచి, చూచి మనసాలపించి ఎద పొంగి పోయెనా?
వేచినా గతపు రోజుల వెలుగు నేడు చేరునా?
మంద మరుదముకు డెందము పొంగునొ?
అరుణ ధీధితుల చరణము కదులునొ?
అణువణువణువున ఒయ్యారము లొలికెనొ?
కనువిందాయె మయూరపు లేమ.
కాదు కాదు పొరపాటాయెనది
నెమలికాదొక మేఘపు పంక్తి,
ఎదలో రగిలిన భావ మాలిక
విరిసెను ఈ విధి గేయ రూపిక


వాణి

సకల కళా విదుషీ మణి వీణా పాణి వాణి
సంగీత సాహిత్య వైదిక విద్యల రాణి
పలుకుల లోన సాహిత్యం,  పదముల సవ్వడి సంగీతం
వేదములే వాక్కు అట వేరే పోలిక లేదుట
నీటిని పాలను వేరు చేసే హంసయె నీకు వాహనము
మంచీ చెడులను నిరూపించెడు తర్కమె నీకు ఆయుధము.
అనుభూతు లను మనుజుల పంచి హృదయ స్పందన కల్గించే
కవి శిఖామణుల కావ్య మాలికల పరిమళ లహరి నీవేనా?
సరిలయల సరిగమల చరణ కింకిణుల పలికించే
అమర లోకాల దరుల చూపిచు మధుర గీతమ్ము నీవేనా?
తల్లీ నీకు జోహార్లు, కన రావా మాదు లోగిళ్ళ
మధుర గీతముల మనసు మురిపించ మార్చ లేవా మనుజుల.

Monday, December 27, 2010

ఆనందం

ఆనందం, ఆనందం, ఆనందం,
ప్రవహించే నదుల పైన
చెదిరే తుంపరల లోన
సూరీడు ఏడు కళల
వెలుటను చూచుటలో ||ఆనందం||
పూవు పూవు మీద సాగు
పుప్పొడి పాదములంటగ
తేనె కొరకు పరుగు తీయు
తూరీగల హొయలలోన ||ఆనందం||
ఆవు తనదు లేగ కొరకు
అంబా అని అఱచుచు
సాయం గోధూళి వేళ
ఎదురుగ దూడను చూచి,
మురిసే గోమాత ముఖము
లోన తొంగి చూచునట్టి ||ఆనందం||
ఆ ప్రకృతి సొగసులు
ఏవీ,ఏవీ, నేడు
ఆ రోజులు ఆ పల్లెల
అందాలు తిరిగి వచ్చు
నన్న ఆశలోన కల్గు ||ఆనందం||
(పారిశ్రామిక వాడల ప్రణాళికలలో రంగులు తప్పుతున్న పల్లెటూర్ల మిద )
౨౭-౧౨- ౨౦౧౦

Tuesday, December 21, 2010

జడత్వం

జడత్వం,జడత్వం,జడత్వం
ప్రకృతిలో చైతన్యపు దారులకు స్పందింపక
మౌనముగా నివసించుట జడత్వం
వెలుగు రేఖలా కొరకు వెదకుటను మాని వేసి
చీకటిలో రోయుటే  జడత్వం.
మంచి  చూచి స్పందింపక, మానవతను పరికింపక
తన కోసమె తను బ్రదుకుట జడత్వం.
భాధ తనను కుదిపి వేయ,
రోదించుట మాని వేసి,
వేదనలితరుల వైనను
సాధనతో తగ్గించి,
ఆనందపు అవధులను
అందరికీ అందించే
మానవుడిని చూచి పరుగు
తీయు చూడు జడత్వం.
21-12-2010



Monday, December 6, 2010

కీర వాణి 8

స్వామీ!
అర్భకుండనైనాను అలుసత బ్రదికిన వేళ 
తెలియదు బ్రదుకిన్ని గతుల మార్పులు మరి వచ్చుననీ
ఆవేదన, ఆవేశము,  ఆక్రందన అనుకంపన
అనుపదముల కర్థములు అసలే తెలియవు నాకు.
మనసు పొంగ మాటలతో  తనువు పొంగ నాటలతో
గడిపి వేసి, గడిపి వేసి  కనుల తెరిచితొకనాడు
చదువే నా లోకమని బ్రదికితి నా యౌవనమున
లోకపు రీతుల తెలియక గడిపితి నా రోజులను
ఈ అనుక్షణ సాధనలో ఈ తెలియని లోకములో
ఎందుకో  నా మది   ఈ రీతిన ఈ నాడు 
ఆవేశాలకు లోనై   ఆవేదనలకు తావై
అనుక్షణము ప్రతి దినము అలమటించు  నో స్వామీ!
అర్భకుడను  కాను నేను అలుసుదనము లేదు నాలో
లోకములో జరుగు మార్పులను చూచిన ఆవేదన
ఎపుడు ధర్మ పాలన వచ్చునని నిరీక్షణ
తెలుసులే జవాబు రాదు  ఈ ప్రశ్నకు బదులు లేదు.