Sunday, March 23, 2014

గీతాంజలి ౨౦


కుసుమించినదది కమలమ్మని
నే గుర్తించగ లేదు.
ఎదలో రగిలే మథనము లో నే
విరులను చేర్చగ లేదు.
మెల మెల్లగ సోకెను దక్షిణ గాలులు
చల్లగ మేల్కొలుప
వ్యథ తో నిండిన హృది నది లేపెను
తీయని విరి తావి
తవి తీరని కోర్కెలు రేపెను నాలో
చల్లగ పూ తావి
గ్రీష్మర్తువు యొక్కచవరి దశ
దరి చేరినదని తెలియకనే మది
మాధుర్యము సోకె

ఎదఅంచుల తాకె. 

Monday, March 17, 2014

దోమ

                                                                                      
ఏమండోయ్ నేనే, దోమను. కొందరు నన్ను మశ్చికం అంటారు. వాళ్లకు కొంత భాషాభిమానము ఎక్కువ లెండి. సింపుల్ గా నన్ను దోమ అంటే చాలు. మా జాతి మీద మీకు చాలా కోపముగా యున్నది. ఆ విషయము మీకూ  తెలుసు. అది సహజము కూడా. ఎందుకంటే మేము రక్త పిశాచ జాతికి చెందిన వాళ్లము. అంటే అన్ని రకాల జీవుల రక్తము మీద జీవిస్తాము కాబట్టి. అయినా మేము మానవ జాతి యొక్క దయా దాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నామంటే మీరు ఆశ్చర్య పోతారు. కానీ, నిజాము మాత్రమదే.
సుమారుగా ఏబది ఏళ్ల క్రిందట  పల్లెటూళ్ళలో ఆరు బయట చల్లని గాలిలో  మంచాలు వేసుకొని పండుకొనే వారు. ఎందుకంటే అప్పుడు మా జనాభా అంతగా పెరగ లేదు. ఇప్పుడలా పండుకోంది చూద్దాము. మా జనాభా మిమ్ములనలా పండుకోనిస్తున్దేమిటి? మాకు మీ రక్తముతో బాటు మురికి పదార్థాలు అన్నా ఇష్టమే. అందుకీ మా గుడ్లను మురికి గుంటల లోనే పెడుతాము. ఆ రోజుల్లో నత్తలు కప్పలు నేరుగా వచ్చి మాగుడ్లను తిని వేసేవి. వాటిని తప్పించుకొని పగిలిన గుడ్లే మా జాతిని నిలిపేవి. ఆ సమయములో మా జాతి అందుకే వేగముగా పెరిగేది కాదు.
ఈ విషయము లోనే మేము మేము మానవ జాతికి ఏంటో ఋణ పడి యున్నాము. ఎందుకంటే వాళ్ళు పరిశోధనలకనీ, వంటల కనీ కప్పలను ఖాళీ చేయించేసినారు. అంతే కాక చేపల చెరువుల్లో ఆహారము గా వేయుటకై నత్తలన్నిటినీ ఏరి, చితగ కొట్టి వేసేస్తున్నారు. దీనితో మాకు ప్రాథమిక శత్రువులు పోయినారు.
పాత రోజుల్లో ఇళ్ళల్లో సాంబ్రాణి లాంటి ధూపాన్ని తరచుగా వేసే వారు. ఆ వాసన మాకు అసలు పడదు. అందుకని మేము లోపలి ప్రవేశించే వాళ్లము కాదు. ఇప్పుడు బొగ్గులు పొడి చేసి అందులో సాంబ్రాణి వేసి ధూపము వేయాలంటే మీకు బాగా బద్ధకము వచ్చేసింది. దీనితో మాకు బాగా స్వాతంత్రము వచ్చేసింది.
          మా వలన మలేరియా లేదా చలి జ్వరము వ్యపిస్తున్నాడని తెలిసిన తరువాత మేమంటే జనానికి భయము పెరిగినది. ఆ తరువాత వ్యాధుల పట్టీలో డింగీ బర్డ్ ఫ్లూ లాటి విష జ్వరాలు చేరిన తరువాత  మమ్ములను నియంత్రించుటకై బజారులో పొగ చుట్టాలు, కిరసిన్న్ పొగ డబ్బాలు చాలా వచ్చినాయి. వాటి దెబ్బకు మా దోమలు చాలా చని పోతున్నాయి. అయితే ఇప్పటికీ జనానికి అర్థము కానిదొకటి యున్నది. దోమ నివారణ రసాయనాలు  పెరిగినాయి, దోమలు కూడా చాల చని పోతున్నాయి, అయినా మా సంఖ్య పెరుగుతూనే యున్నది.అది మీకు పూర్తిగా అర్థము కావుట లేదు.
అంతకంటే గమ్మత్తయిన విషయమున్నది. దోమలకు రోగ నిరోధక శక్తి కూడా పెరిగినది. ఇంతకుముందు కొద్ది మోతాదుకు చని పోయే దోమలు ఇప్పుడు ఎక్కువ మోతాదుల విషాన్ని కూడా తట్టుకొన గలుగుతున్నవి. ఈ విషయములో నా చిన్న బుఱ్ఱకు తోచినదొకటే. విష ప్రయోగము వలన కొన్ని బలహీనమయిన దోమలు చని పోయిన కొలదీ మిగిలిన దోమలకు దొరికే ఆహారము పెరిగి వాటి శక్తి కూడా పెరుగుతున్నది.మరొకటేమిటంటే మీ లోని కొంత మంది శాస్త్ర వేత్తలు చెపుతున్న దాన్ని బట్టి, (మ్యుటేషన్  అనబడే జీవ లక్షణమును అనుసరించి ) మా యొక్క రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతున్నది. అందుకనే మీ విష పదార్థముల ప్రభావము తగ్గిపోతున్నది. మీ ఓర్పు మరీ తగ్గి పోయి మమ్ములను పూర్తిగా నాశనము చేయాలన్న కసి కొద్దీ  మీరు భూమిని విష పదార్థములతో నింపి వేస్తున్నారు.
ఒక మహర్షి చెప్పినారు, మీరు మరొకరిని పరోక్షముగా నిందించుట వలన ఏర్పడే శక్తి మాకు బలాన్ని చేకురుస్తున్నాదని. అది, నిజమో కాదో నా చిన్ని బుఱ్ఱకు అర్థము కాదు, కానీ,భౌతిక వాదముతో కొట్టుక పోతున్న మీకు ఈ విషయాన్ని అంగీకరించే శక్తి లేదన్న మాట మాత్రము నిజము. 
మధ్యలో మరొక సరాగము. ఇటీవల ఈగ అనబడే పేరుతొ సినీమా వచ్చినది. చని పోయిన కథానాయకుడు ఈగ దేహములో చేరి పగ తీర్చుకుంటాడు. అంత పగను పెంచుకొని ప్రతి నాయకుడిని గుర్తుంచుకొనే శక్తి ఈగ మెదడుకు ఉందా? నాకు అర్థము కాలేదు. అది వీలయితే రేపు నేను కూడా అలాటి పనులు చేయ వచ్చును .
మళ్ళీ ఎపుడో కలుద్దాము.

మీ చిన్ని దోమ.   

Tuesday, February 18, 2014

సరికొత్త సామాజిక వాదము



 లేని వారు ఎదో యొకటి ఆలోచిస్తూనే యుంటారు. పనికి వచ్చేది  మాత్రము కాదు.  ఎదో యొకటి వ్రాస్తుంటారు., ఇదీ అంతే. ఇటువంటిదే ఇటీవల ఒక పత్రికలో ఒక వ్యాసము వచ్చినది. అదేమిటంటే, ఎడమ చేయి ఏమి పాపము చేసినది?  మూఢ నమ్మకాల నుండి మార్క్సిజం వరకు అందరూ మా ట్లాడేస్తూ ఉంటారు.  అయన/ఆమె బాధ ఏమిటంటే ఎడమ చేయిని చిన్న చూపు చూస్తున్నామా? , అని. ఇక్కడ నుండి సరిక్రొత్త సిద్ధాంతాలు, రాద్ధాంతాలు మొదలవుతాయి.
          ఒక సారి నేనొక ప్రొఫెసర్ ఇంట్లో రాత్రి విందుకు వెళ్ళినాను. అక్కడ ఒక అమెరికన్  జాతీయుడు కూడా అతిథి.  నేను గమనిస్తూ ఉన్నాను. అందరమూ అలవాటుగా కుడి చేతితో అన్నము కలుపుకొని తింటున్నాము.  అప్పటికే ఆయన తనకు అలవాటు అయిన రీతిలో రెండు చేతులను అన్నిటికి వాడుతూ తింటూ,క్రమ క్రమముగా అందరిని  గమనించి కుడి చేతి తో అన్నము తిన సాగినాడు.  ఇందులో ఎవరిదీ మంచి పధ్ధతి, లేదా కాదు అన్న ప్రశ్నే లేదు.  కాని, పదుగురు వెళ్ళే మార్గములో వెళ్ళాలని అందరూ  ప్రయత్నిస్తారు. అంతే గానీ దీనిని ఎదో ఒక తీవ్రమయిన విషయముగా భావించ వలసిన విషయము కాదు. ఈ తత్వము ఇంతటితో ఆపితే బాగుంటుంది, కానీ, అన్ని విషయాల్లో చేతులు పెడతారు.
          అదే పత్రికలో మరొక వ్యాసములో ఒక రచయితకు తెలుగు మీద సంస్కృతం యొక్క అత్తగారి పెత్తనము కనిపించినది. కానీ, ఆ రచయిత/రచయిత్రి  భారతీయ భాషలన్నీ సంస్కృతము నుండి వచ్సినాయన్న విషయాన్ని మఱచి పోయినాడు. అంటే కాదు, వారికి  ఆంగ్లము ( పొరపాటయింది ), ఇంగిలీషు మామ గారి పెత్తనము కూడా కనిపించినది.
          మనము చరిత్ర పూర్తిగా చదివి అర్థము చేసుకోకుండా ఈ విధమయిన మిడి మిడి జ్ఞానముతో ప్రతి విషయానికి సామ్య /సామాజిక వాడమును  ఆపాదించు కుంటూ పొతే గోరిల్లాలకు కూడా సరి అయిన న్యాయము అందించ వలసి యుంటుంది. అవి కూడా మనలాగే  ఆహారము తింటాయి, నడుస్తాయి, కాస్త అలవాటు చేస్తే చిన్న చిన్న మాటలు కూడా మాట్లాడుతాయి. వాటికి మన లాగే కాస్త కోపము కూడా ఎక్కువగానే యుంటుంది. ఈ సరికొత్త సామాజిక వాదులకు అది కనిపించదనుకుంటాను.
          గౌతమ  బుద్ధుడు కూడా తన మొదటి ప్రవచనాలన్నీ సంస్కృతం లోనే చేసినారన్న విషయము చాలా మందికి తెలిసి యుండక పోవచ్చును.  కానీ, అవి సామాన్యులకు అర్థము కావటము లేదన్న భావముతో పాళీ భాషలో తన బోధనలను చేసినాడు. అంటే ఆయనకు సంస్కృతము మీద అభిమానము తగ్గినదని  లేదా  పాళీ భాష  మీద అభిమానము పెరిగినదని కాదు. ఎవరికీ అయనా ఏదయినా అందించాలంటే అందుకు అనుగుణమైన భాషలో చెప్పాలన్నది, ప్రాచీన కాలమునుండి ఋషులు అనుసరిస్తున్న విధానము. అంతే కానీ ప్రధానమైన భాషను దిగజార్చుట వారి ఉద్దేశ్యము కాదు. మరొకటి గమనించాలి, భారత దేశము నుండి, టిబెట్  మరియు చైనా లకు వెళ్ళిన బౌద్ధ గ్రంథాలు ఎక్కువగా సంస్కృత గ్రంథాలే.
          మన ప్రధాన మయిన ఇతిహాసాలన్నీ సంస్కృతము లో యున్న రోజుల్లో మహా భారతాన్ని పంప కన్నడము లోనికి అనువదించినాడు. అదే సమయములో నన్నయ భట్టారకుడు భారతాన్ని తెలుగు లోకి అనువదించి నాడు. వచనములో కంటే పద్యము లో యున్న సంగీత పరత్వానికి తెలుగు ప్రజలు పరవ శించినారు. నన్నయ తో మొదలయిన ఈ ప్రయత్నము తిక్కన సోమయాజి, ఎర్రాప్రగడ ల తో పూర్తి అయింది. దీని తో తెలుగు కు సాంస్కృతికము గా ప్రాధాన్యము లభించినది. క్రమ క్రమముగా భాష మీద పటుత్వము లేని వారందరూ సరి క్రొత్త సూక్తులు మొదలు పెట్టినారు.  మా భావాలను ఛందస్సుతో బందీలుగా చేయ లేమని సరికొత్త  నినాదాలను సృష్టించినారు. ప్రతి యొక్కరికి తమకు నచ్చిన రీతిలో వ్రాసే అధికారము ఎప్పుడూ ఉంది. అందుకని తమను మేధావి వర్గముగా మిగిలిన వారు  చాందసులుగా ప్రకటించు కోవలసిన అవసరము లేదు. నిజానికి ఛాందసులంటే ఛందస్సు ను ఉపయోగించే వారని అర్థము. అంతే కాని అది చెడు పదము కాదు. కెవ్వు కేక లాంటి కవితలు వచ్చే కొద్దీ ప్రజలకు భాష మీద పటుత్వము తగ్గి పోయింది. అటువంటి పరిస్థితులలో మాండలికాలు పెరిగి పోయి, అసలు భాష జనానికి దూరము అవుతుంది. అయిదు వేల నాటి సంస్కృతము ఈ నాటికీ అర్థము అవుతుంది. కానీ అయిదు వందల నాటి ఆంగ్లము ఇప్పటి వారికి పూర్తిగా అర్థము కాదు. కారణము  ఒకటే. ఖచ్చితముగా వ్యాకరణ సూత్రాలను పాటించక పోవడము వలన భాష స్వరూపము మారి పోతుంది.
          ఒక సారి ఒక బెంగాలీ స్నేహితుడి తో భాష మీద ఒక చర్చ వచ్చినది.  రవీంద్ర అనకుండా రబీంద్ర అని ఎందుకు ఉచ్చరిస్తారని నేను ప్రశ్నించి నాను. ఆయన ఒక సిద్ధాంతము చెప్పినాడు. జీవ భాషలు నిరంతరము మార్పు చెందుతాయని ఆయన చెప్పినాడు. ఆ క్రమములోనే వ యున్న చోట బ వచ్చిందని అన్నాడు. ఆధునిక భాషా శాస్త్రము (లిమ్గిస్తిక్స్ )లో ఇటువంటి సిద్ధాంతము యున్నదని నాకు అప్పుడు తెలిసింది. వెంటనే నేను ఒక ప్రశ్న వేసినాను. మీ తాత గారు వ్రాసినది మీకు అర్థము కాక పొతే అది ఖచ్చితముగా జీవ భాషే కదాఅని. సంస్కృతాన్ని మృత భాష అని ఎందుకంటారో కూడా అప్పుడు నాకు తెలిసింది. కొన్ని వేల సంవత్సరాలుగా సంస్కృత భాషా నిర్మాణము లో మార్పు లేదు కదా.  అంటే కాని సంస్కృతాన్ని జనము ఇంకా వాడుతున్నారా అనే ప్రశ్న ఇక్కడ లేదు. కొన్ని సిద్ధాంతాలు ఇలాగే యుంటాయి.
          ఆ తరువాత మన అంటే తెలుగు భాష చాలా గొప్ప భాష అని విదేశీయులు ఎప్పుడు పొగిడినారో నాకు అర్థము కా లేదు. మన బ్రౌన్ లాటి వారికి తప్ప అలా పొగిడే అలవాటు వారికి ఎప్పుడూ లేదు. వాళ్ళు అన్నది ఒకే మాట. తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. అంటీ ప్రాచ్య ఇటాలియన్ భాష అని యన్నారు. అంతే.  దీనిని పొగడ్త గా ఎవరూ ఎలా అర్థము చేసుకున్నారో కూడా తెలియ లేదు.  నిజానికి భారత దేశపు  భాషలలో ఎక్కువ భాషలు హల్లులతో అంతమవుతాయి, సంస్కృతము, తెలుగు మరియు కన్నడము తప్ప.  అందులో తెలుగు కన్నడాలను అజంత భాషలు అంటారు. యూరప్ లో ఇటువంటి లక్షణము ఉండేది ఒక ఇటాలియన్ భాషకు మాత్రమె. అందరూ రోం  అంటే వాళ్ళు రోమా అని అంటారు. అందరూ పొప్ అంటే వాళ్ళు పాపా అంటారు.వాళ్ళ కంపెనీ పేరు కూడా పియాగ్ లేదా పియాగియ్ అని యుండదు. స్పష్టముగా పియాగియో అని యుంటుంది. తెలుగు పదాలకు అవే లక్షణాలున్నాయని వారన్నారు, అంతే.
          ఇటు వంటిదే  మరొక విషయము చెప్ప వలసి యున్నది. భారతీయులకు అందులో ప్రధానముగా తెలుగు వాళ్లకు ఏ మాత్రము ఎదుటి వాళ్ళు పొగిడినా పడి పోయే అలవాటు ఉన్నది. భారతీయ గణితములో స్థానాన్ని బట్టి విలువ ఇచ్చే అంకెలతో సున్నకు యున్న ప్రాధాన్యత అందరికి తెలుసు. కానీ పాశ్చాత్యులు వాడే వాక్యమేమంటే గణితానికి భారతీయుల ప్రధానమయిన ప్రతిపాదన సున్నఅని.( Indian contribution to mathematics is zero)  ఇది చూచి మనము మనలను గురించి గర్వ పడ వచ్చును. ఇందులో ఇంకో అర్థము కూడా వస్తుంది. అది పట్టుకొని వాళ్ళు మనలను గేలి చేయ వచ్చును కూడా. అందుకే భారతీయుల గురించి పాశ్చాత్యుల కొన్ని ఉవాచలు అర్థము కావు. అంతకంటే అద్భుత మయిన గణిత ప్రతిపాదనలు పరిజ్ఞానము పాశ్చాత్యులకంటే కొన్ని వందల సంవత్సరాల ముందే భారతీయ గ్రంథాలలో యున్నవి.  న్యూటన్ వాడిన కొన్ని ప్రక్రియలు కొన్ని వందల సంవత్సరాలకు ముందే భాస్కరాచార్యులు తమ సిద్ధాంత శిరోమణి లో వాడినారన్న విషయము ఎవరికీ గుర్తుండదు. అందుకే కొన్ని నిజానికి పొగడ్తలు అయినా మనకు వాటిని అనుమానించ వలసి వస్తుంది.
          కొన్ని శతాబ్దాల పర్యంతము సముద్ర మార్గము వచ్చే వరకు భారత దేశమునకు సింధు నది దాటి రావలసి యండేది. మన  శబ్దమును సరిహద్దు లోని పార్సీలు క్రింద పలికే వారు. ఆ విధముగా హిందూ నదిని దాటి వెళ్ళే దేశము కాబట్టి ఈ దేశమును హిందూ దేశము అని పిలిచినారు. అదే విధముగా దక్షిణముగా యున్న సముద్రానికి హిందూ మహా సముద్రము అని పిలిచినారు. ఈ పేరు పెట్టింది విదేశీయులే. ఇక్కడ సంప్రదాయమును హిందూ మతము అని అన్నారు.  ఈ దేసానికి అసలు ప్రాచీన మయిన పేరు అజనాభ దేశము. ఋషభుడి కుమారుడయిన భరతుడి పేరున ఇది భారత దేశము అయినది. అటువంటిది కొన్ని సంవత్సరాల క్రిందట మన పొరుగు దేశము ఒక మహా సముద్రానికి ఒక మతము పేరు ఎలా పెడతారని అంతర్జాతీయ వేదిక మీద గొడవ చేయాలనీ ప్రయత్నించిన విషయము అందరూ మర్చి పోయి యుంటారు. ఏమయినా మనము, మన ప్రభుత్వము నాలుక లేనివి కదా!
          పైన చెప్పా బడిన వాటిలో ఏది యథార్థ వాడమో, ఏది మూర్ఖ వాడమో అర్థము కాదు. మనుషుల మధ్య యుండ వలసినది ప్రేమ గానీ తార్కికి వివాదాస్పద విశ్లేషణలు కాదు.
       ఒక్క మాట చెప్పాలంటే నేను కూడా పని లేని వాడినే. ఎందుకంటే ఇటువంట పని లేని విశ్లేషణలకు స్పందిన్చినాను. మరి నేను కూడా మామూలు మనిషినే కదా!


  Also visit varasatvamu.blogspot.in

Friday, February 14, 2014

శ్రీ చదువు

                                               


                 ఏమోయ్ రాజూ! ఏమి చేస్తున్నావు?
                ఇంజనీరింగ్ చదువుతున్నాను, బాబాయ్!
                మరి, నీ సంగతేమిటోయ్, చందూ!
                ఇంజనీరింగ్ చదువుకుంటున్నాను
              రాజేమో ఎదో చదువుతున్నానన్నాడు. మరి, చందూ  ఏమో చదువు కుంటున్నా నన్నాడు.  మరో వ్యక్తీ     చదువు కొంటున్నానన్నాడు. ఇందులో ఎవరిదీ సరి అయిన జవాబు?
        ఇక్కడ చదువు విషయములో ఎవరికీ ఏ అనుమానము రాదు, ఈ రోజుల్లో  అందరూ చదువుకొంటున్నారు, నిజమే చదువును కొంటున్నారు.
      కొన్నాళ్ళ క్రిందట  విద్యార్థి అనే పదాన్ని అందరూ వాడే వారు, ఇప్పుడు కూడా వాడుతున్నారు. అర్థము మాత్రము మారి పోయినది. విద్యనూ అర్థించే వాడు, అంటే విద్యనూ భిక్షగా ఇమ్మని యాచించే వాడు విద్యార్థి. అటువంటి విద్యలలో ఉన్నత స్థాయికి చెందిన ఒక విద్యనూ శ్రీ విద్య అనే వారు. దీనిని అందుకోవాలంటే, శిష్యుడు గురువు దగ్గిర చాలా కఠిన మయిన లేదా తీవ్రమయిన సాధనను చేయ వలసి యుండేది. ఎందుకంటే మంత్ర శాస్త్రములో యే యొక్క బీజము మారి పోయినా ప్రభావము మారి పోతుంది. అందు వలన వచ్చే ఫలితానికి నేర్చుకున్న వాడు బాధ్యుడవుతాడు. ఉచ్చారణ చాలా ప్రాధాన్యతను కలిగి యుంటుంది. ఏ మాత్రము తేడా వచ్చినా ఫలితాలు చాలా తీవ్రముగా యుంటాయి. విత్ ధాతువుకు అర్థము జ్ఞానము. య కు ఎక్కడ యున్నదో అన్న అర్థము వస్తుంది. యథా రాజా తథా ప్రజా లాంటి వాక్యాలు ఇలా శబ్దము నుండి వచ్చినవే. ఎక్కడయితే జ్ఞానమున్నదో అదే విద్య.  అంతే గానీ, జపాన్ రాజధాని టోక్యో యని, మనకింతకు ముందు ఇంతమంది మంత్రులున్నారని, అశోకుడు రహదారుల కిరువైపులా చెట్లని నాటించినారని  చెప్పేది, విద్యార్థులకు నేర్పిస్తే అది చదువు అవుతుంది కానీ, విద్య కాదు.
          ఇక్కడ నుండి శ్రీకాకుళం కు పని మీద బస్సు లో వెళుతున్నామని అనుకుందాము.  మనస్సు పని మీద మాత్రమే యుంటే రహదారి కి ఇరు వైపులా ఏమి జరుగుతున్నదనే విషయము దృష్టి కి రాదు. అది లేనపుడు  ప్రక్కనున్న వాటిని కూడా చూచుకుంటూ వెళుతాము. ఇదే విధముగా మనము లక్ష్యము వైపు వెళుతున్నపుడు దారిలో కనిపించేవి గుర్తు సంభాలు, అంతే కానీ, అవి మన లక్ష్యాలు కాదు.

          భౌతిక శాస్త్రము అభ్యసించేటపుడు డెమోక్రటేస్, న్యూటన్ మరియు ఐన్ స్టీన్న్ లాంటి వారు శాస్త్రము నేర్చుకొనే దారిలో కనిపించే స్తంభాల లాంటి వారే కానీ, వారు శాస్త్రము కాదు. ఈ విషయములోనే భారతీయ మరియు పాశ్చాత్య
శాస్త్ర గ్రంథాల్లో తేడా కనబడుతుంది.  ఉదాహరణకు చరక సంహిత ఒక ఆయుర్వేద గ్రంథము. పాశ్చాత్య సంప్రదాయము నకు అలవాటు పడిన వారు, ఆ గ్రంథాన్ని చరకుడు అనే వ్యక్తీ వ్రాసినారు అని అన్నారు.  కానీ,  ఒక చోటి నుండి, మరొక చోటికి, మందులు తీసుకొని వెళ్లి వైద్యము చేసే వాళ్ళను ప్రాచీన భారతీయ సాంప్రదాయములో చరకులు అంటారు అని, వారికొరకు వ్రాసిన సంహితను చరక సంహిత అనెదరని మరొక వాదన యున్నది.  కానీ, నిజానికి ఆ గ్రంథాన్ని వ్రాసినదెవరో ఎవరికీ తెలియదు. మన భారతీయ శాస్త్ర విజ్ఞాన ద్రష్టల గురించి మనకు ఎటువంటి సమాచారము దొరకదు.
ఈ అద్భుత నిర్మాణమును ఎవరూ చేసినారో ఎవరికీ తెలియదు. వారందరికీ వందనములు. కానీ, వారి ఉనికి అప్పుడప్పుడు కనబడుతూనే ఉంటుంది.
          ఒక సాధకుడికి ఒక కొబ్బరి తోట ఉన్నది. అందు లోకి ఒక  పేద వాడు వచ్చినాడు. మంచి ఆకలి మీద యున్నాడు. చెట్టి ఎక్కి కొబ్బరి కాయ కోయ బోయినాడు. దీనిని యజమాని అయిన సాధకుడు గమనించి అతడిని అక్కడే బంధించినాడు.  ఇంటికి వెళ్లి, పాత్ర నిండా ఆహార పదార్థములు, కొన్ని కొబ్బరి కాయలు తెచ్చి వాటిని తీసుకొమ్మని చెప్పి వెళ్లి పొమ్మని చెప్పినాడు. దీనిని చూచిన ఒక వ్యక్తి, నీకు పిచ్చి పట్టిందా ఏమిటి? దొంగను ఇలా ఎవరయినా సత్కరిస్తారా? అని అడిగినాడు. అప్పుడా సాధకు డన్నాడు,అవసరము లేదు, అతడికి ఎక్కడ శిక్ష పడాలో అక్కడ పడింది, ఇంకా అతడు దొంగ తనము చేయ లేదు. అన్నాడు. నిజమే అతడికి భౌతిక మయిన శిక్ష లభిస్తే బహుశా దొంగగా ఉంది పోయే వాడేమో? కానీ, దెబ్బ మనసుకు తగిలినది. ఆ సాధకుడు మరో మాట అంటాడు. ఇటువంటి విద్యను నేర్పే శాస్త్రాలు కను మరగు అయి పోయినాయి అని. ఈ సంఘటన అయ్యర్ నిర్మించిన శంకరాచార్య  చిత్రములో చూపించ బడినది.
          ఇందులో శ్రీ సత్య సాయి బాబా భక్తుడయిన హోల్ హోనిగ్ న్యూయార్క్ లో పెట్టుకున్న ఆహార వితరణ కార్యక్రమమును ప్రస్తావిస్తాను. బాబా యొక్క ప్రభావము వలన అయన రోజూ సాంద్ విచ్ లను, కుకీ లను ఆకలి మీద యున్న పేద వారికి న్యూయార్క్ నగరములో నున్న మూలలలో నున్న ప్రదేశాలలో పంచడము అలవాటు చేసుకున్నాడు. ఒక సారి రైలు బండిలోవీటిని పంచుతుంటే, ఒక బలముగా కనిపించే వ్యక్తీ ఎగుడు దిగుడు జుట్టుతో, ఇష్టము వచ్చినట్లు కదులుతూ కనిపించినాడు. అనాగరికంగా కథినము గా కనిపిస్తున్న అతడు డబ్బులు అడుగుతున్న విధానము అందరికి భయము వేస్తున్నాది. పైన చెప్పిన భక్తుడిని కూడా ప్రక్కనున్న వారు అతడి గురించి హెచ్చరించినారు. అయినా ధైర్యము చేసి, నీకు సాండ్ విచ్ కావాలా? అని అడిగినాడు. అతడు నాకు చాలా ఆకలి గా ఉన్నది అని, ఆత్రము గా తీసుకొని గబగబా తిని ముందుకు వెళ్లి పోయినాడుట. ఆహారము తీసుకున్న తరువాత అతడి ముఖములో అంతకు ముందున్న క్రూరత్వము మాయమయి పోయిందని  హోల్  హోనిగ్ చెబుతాడు.
          చిన్నప్పుడు నా జీవితములో జరిగిన సంఘటను ఒక దానిని ప్రస్తావిస్తాను.  నేను పుట్టి, పెరిగిన ఊరు పేరు
 పైనాం పురం. నేను చదువుకున్న ఉన్నత పాథ శాల ఈదూరు అనే గ్రామములో యున్నది. ఈ రెండిటి మధ్య దూరము సుమారుగా మూడు మైళ్ళు లేదా అయిదు కిలో మీటర్లు. మరో వసతి లేనందు వలన రొజూ నడచి వెళ్ళాలి. దారిలో అన్నీ పంట పొలాలు. ఒక రోజు నేనూ నాతొ బాటు వారు, దారిలో ఒక వేరు శనగ వేసి యున్న ఒక పంట పొలములో దిగినాము. వేరు శనగ మొక్కలను పెకలించి కాయలను అందరూ తింటున్నారు. ఇంతలో ఆ పొలానికి సంబంధించిన వ్యక్తి అందరిని తిట్టి బయటికి పంపించినాడు, కానీ, నన్నేమి అన లేదు. నన్ను ఒక చూపు చూచి నాడు అంతే. అతడు మా నాన్న దగ్గిరకు తరచు వస్తూ యుంటాడు. నిజానికి అతడు మా నాన్నకు నా మీద ఎలాటి పితూరీ చెప్ప లేదు. కానీ, అతడి ఈ ప్రవర్తన నన్ను ఎంత బాధ పెట్టిందంటే, ఆ తరువాత నేను ఆ విధముగా ఎవరి పొలములో దిగ లేదు.
          మరొక సంఘటన. ఒక సారి మా వారి పోలములో పనను దొంగిలించినారు. ఈ పని మాదగ్గిర పని చేసే వారే చేసినారని మా దాయాదులు వదంతులు రేపినారు. ఆ పని చేసే వ్యక్తికీ ఏబది ఏండ్ల పైనే యుంటుంది. భయముతో దిగులు పెట్టుకుని జ్వరము తెచ్చుకున్నాడు. అప్పుడు అతడిని మా అమ్మ పిలిపించింది. వేడి వేడి గా అన్నము పెట్టింది. మా అమ్మ , నాన్న ఇద్దరూ, ఇన్నాళ్ళు పని చేస్తున్న మిమ్ములను నమ్మక పొతే ఇంక ఎవరిని నమ్ముతాము? ఎవరేమన్నా పట్టించు కోవద్దు.. అని చెప్పి పంపించినారు. అప్పటి, ఆ ప్రేమలు, ఆపేక్షలు ఇప్పటి జనానికి అర్థము అవుతాయా?    
          ఈ విధముగా మనము చెప్పే విద్యలు ఎక్కవలసినది బుర్రకు కాదు, మనసుకు.  మా మాస్టారు ఒక ఉన్నత విద్యా సంస్థలో పని చేసి పదవీ విరమణ చేసినారు. ఆయన చెప్పిన ఒక విషయము: ఒక జర్మన్ ప్రొఫెసర్ తో సోక్రటిక్ విద్యా విధానము గూర్చి అడిగితే ఆయన మీరు పూర్తిగా మరిచి పోయిన ఉపనిషదిక్ పధ్ధతి మించిన విద్యా విధానము ఎక్కడుంది? అని తిరిగి ప్రశ్నించినాడుట. అందులో శాస్త్ర విదానముతోబాటు శీల గుణాలకుఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినారు.
          కృష్ణ యజుర్వేదములో శిష్యుడికి చదువు అయిపోయిన తరువాత కొన్ని నియమాలను బోధిస్తాడు. అందులో కొన్ని,
మాతృ దేవో భవ|
పితృ దేవో భవ|
ఆచార్య దేవో భవ|
  అందులో మనకు అంతర్లీనముగా తన బిడ్డలు ఎక్కడ ఎలా కష్ట పడుతున్నారో,తపన పడే తల్లి ని,
బిడ్డ ఎలా కష్ట పడినా ఫరవాలేదు, విద్యావంతుడు కావాలనుకొనే తండ్రిని,  శిష్యుడికి ప్రధానమయినది  జ్ఞానార్జన,దాని కోసము నిప్పుల్లో పడినా ఫరవాలేదు, నేను రక్షించుకోగలను అన్న ధీమాతో జీవించే గురువును ఏ రీతిలో గౌరవించాలో
చెబుతారు. వీరే శిష్యుడికి మొదటి దేవుళ్ళు. ఇదే మన ప్రాచీన భారతీయ సాంప్రదాయానికి మూల స్తంభాలు. ఈ నాదు మన  పిల్లలకు ఇటువంటి ఆలోచనలను ఈయ గలుగుతున్నామా?
          అందులోనే సత్యం వద , ధర్మం చర  అని శిష్యుడిని ఆదేశిస్తాడు. అంటే సత్యమునే పలుకుము, ధర్మమునందే సంచ రింపుము,అని.
          స్వాధ్యాయాన్మా ప్రమదః అని బోధిస్తారు, అంతే కాదు. స్వాధ్యాయ ప్రవచానాభ్యాం నా  ప్రమదితవ్యం అని ఆదేశిస్తారు. మొదట నిరంతరమూ, చదువుకొనుట మరియు అవగాహన చేసుకొనుటలో పొరపాటు పడ వద్దు. అంటే కాదు,నీవు నేర్చుకున్న దానిని ఇతరులకు చెప్పుటలో కూడా పొరపాటు పడ వద్దు. అని చెబుతారు. ఇక్కడ స్వాధ్యాయము అంటే పుస్తక/విజ్ఞాన భాండాగారాలను బుర్రకు ఎక్కించడము మాత్రమే కాదు, శీల గుణ వ్యవహారాలలో తనను కూడా నిరంతరము తనను అధ్యయనము చేసుకోవాలి. ఇవి అన్నీ కూడా కలిస్తేనే విద్య అవుతుంది.
          ఇవి అన్నీ లేక పొతే అది చదువు అవుతుంది. విద్య చదువు ఒకటి కాదా? వేర్వేరేనా? అంటే ఆంగ్ల భాషలో కూడా వేర్వేరు పదాలున్నవి. రీడ్ అంటే చదువుట, స్టడీ అంటే అధ్యయనము చేయుట. స్టూడెంట్ అంటే అధ్యయనము చేసే వాడు, అంతే, కానీ, రీడ్ చేసే వాడు కాదు. ఒక పాఠ్య గ్రంథాన్ని మొదటి నుండి అర్థము చేసుకోకుండా అప్ప చెప్పే వాడిని స్టూడెంట్ అని అన కూడదు, రీడర్ అని అన వచ్చు అనుకుంటాను. 
          ఒకప్పుడు మంచి శిష్యుడి కొఱకు గురువులు ఎంతో ఎదురు చూచే వారు. తరువాత కాలము లో మంచి గురువు కోసము శిష్యులు వారణాసి, ఉజ్జయిని లాంటి స్థలాలకు వెదుకుతూ వెళ్ళే వారు. కానీ ఈ నాడు, పాథ శాలలు బాగా పెరిగినవి, కానీ, మంచి, గురువు, మంచి శిష్యుడు, దొరకడము కష్టముగానే యున్నది. కారణము ఒకటే, మన విద్యా వ్యవస్థ లో శీల నిర్మాణము పై తగ్గిన శ్రద్ధ.
          విద్య లక్ష్మి తో కూడుకున్నది. అందుకనే దానికి శ్రీ విద్య అని పేరు వచ్చినది. ఆ లక్ష్మి, మనము సృష్టించినది కాదు. ధనమగ్ని ర్ధనం వాయు ధనం భూతాని పంచచ అన్న ఋషి వాక్యమును గమనిస్తే మనము సక్రమముగా యుంచిన ప్రకృతే మన సంపద. మనము సృష్టించుకున్న కోట్ల రూపాయల సంపద యున్నా కంపు కొట్టే వాతావరణములో ఉండ లేము కదా!

          కానీ ఈ నాడు చదువు భౌతిక మయిన సంపదతో సంబంధాన్ని కలిగి మానవత్వానికి దూరముగా పోతున్నది.  అందుకే దాన్ని శ్రీ చదువు అందాము. ఇది త్వరలో శ్రీ విద్యగా మారే రోజు కోసము ఎదురు చూస్తాము.  

Friday, December 20, 2013

సిధ్ధార్థ

                                                                                     

           సిధ్ధార్థ అందగాడే కాదు, గుణవంతుడు కూడా, పసి తనములో తల్లి దండ్రులను కోల్పోయినాడు. కానీ అనాథ గా మాత్రము లేడు. ఊళ్ళో అందరికి సాయము చేస్తూ, వారి అండతో, వారిలో ఒకరిగా పెరిగినాడు. తను ఎవ్వరి మాటను కాదనడు. అందుకని పెద్ద వాళ్ళ ప్రేమకు పాత్రుడయినాడు. బాగా మృదు స్వభావి, అందరితో ప్రేమగా మాట్లాడుతాడు. అది కూడా అవసరముంటేనే. స్త్రీలతో కూడా లల్పించుకొని మాట్లాడే వాడు కాదు. అందుకని, వారు కూడా సిధ్ధార్థ మీద ప్రేమాభిమానాలు చూపేవారు.
           వయస్సు పెరిగే కొద్దీ, ఆకర్షణ పెరుగుతున్నది. కానీ, మాట తీరు, స్వభావములో మార్పు రాలేదు.
అందుకని, ఆ వూళ్ళో, చాలా మంది చిన్నప్పటి నుండి తమ మధ్య పెరిగిన సిధ్ధార్థను అల్లుడిగా చేసుకోవాలని భావిస్తున్నారు. తల్లి దండ్రుల మాటలను విన్న అమ్మాయిలు కూడా సిధ్ధార్థ చేత ఆకర్షితులయినారు, కానీ సాంప్రదాయము కట్టుబాటు వలన వారు బయట పడ లేదు.
            ఊరంతా కోలాహలముగా ఉన్నది, జనమంతా చాల సంబరముగా యున్నారు. దీపంకర బుధ్ధుడు ఊరికి వచ్చి యున్నాడు. కొంతమంది ఆయన మీద ప్రేమతో అభిమానముతో వస్తే, మరి కొందరు ఆయన ప్రవచనము వినాలని వచ్చినారు. కొందరు ఆయన సాన్నిహిత్యము కొఱకు వచ్చినారు. ఎక్కువ మంది మాత్రము వాళ్ళ కష్టాలను ఆయనకు విన్నవించుకొనుటకు అవకాశము వస్తుందని, లేదా ఆయన దర్శనముతోనే తమ కష్టాలన్నీ తీరి పోతాయనీ వచ్చినారు. ఆయన కొఱకు ఒక వేదిక నిర్మించ బడినది. వేలాది మంది జనము ఆయన దివ్య దర్శనము కొఱకు వేచి చూస్తున్నారు.
            సిధ్ధార్థకు దీపంకర బుధ్ధుడిని దర్శనము చేసుకోవాలని యున్నది. కానీ, పెద్ద వారి దగ్గిఱకు వట్టి చేతులతో వెళ్ళ గూడదనే నియమాన్ని పాటిస్తున్నాడు. ఆ నాడు తన దగ్గిఱ ఏ మాత్రము డబ్బు లేదు. ఎవరినీ అడుగ లేక పోయినాడు. నెమ్మదిగా సమావేశ స్థలానికి నడుస్తున్నాడు. దారిలో ఒక అమ్మాయి తామర పూల కట్ట తో సమావేశము వైపు వెళ్ళుతున్నది.
            సిధ్ధార్థ ఆ అమ్మాయిని ఒక తామర పూవును ఇమ్మని అడిగితే బాగుంటుందని అనుకున్నాడు. దగ్గిఱకు వెళ్ళి, లౌక్యము తెలియని రీతిలో,
             " అన్ని పూవులు తీసుకొని వెళ్ళుతున్నావు. ఒకటి నాకు ఇవ్వ వచ్చు కదా" అని అడిగాడు.
             "బాగుంది, నేను నీకు ఎందుకు ఇవ్వాలి?"
             "బుధ్ధుడికి సమర్పణ చేసుకుందామని."
            "అలాగా! అయితే నాకేమిటి లాభము?"                       
            "ఇంతకూ, నీకు ఏమి కావాలి?"
            "ఏమి అడిగినా ఇస్తావా? అయితే, నన్ను పెళ్లి చేసుకో"              
          ఆ అమ్మాయి అడిగినది. తను కూడా ఒక పేద అమ్మాయి అయినప్పటికి సిధ్ధార్థ ఆకర్షణ లో ఉన్నది.
తనది అత్యాశ అనిపించినా అతడిని పెళ్ళి చేసుకొని జీవితము పంచుకోవాలన్న కోరిక ఎంతో లోతుగా యున్నది.
ఆ అమ్మాయికి ఇంకో విషయము తెలుసు, సిధ్ధార్థ మాటకు కట్టుబడే వ్యక్తి అని.
            "అలాగే " ,అంటూ ఒక పూవును తనే లాగేసుకున్నాడు. ఆమె చెప్పిన దానికి ఒప్పుకున్నాడు, కాబట్టి, అలా చేయడము తప్పని అతడికి అనిపించ లేదు.
            సమావేశము దగ్గిఱకు వెళ్ళినాడు. వేలాది మంది, వేర్వేరు ఉన్నతమైన స్థితులలో యున్న వారు
ముందు వరుసలలో యున్నారు. వారి దృష్టి అంతా బుధ్ధుడిమీదే యున్నది. సిధ్ధార్థకు ముందుకు వెళ్ళాలని అనిపించినది. కానీ, అలా వెళితే, చాలా మంది భాధ పడుతారని అనిపించినది. అందుకే ఏమి చేయ వలనో తెలియ లేదు. పుష్పాన్ని తన చేతులతో ఈయ వలెనన్న కోరిక ఎంత కష్టమో తెలిసినది.
            తన బలమంతా ఉపయోగించి ఆ తామర పూవును బుధ్ధుడి మీదకు విసరి వేచినాడు. అప్పుడే ఒక విచిత్రము జరిగినది. మామూలుగా అయితే పది అడుగులు కూడా ముందుకు వెళ్ళని తామర పూవు నేరుగా ముందుకు వెళ్ళినది. దీపంకర బుధ్ధుడి తల పైన అలంకారము వలె గాలిలో నిల బడినది. అందరూ అది చూచి ఆశ్ఛర్య పోయినారు.
            అపుడు బుధ్ధుడు ఆ యువకుడిని తన శిష్యుడికి చూపించి దగ్గిఱకు పిలువమని ఆదేశించినాడు.
అన్ని వేల మందిలో అతడిని చూపించినాడు.
                సిధ్ధార్థ కు ఒక అద్భుతమైన అవకాశము వచ్చినది. బుధ్ధుడికి దగ్గిఱగా నిలబడినాడు. బుధ్ధుడు అతడిని ఆశీర్వదించినాడు, ఏవో చెప్పినాడు. తనున్న తన్మయ స్థితిలో బుధ్ధుడు చెప్పినవేవీ సిధ్ధార్థకు అర్థము కాలేదు. బుధ్ధుడు ఇక వెళ్ళి రమ్మన్నాడు. సిధ్ధార్థ ఒక మైకములో యున్నాడు. అక్కడ జరుగుతున్న విషయాలేవీ అతడికి తెలియుట లేదు. అదే మైకముతో తనున్న గదికి వచ్చినాడు.  లోపలికి వెళ్ళి పద్మాసనములో కూర్చున్నాడు.
            ఆ స్థితిలోనే ధ్యానములోనికి వెళ్ళినాడు. తన జీవితమంతా ఒక నాటకము వలె కనబడినది. తనకు తెలియని ఎన్నో లోకాలు కనబడినవి. అక్కడంతా తన ఉనికి కనబడినది. చివరలో దీపంకర బుధ్ధుడు దర్శనము ఇచ్చినాడు. ఆయన మాటలు ఇప్పుడు స్పష్టముగా వినబడుతున్నవి.
            "సిద్ధార్థా! నీవు ఉన్నతమైన పరిణామ స్థితిలో యున్నావు. నా తరువాత ఈ బుధ్ధత్వము అందుకొనే వాడవు నీవే. ఎంతో మందిని ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి లోనికి తీసుకొని వెళ్ళుతావు.
            ఇంత వఱకు నీ సాధనలో ఇతరులతొ ఉన్న కర్మ బంధాలను అన్నీ ఛేదించుకున్నావు. ఆ విధముగా నీవు ముక్తుడివే. కానీ, ఇంకా కొన్ని జీవితానుభవాలకోసము నీ కింకా వైవాహిక జీవితము అవసరము. నీవు  ఎవరి దగ్గిఱ అయితే మాట ఇచ్చి పుష్పాన్ని తీసుకున్నావో, ఆ అమ్మాయితో నీకు కర్మ బంధము ఏఱ్పడినది. అది నీ పొరపాటు వలన కాకుండ మా సంకల్పము వలన జరిగినది. ఇంక నీవు బుధ్ధత్వము అందుకొనే జన్మ వఱకూ తనే నీకు భార్యగా యుంటుంది. ఆమె కూడా ఉత్తమురాలు. నీవడిగినపుడు ఆ పుష్పము నాకు సమర్పణ కోసమని ఎంతో సంతోష పడినది. అందు వలన ఇద్దరి మధ్య యున్న బంధము పైకి లౌకికముగా కనిపించినా అది ఆధ్యాత్మికముగానే యుండి ఇద్దరి యున్నతికి తోడ్పడుతుంది. మీకు నా ఆశిస్సులు."
                        సిధ్ధార్థ మత్తులోనుండి బయట పడినాడు. దైవ సంకల్పము వలన ఏమో ఆ పూలు అమ్ముకొనే అమ్మాయి మీద ఆకర్షణ ఏర్పడినది. కానీ, తటస్థముగా యుండి పోయినాడు.
            ఉదయాన్నే సాధనను పూర్తి చేసుకున్నాడు. బయటకు వెళ్ళ పోతుంటే ఒకరు వచ్చి, ఇలా చెప్పినాడు.         
"నాయనా! సిధ్ధార్థా!  ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. నేను చాలా పేద వాడిని. నిన్న బుధ్ధుడు నన్ను పిలిచి చెప్పినాడు. మా అమ్మాయి యశొధరను నీకు ఇచ్చి పెళ్ళి చేయాలని అది ఆయన సంకల్పమని."
            ఆ రకముగా సిధ్ధార్థుడికి ఆ పూలు అమ్ముకొనే అమ్మాయికి పెళ్ళి జరిగినది. అది జన్మ జన్మల బంధముగా నడచినది.
                         ************************
(ఇది లలిత విస్తారము అంబడు బౌధ్ధ పురాణము లో నున్న గౌతమ బుధ్ధుడి పూర్వ జన్మ  కథ.. శ్రీ ఎక్కిరాల వేదవ్యాస గారి రచన నుండి స్వీకరించ బడినది. ఆ జన్మ లో వారి పేర్లు మాత్రము గౌతమ బుధ్ధుడి జన్మ లో పేర్లతో వ్రాయ బడినది.
          అజంతా చిత్రాలలో బుధ్ధుడికి పైన ఒక తామర పూవు గాలిలో నిలబడి యుంటుంది. అది ఈ కథకు సంబంధించిందే          అజంతా చిత్రాలలో బుధ్ధుడికి పైన ఒక తామర పూవు గాలిలో నిలబడి యుంటుంది. అది ఈ కథకు సంబంధించిందే)
                   

Wednesday, December 18, 2013

ఓంకారము

          
ఏదీ ఆ ఓంకార ప్రణవ నాదం
ఏదీ ఆ దివ్య అరుణ రాగం?
మానవులందరి ఎదలో మెదలే
ఆనంద రాగం ఏదీ? ఏదీ?

సుషుప్తి నుండి మేలుకొలిపే
గుడి గంటలు ఏవీ? ఏవీ?
మంచిని కోరీ ఆచరించే
మానవతా  మూర్తులు ఏరీ?

ఆశా మోహం రాగం ద్వేషం
అలుము కొన్నవా నాల్గు మూలలా
అనురాగ భావనల దివ్య దీధితులు
చెదిరి పోయెనా ఈ నాడు?

మనిషిని మనిషి ద్వేషించేనా
దేశపు ప్రగతి నిలిచేను
దేశము దేశము ద్వేషించేనా
మారణ కాండ సాగేను
ప్రేమభావనలు వెల్లి విరిసినా
వెదజల్లే ప్రకృతి నవ్వులు
హరిత రాగము అంతట నిలబడి
అందించేను చేతులు
ఈ భావనలంతా వెద జల్లే
మహా పురుషులకు జోతలు.


Monday, December 16, 2013

ఆ రోజుల్లో

                                                 

మా ఊరు పేరు పైనాంపురం. ఈ సంఘటన సుమారుగా  యాభయి సంవత్సరాల నాటిది. మా అక్కయ్య  గూడూరులో యున్నది. నెల్లూరు వెళ్లి అక్కడనుండి గూడూరు వెళ్ళాలి.  మాకు నెల్లూరు వెళ్ళడము కూడా కష్టమే.
ఎందుకంటే బస్సు సౌకర్యాలు సరిగా లేవు. మా ఊరికి నేరుగా బస్సు లేదు.  మా అమ్మ, నేను, మా రెండవ అక్కయ్య ఎడ్ల బండి మీద బయలు దేరినాము. మా మొదటి మజిలీ వరకవిపూడి. గంట సేపు ఎదురు చూసినా బస్సు  రాలేదు. ఇంక బస్సు రాదన్నారు. తిరిగి బండి ఎక్కి ఈదూరు వెళ్లినాము. అక్కడ ఒక గంట ఎదురు చూచినా బస్సు రాలేదు. అక్కడ కూడా ఇంక బస్సు రాదేమో యన్నారు.
          మళ్ళీ మామూలే. బండి ఎక్కి తరువాత మజిలీ తోటపల్లి గూడూరు చేరినాము.  అక్కడ నుండి వరిగొండ మీదుగా నెల్లూరుకు బస్సుయున్నది. సరిగ్గా అప్పుడు మిట్ట మధ్యాహ్నము అయినది. అది భోజనము సమయము.
          ఎదురుగా ఒక ఇల్లు యున్నది. వాళ్ళు సుమారుగా గంట నుండి మమ్ములను గమనిన్చినట్లున్నారు. వచ్చి, మమ్ములను భోజనానికి రమ్మన్నారు. మాకేమో కాస్త మొహమాటము గా యున్నది. అసలు వాళ్ళెవరో తెలియదు. అందుకే మేము అందుకు సిద్ధముగా లేము.
          కాని వాళ్ళు,మీరు గంట నుండి ఇక్కడ యున్నారు. భోజనము చేసినట్లు లేదు. ఎదురుగా భోజనము లేకుండా మిమ్ములను పెట్టుకొని మేమెలా భోజనము చేయ గలము? అన్నారు.
          ఇవీ ఒకప్పటి పల్లెటూర్లు. ఆ విలువలు, ఆప్యాయతలు ఇంకాఉన్నాయంటారా? ఏమో? మాకు అక్కడ భోజనము చేయక తప్ప లేదు.
          ఇవీ ఒకప్పటి  పల్లెటూర్లు.