Sunday, April 15, 2012

శిల్పి 10





          హేమ సంగతి అందరూ మరచి పోయినారు.
                 హేమ కు బావ అంటే ఎప్పుడూ అభిమానమే. కానీ తను ఎప్పుడూ బయట బడ లేదు. అంతకు మించి మరే ఆలోచన లేదు. ఉద్యోగములో ఉండే హోదా అంటే అభిమానమే, ఆకర్షణ కూడా ఉన్నది.  అందుకే శ్రీనాథుడితో వివాహ ప్రస్తావన రాగానే చాలా సంతోష పడినది. ఎన్నో బంగారు కలలను కన్నది.తన హృదయములో బావ రూపాన్ని పెట్టుకొని ఆరాధించినది.
          బావ వచ్చిన నాడు స్వతస్సిద్ధమైన లజ్జతో తనేమీ మాట్లాడ లేక పోయినది.  కానీ బావ ఉద్యోగము పోయినదనగానే తన కలల సౌధము కూలి పోయినట్లు బాధ పడినది.
           ఆ సమయములో తను ఓదార్పు మాటలు చెప్ప వలసి యున్నది. కానీ, తను నోరు మెదప లేదు. నీకు నేను తోడుంటానన్న  మాట రాలేదు. ఇంతలో బావ వెళ్ళీ పోయినాడు
            ఆవేదనతో అలసి పోయినది. మరునాడుదయము ఇల్లు  శుభ్ర పరుస్తుంటే పాల రాతి విగ్రహము దొరికినది. నాన్న దీన్ని ఎప్పుడు చెక్కినాడు? తనకు తెలియదేవిగ్రహము తీసి చూచినది. విగ్రహము మీద తన పేరు, శ్రీ నాథుడి పేరు ఉన్నది. అంటే ఆ రోజు బావ ఈ విగ్రహాన్ని ఇక్కడే వదిలి పెట్టి వెళ్ళినాడు అని తెలిసినది.
            ఎప్పుడొ ఎవరో ఒక మహా కవి పలికినాడు. "ప్రియుడి దగ్గిఱకు తీసుకొని పోవుటకు పల్లకి వచ్చిందని కాదు, సంతోషము. ఆ పల్లకిని ప్రియుడే స్వయముగా పంపించినాడుట." ఉద్యోగాలు, హోదాలు ఎన్నో వస్తాయి, పోతాయి, కానీ, మనసులో నిలిచిన మమతానుబంధాలు ఎక్కడికి పోతాయి?
            నాన్నగారు రాగానే జరిగినదంతా చెప్పినది. అప్పుడే నాన్నగారు మరో విషాద వార్త చెప్పినారు, బావ ఊరు వదిలి వెళ్ళినాడుట.
            కొన్నాళ్ళూ పైకి చెప్పుకోలేక రాత్రింబవళ్ళూ ఏడిచినది.  ఒక రోజు రామాచార్యులు వచ్చినారు. తనను దగ్గిఱకు పిలిచినాడు.
            "అమ్మా! హేమా! నీ బావ తప్పక తిరిగి వస్తాడు. నీ మనసును గుర్తిస్తాడు. " అని హామీ ఇచ్చినాడు. ధైర్యము చెప్పినాడు.  కొన్ని నెలలు గడిచినవి.
            శ్రీనాథుడు తిరిగి వచ్చినాడు. చూడాలని ఉన్నది,చూచి పలకరించాలని, తన భాధను దించుకోవాలని అనిపించినది. కొన్ని రోజులు సంశయించినది. వెళ్ళాలంటే ఏదో అభిమానము, లజ్జ. ఒక రోజు ధైర్యము చేసుకొని బయలు దేరినది. వాకిట్లోనే రామాచార్యులు ఎదురయినారు. తన మనస్సులో భావనను ఆయన వెంటనే పసిగట్టినారు.
            "అమ్మా! బాగున్నావా?", ఆయన పలకరించినారు.
            "నీ బావ చాలా నేర్చుకొని వచ్చాడమ్మా.", అంటూ శుభ వార్త చెప్పినాడు.
            "నీ బావ నిన్ను మరిచి పోలేదమ్మా", అని అన్నపుడు తన కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి.
            "నీ దగ్గిఱ ఒక భిక్ష కావాలమ్మా!"అని అన్నపుడు మాత్రము ఆశ్ఛర్య పోయినది.
            తన దగ్గిరేమున్నదని వచ్చినాడు. కలలు క్రుంగిన నిర్భాగ్యురాలు తనేమి భిక్ష ఈయ కలదు?
            ఆయన గురుకులానికి అధిపతి, అందరికి మాననీయులు, త్యాగ శీలి. ఆయన ఉద్దేశ్యము ఏమిటో అర్థము కాలేదు.
            ఆయన పాదాలకు నమస్కరించినది. "మీరు నన్నాజ్ఞాపించ వలసిన వారు. మీ మాటను నేనెపుడూ జవ దాటను, చెప్పండి", అన్నది.
            "కొద్ది నెలలు శ్రీ నాథుడికి కనుపించ వద్దమ్మా! ఆతడి వలన ఊరికి, నీకు ఎంతో మేలు జరుగుతుంది."
            కళ్ళల్లో నీళ్ళూ తిరిగినాయి,ఆ నీళ్ళలోనే ఇంకో ప్రశ్న ఉన్నది."ఎందుకిలా నన్ను శాసిస్తున్నారు?"అని.
            ఆయన అర్థము చేసుకున్నారు తన ప్రశ్నను. తన చేయి తీసి ఆయన చెతిలో పెట్టినది."మీ పాదముల మీద ఆన" అన్నది. ఏడుపు పైకి పొంగుతుంటే పమిట కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ లోపలికి పో బోయినది.
            "అమ్మా!హేమా!",పిలుపు విని ఆగినది. ఆమె కళ్ళలో ఒకే ప్రశ్న,ఇంకా నా నుండి ఏమి కావాలి అని.
            "నిన్ను నేను చాలా భాధ పెడుతున్నాను, నాకు తెలుసు. మీ ఇద్దరి పెళ్ళి నేనే చేయిస్తాను, ఇదే నీకు నేనిచ్చే మాట. శ్రీ నాథుడు ఈ నాడు ఏ పనిని అయినా చేయ గలనన్న ఆత్మ వీశ్వాసముతో యున్నాడు. కృంగి పోయిన సామాజిక పరిస్తితిని చూచి ఆవేశములో నున్నాడు.  నీవిపుడు కనిపిస్తే అతడి దీక్ష సడలుతుందేమోనని సంశయిస్తున్నాను తల్లీ! ఇంక నేను వస్తాను.", అని వెళ్ళి పోయినాడు.
                                       ----------------------------
            భారత  మాత  ఆలయ నిర్మాణము జరుగుతున్నది. అతి ప్రాచీన కాలమునుండి ఈ భూమిని స్త్రీ రూపములో కొలిచినారు. ఆమెను తల్లిగా భావించినారు. మనిషి ఎన్ని రకాల భాధ పెట్టినా సైరించి వారిని మన్నించేది మొదట తల్లి అయితే, రెండవది భూ మాత. అందుకే ఆమె మాతృ రూపములో కొలువ బడుతున్నది.  ఆమె స్వరూపాన్ని దుర్గా మాతగా కూడా కొలిచినారు. ఆ స్వరూపమునే భారత మాత గా కొందరు స్వీకరించినారు.
            ఆలయ నిర్మాణము మొదలు పెట్టినది శ్రీ నాథుడే అయినా, ఇప్పుడది సమిష్టి కార్యముగా జరుగుతున్నది. ఊళ్ళో అందరి తోడ్పాటు ఉన్నది.
            ఊళ్ళో చాలా మంది చూచి వస్తుంటే తనూ చూచినది. బావకు కనిపించకుండా వెనుకకు వచ్చేసినది. బావే కళ్ళ ముందు మెదులుతున్నాడు. గుబురుగా పెరిగిన గడ్డముతో, సున్నితమైన చూపులతో తల ఎత్తకుండా పని చేస్తున్నాడు. ఎంత అదృష్టవంతుడోఆపేక్షతలు, బంధాల అవధులను ఎప్పుడో దాటి వేసాడని అనిపిస్తుంది. ఇలా కొన్ని నెలలు గడిచినవి.
            రాజు బలహీనుడయినాడు. దొంగలు, దోపిడి దార్లుపెరిగి పోయినారు.ప్రజలకు రక్షణ పోయినది. రాజ్యములో ప్రశాంతత పూర్తిగా పోయినది. జాతి అంతటికి ఉప్పెన వచ్చేసినదా అనిపించినది.
            వర్గ, కుల భేదాలు ప్రతి పల్లె లొనూ పెరిగి పోయినవి. ఊళ్ళో పది మంది ఉంటే ఇరువది మంది నాయకులు తయారు అయినారు. దానితో సమగ్ర రక్షణ అనే దానికి అర్థము లేకుండా పోయినది.
            దీనితో కొన్ని దోపిడి మూకలు విజృంభించినవి. స్త్రీ మాన, ధన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయినది. మత ద్వేషము పేరుతో దేవాలయాలు ధ్వంసము చెయ బడుతున్నవి.
            భాగవతములో ఋషభోపాఖ్యానములో ఒక వివరణ ఉన్నది. ఒకప్పుడు ప్రతి మనిషి లో దైవమును గమనించి నమస్కారము చేసే వారుట. తరువాత పతన స్థితి ఏర్పడిన తరువాత ఉత్తమ స్థితిలో నున్న వారిని మాత్రమే దైవ రూపముగా బావించే వారుట. అటు తరువాత తమ తోటి వారిలో దైవత్వము గుర్తించ లేక ఉత్తములయిన పూర్వీకులకు ప్రతీక గా వారి రూపమును ఏర్పరిచి ఉపాసన చేయడము మొదలు పెట్టినారు. ఇదే తరువాత విగ్రహారాధనగా మారినది. దీని వలన మంచి పరిణామము వచ్చినదే కాని నష్టము జరుగ లేదు. 
            మత ద్వేషముతోడు వచ్చిన వారు దేవాలయాల విధ్వంసముతో బాటు, ఒక్కొక్క పల్లెను దోచుకుంటున్నారు. ఎదురు తిరిగే వారు లేరు. ఒకరిద్దరు ఎదురు తిరిగినా వారికి బలి అవుతున్నారు. పల్లెటూర్లు ధ్వంసము అవుతున్నాయి.
            ఉదయాన్నే ఎవరో ఒక వార్తను మోసుకొని వచ్చినారు. పాతిక మైళ్ళ దూరములో ఒక ఊరు పూర్తిగా దోపిడి చేయ బడినదట. ఎందరినో పిల్లలు, వృద్ధులు అని లేకుండా  పొదిచి వేసినారుట. స్త్రీలను అవమానించినారుట. ప్రేత భూమిలా మారిన ఆ పల్లె లోనే విందులు చేసుకుంటున్నారుట.
             ఊరిలో అంతా భయము పెరిగినది. కొంత మంది ఊరు వదిలి వెళ్ళి పోతామంటున్నారు. కొంత మంది ఎదిరిద్దామంటున్నారు.  మఱి కొంత మంది వచ్చిన తరువాత చూద్దామంటున్నారు.అందరి గుండెలలో ఆ ఆశ్వికుల గుఱ్ఱాల గిట్టల చప్పుడే వినిపిస్తున్నది. ఎవరూ ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారు.
            కొంత మంది శ్రీ నాథుడిని ఊళ్ళోకి వచ్చేయమన్నారు. కానీ శ్రీ నాథుడిది ఒకటే మాట. రక్షించుకోవాలంటే అందరూ ఒకటయి వారితో పోరాడాండి, అంతే కానీ, పిరికి పందల్లా ఇళ్ళల్లో దాక్కొని జాతిని అవమానాల పాలు చేయకండి. తను మాత్రము ఈ స్థలాన్ని వదిలి రానన్నాడు. ఎవ్వరికీ భయ పడి తన పనిని మాననన్నాడు.