Monday, May 23, 2011

శిల్పి 4


(శిల్పి ౩ నుండి )
తను కోరినది కాక  పోయినా      
తృప్తిని కల్గించినది.
తనకానందము కలిగే రీతిలొ
ఫలితము దక్కినది.
కలలు కన్న జీవితము
దరికి తను చేరెను నేడు
ప్రజకు తను చేసినది
తృప్తిని చేకూర్చినది.
        శ్రీ రామ రాయ భూపతి రాజు గారి పేరు. వయస్సు ఏబది సంవత్సరాల పైనే యుంటుంది, గంభీరముగా యుంటాడు, కానీ, ఉదాత్త స్వభావి.
       వచ్చిన యువకులనందరిని స్వయముగా ప్రశ్నించినాడు. కొంత మందిని తన అధీనములో యున్న విధులలోనే తీసుకున్నాడు.  వారందరిలో శ్రీ నాథుడు అగ్ర స్థానములోనే యున్నాడు. అతడికి ఆర్థిక మరియు విద్యా వ్యవహారాల భాధ్యత అప్ప చెప్ప బడినది. తన క్రిందనే యుంటాడు కాబట్టి ప్రత్యేక శిక్షణ అవసరము లేదనుకున్నాడు.
     రాజ ధానిలోనే అందరికి నివాసాలు ఏర్పరుప బడినవి.కొత్తగా చేరిన ప్రతి వ్యక్తి తోనూ చేయ వలసిన కార్యక్రమాల గురించి చర్చించే వాడు. వారి జవాబులను బట్టి వారి వ్యక్తిత్వాలను అంచనా వేయడానికి ప్రయత్నించే వాడు. అపుడపుడు అందరిని కలిపి సలహాలను తీసుకొనే వాడు.
      ఆ సమయములోనే రామాచారిగారు రాజధానికి రావడము జరిగినది. అతడికి రాజు గారు స్వయముగా ఎదుర్కొని స్వాగతము చెప్పినాడు. రాజుగారతని నుండి శ్రీ నాథుడి వ్యక్తిత్వమును గూర్చి బాగుగా తెలుసుకున్నాడు. అప్పటినుండి శ్రీ నాథుడి తో తమ అంతరంగిక విషయాలను కూడా చర్చించే వాడు. ఎన్నో సందేహాలను తీర్చే వాడు.
        "ప్రభువు కంటే ప్రజల అవసరాలకు ఎక్కువ విలువను ఇచ్చి ఆ అవసరాలను ప్రభువుకు తెలియ చేసే వాడే నిజమయిన ప్రభుత్వోద్యోగి "అనే వాడు.
          "ప్రధాన నగరాలలో ఎటువంటి వారికి ఆకలి భధ యుండకూడదు. ఎందుకంటే రాజ్యము యొక్క గౌరవ మర్యాదలను, సంస్కృతిని బయటి ప్రపంచానికి తెలిసేది వారి ద్వారానే."
          "ఆకర్షణియమన శిల్ప కళ ప్రభుత్వ సత్రాలలో కూడా కనిపించాలి. అవి సంస్కృతిపై గౌరవ మర్యాదలను పెంచుతాయి. అంతే గాక కళాకారులకు, శిల్పులకు జీవనోపాధిని కూడా కలిగిస్తాయి."
      " ముందు తరాలలో ప్రజల యొక్క దేశము యొక్క గౌరవ మర్యాదలను ప్రజలు తెలుసుకోవాలి. ఆ తరాల పాలకుల విశిష్థతను వారు అర్థము చేసుకోవాలి. మన యొక్క ఘన ఫలితాలను ముందు తరాల వారు తెలుసుకున్న నాడే మన సంస్కృతి నిలుస్తుంది. మనోహరముగా హృద్యముగా ఈ పనిని నిర్వర్తించ గలిగిన వారు కళాకారులే. వక్రత లేని కళాకారుడెవరయినా రాజ్య పరి రక్షణకు తోడ్పడుతాడు."
       పదే పదే రాజు గారు ఈ అభిప్రాయాలను వెల్లడించే వాడు.
          శ్రీ నాథుడు వేర్వేరు ఉప శాఖలలో పని చేసినాడు, చాలా విషయాలను తెలుసుకున్నాడు. రాజుగారి ఆదేశము మీద రాత్రిళ్ళు మారు వేషములో నగరులో పర్యటించే వాడు. ప్రతి విషయాన్ని పూర్తిగా పరిశీలించి రాజు ముందుంచే వాడు.
      తనకు క్షణము తీరిక లేదు, అయితే ఏమి? తను నేర్చుకున్న దానికి సార్థకత లభిస్తున్నది. రాజుగారి మన్నన యున్నది, తన  నిర్ణయాలకు విలువున్నది. మనస్సులో తృప్తి యున్నది. అన్నిటికి మించి గురువు గారి అపారమైన ఆశిస్సులున్నవి.
          రాజ ధానిలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి.  నూతన భవన నిర్మాణాలు జరిగేవి.  వాటిని సావధానముగా చూచుటకు వ్యవధి యుండేది కాదు. అందుకే కళల మీదకు దృష్టి పోవుట లేదు.
        నిద్రా సమయానికి ఇల్లు చేరే వాడు. పోతన భాగవత తాళ పత్ర ప్రతి తన దగ్గిర ఒకటి యున్నది. అందులో ఒక రేకు చదివేసరికి నిద్ర వచ్చేది. అలాగే నిద్రించే వాడు.
       తండ్రి నుండి, వీరభద్రయ్య నుండి ఒకే సారి ఉత్తరము వచ్చింది. "హేమను వివాహము చేసుకొనుతకు అభ్యంతరము ఏమయినా యున్నదా?" అని. హేమ అంటె అందాల ప్రోవు, తన కలల రూపము. అందుకే మీ ఇష్టమే నా ఇష్టమని వ్రాసి పంపినాడు.
          ఇక మానసికముగా ఎలాటి చింతా లేదు.బ్రతుకు పూల బాటగా మారినది. తను కోరుకున్నది దొరకక పోయినా దొరికినది బంగారు బ్రతుకే. నిశ్చయ తాంబూలాలకు కూడా తనను రమ్మన్నారు.ఇంకా ఒక మాసము కాలమున్నది.
      ప్రముఖ రాజోద్యోగిగా హోదా యున్నది. అనుకున్నది చేతి కందుతున్నది. హేమకు మంచి బహుమతి ఇవ్వాలనుకున్నాడు. నగిషీలతో మెరిసే చీరల? బంగారు ఆభరణాలా? నల్లని కురులకు జడ గంటలా? వారము రోజులు ఆలోచించినాడు. ఇవేమీ కాదు, పాల రాయి మీద హేమ బొమ్మ చెక్కాలని. మేలయిన పాల రాయి మీద వారము రోజులు శ్రమించి శిల్పాన్ని చెక్కినాడు.  ఎంతో మురిపముగా చూచుకుంటూ దానిని జాగ్రత్త పరచినాడు.
     ఆ రాత్రి కల వచ్చినది. ఆ కలలో హేమ కనిపించినది. తను చెక్కిన శిల్పాన్ని హేమకు ఇచ్చినాడు. దానిని తీసుకొని, "జీవము లేని రాయికి జీవము నిచ్చినావు", అని పొగడినది. " నీకు తోడుగా, నీడగా , నీలో యుండే కళాకారుడికి ఊపిరిగా నిలుస్తానన్నది."
        హఠాత్తుగా ఏదో హడావుడి, నగరమంతా కాంతి హీనమయినది.
(ఇంకా ఉన్నది )

Monday, May 16, 2011

శిల్పి 3


      
(శిల్పి 2 తరువాత భాగము)
   తలచినది వేరు, ఎదురైనది వేరు
   ప్రకృతిలో భాగముగా పర్వశించి బ్రదుకాలని
   తలచినాడు కాని తనకు
   అందిన జీవితము వేరు
   ఎదలో నావేశము ఒక వైపు
   తనవారిలొ ఆశలు ఒక వైపు
   భాధ్యతలు బంధించగ
   మారేను బ్రదుకు గతి.
              శ్రీ నాథుడు ఇప్పుడు ఒక సాధారణ విద్యార్థి కాదు. మాట నిలబెట్టుకోవాలన్న తపన ప్రతి క్షణము మదిలో మెదులుతుంటే చాలా శ్రద్ధగా చదువుతున్నాడు. తర్కమును, అర్థ శాస్త్రమును లౌకిక అవసరాలకొరకు,  దర్శన ఆగమాలను పారమార్థికత కొరకు అభ్యశిస్తున్నాడు. కొద్దికాలము లోనే  సహ విద్యార్థులందరిని దాటినాడు.
           మాట నిలబెట్టుకున్న శ్రీనాథుడంటే ఆచార్యుల వారి కెంత గౌరవమో, తన బిడ్డను దారిలోనికి తెచ్చాడని
విశ్వ కర్మ కు ఆచార్యుల వారంటే అంత గౌరవము.
            విద్యా దీక్ష చాలా వరకు ముగిసినది. శ్రీ నాథుడు ఇపుడు ఇరువది ఐదు ఏండ్ల యువకుడు. ఉదయమంతా శాస్త్రాధ్యనము, మధ్యాహ్నకాలములో ఏదొ యొక చర్చ,  సయంకాలమయేసరికి, ఏ కొండో గుట్టొ ఎక్కి ప్రకృతి పరిశీలన, ఇదే శ్రీ నాథుడికి నిత్య కృత్యమయినది.
         ఇన్ని సొగసులను చూస్తుంటే, భగవంతుడీ ప్రకృతిలో తప్ప మరెక్కడో యుండడనిపిస్తుంది. కడుపు నింపుకుని కలకలా రవములతో అందాల రత్న మాల వలె ఆకాశ వీధులలో పయనించే పక్షులను
చూస్తుంటే, "ఈ ప్రకృతి ఇన్ని సొబగులను ఇన్నాళ్ళూ ఎక్కడ దాచుకుందో?" అనిపిస్తుంది.
        అప్పుడు పదాలు పాటలుగా దొర్లుతుంటాయి, దృశ్యాలు చిత్రాలుగా మారుతుంటాయి. ఈ అందాలను అనుభవించుట చేత కాని వారు, ఆ భగవంతుడికి రూపాన్ని ఎందుకివ్వాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారా? అనిపిస్తుంది. ఈ ఆలోచనలకు తన మీద తనకే నవ్వు వస్తుంది. బహు ముఖ ప్రజ్ఞావంతులయిన వారి
మీద తన లాంటి అల్పజ్ఞుడీ విధముగా అనుకోవచ్చా? యని అనిపిస్తుంది.
        ఇప్పుడు తండ్రికి తన మీద నమ్మకమేర్పడింది, ఇంతకు ముందు వలె తనను చులకనగా చూడటము లేదు. గురువు గారి నుండి తనపై ఎటువంటి ఆరోపణలు లేవు.
              ఆ రోజు సాయంత్రము చీకటి బడగానే ఇంటికి వచ్చినాడు. వాకిట్లో ఊయల బల్ల మీద కూర్చొని,
ఎవరో అతిథితో గట్టిగా మాట్లడుతున్నాడు. మధ్యలో ఎన్నొ చతురోక్తులు, నవ్వులు వినిపిస్తున్నాయి. తను
వాళ్ళను దాటుకొని లోపలికివెళ్ళ పోయినాడు.
         "శ్రీ నాథా! ఇటు రావోయి" , నాన్నగారి పిలుపు వినిపించి అటు తిరిగినాడు.
       "రామా! వీడే మా వంశోధ్ధారకుడు", శ్రీ నాథుడిని పరిచయము చేసినాడు.
       "శ్రీ నాథా! ఈయన రామ రాజు గారని నాకు చిన్నపుడు సహాధ్యాయి. నేనేమో రాళ్ళా వెంట తిరిగితే
తను రాజుల వెంట తిరిగినాడు. రాజుగారు అర్హత గల యువకులను తనకు సలహా దారులుగా తీసుకోవాలని
అనుకుంటున్నాడు. అందుకొరకు వేరు వేరు గురుకులాలకు సమాచారము పంపిస్తున్నాడు. అందులో భాగముగా
ఆచార్యులను కలియుటకు ఇచటికి వచ్చి పూర్వ పరిచయము వలన ముందు నాదగ్గిరకు వచ్చినాడు."
          గౌరవముతొ శ్రీనాథుడు నమస్కరించినాడు.
          "త్రయోదశి నాడు వచ్చిన యువకులను రాజుగారు స్వయముగా పరీక్షిస్తారుట. అక్కడికి బయలు
దేరుటకు సిధ్ధముగా యుండుము", విశ్వ కర్మగారు ఆనతిచ్చినారు.
          "ఒక సారి గురు దేవులతో కూడా ముచ్చటించాలి నాన్నా!"
          "ఆయనేమంటాడోయ్‌. తన ప్రియ శిష్యుడు రాజాస్థానములో నుండడమంటే ఆయనకే గొప్ప గదా!"
         శ్రీ నాథుడేమీ మాట్లాడ లేదు.
         "మరేమీ ఆలోచనలు పెట్టుకోవద్దు. ఎల్లుండే ప్రయాణము. ఆ!"
         "శ్రీ నాథుడు అలాగే నిలబడినాడు.
         "ఇంక వెళ్ళి ప్రయాణము కు కావలసినవి ఏమన్నా యుంటే చూచుకో".
         శ్రీ నాథుడు లోపలికి వెళ్ళీ తల్లితో విషయము చెప్పినాడు.
         "శ్రి నాథా! ఒక్కడివే రాజధానికి వెళ్ళ గలవట్రా?", తల్లి అడిగింది.        .
           "అదేమిటమ్మా? అలాగంటావు? ఎందుకు వెళ్ళ లేను? నా భాధ ఒకటెనమ్మా! అక్కడ ఉద్యోగమే వస్తే, ఊరిని, మిమ్ములను వదిలి దూరముగా వెళ్ళాలనేదే నా భాధ."
            " నా ఉద్దేశ్యము అదేరా. కాని నాన్న మాట కాదనకు."
            "నేను ఎప్పుడు కాదన్నాను", అన్నాడు. ఒక క్షణము ఆగి, "ఒక సారి మామయ్య ఇంటికి వెళ్ళి
వస్తాను, అమ్మా!", అన్నాడు.
            "అలాగే బాబూ! హేమను ఒక సారి రమ్మన్నానని చెప్పు"
                       ----------------------------------
          శ్రీ నాథుడు వెళ్ళేసరికి ఎప్పుడో ఎక్కడో ప్రకృతి తాకిడులకు లోనయిన రాతికి ఒక అందమయిన
రూపాన్ని ఇచ్చే ప్రయత్నములో నున్నాడు, వీరభద్రయ్య. శ్రీ నాథుడిని చూడగనే ఉలిని పక్కన పెట్టి,
లోపలికి ఆహ్వానించినాడు.
       "రెండు రోజుల్లో నేను రాజధానికి వెళ్ళాలి, మామయ్యా!", శ్రీ నాథ్డన్నాడు.
       "హథాత్తుగా ఈ ప్రయాణమేమిటి? ఏమయినా కొలువులో చేరుతున్నావా?"
       "రాజుగారికి అంతరంగిక సలహాదార్లు కావాలని, అర్హత గలిగిన యువకులను పరీక్షకు పంపించాలని
అన్ని గురు కులాలకు సమాచారము వెళ్ళ్తున్నదట. అక్కడికి నన్ను కూడా వెళ్ళమంటున్నారు."
        "చాల మంచి వార్త చెప్పావయ్య, రాజు గారి కొలువులో నయితే బ్రతుకు సుఖముగ గడచి పోతుంది.
హేమా! బావకు ప్రసాదము తెచ్చి పెట్టమ్మా!"
       "అదేమిటి మామయ్యా! మీరు కూడా అలాగంటారు? రాజు కొలువులో ఇక్కడ లేని సుఖము ఎక్కడ
వస్తుంది? అనుదినము బ్రతుకు కత్తి మీద సామే కదా?"
        "అదేమిటి శ్రీ నాథా! అలాగంటావు? ఇక్కడ మాత్రము సుఖమేమున్నది? పని యున్న నాడు డబ్బు,
మిగిలిన రోజులు ఖాళీయే కదా!"
       "మీరు నాకు చాలా నేర్పించినారు. మట్టిలే పొరలే రాళ్ళకు అందమైన రూపాలెలా ఇవ్వాలో నేర్పించినారు.
అస్పష్టమైనదృశ్యాలను అందమైన చిత్రాలుగా ఎలా మలచాలో చెప్పినారు. అదే నోటితో చెప్పండి మామయ్యా! సుఖమంటే ఏమిటో? అందాలు చిమే ప్రకృతిలో మన భావాలకు రూపాలు కల్పించడములో యుండే సుఖము
అనుక్షణము మరొకరి ఆజ్ఞకై ఎదురు చూడడములో, సరిగా చేసినామా లేదా యని అనుకోవడములో  వస్తుందంటారా?"
        "ఊహలు చాలా అందమైన దృశ్యాలే, కానీ ఆకలి వేళల్లో కూడా అవి మనలో ఉంటాయంటావా? బావా!",
నవ్వుతూ పలకరించింది హేమ.    .  
   "ఓ హేమా! చాలా చక్కగా మాట్లాడేస్తున్నావే? మనకలాంటి పరిస్థితి వచ్చేస్తుందని భయమా? నీ లాంటి
గడుసు పిల్లను ఆకలికి మాడుస్తానని భయమా?"
      "మా ట  తప్పించేస్తున్నారు బావా! నిజాయితీగా ఆలోచించండి. మామయ్య లాంటి అయన ఎందుకా విద్యను వదిలివేసి నారు? నీకు శిల్ప కళలో చిన్న విషయాలు  కూడా చెప్ప లెదనే వాడివి. ఏ వ్యక్తి నయితే తను అనుక్షణము అసహ్యించుకుంటాడో అతడి శిలా విగ్రహాన్నే చెక్క వలసి వస్తే, మనస్సును  చంపుకో లేక, ఆ బొమ్మను చెక్కిన చేతులకు సజీవ శిల్పాలను చెక్కే అర్హత  లేదనుకున్నాడు. సుత్తిని, ఉలిని తిరిగి చేతిలోనికి తీసుకోలేక పోయినాడు. ఇది తెలిసిన విషయమే కదా!"
       "అబ్బో హేమా! నీకు ఎవన్నీ ఎవరు చెప్పినారు? అయినా అనుభవాలు అందరికి ఒకే రకముగా యుండవు
కదా! నిజానికి అలా యుంటే, ఈ నాడు కొన్ని కళా రూపాలను మనము చూచే వాళ్ళము కాదు."
       "నిజమే బావా! ఇదిగో ప్రసాదము. ఎలా యుందో చెప్పు."
       "నీ చేతితో ఏమిచ్చినా అద్భుతముగా యుండదేమిటి?" చేతిలోనికి తీసుకున్నాడు.
         "అబ్బ రాయి", అంటూ గట్టిగా నోరు పట్టుకున్నాడు.
        "అయ్యో! ఒక్కొక్క సారి అంతే బావా! ఊహా లోకానికి యథార్థానికి ఇలానే తేడా యుంటుంది.", అంటూ లోపలికి వెళ్ళింది.
        శ్రీ నాథుడు కూడా లేచినాడు.
       "ఇక వస్తాను మామయ్యా! "
       "అదేమిటయ్యా అప్పుడే బయలు దేరినావు? అయినా హేమ కేమీ తెలియవు. దాని మాటలను
పట్టించుకోవద్దు."
       "అదేమీ లేదు మామయ్యా! వచ్చి చాల సేపయినది. మళ్ళీ కలుస్తాను. మరిచి పోయినాను, అమ్మ హేమను ఒక సారి కనిపించమన్నది."
       మనస్సు చాలా చికాకుగానున్నది.ఎవ్వరూ తనను అర్థము చేసుకోవటము లేదు. తన వాదములో బలము లేదా? బహుశా వారు చెప్పేదే నిజమేమో?  అలాగైతే రాచ కొల్వుల గురించి తను విన్నదేమిటి? లక్షల
అనుభవాలను పొంద వచ్చును. లక్షలు ఆర్జించ వచ్చును. కానీ ప్రతి అడుగు హెచ్చరికతో వేయాలి. అక్కడ
కోప తాపాలు పనికి రావు.
       అందమైన సౌధాలలో తిరుగ వచ్చును,కానీ కొండల మీద తిరుగ లేడు. ఉద్యాన వనాలలో తిరుగ
వచ్చును, కానీ, అడవి మల్లెలనాస్వాదించ లేడు. అది బంగారు పంజరములో బ్రతుకు. తను కోరుకొనే
స్వతంత్ర ప్రవృత్తితో దానికి పోలిక ఎక్కడ?
         వడిగా అడుగులు గురుకులము వైపు వేసినాడు. ఆచార్యుల వారపుడే  సంధ్యా వందనము పూర్తి చేసి
గ్రంథ పథనముకు కూర్చున్నాడు.
        తనను చూచి "రావయ్యా! శ్రీ నాథా!" అంటూ ఆసనమును చూపించినాడు.
        "అంతా కులాసాయేనా?" అని పాల్కరించినాడు. అందులో "అకాలములో వచ్చావేమయ్యా?" అన్న ప్రశ్న
యున్నది.
      "విశేషమేమయినా యుందా?" అన్న ఆతృత కూడా యుంది.
      గౌరవ అభివందనలు అయినవి.  మనస్సు కాస్త సావధాన పడింది.
      తనలో జరిగే మానసిక సంఘర్షణను నివేదించినాడు. పరిష్కారము చూపించమన్నాడు.
ఆచార్యులు గారు ఒక నిముషము ఆలోచించి ఇలా యన్నాడు.
     "శ్రీ నాథా! ఆయన తండ్రిగా ఆలోచించినాడు. అందులో తప్పేముంది? గురువుగా అదే నేను చెప్ప వచ్చునేమో? కానీ, నాకా అధికారము లేదు. నీకిచ్చిన మాట ప్రకారము నేను శాసించ లేను. కానీ,  నిజాన్ని గమనించాలి. యథార్థ ప్రపంచానికి ఊహా ప్రపంచానికి చాలా తేడా యుంటుందయ్యా.",అని యన్నారు.
      "అంతేనంటారా? మీ మాట కోసము ఎంతో ఆశతో వచ్చాను",అన్నాడు శ్రీ నాథుడు.
      "జీవితమంటే కోరుకున్నవన్నీ దొరకవు. ఎదురుగా వచ్చిన వానిని చూడకుండానే వదలి వేయకూడదు.
నీవు శ్రధ్ధతో అన్నీ క్సుణ్ణముగా నేర్చుకున్న వాడవు. నా శిష్యులలో అగ్రగణ్యుడవు. సముచిత స్థానాన్ని సంపాదించుకోగలవు. కానీ, ఇది మొదటి  ప్రయత్నమే కదా! అంత కంగారెందుకు? ఉద్యోగము వచ్చిందనుకుందాము, అది నీకు నచ్చుతుందేమో? నచ్చనపుడు అది యొక అనుభవముగా మిగిలి పోతుంది. భవిష్యత్తులో నీ నిర్ణయాలకు తోడ్పడుతుంది. అందుకే, ఆలోచించుకో, నిర్ణయము నీదే. కానీ మనస్సులో సందేహము పెట్టుకొవద్దు."
        ఆ సందేశమును పూర్తిగా విన్నాడు శ్రీ నాథుడు. తన పరిస్థితిని ఆకళింపు చేసుకున్నాడు,
నిర్ణయము తీసుకున్నాడు.
(తరువాత శిల్పి 4 వ బాగాములో)