Friday, April 13, 2018

ప్రస్థానము 6



పైనాంపురం లో ఇప్పుడు ఒక పాతిక  అంటే  దగ్గిరగా ఇరువది అయిదు కుటుంబాలున్నాయి. రోజూ ఏదో యొక  లారీలో నీళ్ళు తెస్తేనే  త్రాగుటకు బాగుంటుంది. లేక పొతే లవణాలతో కూడిన నీటినే అక్కడ త్రాగుతున్నారు. ఆ చుట్టూ ప్రక్కల యున్న చాలా గ్రామాల పరిస్థితి అదే. పంజల మడుగు నీరు ఎక్కువ యున్నప్పుడు అంత ఉప్పగా యుండవు, కానీ నాగరికత తెచ్చిన లాభాల కంటే అనుమానాలు, భయాలు మరీ ఎక్కువ పీడిస్తున్నాయి. ఆ నీరు త్రాగితే ఏ క్రిములో  దేహములోకి వెళ్లి, అనారోగ్యము వస్తుందన్న భయము ఎక్కువ. వచ్చే నీరు తగ్గితే  సముద్రపు నీరు ఎదురు తన్ని  ఆ నీరు కూడా ఉప్పగా తయారవుతుంది. నూతుల్లో, బావులలో నీరు రొయ్యల చెరువు రాకతో ఎప్పుడో ఉప్పగా తయారయినాయి.
గోపి ఆ ప్రాంతము అంతా తిరిగినాడు. అక్కడక్కడ కొన్ని ఇళ్ళు ఉన్నవి. ఎవరికి వారు బ్రదుకుతూ ఉన్నారు. ఇంకా ప్రభుత్వాలు కల్పించ గలిగిన  విద్య వసతులు అక్కడికి చేరే అవకాశము  లేదు. ప్రపంచములో అన్ని దేశాల  ఆర్ధిక వ్యవస్థలు నూతన విధానాల  వలన దెబ్బ తిన్నట్లే, వాటిని అనుసరించినపుడు  ఆ ప్రభావము భారత దేశము మీద కూడా పడింది. కానీ, ప్రజలలో విదేశీ ప్రభావములో పూర్తిగా పడినా కొందరి వలన పడి పోకుండా కొంత వరకు లేచి నిలబడ  గలిగింది. అయినప్పటికీ అంతకు ముందు ఉన్న ఆర్ధిక పటిస్థత రాలేదు. ఆర్ధిక వ్యవస్థ ఈ విధముగా దెబ్బ తినడానికి కారణము స్పష్టము గా కనిపించినప్పటికీ  ప్రజలే  మార్పుకు సిద్ధముగా కనిపించ లేదు. ఇదే దేశము ఆర్థికముగా లేవడానికి అడ్డుగా ఉంది.
ఎక్కువ పెట్టుబడి పెట్టి పెద్ద పరిశ్రమలు పెట్టాలంటే చాలా కష్టము. అందుకని, నల్గురు లేదా వచ్చిన పది మందీ పెట్టుబడి పెట్టి, పరిశ్రమ నిర్మాణము  చేసిన తరువాత  వచ్చిన లాభములో కొంత పెట్టుబడికి కలిపి మిగిలిన మొత్తమును పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకొనుటకు షేర్ మార్కెట్  ఏర్పడినది. నికరపు పెట్టుబడిని పదులు యొక్క  గుణిజములుగా ఏర్పరచి ఒక పదిని ఒక షేర్ గా  తీసుకున్నారు. లక్ష రూపాయల  పెట్టుబడి యంతే పదివేల షేర్లు ఉన్నట్లు లెక్ఖ. పరిశ్రమలో  ఎక్కువ లాభాలు వస్తే  పెట్టుబడి పెట్టాలనుకొనే వారి సంఖ్య పెరుగుతుంది. ఈ విధముగా షేర్/వాటా   కున్న గిరాకీ ని బట్టి ఎక్కువ విలువ ఇచ్చి కొనడానికి జనము సిద్ధ పడతారు. ఈ విధముగా లక్ష రూపాయల పెట్టుబడి యున్న పరిశ్రమలో షేరు  లేదా వాటా విలువ పది నుండి ఇరువదికి పెరిగినపుడు  ఆ పరిశ్రమ విలువ లక్ష నుండి రెండు లక్షలకు పెరుగుతుంది. ఇది అసలు విలువ కాదు, ప్లావిత మయిన విలువ(ఫ్లోటింగ్ విలువ) లేదా కృత్రిమ మయిన విలువ. అదే ఆ పరిశ్రమ నష్టాలలో పడినపుడు వాటా విలువ అయిదు రూపాయలకు పడి పోవచ్చును. అంటే ఆ పరిశ్రమ విలువ యాబది వేలు మాత్రము అవుతుంది.
మొదటి దశ లో పరిశ్రమ విలువ యంత్రముల విలువకు మాత్రమె సరి పోయినపుడు ఎక్కువ సమస్యలు రాలేదు. ముడి సరుకుల విలువ కలిపినపుడు కూడా అంత సమస్య రాలేదు. అదే ఒక వ్యాపారముల ముడి సరుకులలో నిత్యావసర వస్తువులను కూడా  వ్యాపారములో చూపించినపుడు  సరికొత్త సమస్యలు ఏర్పడినాయి. ఇక్కడ ఒక విష వలయము ఏర్పడింది. ఒక పరిశ్రమ/వ్యాపారము యొక్క నికర లాభము వారు చేస్తున్న వ్యాపారము పెంచుకున్నందు వలన వస్తుంది. ఈ లాభాల వలన  వారి వాటా యొక్క విలువ పెంచుతుంది. అంటే  అక్కడ పరిశ్రమలు, యంత్రములు, సరకుల వలువ కంటే ఆపాదించా బడిన విలువ చాలా ఎక్కువ అన్న మాట. ఈ విధముగా లాభాల పంపకము జరుగుతుంది. ఇవి పెరిగితే ప్రభుత్వానికి వివిధ పన్నుల వలన అంత లాభము వస్తుంది.
ఇక షేర్ మార్కెట్ తన క్రింద నమోదయిన  అన్ని పరిశ్రమల వాటా  విలువను అనుసరించి  తన ఇండెక్స్ ను ప్రకటిస్తుంది.   ఇండెక్స్  పెరగక పొతే  వ్యాపారము నిరాసక్తతతో  ఉంటుంది.  ఈ సూచిక పెరగాలంటే  వాటా విలువ పెరగాలి. వాటా విలువ పెరగాలంటే లాభాలు పెరగాలి. లాభాలు పెరగాలంటే  ఉత్పత్తి పెరిగి ఎక్కువగా  అమ్ముడు పోవాలి.  అలా జరగనప్పుడు, మరొక మార్గాన్ని అనుసరిస్తారు. ఉత్పత్తి అయిన వస్తువు విలువను కృత్రిమముగా పెంచుతారు. లేదా కృత్రిమముగా వాటా పెంచుతారు. షేర్  మార్కేట్  లో మోసాలు ఇక్కడినుండే మొదలవుతాయి. కృత్రిమముగా సూచీ పెంచడానికి  కృత్రిమముగా లాభాలు పెంచి,  నల్ల ధనాన్ని పెంచుటకు వాటాదార్లు ప్రయత్నమూ చేయడము, ఈ సూచీ ప్రభుత్వ  ఆదాయము మీద ప్రభావము చూపుట వలన, దానిని బల పరచడానికి ప్రభుత్వాలు కూడా  సాయము చేయడము, ఈ విధముగా దేశము యొక్క ఆర్ధిక వ్యవస్థ  ఒక విష వలయము లోనికి పడిపోవడము  జరుగుతున్నది. దీనిని వారించుటకే  సత్య సాయి బాబా గారు  ధార్మిక మయిన వ్యాపారాన్ని గురించి ఎప్పుడూ మాట్లాడే  వారు.
ధార్మిక  వ్యాపారములో ప్లావిత విలువలు ఉండవు. ఎక్కువ లాభము రాక పోయినా ఖచ్చితముగా నష్టము  రాదు. అదే  షేర్  మార్కెట్లో  కృత్రిమముగా  వాటా విలువ పెరిగినపుడు, పెట్టుబడిని పెంచి,  వాటా విలువ పడి పోయినపుడు, తమ పెట్టుబడులను పోగొట్టుకొన్, ఆత్మా హత్యలు చేసుకున్న సందర్భాలు  కోకొల్లలు.
క్రమ క్రమముగా వ్యాపారాలు  నష్టాల్లో పడి, సూచీ బాగా పడిపోయినపుడు, కృత్రిమముగా సూచీ పెంచుటకు, పప్పు దినుసుల  విలువలను కూడా స్టాక్  మార్కెట్  లో నమోదు చేయుటకు ప్రభుత్వమూ అనుమతించండి. దీని వలన సూచీ నిలకడ ను సూచించినా  సామాన్య మానవుడికి బలవర్ధకమాయి అత్యంత  ఆవశ్యకమయిన పప్పు దినుసుల ధరలు ఆకాశమును అందుకున్నవి. ఈ విధముగా  వ్యాపార పరమయిన నిర్ణయాలు  సామాన్యుల  జీవితాలను శాసించుట మొదలు పెట్టినవి. ఇటువంటి నిర్ణయాలే కొన్ని దేశాలలో ఆర్ధిక  వ్యవస్థ కూలి పోవుటకు కారనమయినవి.
అందుకే  ఆర్ధిక వ్యవస్థ  సరి అయిన మూలాల మీద ఏర్పడాలి. ఆ ప్రాంతములో దొరికే  మౌళిక వనరుల మీద ఆధార పడాలి. ప్రప్రథమముగా ప్రాంతీయముగా యున్న ప్రజల  అవసరాలను తీర్చ గలగాలి. అటు తరువాత బయటి  ప్రాంతాల వారికి బయట దేశాల వారికి అందించుటకు ప్రయత్నించాలి. ఎగుమతుల కొరకే పరిశ్రమలని  స్థాపించిన దేశాల ఆర్ధిక వ్యవస్థలో కలిగే ఒడిదుడుకులను మనము గమనించ వలసి ఉంది.