Tuesday, August 30, 2016

మోతోయామా



హిరోషి  మొతోయామా జపాన్  కు చెందిన ప్రముఖ  కంప్యూటర్ శాస్త్ర  వేత్త. ప్రస్తుతము  అమెరికా లో పని చేస్తున్నాడు. అతడి జీవితము లో జరిగిన ఒక సంఘటన ఇందులో ప్రస్తావించ బడినది.
అతడు చిన్నప్పుడు  తల్లిదండ్రులతో ఉన్నప్పుడు  తండ్రి తల్లిని చాలా బాధించే వాడు.  ఇంట్లో ఎప్పుడూ అశాంతిగా ఉండేది.  మనశ్శాంతి కోసము  తల్లి తన కొడుకుతో సహా దగ్గిరలో ఉన్న బౌద్ధ ఆశ్రమము(లామాసరీ) కు వెళ్ళేది. అక్కడున్న ఒక లామా మొతోయామా లో ఏదో ఆకర్షణను చూచినాడు. వచ్చినపుడల్లా మొతోయామా ను దగ్గిరకు పిలిచి కబుర్లు చెప్పే వాడు. ఒక రోజు మొతోయామా తను ఒక్కడే  వెళ్ళినపుడు ఇంట్లో ఉన్న అశాంతి ని గూర్చి చెప్పినాడు. ఆ  లామా అప్పటికే మొతోయామా కు కొన్ని ధ్యాన ప్రక్రియలను పరిచయము చేసినాడు. మొతోయామా సమస్య విన్న తరువాత  అతడి చేత ఒక ప్రత్యేకమయిన ధ్యానము చేయించినాడు. అందులో ఒక చరిత్ర కన బడింది.
కొన్ని వందల సంవత్సరాల క్రితము  కొరియా దేశము నుండి జపాన్ వచ్చిన రాయబారి  జపాన్ రాజ కుటుంబముతో చాలా సన్నిహితముగా ఉండే వాడు. అతడికి రాజ కుటుంబమునకు సంబంధించి అన్ని  విషయాలు తెలిసేవి. కొన్ని నాళ్ళ తరువాత అతడిని తిరిగి రమ్మని ఆదేశిస్తూ వేరొక రాయబారిని కొరియా ప్రభుత్వము పంపించినది. జపానుకు చెందిన మంత్రి “రాజ కుటుంబానికి చెందిన  అన్ని విషయాలు తెలిసిన ఈ రాయబారి తిరిగి కొరియా వెళితే రాజ్య క్షేమమునకు మంచిది కాదని” భావించి, ఒక రోజు అతడికి ఆహారములో విషము కలిపి పెట్టినాడు. విష ప్రభావముతో చని పోతున్న రాయబారి తన చావుకు కారణమెవరో తెలిసి అతడిపై విపరీతమయిన ద్వేషముతో చనిపోయినాడు. ( ఏ వ్యక్తికీ అయినా చనిపోయినపుడు ఏ ఆలోచన తీవ్రముగా ఉంటుందో అది అతడి  మరు జన్మలో జీవితాన్ని నడిపిస్తుందనేది జగద్విదితము. )  అటు తరువాత ఆ  మంత్రి రాయబారిని కారణము లేకుండా అనుమానించి చంపించినాడన్న బాధతో చని పోయినాడు. ఈ విధముగా ఆ మంత్రికి రాయబారికి కర్మ బంధము ఏర్పడింది. ఆ మంత్రి భార్య గా ఆ రాయబారి భర్త గా జీవితాన్ని పొందినారు. వారే మొతోయామా తల్లిదండ్రులు.
మొతోయామా తన ఇంట్లో అశాంతి ఎలా తొలగి పోతుందని అడిగినాడు. ఆ లామా తండ్రి కోపాన్ని తగ్గించుటకు కొన్ని సాధనలు చేయించినాడు. తండ్రిలో మంచి మార్పు వచ్చింది. ఇంట్లో అశాంతి తొలగి పోయింది. కొన్నాళ్ళు చాలా హాయిగా గడచింది. ఈ లోపల తండ్రికి మళ్ళీ జబ్బు చేసింది. దానిని వైద్యులు కాన్సర్ గా నిర్ధారించినారు.
మొతోయామా ఈ విషయమై లామాను అడిగినాడు. అప్పుడు లామా కొంత సేపు ధ్యానము లోనికి వెళ్లి , తిరిగి చెప్పినాడు.” మీ తల్లికి తండ్రికి మధ్య ద్వేషము కారణము గా కలిసి బ్రదుక వలసిన కర్మ బంధము ఏర్పడినది. నీ యొక్క ధ్యానము వలన మీ తండ్రికి ద్వేషము తొలగి  ఆ బంధము తొలగి పోయింది. ఇంకా ఆయనకు  ఈ దేహముతో చేయ వలసిన పనులు లేవు. అందుకే అతడి జీవాత్మ తిరుగు ప్రయాణానికి సిద్ధమయింది.  ఇంకా మనము చేయ గలిగినది ఏమీ లేదు”, అని చెప్పినాడు. ఇంకా తల్లికి బిడ్డపై ఉన్న ప్రేమ బంధము వలన కొంత కాలము జీవిస్తుంది.  ఈ విధముగా ఇప్పటి మన కర్మలు రాబోయే జీవితాలను నడిపిస్తాయి.
ఇటువంటిదే మనకు తెలిసిన కథ ఒకటుంది.  ఒక సాధువు ఒక చెప్పులు కుట్టే వ్యక్తీ నుండి ఒక వరహా తీసుకుంటాడు. అది తిరిగి ఈయ లేక అప్పు తీర్చ లేదన్న ఆలోచనతోనే చని పోతాడు. అతడు ఆ చెప్పూ కుట్టే వ్యక్తిక్ర్ కొడుకు గా జన్మిస్తాడు. వయస్సు వచ్చే కొద్దీ వేదాంత పాఠాలు వల్లే వేస్తూ ఉంటాడు. ఇది గమనించిన తండ్రి ఒక యోగి దగ్గిరకు వెళ్లి తన కొడుకు విషయము ప్రస్తావిస్తాడు. ఆ యోగి చెప్తాడు,”నీవు చాలా అదృష్టవంతుడవు. అటువంటి వ్యక్తీ నీకు కొడుకుగా పుట్టడము నీ అదృష్టము. అయితే అతడు ఎక్కువ రోజులు బ్రదుకడు.” అని చెబుతాడు.
“మరెలా స్వామీ!” అని తండ్రి ప్రశ్నిస్తాడు.
“ఏమీ లేదు అతడి దగ్గిర ఎప్పుడూ ఏవిధముగా డబ్బులు తీసుకోవద్దు.” అని చెబుతాడు.
ఆ పిల్ల వాడు ఒక రోజు తను సంపాదించిన డబ్బులు దాచి పెట్టమని తండ్రికి ఇస్తాడు.ఆ వెంటనే ఒక పాము కరిచి చని పోతాడు.
ఋణానుబంధాలు ఇలాగే ఉంటాయి.
(ఇందులో మొతోయామా కథ శ్రీ ఎక్కిరాల వేదవ్యాస గారి పుస్తకము నుండి స్వీకరించా బడినది)

                                        ఓం స్వస్తి.