Saturday, October 3, 2020

ప్రేమ కథ

 


అందరికీ ప్రేమ కథలు అంటే ఆసక్తి. విఫల మయిన ప్రేమతో పాత్రలు బాధ పడుతుంటే చూచే వాళ్ళు కూడా ఎక్కి ఎక్కి ఏడుస్తుంటారు. మన పురాణాల లో కూడా చాలా ప్రేమ కథలున్నాయి. వాటిని గురించి ఎక్కువ మందికి పూర్తిగా తెలియదు. వాటిని గమనిస్తాము. అందు లో రురువు ఒకరు.

చ్యవన మహర్షి యొక్క మనుమడు రురువు. ఈ  చ్యవనుడే ఆరోగ్య వర్ధకము అయిన చ్యవన ప్రాసకు మూల పురుషుడు. స్థూల కేశ మహర్షి యొక్క దత్త పుత్రిక అయిన ప్రమద్వరను రురువు ప్రేమిస్తాడు. రురువు యొక్క కోరికను అంగీకరించి స్థూల కేశ  మహర్షి వివాహ ముహూర్తమును నిర్ణయిస్తాడు.

ప్రమద్వర పెళ్ళికి ముందే తన స్నేహితురాండ్రతో ఆటలలో ఉన్నపుడు పాము కాటుకు గురి అవుతుంది. కళను కోల్పోయి విష ప్రభావముతో ప్రమద్వర మరణిస్తుంది.

ప్రమద్వర మరణము తో విలపిస్తూ రురువు రేయింబవళ్ళు పిచ్చి వాడిలా తిరుగుతాడు. రేయింబవళ్ళు విలపిస్తాడు. అప్పుడు ఒక దేవత రురువుకు కనిపించి తన ఆయుస్సులో సగము ఆయుస్సును ధార పోస్తే ప్రమద్వర జీవిస్తుందని చెబుతుంది. దీర్ఘాయుష్కుడు అయిన రురువు తన ఆయుస్సులో సగమును ప్రమద్వరకు ధార పోస్తాడు. యమ ధర్మ రాజు అందుకు అంగీకరించి ప్రమద్వరను జీవింప చేస్తాడు.

మరొక కథ సావిత్రిది. అల్పాయుష్కుడు అని తెలిసి కూడా తను సత్యవంతుడ్ని ప్రేమించి పెళ్లి చేసు కుంటుంది. అదీ తల్లి దండ్రుల అభిప్రాయానిక్ వ్యతి రేకముగా.  అడవిలో ఒకరోజు సత్యవంతుడు మరణిస్తాడు. భర్త ప్రాణాల కోసము యమ ధర్మ రాజు వెంట బడి, భర్తను బ్రదికించుకుంటుంది. మానవాళికి ఆరాధ్య దేవత అవుతుంది. ఈమె కథనే అరవింద రిషి ఆంగ్లములో అద్భుతముగా వ్రాసినాడు.

మన పురాణాల్లో ఇటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు నల దమయంతులు, శకుంతలా దుష్యంతులు మొదలయినవి. వీరందరూ ఎన్నో కష్టాలు పడినారు, ఓటమిని అంగీకరించ కుండా పోరాడి విజయాన్ని సాధించినారు. చరిత్రలో నిలబడి పోయినారు.

ఇక లైలా మజ్నూ, రోమియో జూలియట్ లాటివి విదేశాలలో, ఇక మన దేశములో కృత్రిమమముగా కల్పించ బడిన అనార్కలీ, ముంతాజ్ మహల్ లాటి వారు. లైలా మజ్నూ లు ఏడుస్తూ మరణిస్తారు. ఇంకా అనార్కలి అసలు మరణించ లేదని నుర్జేహాన్ పేరుతొ సలీమ్ నే పెళ్లి చేసుకుందని కొన్ని కథలున్నాయి.

ఇంక  షా జెహాన్ కు ఉన్న పెద్ద జనాభా కలిగిన భార్యలో ముంతాజ్  ఒకరు. ఆమె తను రాణిగా ఉన్న కొద్ది కాలములో అవిశ్రాన్తముగా సంవత్సరానికి ఒకరు చొప్పున పదునాలుగు మంది పిల్లలకు తల్లి అయి ఆఖరి కాన్పులో భరించ లేని బాధతో మరణిస్తుంది. షా జెహాన్ కు ఆమె అంటే అంత ప్రేమ. మేవాడ్ రాజుల రాజ మహల్ ను తాజ్ మహల్ గా మార్చి, ఆమె సమాధిని అందులో ఉంచారన్నది నిర్వివాదాంశము. దానిని అమర ప్రేమగా, కొన్ని సంవత్సరాను కష్ట బడి తాజ్ మహల్ నిర్మాణము చేసినారని కొంత మంది కథలు చెబుతారు.

వీటి ప్రేరేపణతో వచ్చిన మరొక ప్రేమ కథ దేవదాసు.,బెంగాలీ రచయిత శరత్ చేత వ్రాయ బడినది. ఇందులో నాయక నాయికా  పత్రాలు బాగా బలహీనమయినవి. వాటిని చూచిన వారి మనస్సులను బలహీన పరుస్తాయి. పాశ్చాత్య సంస్కృతి ప్రభావము వారిని అమర ప్రేమికులుగా మార్చింది.

మనిషిలో ప్రేమ తొటి జీవులను బ్రదుకనిస్తుంది. ప్రేమికుల ప్రేమ కూడా ఓటమిని అంగీకరించదు. మరి ఈ ఆధునిక ప్రేమ జీవుల  కథలు వారి అభిమానులను ఎందుకూ పనికి రాని బలహీనులుగా మారుస్తాయి. ఇది నా అభిప్రాయము మాత్రమె.

ఒప్పుకుంటారా?