Monday, September 30, 2019

ప్రస్థానము 10




 గోపీ తిరిగి పైనాంపురము వచ్చినాడు. ఎవరయినా  కనిపిస్తారని రావి చెట్టు చావడి దగ్గిరకు వచ్చినాడు. అక్కడ కాషాయ వస్త్రాలతో ఒక సాధువు కూర్చొని ఉన్నాడు. పక్కనే మరో ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు. గోపీ ఆయన దగ్గరకు వెళ్లి నమస్కారము చేసినాడు.
ఆయనకు గోపీ ని చూడగానీ అంతా అర్థమయింది. “రావయ్యా! కూర్చో. నీవు చాలా చేయాలని అనుకున్నావు. కానీ ఏమి చేయాలో స్పష్టముగా తెలిసినట్లు లేదు.”
“స్వామీ! ఎన్నో సందేహాలు. ఎటు వెళ్లాలనో తెలియటము లేదు.”
“వంద అడుగులు వేయాలనుకున్న వారికి మొదటి అడుగు చాలా ముఖ్యమయినది. అదే తడబడితే ఎక్కడికి వెల్ల గలవు? నీ గురించి చూచాయగా తెలిసింది. ఆశయాలు గొప్పవే. కానీ అడుగు ముందుకు పడాలి కదా. మరొక విషయము.  ఏదయినా మార్పు తీసుకొని రావాలని అనుకున్నప్పుడు అంతకు ముందు పరిస్థితులను గురించి పూర్తీ అవగాహన ఉండాలి.ఒక ఊరికయినా మనిషి కయినా ఇదే వర్తిస్తుంది. కష్ట పడడానికి సిద్ధముగా యున్న వారికి పని ,ఉండడమే కాదు తను తయారు చేసుకున్నవి తను కష్ట పడితేనే వచ్చాయి అన్న భావన విశ్వాసము ఉండాలి. గ్రామములో త్రాగడానికి నీటి వనరులు ఉండాలి. ఇవన్నీ సమకూర్చు కోదానికి ప్రాచీన వ్యవస్థ ఎలా పనిచేసిందో తెలుసుకోవాలి. ఈ  నాటి సైన్సు మరియూ టెక్నాలజీ లు విశ్లేషణాత్మక (analytic)దృష్టిని ఇచ్చాయి. కానీ సమన్వయము(synthesis)  ఎలా చేయాలో తెలుపుట లేదు. ఇప్పటి సమస్యలన్నిటికీ ఇదే ప్రధాన కారణము.”
“మరి కాస్త వివరముగా చెబుతారా?”
“ ఉదాహరణకు ఒక ఊరిలో అందరికీ నీరు కావాలంటే ఏమి చేయాలో చెప్పు.”
“కాలువల ద్వారా నీరు తీసుకొని వచ్చి, ఎత్తుగా కట్ట బడిన టాంకును నీటితో నింపి కుళాయిల ద్వారా అందరికి నీరు అందిస్తున్నారు. అందు కొరకు నీరు నిలువ చేయటానికి నేల మట్టములో చెరువులు త్రవ్విస్తున్నారు. అందులో నీరు నింపి ఉంచుతున్నారు.’
“ఈ సమస్యకు ఈ నాడున్న పరిష్కారాన్ని చెప్పినావు. ఇందులో చాలా నిర్మాణము చేయ వలసి ఉంది. రోజూ టాంకును నీతితో నింపుటకు మోటార్ లాటి హంగామాలు చాలా కావాలి. అంతే కాదు, అందరికీ నీరు సులభముగా అందించ బడుతుంది కాబట్టి దుర్వినియోగము కూడా జరగ వచ్చును. కానీ ప్రాచీన వ్యవస్థ ఈ విధముగా ఉండేది కాదు. ఆ నాటి గ్రామానికి ఆయువు పట్టువు దేవాలయము.  మొత్తము వనరుల నిర్వహణ అక్కడినుండి జరిగేది. ఎక్కడయినా ఎప్పుడయినా ఈ విషయాన్ని గురించి చదివావా?”
“కాస్త వివరముగా చెప్పండి.”
“వేల సంవత్సరాలుగా ఇక్కడున్న వ్యవస్థ అటువంటిది. దేవాలయము అంటే పూజలు జపాలు , వ్రతాలు మాత్రమె కాదు. దేవాలయ పూజారి అంటే ఆ నాడు గ్రామానికి కేంద్ర బిందువు. ఆ నాడు అతడికున్న పరిజ్ఞానము మరొకరికి ఉండేది కాదు. మొదట చెప్పాలంటే అతడు ఒక వైద్యుడు. అతడికి మూలికా వైద్యముతో బాగా పరిచయము ఉండేది. ఉత్తరేణి, కొండ పిండి, నెల వేము, నెల పొగడ,...... లాటి మూలికలు పల్లెలలో ఎక్కడయినా దొరికేవి. ఇంక దేవాలయము గురించి  చెప్ప వలసిన పని లేదు. కొన్ని దేవాలయాల్లో ప్రత్యేకముగా మూలికా వనము కూడా ఉండేది.ఎక్కడికయినా ఏదయినా వాళ్ళే తీసుకొని వెళ్ళాలి కాబట్టి, ప్రతి యొక్కరికి తగిన, పని, వ్యాయామము, వీటితో బాటు ఆరోగ్యము ఉండేది. విపరీతమయిన పరిస్థితులలో    వ్యాధీ వచ్చినా పూజారి ఇచ్చిన మూలికలతో చేసిన మందుతో తగ్గి పోయేది. ఇప్పటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ యొక్క అవసరము అప్పుడు ఉండేది కాదు.”
“ప్రతి ఆలయానికి ఒక కోనేరు అంటే చెరువు ఉండేది. దానిని ఎప్పుడూ నీతితో నింపి ఉంచే వారు. మట్టి పొరలలో నీరు దిగి ఊరంతా నీటి పోర వ్యాపించి ఉండేది. ఎవరికీ వాళ్ళు నుయ్యి త్రవ్వితే  కావలసిన నీరు లభించేది. “
“ఇళ్ళ ప్రక్కన స్థలాలలో ఏదో యొక పూల మొక్కలు, పండ్ల మొక్కలు వేసే వారు.ఏ ప్రాంతములో పెరిగిన కూరలు పండ్లు ఆ ప్రాంతము వారికి ఎక్కువ ఆరోగ్యమిస్తుందని ఆయుర్వేద ము  చెబుతుంది.”
“అంటే స్వామీ! ఆపిల్ లాంటి పండ్లు......”
“అక్కడకే వస్తున్నా. మన ప్రాంతాలలో  పండిన పండ్లు మాత్రమె మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆపిల్ తింటే అనారోగ్యానికి దూరమంటే  ఆ పండ్లు పండే ప్రాంతాలలో అనారోగ్యాలు ఎక్కువ అని కూడా చెప్పవచ్చును. ఆపిల్ పండు దొరకని రోజుల్లో కూడా ఇక్కడ పూర్తీ ఆరోగ్యముతో జీవిస్తారు.”
“మరొక ప్రశ్న. ఎక్కువ మందికి రక్తపు పోటు ఎందుకు వస్తుందో తెలుసు. అతి మధురము(దయబితీస్) కూడా ఒక తీవ్రమయిన వ్యాధి గా మారింది. అది తీపి పదార్థాలు ఎక్కువగా తినడము వలన వచ్చిందని అంటున్నారు. నిజమేనా?”
“గుజరాత్, రాజస్తాన్ లలో మధుర పదార్థాలను ఎక్కువగా తింటారు. ఇక వారణాసి లో వారి ఉదయము జిలేబి తినదముతో మొదలవుతుంది. మరి వారికి దయబెటీస్ ఉందా?”
“శారీరిక  మరియు మానసికమయిన ఒత్తిడి  ఒక స్థితిని దాటినా తరువాత, వ్యాధికి కారణము కావచ్చును. ఇక్కడి నుండే వ్యాధులు మొదలు అవుతాయి. కాన్సరు నుండి రక్తపు పోటు,  డయాబెటీస్ వరకు వచ్చే జబ్బ్బులన్నీ మానసిక  ఒత్తిడి నుండే మొదలవుతున్నాయి. కళ్ళ జబ్బుకు కూడా  మానసిక ఒత్తిడే కారణము. అయిదేళ్ళ పిల్లాడు కూడా లావు కళ్ళద్దాలతో వెళుతుంటే ఆశ్చర్య మేస్తుంది.. ఆటలు, పాటలతో గడప వలసిన చదువుల పేరుతొ పుస్తకాల మూటలను మోస్తూ,ఒక రకముగా జైలు జీవితాన్ని వారు గడుపుతున్నారు. ఇందుకు ప్రధానముగా  కార్పొరేట్  విద్యా సంస్థలను, పిల్లల తల్లి దండ్రులను తప్పు పట్టాలి.”
“స్వామీ! మీతో చాలా విషయాలు మాట్లాడాలి. మీరు ఉంటారా?”
“మహా లక్ష్మి గుడి దగ్గిర ఒక ఇంట్లో ఉంటున్నాను. ఇప్పుడు నాకు వేరే పని ఉంది. రేపు మహాలక్ష్మి అమ్మవారి గుడి ముందున్న అరుగు మీద కలుద్దాము.
                         **************************************