సుందరి : ఎవరే,..... ఎవరే....
అట దాగినదెవరే....
విరిసిన పూవుల పొదల మాటున
పరిమళ లహరుల పొందు కోరుతూ..
ఎవరే ..........దాగినదెవరే......
రుచిర: సూర్యుడు పైకి లేచిన వేళ
విరిసిన పూలు ఉండవా?
విరిసిన పూలను సోకిన గాలులు
పరిమళ లహరుల చిందవా?
సుందరి: ఇది యే ఋతువే?......
రుచిర: ........వసంతమే.
సుందరి: నిజమేనా?
రుచిర: ఇది సుమర్తువేనే .
సుందరి: ఏది వసంతం? ఎక్కడ కోయిల?
ఆకుల రాలగ సోలే
అడవి.
ఏది వసంతం?
ఎక్కడ కోయీ?
రుచిర : చూడవే అటు చూడవే..
పొదల మాటున దాగిన
మన చెలి
పూర్ణిమ ముఖాన చూడు.
పుప్పొడి ఎల్లెడ
సోకి పాకెనట
పూచిన పున్నాగ మ్రోల.
ఇది వసంత మేనే...
ఇది సుమర్తువేనే .
సుందరి: మరి కోయిల గొంతుక ఏదే?
మద కోయిల గొంతుక ఏదే?
పూర్ణిమ :సూర్యుడు తూరుపు సోకక ముందే
సుందర ప్రకృతి పొంగును చూచి,
విరిసిన రంగుల విరి కన్నియల
సొగసుల కన్నుల కాంచి,
తన సహజ ప్రకృతిని మఱచి కోయల
చూత వృక్షపు
చిగురుల చేరక.
అందుకే
దిక్కుల చూచెనదే మరి కోయల
ఎటు పోవాలో తెలియక.
పూర్ణిమ: చెలియా! సుందరి
ఇటు రావే,
నను తరిమే భ్రమరుడి చూదవే.
సుందరి: నీ ముద్దుల మోము చంద్రుడి
పోల,
చంద్రుడి మోమున
పుప్పొడి పొడల
ఆస్వాదించగ వచ్చిన
భ్రమరుడి
కంతగ భయ పడనేల?
ఓ చెలి! విరి బాలా!
సుచిర: సరదాగా ఉన్నదే....
విరులను చూచి పొంగిన కోయిల
ఇలనే మఱచేనే.
విరులనుకొని మన చెలి వెంట బడె
భ్రమరుడు ఇట నేడే......
పూర్ణిమ: అటు చూడవే...........
సుందరి: ఏమిటే?
పూర్ణిమ: కుహూ! కుహూ! కోయల వచ్చేనే
సుమ మల్లియలే విరిసేనే
నవ వసంతమే వచ్చేనే
నవ్యత ఎల్లెడ విరిసేనే.
పూర్ణిమ: వలపులతో వికసించి,
పరిమళాల పంపించి,
భ్రమరుడి ధాటికి సోలి,
పరిపూర్ణత పొందె విరి.
సుందరి: ప్రతి హృదయము పొంగగా
చెలి యెడద పులకించ,
నవ వసంతు జంట గాడి
చంద్రుడి చూపెను వరుడు.
ముగ్గురు: ననలు వేసి,
పూత పూసె,
నిలువెల్లా చూతము.
పూతను తిన్న కోయిలకు
భూతలమే సుమవంతము.
ఇది వసంత మేనే,
ఇది సుమర్తువేనే.
సుచిర: గరిక పూలు, శిరీషాలు,
గాలికి వలవల లాడెను,
చంద్ర మౌళి శిరసునందు
సుందరముగ దాగుటకా?
పూర్ణిమ: పొదల లోన పూసిన
యా
మల్లికలు పిలువ
సాగె.
అభిసారిక సిగలో నిలువ
అభిసారిక వోలె లేచి.
ముగ్గురు: ఇది వసంత మేనే
ఇది సుమర్తువేనే .
సుందరి: చూచితివా?
ఓ చెలి చూచితివా?
తియ తీయని పరిమళాల
వెదజల్లే సుమ దళాల
సొగసుల సుందర హొయలను
|చూచితివా|
రుచిర: అడుగడుగున విరుల
వాన
అణువణువున సిరుల సోన
తియ తీయని పరిమళాల
వెదజల్లే సుమ దళాల | చూచితివా |
పూర్ణిమ: విరివిరి పై వాలి
వాలి
పొడి పుప్పొడి పైన
సోలి,
రంగుల రెక్కల హొయల
పొంగులతో భ్రమరుడిని |చూచితివా|
తియ తీయని పరిమళాల
వెదజల్లే సుమ దళాల | చూచితివా|
సుందరి: చిరు రసాల చిగురులను
చిరు బొజ్జకు పట్టించి
పొంగు హొరంగుల ప్రకృతి
పిలిచే కోయిల రాజును. |చూచితివా|
|తియ తీయని పరిమళాల|
నారాయణ నామమునే
పారాయణ చేయు ఋషులు
నవ వసంతు సొగసులలో
నవ లోకము చూచితిరే
మదనుడి విరి తూపుల
పదనుకు ఎద వేగ
లేక
వరుడి కొఱకు వేచి
చూచు
వధూమణుల వేదుకలో
మల్లికల వాసనలా
కలల కన్ను గీటేనా?
కొత్త కొత్త కోరికల
ఎడద వేచి చూచేనా?
చూడవే, అటు చూడవే......
తరాల ప్రకృతిలో
తరలి వచ్చు మార్పులతో
వాడి, వడలి, పర్ణ హీన
అయినది, ఈ పర్ణ శాల.
చూచితివా? ఓ చెలి చూచితివా?
(ఒక్కొక్కరు లోపలికి వస్తారు.)
సుందరి: ముని కుటుంబ మిట
నాడు
పచనము చేసిన పాత్రల
అవశేషములా ఇవి,
హా! విధి, ఎవరిది గృహము.
గాలులు ఈ నాటికైన
చొరబడ లేదేమొ గాని
ముని యొక్క దర్భ శయన
మిదె మరి చూడవె ఓ చెలి.
పూజా సుమముల నిచ్చెడి
మరుమల్లెల పొదలు
మాలి లేక వాడి పోయె
మధుర గతము గుర్తు చేయ.
ఎవరే ఈ ధీ శాలి,
ఎవరే ఈ మహా ఋషి,
ఏల గృహము వదిలెనో
ఎపుడు తిరిగి వచ్చునో?
సుచిర: నాదు తండ్రి చెప్పినాడు
ఘనుడట ఈ ముని వరుడు
కరువులోన ఇల జనంబు
ఆకలితో అలమటించ
గోదావరినిలకు తెచ్చి
కరువును మాపిన ఘనుడట,
ఘన నామము గౌతముడట,
ఎటకేగెను ఏమో మరి,
ఎపుడు తిరిగి వచ్చేనో?