Monday, May 23, 2011

శిల్పి 4


(శిల్పి ౩ నుండి )
తను కోరినది కాక  పోయినా      
తృప్తిని కల్గించినది.
తనకానందము కలిగే రీతిలొ
ఫలితము దక్కినది.
కలలు కన్న జీవితము
దరికి తను చేరెను నేడు
ప్రజకు తను చేసినది
తృప్తిని చేకూర్చినది.
        శ్రీ రామ రాయ భూపతి రాజు గారి పేరు. వయస్సు ఏబది సంవత్సరాల పైనే యుంటుంది, గంభీరముగా యుంటాడు, కానీ, ఉదాత్త స్వభావి.
       వచ్చిన యువకులనందరిని స్వయముగా ప్రశ్నించినాడు. కొంత మందిని తన అధీనములో యున్న విధులలోనే తీసుకున్నాడు.  వారందరిలో శ్రీ నాథుడు అగ్ర స్థానములోనే యున్నాడు. అతడికి ఆర్థిక మరియు విద్యా వ్యవహారాల భాధ్యత అప్ప చెప్ప బడినది. తన క్రిందనే యుంటాడు కాబట్టి ప్రత్యేక శిక్షణ అవసరము లేదనుకున్నాడు.
     రాజ ధానిలోనే అందరికి నివాసాలు ఏర్పరుప బడినవి.కొత్తగా చేరిన ప్రతి వ్యక్తి తోనూ చేయ వలసిన కార్యక్రమాల గురించి చర్చించే వాడు. వారి జవాబులను బట్టి వారి వ్యక్తిత్వాలను అంచనా వేయడానికి ప్రయత్నించే వాడు. అపుడపుడు అందరిని కలిపి సలహాలను తీసుకొనే వాడు.
      ఆ సమయములోనే రామాచారిగారు రాజధానికి రావడము జరిగినది. అతడికి రాజు గారు స్వయముగా ఎదుర్కొని స్వాగతము చెప్పినాడు. రాజుగారతని నుండి శ్రీ నాథుడి వ్యక్తిత్వమును గూర్చి బాగుగా తెలుసుకున్నాడు. అప్పటినుండి శ్రీ నాథుడి తో తమ అంతరంగిక విషయాలను కూడా చర్చించే వాడు. ఎన్నో సందేహాలను తీర్చే వాడు.
        "ప్రభువు కంటే ప్రజల అవసరాలకు ఎక్కువ విలువను ఇచ్చి ఆ అవసరాలను ప్రభువుకు తెలియ చేసే వాడే నిజమయిన ప్రభుత్వోద్యోగి "అనే వాడు.
          "ప్రధాన నగరాలలో ఎటువంటి వారికి ఆకలి భధ యుండకూడదు. ఎందుకంటే రాజ్యము యొక్క గౌరవ మర్యాదలను, సంస్కృతిని బయటి ప్రపంచానికి తెలిసేది వారి ద్వారానే."
          "ఆకర్షణియమన శిల్ప కళ ప్రభుత్వ సత్రాలలో కూడా కనిపించాలి. అవి సంస్కృతిపై గౌరవ మర్యాదలను పెంచుతాయి. అంతే గాక కళాకారులకు, శిల్పులకు జీవనోపాధిని కూడా కలిగిస్తాయి."
      " ముందు తరాలలో ప్రజల యొక్క దేశము యొక్క గౌరవ మర్యాదలను ప్రజలు తెలుసుకోవాలి. ఆ తరాల పాలకుల విశిష్థతను వారు అర్థము చేసుకోవాలి. మన యొక్క ఘన ఫలితాలను ముందు తరాల వారు తెలుసుకున్న నాడే మన సంస్కృతి నిలుస్తుంది. మనోహరముగా హృద్యముగా ఈ పనిని నిర్వర్తించ గలిగిన వారు కళాకారులే. వక్రత లేని కళాకారుడెవరయినా రాజ్య పరి రక్షణకు తోడ్పడుతాడు."
       పదే పదే రాజు గారు ఈ అభిప్రాయాలను వెల్లడించే వాడు.
          శ్రీ నాథుడు వేర్వేరు ఉప శాఖలలో పని చేసినాడు, చాలా విషయాలను తెలుసుకున్నాడు. రాజుగారి ఆదేశము మీద రాత్రిళ్ళు మారు వేషములో నగరులో పర్యటించే వాడు. ప్రతి విషయాన్ని పూర్తిగా పరిశీలించి రాజు ముందుంచే వాడు.
      తనకు క్షణము తీరిక లేదు, అయితే ఏమి? తను నేర్చుకున్న దానికి సార్థకత లభిస్తున్నది. రాజుగారి మన్నన యున్నది, తన  నిర్ణయాలకు విలువున్నది. మనస్సులో తృప్తి యున్నది. అన్నిటికి మించి గురువు గారి అపారమైన ఆశిస్సులున్నవి.
          రాజ ధానిలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి.  నూతన భవన నిర్మాణాలు జరిగేవి.  వాటిని సావధానముగా చూచుటకు వ్యవధి యుండేది కాదు. అందుకే కళల మీదకు దృష్టి పోవుట లేదు.
        నిద్రా సమయానికి ఇల్లు చేరే వాడు. పోతన భాగవత తాళ పత్ర ప్రతి తన దగ్గిర ఒకటి యున్నది. అందులో ఒక రేకు చదివేసరికి నిద్ర వచ్చేది. అలాగే నిద్రించే వాడు.
       తండ్రి నుండి, వీరభద్రయ్య నుండి ఒకే సారి ఉత్తరము వచ్చింది. "హేమను వివాహము చేసుకొనుతకు అభ్యంతరము ఏమయినా యున్నదా?" అని. హేమ అంటె అందాల ప్రోవు, తన కలల రూపము. అందుకే మీ ఇష్టమే నా ఇష్టమని వ్రాసి పంపినాడు.
          ఇక మానసికముగా ఎలాటి చింతా లేదు.బ్రతుకు పూల బాటగా మారినది. తను కోరుకున్నది దొరకక పోయినా దొరికినది బంగారు బ్రతుకే. నిశ్చయ తాంబూలాలకు కూడా తనను రమ్మన్నారు.ఇంకా ఒక మాసము కాలమున్నది.
      ప్రముఖ రాజోద్యోగిగా హోదా యున్నది. అనుకున్నది చేతి కందుతున్నది. హేమకు మంచి బహుమతి ఇవ్వాలనుకున్నాడు. నగిషీలతో మెరిసే చీరల? బంగారు ఆభరణాలా? నల్లని కురులకు జడ గంటలా? వారము రోజులు ఆలోచించినాడు. ఇవేమీ కాదు, పాల రాయి మీద హేమ బొమ్మ చెక్కాలని. మేలయిన పాల రాయి మీద వారము రోజులు శ్రమించి శిల్పాన్ని చెక్కినాడు.  ఎంతో మురిపముగా చూచుకుంటూ దానిని జాగ్రత్త పరచినాడు.
     ఆ రాత్రి కల వచ్చినది. ఆ కలలో హేమ కనిపించినది. తను చెక్కిన శిల్పాన్ని హేమకు ఇచ్చినాడు. దానిని తీసుకొని, "జీవము లేని రాయికి జీవము నిచ్చినావు", అని పొగడినది. " నీకు తోడుగా, నీడగా , నీలో యుండే కళాకారుడికి ఊపిరిగా నిలుస్తానన్నది."
        హఠాత్తుగా ఏదో హడావుడి, నగరమంతా కాంతి హీనమయినది.
(ఇంకా ఉన్నది )

No comments:

Post a Comment