Tuesday, August 7, 2018

ప్రస్థానము 7




ఒక  సారి  అక్కడ  ఇసుక  దిబ్బల మీద నడుస్తుంటే

“ఎవరబ్బాయివి నీవు?” ఎవరో ఒక ముసలాయన అడిగినాడు.

“శ్రీనివాస్  కొడుకును తాతగారూ!”

“గోపాల  కృష్ణయ్య మనుమడివా? అనుకున్నానులే.అయినా ఇక్కడేముందని వచ్చావు? అన్నీ వదిలి వేసుకొని అందరూ వెళ్ళిపోయారు కదా.”

“ఒక సారి  మా తాత గారున్న ఊరిని చూచి వేళ్ళుదామని  వచ్చాను. అయినా  ఇంకా  మా పొలాలు అమ్మి వేయ లేదు కదా.”

“ఇప్పుడు అమ్మాలన్నా కొనే  వారు ఎవరూ లేరు. ఎవరో  ఫాక్టరీలు  పెడితే  కొందరు అమ్ముదామని  అనుకున్నారు. ఫాక్టరీలు పెట్టారు, మూసేసినారు. తిరిగి వెళ్ళి పోయినారు.”

“ఎందుకని  తాత గారూ!”

“ఆళ్ళు ఫాక్టరీలు పెట్టగానే ఇక్కడ జనాలకు జబ్బులు  చేసి వళ్ళు  పాడయి  ఊరు  ఖాళీ  చేసి  వెళ్లి ఖాళీ  చేసి  వెళ్లి పోయినారు. ఇంకా ఫాక్టరీలు పెట్టిన  వారు ఊరు  పాడయిన తరువాత అనుకున్న లాభాలు రాలేదని, అన్నీ వదులు కొని వెళ్లి  పోయినారు. ఇంతకూ  మీ  నాన్నగారు  ఇక్కడే  పుట్టినాడు. అప్పుడప్పుడు  రావచ్చు కదా! అయినా  ఇక్కడ ఏమున్నదని  వస్తాడులే.”,  ఆయన  గొంతులో  బాధ కనిపించింది.

మళ్ళీ అన్నాడు. “మీ  తాత గారిల్లు తెలుసా? అందులో  పడి పోయిన గోడలు, ఇటుకలు మిగిలినాయి. అందరూ  ఆ కనిపించే  బావిలో నీరే వాడే  వారు. ఈ  ఊరికి ఏమి కర్మ వచ్చిందో  కానీ, రొయ్యల చెరువులు వచ్చిన తరువాత, ఆ నీరు ఉప్పగా తయారయింది.”

“ఇక్కడ  పశువుల  కొఠాము ఉండేది. ఇక్కడ  గడ్డి వాములు ఉండేవి.” దూరముగా ఉన్న ఇంకో నూతిని  చూపించినాడు,” ఆ  బావిలో నీరు అమృతము లా  ఉండేవి. అన్నీ ఉప్పులుగా తయారయినాయి.  ఆ పక్కనే  ధాన్యపు మిల్లు చాలా పెద్దది ఉండేది. ఇవన్నీ ఇప్పుడు కథలుగానే మిగిలి పోతాయి.  చెప్పినా ఎవరు విన్తారులే.”
“మా తాత  గురించి కాస్త చెబుతారా?”

“ఆయన  కేమి? ధర్మాత్ముడు. పెద్ద  ఆస్తులు ఏమీ లేవు, కానీ అందరూ తెలుసు. తనకున్న కొద్ది పోలముతో గుట్టుగా  గడుపుకొనే వాడు. ఊళ్ళో  పోస్టాఫీస్  స్కూలు ఆయనే  పెట్టించాదనే వారు. కొత్తగా  ఎరువు బస్తాల  రూపములో  రసాయనిక ఎరువులు వచ్చినపుడు, అధిక దిగుబడులు వస్తాయని అందరూ ఎగబడితే,  సేంద్రియ ఎరువులే మంచిదని, మన ఆరోగ్యము, ఆదాయము  వ్యాపారస్తుల చేతుల్లో పెడుతున్నామని ఆయన ఏంటో చెప్పినాడు. ప్రకృతి సహజమయిన పంటలను వదిలి వేసి, హైబ్రిడ్  పంటలకు వెళ్ళినపుడు ఇంకా బాధ పడినాడు. ఇంక మన విత్తనాలు కూడా ఉండవని రైతుల బ్రతుకు వ్యాపారస్తుల చేతుల్లో తెల్ల వారుతుందని అన్నాడు. ఎవరూ వినిపించుకోలేదు.”

“ ఆ  రోజుల్లో  మొలగొలకులు, కేసర్లు ముఖ్యమయిన పంటలు. అందులో మొలగొలకులు పంట  తో వచ్చిన బియ్యపు రుచే వేరు. వాటిని రాజనాలు అనే వారు. ఇంక కేసర్లు ఎఱ్ఱ కేసర్లు తెల్ల కేసర్లు అని రెండు రకాలు. వీటన్నిటికి బియ్యపు గింజ పెద్దది. అందుకని వంటలో  ఉడకటము కూడా ఆలస్యము. వాటికి సేంద్రియ ఎరువుల వాడకములో తెగుళ్ళు వచ్చేవి కాదు.  ఇంక  హైబ్రిడ్  పంట వచ్చిన తరువాత తెగుళ్ళకు విపరీతముగా మందులు వాడ వలసి వచ్చేది. ఎరువుల ఖర్చుతో  బాటు ఈ ఖర్చు కూడా పెరిగింది. ఇవన్నీ చూచినా మీ తాత రైతులను షాపుల వాళ్ళు దోచుకుంటున్నారు రా అనే వాడు.”

“మా చిన్నప్పుడు  ఎప్పుడయినా దాహము వేస్తే  పొలములో నీరు ధైర్యముగా తాగే వారు. ఇప్పుడు ఆ పొలాల్లో పురుగు మందుల వాసననే భరించ లేక పోతున్నాము. అన్ని  రకాలుగాత్రాగడానికి నీరు కూడా లేకుండా  బాధ పడుతున్నాము. మా  లాటి  వాళ్లకు ఉన్న ఊరు  వదిలి పెట్టి  వెళ్లడము ఇష్టము లేదు. వెళ్లి  ఎలా బతకాలో  తెలియదు. ఇంక ఉన్న కొద్ది రోజులు  ఎలాగో  గడిపి వేస్తే చాలు అనుకుంటున్నాము. “

“ఇంకో  ఊరు  వెళ్ళ వచ్చును కదా” అని అడగ పోయి ముందే  వచ్చిన జవాబు వలన మాట్లాడ  లేక పోయినాడు.
ఇంతలో సముద్రము వైపు నుండి ఎవరో వస్తూ ఉంటె ఆ  ముసలాయన పిలిచి “మన  గోపాల  కిష్టయ్య మనుమడు. చూ చావా” అన్నాడు.

“ నీ  పేరేమిటి  బాబయ్యా!” వాళ్ళు  అడిగినారు.

“గోపాల కృష్ణ.”

“తాత గారి పేరే. అందుకే కాబోలు. మనలను చూడడానికి వచ్చాడు” అన్నారు. ఆ మాటల్లో వారికి తాత మీద ఉన్న అభిమానము కన బడినది.

“ఎప్పుడొచ్చారు  బాబయ్యా! ఎప్పుదోచ్చారో ఏమో? కాస్త మజ్జిగ తాగండి. రండి. అదే మా ఇల్లు “వాళ్ళ మర్యాదకు ఆశ్చర్య  పడినాడు.

నులక మంచము వాల్చి కూర్చోమని అన్నారు.

ఒకరు తాటాకు  బుట్ట లోంచి  కొన్ని తాటి ముంజలు తీసి ఆకులో పెట్టి  తినమని ఇచ్చినారు.

“ అప్పుడు మీ తాత గారి  మాటలు విని  ఉంటె  ఇప్పడు ఇంట దరిద్రము వచ్చేది కాదు బాబయ్యా!” ఒకరన్నారు.
పేదరికము నిండిన వాళ్ళ జీవితాలలో కూడా వారు చూపించిన అభిమానానికి  కళ్ళల్లో తెలియకుండానే  నీరు పైకి ఉబికింది.

“మీ తాత గారు  మాకు ఏంటో చేసే వారు. ఎవరికైనా ఒంట్లో నలత వస్తే  ఆయనే చిన్న చిన్న మందు ఇచ్చే వాడు. అవసరమయితే తమ ఎడ్ల బండిలో పక్క ఊరికి పంపించే వాడు.. ఇప్పుడు మమ్మలను పట్టించు కొనే వారే లేరు. జబ్బు చేస్తే మూడు మైళ్ళు వెళ్ళాలి.”

వాళ్ళ పరిస్థితిని చూస్తె జాలి వేసింది. పరిశ్రమలు, రొయ్యల చెరువుల పేరుతొ పంట  పొలాలు చవుడు భూములుగా మారినాయి. అక్కడక్కడ ఏవో  చిరు ధాన్యాలు పండిస్తున్నారు.అందుకు కూడా నీరు లేదు.
కొంత మంది అత్యాశకు  ప్రభుత్వపు నిరాసక్తతకు  పంట భూములు చవుడు భూములుగా మారినాయి. ఎవరు మాత్రము ఏమి చేయ గలరు?

వాళ్ళలో మార్పు కోసము ఆర్తి  ఉంది, ఆకలి ఉంది,  ఆ నేల వదిలి పెట్టి వెల్ల కూడదన్న ఆకాంక్ష ఉంది. వేరిని చూచే ఏమో,  ఋషి వాక్యము వచ్చింది,” జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాదపి గరీయసి.”

వాళ్ళు అక్కడే  ఆ నేల  కౌగిళ్ళలో ఎదిగినారు. అందుకే బయటకు వెళ్ళ లేక పోతున్నారు.
తాతగారు అదృష్ట వంతులు. చని పోయిన తరువాత కూడా వాళ్ళలో  జీవిస్తున్నారు.
ఒక్క క్షణము అనిపిస్తుంది,వీరి కోసము ఏదయినా చేయాలని. మరో క్షణము ఎదో నైరాశ్యము,”తానూ ఏమి చేయ గలడు?”


No comments:

Post a Comment