Thursday, April 7, 2011

శిల్పి 2


(శిల్పి 1 తరువాత )

అణువణువున సొగసులతో
అలరించే ప్రకృతి
భగవంతుడి ప్రతి రూపము
పరవశింప చేయు నిజము
స్పర్శ చేత పరవశింప
చేయు పిల్ల గాలులు
ఆకాశపు మేలి ముసుగు
లాగ సాగు మేఘాలు
 వీటి నుండి తొంగి చూచి
పలకరించు ప్రకృతి
నిజమిది నిజమిది నిజము
అలరించే అద్భుతము 
        సాయంసంధ్యా సమయమయినది. ఆకాశములో పక్షులు బారులు బారులుగా పోతున్నవి. ఆకాశము క్రమముగా నీలి రంగునుండి ఎఱుపు రంగు లోనికి మారుతున్నది. ఆచార్యులుగారు చేతిలొ గుడ్డలతో వేద పథనము చేసుకుంటూ కాలువ దగ్గిఱకు చేరినాడు. వెనుక ఇద్దరు శిష్యులు తోడుగా గొంతు కలుపుతున్నారు.
     కాలువ దగ్గిఱ గుట్ట పైన ఒంటరిగా ఒక యువకుడు రాతి బండ మీద సుద్దతో గీస్తున్నాడు, తుడిపి వేస్తున్నాడు, మళ్ళీ గీస్తున్నాడు. కాంతి తగ్గి పోతున్నది. సాయంత్రమవుతున్నదనే భావన అతడిలో కలుగుట లేదు. ఆచార్యులు గారు అతడి దగ్గిఱకు వెళ్ళినాడు. ముఖములోనికి తేరి పార చూచినాడు. అతడు విశ్వ కర్మ కుమారుడు.
  "నాయనా!  శ్రీ నాథా!" పల్కరించినాడు.
పరధ్యానములో నున్న శ్రీ నాథుడొక్క సారి ఉలిక్కి పడినాడు. వెంటనే లేచి నిలబడినాడు.
"ఆచార్య దేవా! నమస్కారములు."
"శ్రీనాథా! చీకటి పడినది కూడా తెలియ లేదా? ఇక ఇంటికి వెళ్ళూ బాబూ!"
"అలాగే గురు వర్యా!"
"శ్రీ నాథా! ఒక్క నిముషము. నీతో కొన్ని విషయములు ప్రత్యేకముగా మాట్లాడాలి. రేపు ఒక ఘడియ ముందే రావాలి."
"అలాగే గురు వర్యా! నేను పోయి వచ్చెదను.", అని బయలు దేరినాడు.
  శ్రీనాథుడి మనస్సులో ఆ చిత్రము చెఱగటము లేదు.రెండు రోజుల ముందు నగరాధిపతి ఇంట భరత నాట్య ప్రదర్శన చూచినాడు.నాథుడిని విడువ లేక విడువ లేక పుట్టింటికి పొయే యువతి, వస్తానన్న కృష్ణుడు రాలేదేమన్న గోపికల కలవరము, నీవే నా ప్రాణమన్న నాథుడి మురిపాలకు సతి ముఖములో కనిపించే మెఱపు, ఓ...ఒక్కటి కాదు, ఎన్నెన్నో భావాలు, ఒక దాని వెంబడి ఒకటి, పదములో, కదలికలో, కన్నులలో..... మఱపే రావటము  లేదు. తన ఆప్తులతో ఈ విషయమే మాట్లాడినాడు.
       గీతలు గీచినాడు. అది తన ఊహలకనుగుణముగా రాలేదు, మళ్ళీ గీచినాడు, మళ్ళి గీచినాడు.ఆశ్ఛర్యముగా తను అనుకున్న రూపము వచ్చినది. ముఖములో భావములు స్పష్టముగా కనిపిస్తున్నవి. స్నేహితులకు చూపించినాడు. ఇంకేమిటి?రాతి మీద చెక్కమన్నారు.
   చిన్నప్పటినుండి శిల్ప విద్య నేర్చుకోవాలని యున్నది.నాన్నగారందులో నిపుణులు. కానీ, తనకు వద్దంటాడు. కానీ మామయ్య చాలా ఆసక్తితో దగ్గిఱ కూర్చో పెట్టుకొని, తనకు అన్నీ నేర్పించినాడు. ఎటువంటి రాతిని తీసుకోవాలి? ఎలా దానిని తయారు చేసుకోవాలి? పనిముట్లను ఎలా వాడాలి? తనకు వచ్చిన విద్య యంతా మామయ్య పెట్టిన బిక్షే .
    హేమ మామయ్య కూతురు. తను నేర్చుకుంటూంటే అన్నీ దగ్గిఱ యుండి చూచేది.
    హేమకు నేనంటే ఇష్టముందో లేదో తెలియదు.
    హేమ యొక అందాల బొమ్మ. హేమ తనతో యుంటే...ఓహ్... ఇంకేమి? ఇక ఈ కొండలలో హేమ బొమ్మలే యుంటాయి.
      ఈ ఆలోచనలతో  ఇంటికి చేరేసరికి బాగా చీకటి బడినది. నాన్నగారు ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఆయన దృష్టిలో పడకుండా ఇంటి వెనుక వైపుకు నడచినాడు.
(తరువాత భాగము త్వరలో)



No comments:

Post a Comment