Wednesday, October 30, 2013

ముళ్ళ మొక్క

                                                        ముళ్ళ మొక్క


                              ఓహో! గులాబి బాలా! అందాల ప్రేమ మాలా!
ఎంత బాగుందీ పాట. ఈ పాటను ఇప్పటికీ ఎవరూ మరిచి పోరు. ఆ పూల రెక్కలరంగు కళ్ళ ముందు కనిపిస్తుంటే, ఆత్మ హత్య చేసు కావాలన్న వారికి కూడా మరి కొన్నాళ్ళు బ్రదుకాలని అనిపిస్తుంది. అందుకనే నైరాశ్యము తో గూడిన వాతావరణానికి విరుగుడు గులాబి  రంగు అని నవ యుగ బోధకులు చెబుతారు.
          చూచారుకదా! మా వృక్ష జాతి మీ ఆలోచనలనే మార్చి వేయ కలదు. అయితే, అంత అందమయిన గులాబీ క్రిందనే సూటిగా గ్రుచ్చుకొనే ముళ్ళున్నాయి. అదే  మీ ఆరోపణ, అదే మా బలహీనత కూడా.
          మరి మీరు మీ ఇంట్లో చొరబడే వారిని చీల్చి చెండాడడానికి వేట కుక్కలను కాపలా పెట్టు కోవడము లేదా?
          మీకు తెలుసా? జాతుల పేరుతొ మనుషులు కొట్టుకుంటున్న రోజులలో,  షిరిడీ లో బాబా గారు ప్రాధాన్యతతో పెంచినది గులాబీ మొక్కలనేయని.ఎందుకో తెలుసా? ప్రేమను పెంచడానికి, మరియు పంచడానికి.
          మరి ఈ ముళ్ళ సంగతి ఏమిటి? మమ్ములను కారణము లేకుండానే కోసి చిదిపి వేసే వారి నుండి మాకున్న రక్షణే ఈ ముళ్ళు. నీళ్ళు తక్కువగా యుండేఎడారి ప్రాంతాలలో నాగ జెముడు, ముళ్ళ జెముడు లాంటిమొక్కలుంటాయి. వీటి గుజ్జు చాలా రుచిగా యుంటుంది. ఆ ముళ్ళే లేక పొతే ఆ జంతువులు వాటిని నమిలి పారేస్తాయి. మేకలకు తుమ్మ ఆకులూ అంటే చాలా ఇష్టము. వాటి నుండి రక్షించుకోవడానికి వాటికి ముళ్ళు ఏర్పడినాయి. ఈ ముళ్ళతో కూడా మాకు
పూర్తి రక్షణ లేదు. అయినా మాకు నింద తప్పుట లేదు.
          బిల్వము లేదా మారేడు దళాలంటే శివుడికి అత్యంత ప్రీతి. అంతే కాదు, రాజస్థాన్ లాంటి మండే ఎండల ప్రాంతాల్లో విపరీతమయిన వేడిని తగ్గించుటకై మారేడు కాయ లోని గుజ్జుతో రసము తీసి త్రాగుతారు. అయితే మీరేమి చేస్తున్నారు?  ఒక్క మారేడు చెట్టును పెంచడానికి మీకు ఓపిక లేదు. కానీ, కార్తీక మాసములో పూజలకని ఒక్క ఆకు కుడా మిగులకుండా త్రుంచి వేస్తున్నారు. అందుకే మారేడు చెట్లకు విపరీతముగా  ముళ్ళు ఉన్నవి. ఒక  సూక్తి ఉన్నది. ప్రాణాలు  పోయ గలిగిన వాళ్ళకే ప్రాణాలు తీసే  అధికార మున్నది. అలాగే మొక్కలను పెంచే  వారికే తుంచే అధికారము ఉండాలి..
          ఇంతకు ముందు మనిషి ఆలోచనలకు సమాజము లేదా లోకము కేంద్రముగా ఉండేది. కానీ ఇప్పుడు మీకు జీవితములో వేగము పెరిగినది. ఇప్పుడు మీ ప్రతి ఆలోచనకు మీరే కేంద్రమయినారు.  అందుకే ప్రక్కనున్న జీవిని గురించే కాదు, ప్రక్క వారిని గురించి కూడా ఆలోచించడము మాని వేసినారు.  మీ ప్రాచీన గ్రంథాలను కూడా మీరు చదవడము మాని వేసినారు. వైద్యుడు ఏదయినా మూలికను భూమినుండి పెళ్ళగించే ముందు, ఆ మూలిక ముందు నిలబడి, ప్రార్థన చేసి, ఇది ఒక రోగి యొక్క సహాయానికి అని చెప్పి, అనుమతి తీసుకొని, అప్పుడు ఆ మూలికను పెళ్లగించాలిట. ఇది ఆయుర్వేద వైద్యుల పధ్ధతి. ఈ మాట చెబితే కాకమ్మ కబుర్లు చెప్పకండి. అంటారు ఆధునిక వాదులు.
          వృక్షాలు మన ఆలోచనలకు స్పందిస్తాయని మన ప్రాచీన ఋషులకు తెలుసు. అందుకు మన పురాణాలలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆధునిక యంత్రాల ద్వారా చెట్లకు చైతన్యమున్నదని ఋజువు చేసిన జగదీశ్ చంద్ర బోస్ ఆ ఋషి సంప్రదాయానికి  చెందిన వాడే. ప్రాచీన ఋషి పరంపరకు చెందిన ఒక సజీవ సమకాలీన సైబీరియన్ యువతి,
అనస్తాసియా గూర్చి చదవండి.  ప్రకృతి మానవుల యొక్క ప్రేమకు ఎంతగా చలిస్తుందో తెలుస్తుంది. చెట్లకు, మనుషులకు మధ్య అనుబంధాన్ని ఎలా పెంచుకోవాలో ఆమె వివరిస్తుంది. ఇది అందరూ ఖచ్చితముగా చదువ వలసిన విషయము. వ్లాడిమిర్ మేగర్ వ్రాసిన ఈ పుస్తకము సరి కొత్త ఆలోచనలను  రేకెత్తిస్తుంది.
         
          ఆధునిక కాలములో ఇటువంటి ప్రయోగాలు చేసిన వారిలో లూథర్ బర్బాంక్ ప్రముఖుడు.  ఆయన చేసిన ప్రయోగాలు ఎంతో మందికి కను విప్పు కలిగిస్తాయి.  నీవు భయ పడ వలసిన అవసరము లేదు. నీకు నేను రక్షణ గా యున్నాను. నీకు ముళ్ళ అవసరము లేదు. అని ఆయన ముళ్ళ జెముడు మొక్కకు పలు మార్లు చెప్పిన తరువాత, ఆ మొక్క ముళ్ళు లేకుండా ఎదిగింది.  ప్రేమ, రక్షణ మరియు సహ జీవనము మొక్కలను మనుషులకు చాలా దగ్గరకు తీసుకొని వస్తుంది. ఈ విధముగా బర్బాంక్ మొక్కలలో ఎన్నో కొత్త మార్పులను తీసుకొని వచ్చినాడు.  వాల్నట్ మొక్కలలో పన్నెండు సంవత్సరాలలో వంద సంవత్సరాల ఎదుగుదలను, పంటను తీసుకొని వచ్చినాడు. ఆయన వాడిన దొకటే సూత్రము ప్రేమ.
          అలబామా కు చెందిన జార్జ్  వాషింగ్టన్ కార్వర్ మొక్కలతో సంభాషించి బఠానీ మొక్కల యొక్క ఉపయోగాలను వాటి ద్వారానే తెలుసుకున్నాడు. మొక్కల రహస్య జీవనము అనే పుస్తకములో పీటర్ టామ్ప్కిన్స్ మరియు బర్డ్ కొన్ని ప్రయోగాలను వివరించారు. ముళ్ళ జెముడు చెట్లు ఒంటరిగా యున్నపుడు ఈల పాటలు పాడుకున్తాయిట. వాటిని యంత్రముల ద్వారా కూడా విన్నారు. స్క్వాష్ అనే తీగ కు శాస్త్రీయ సంగీతమంటే ఎంతో ఇష్టమట.  అది ఎప్పుడు సంగీతము వచ్చే దిశ వైపే ప్రాకు తుందట. పాట వచ్చే పరికరాన్ని చుట్టేసుకున్తుందట.  అదే రాక్ సంగీతానికి దూరముగా వెళ్లి పోతుందట.
          ప్రకృతికి మీరు దూరముగా వెళ్లి పోతున్నారు, కాదు, వెళ్లి పోయారు. అందుకే మేము మీకు అర్థము కావటము లేదు. ఒక్క సారి మీ జాన పద కథల లోనికి వెళ్ళండి. అందుకు మీకు సమయమున్నదా? మరి కంప్యూటర్ ఆటలు ఆడుకోవాలి కదా! తనను ప్రేమగా పెంచిన యువకుడు దూర దేశాలలో జబ్బు పడితే, పెంచ బడిన మొక్క కూడా జబ్బు పడడము ఉన్నది కదా! ఇది మాకు మామూలే.
          మేము కూడా మీలాంటి వాళ్ళమే, మమ్ము హింసించకండి. మేము కూడా మీ వాళ్ళమే, మమ్ము నరకకండి. మమ్ములను మంచి చేసుకొని లాభాలను పొందడము షామన్లకు తెలిసినంత మీకెవరికీ తెలియదు.
          ఈ ప్రకృతికి, జీవ రాశికి మూలమయిన శక్తి యొక్కటే, అదే  ప్రేమ.

          చెట్లపై యున్న ముళ్ళు వాటి పొరుగు వారి క్రూరత్వాన్ని సూచిస్తాయి. అంతే గాని, వాటికున్నది ప్రేమ మాత్రమె.

1 comment: