Tuesday, February 18, 2014

సరికొత్త సామాజిక వాదము



 లేని వారు ఎదో యొకటి ఆలోచిస్తూనే యుంటారు. పనికి వచ్చేది  మాత్రము కాదు.  ఎదో యొకటి వ్రాస్తుంటారు., ఇదీ అంతే. ఇటువంటిదే ఇటీవల ఒక పత్రికలో ఒక వ్యాసము వచ్చినది. అదేమిటంటే, ఎడమ చేయి ఏమి పాపము చేసినది?  మూఢ నమ్మకాల నుండి మార్క్సిజం వరకు అందరూ మా ట్లాడేస్తూ ఉంటారు.  అయన/ఆమె బాధ ఏమిటంటే ఎడమ చేయిని చిన్న చూపు చూస్తున్నామా? , అని. ఇక్కడ నుండి సరిక్రొత్త సిద్ధాంతాలు, రాద్ధాంతాలు మొదలవుతాయి.
          ఒక సారి నేనొక ప్రొఫెసర్ ఇంట్లో రాత్రి విందుకు వెళ్ళినాను. అక్కడ ఒక అమెరికన్  జాతీయుడు కూడా అతిథి.  నేను గమనిస్తూ ఉన్నాను. అందరమూ అలవాటుగా కుడి చేతితో అన్నము కలుపుకొని తింటున్నాము.  అప్పటికే ఆయన తనకు అలవాటు అయిన రీతిలో రెండు చేతులను అన్నిటికి వాడుతూ తింటూ,క్రమ క్రమముగా అందరిని  గమనించి కుడి చేతి తో అన్నము తిన సాగినాడు.  ఇందులో ఎవరిదీ మంచి పధ్ధతి, లేదా కాదు అన్న ప్రశ్నే లేదు.  కాని, పదుగురు వెళ్ళే మార్గములో వెళ్ళాలని అందరూ  ప్రయత్నిస్తారు. అంతే గానీ దీనిని ఎదో ఒక తీవ్రమయిన విషయముగా భావించ వలసిన విషయము కాదు. ఈ తత్వము ఇంతటితో ఆపితే బాగుంటుంది, కానీ, అన్ని విషయాల్లో చేతులు పెడతారు.
          అదే పత్రికలో మరొక వ్యాసములో ఒక రచయితకు తెలుగు మీద సంస్కృతం యొక్క అత్తగారి పెత్తనము కనిపించినది. కానీ, ఆ రచయిత/రచయిత్రి  భారతీయ భాషలన్నీ సంస్కృతము నుండి వచ్సినాయన్న విషయాన్ని మఱచి పోయినాడు. అంటే కాదు, వారికి  ఆంగ్లము ( పొరపాటయింది ), ఇంగిలీషు మామ గారి పెత్తనము కూడా కనిపించినది.
          మనము చరిత్ర పూర్తిగా చదివి అర్థము చేసుకోకుండా ఈ విధమయిన మిడి మిడి జ్ఞానముతో ప్రతి విషయానికి సామ్య /సామాజిక వాడమును  ఆపాదించు కుంటూ పొతే గోరిల్లాలకు కూడా సరి అయిన న్యాయము అందించ వలసి యుంటుంది. అవి కూడా మనలాగే  ఆహారము తింటాయి, నడుస్తాయి, కాస్త అలవాటు చేస్తే చిన్న చిన్న మాటలు కూడా మాట్లాడుతాయి. వాటికి మన లాగే కాస్త కోపము కూడా ఎక్కువగానే యుంటుంది. ఈ సరికొత్త సామాజిక వాదులకు అది కనిపించదనుకుంటాను.
          గౌతమ  బుద్ధుడు కూడా తన మొదటి ప్రవచనాలన్నీ సంస్కృతం లోనే చేసినారన్న విషయము చాలా మందికి తెలిసి యుండక పోవచ్చును.  కానీ, అవి సామాన్యులకు అర్థము కావటము లేదన్న భావముతో పాళీ భాషలో తన బోధనలను చేసినాడు. అంటే ఆయనకు సంస్కృతము మీద అభిమానము తగ్గినదని  లేదా  పాళీ భాష  మీద అభిమానము పెరిగినదని కాదు. ఎవరికీ అయనా ఏదయినా అందించాలంటే అందుకు అనుగుణమైన భాషలో చెప్పాలన్నది, ప్రాచీన కాలమునుండి ఋషులు అనుసరిస్తున్న విధానము. అంతే కానీ ప్రధానమైన భాషను దిగజార్చుట వారి ఉద్దేశ్యము కాదు. మరొకటి గమనించాలి, భారత దేశము నుండి, టిబెట్  మరియు చైనా లకు వెళ్ళిన బౌద్ధ గ్రంథాలు ఎక్కువగా సంస్కృత గ్రంథాలే.
          మన ప్రధాన మయిన ఇతిహాసాలన్నీ సంస్కృతము లో యున్న రోజుల్లో మహా భారతాన్ని పంప కన్నడము లోనికి అనువదించినాడు. అదే సమయములో నన్నయ భట్టారకుడు భారతాన్ని తెలుగు లోకి అనువదించి నాడు. వచనములో కంటే పద్యము లో యున్న సంగీత పరత్వానికి తెలుగు ప్రజలు పరవ శించినారు. నన్నయ తో మొదలయిన ఈ ప్రయత్నము తిక్కన సోమయాజి, ఎర్రాప్రగడ ల తో పూర్తి అయింది. దీని తో తెలుగు కు సాంస్కృతికము గా ప్రాధాన్యము లభించినది. క్రమ క్రమముగా భాష మీద పటుత్వము లేని వారందరూ సరి క్రొత్త సూక్తులు మొదలు పెట్టినారు.  మా భావాలను ఛందస్సుతో బందీలుగా చేయ లేమని సరికొత్త  నినాదాలను సృష్టించినారు. ప్రతి యొక్కరికి తమకు నచ్చిన రీతిలో వ్రాసే అధికారము ఎప్పుడూ ఉంది. అందుకని తమను మేధావి వర్గముగా మిగిలిన వారు  చాందసులుగా ప్రకటించు కోవలసిన అవసరము లేదు. నిజానికి ఛాందసులంటే ఛందస్సు ను ఉపయోగించే వారని అర్థము. అంతే కాని అది చెడు పదము కాదు. కెవ్వు కేక లాంటి కవితలు వచ్చే కొద్దీ ప్రజలకు భాష మీద పటుత్వము తగ్గి పోయింది. అటువంటి పరిస్థితులలో మాండలికాలు పెరిగి పోయి, అసలు భాష జనానికి దూరము అవుతుంది. అయిదు వేల నాటి సంస్కృతము ఈ నాటికీ అర్థము అవుతుంది. కానీ అయిదు వందల నాటి ఆంగ్లము ఇప్పటి వారికి పూర్తిగా అర్థము కాదు. కారణము  ఒకటే. ఖచ్చితముగా వ్యాకరణ సూత్రాలను పాటించక పోవడము వలన భాష స్వరూపము మారి పోతుంది.
          ఒక సారి ఒక బెంగాలీ స్నేహితుడి తో భాష మీద ఒక చర్చ వచ్చినది.  రవీంద్ర అనకుండా రబీంద్ర అని ఎందుకు ఉచ్చరిస్తారని నేను ప్రశ్నించి నాను. ఆయన ఒక సిద్ధాంతము చెప్పినాడు. జీవ భాషలు నిరంతరము మార్పు చెందుతాయని ఆయన చెప్పినాడు. ఆ క్రమములోనే వ యున్న చోట బ వచ్చిందని అన్నాడు. ఆధునిక భాషా శాస్త్రము (లిమ్గిస్తిక్స్ )లో ఇటువంటి సిద్ధాంతము యున్నదని నాకు అప్పుడు తెలిసింది. వెంటనే నేను ఒక ప్రశ్న వేసినాను. మీ తాత గారు వ్రాసినది మీకు అర్థము కాక పొతే అది ఖచ్చితముగా జీవ భాషే కదాఅని. సంస్కృతాన్ని మృత భాష అని ఎందుకంటారో కూడా అప్పుడు నాకు తెలిసింది. కొన్ని వేల సంవత్సరాలుగా సంస్కృత భాషా నిర్మాణము లో మార్పు లేదు కదా.  అంటే కాని సంస్కృతాన్ని జనము ఇంకా వాడుతున్నారా అనే ప్రశ్న ఇక్కడ లేదు. కొన్ని సిద్ధాంతాలు ఇలాగే యుంటాయి.
          ఆ తరువాత మన అంటే తెలుగు భాష చాలా గొప్ప భాష అని విదేశీయులు ఎప్పుడు పొగిడినారో నాకు అర్థము కా లేదు. మన బ్రౌన్ లాటి వారికి తప్ప అలా పొగిడే అలవాటు వారికి ఎప్పుడూ లేదు. వాళ్ళు అన్నది ఒకే మాట. తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. అంటీ ప్రాచ్య ఇటాలియన్ భాష అని యన్నారు. అంతే.  దీనిని పొగడ్త గా ఎవరూ ఎలా అర్థము చేసుకున్నారో కూడా తెలియ లేదు.  నిజానికి భారత దేశపు  భాషలలో ఎక్కువ భాషలు హల్లులతో అంతమవుతాయి, సంస్కృతము, తెలుగు మరియు కన్నడము తప్ప.  అందులో తెలుగు కన్నడాలను అజంత భాషలు అంటారు. యూరప్ లో ఇటువంటి లక్షణము ఉండేది ఒక ఇటాలియన్ భాషకు మాత్రమె. అందరూ రోం  అంటే వాళ్ళు రోమా అని అంటారు. అందరూ పొప్ అంటే వాళ్ళు పాపా అంటారు.వాళ్ళ కంపెనీ పేరు కూడా పియాగ్ లేదా పియాగియ్ అని యుండదు. స్పష్టముగా పియాగియో అని యుంటుంది. తెలుగు పదాలకు అవే లక్షణాలున్నాయని వారన్నారు, అంతే.
          ఇటు వంటిదే  మరొక విషయము చెప్ప వలసి యున్నది. భారతీయులకు అందులో ప్రధానముగా తెలుగు వాళ్లకు ఏ మాత్రము ఎదుటి వాళ్ళు పొగిడినా పడి పోయే అలవాటు ఉన్నది. భారతీయ గణితములో స్థానాన్ని బట్టి విలువ ఇచ్చే అంకెలతో సున్నకు యున్న ప్రాధాన్యత అందరికి తెలుసు. కానీ పాశ్చాత్యులు వాడే వాక్యమేమంటే గణితానికి భారతీయుల ప్రధానమయిన ప్రతిపాదన సున్నఅని.( Indian contribution to mathematics is zero)  ఇది చూచి మనము మనలను గురించి గర్వ పడ వచ్చును. ఇందులో ఇంకో అర్థము కూడా వస్తుంది. అది పట్టుకొని వాళ్ళు మనలను గేలి చేయ వచ్చును కూడా. అందుకే భారతీయుల గురించి పాశ్చాత్యుల కొన్ని ఉవాచలు అర్థము కావు. అంతకంటే అద్భుత మయిన గణిత ప్రతిపాదనలు పరిజ్ఞానము పాశ్చాత్యులకంటే కొన్ని వందల సంవత్సరాల ముందే భారతీయ గ్రంథాలలో యున్నవి.  న్యూటన్ వాడిన కొన్ని ప్రక్రియలు కొన్ని వందల సంవత్సరాలకు ముందే భాస్కరాచార్యులు తమ సిద్ధాంత శిరోమణి లో వాడినారన్న విషయము ఎవరికీ గుర్తుండదు. అందుకే కొన్ని నిజానికి పొగడ్తలు అయినా మనకు వాటిని అనుమానించ వలసి వస్తుంది.
          కొన్ని శతాబ్దాల పర్యంతము సముద్ర మార్గము వచ్చే వరకు భారత దేశమునకు సింధు నది దాటి రావలసి యండేది. మన  శబ్దమును సరిహద్దు లోని పార్సీలు క్రింద పలికే వారు. ఆ విధముగా హిందూ నదిని దాటి వెళ్ళే దేశము కాబట్టి ఈ దేశమును హిందూ దేశము అని పిలిచినారు. అదే విధముగా దక్షిణముగా యున్న సముద్రానికి హిందూ మహా సముద్రము అని పిలిచినారు. ఈ పేరు పెట్టింది విదేశీయులే. ఇక్కడ సంప్రదాయమును హిందూ మతము అని అన్నారు.  ఈ దేసానికి అసలు ప్రాచీన మయిన పేరు అజనాభ దేశము. ఋషభుడి కుమారుడయిన భరతుడి పేరున ఇది భారత దేశము అయినది. అటువంటిది కొన్ని సంవత్సరాల క్రిందట మన పొరుగు దేశము ఒక మహా సముద్రానికి ఒక మతము పేరు ఎలా పెడతారని అంతర్జాతీయ వేదిక మీద గొడవ చేయాలనీ ప్రయత్నించిన విషయము అందరూ మర్చి పోయి యుంటారు. ఏమయినా మనము, మన ప్రభుత్వము నాలుక లేనివి కదా!
          పైన చెప్పా బడిన వాటిలో ఏది యథార్థ వాడమో, ఏది మూర్ఖ వాడమో అర్థము కాదు. మనుషుల మధ్య యుండ వలసినది ప్రేమ గానీ తార్కికి వివాదాస్పద విశ్లేషణలు కాదు.
       ఒక్క మాట చెప్పాలంటే నేను కూడా పని లేని వాడినే. ఎందుకంటే ఇటువంట పని లేని విశ్లేషణలకు స్పందిన్చినాను. మరి నేను కూడా మామూలు మనిషినే కదా!


  Also visit varasatvamu.blogspot.in

1 comment:

  1. ఒక్క విషయం మరచిపోయారు.
    తమలోతాము నిత్యం ఐనదానికీ‌ కానిదానికీ తన్నుకుచచ్చే గొప్ప జాతీయదృక్పథం కూడా మన భారతీయుల ప్రత్యేకలక్షణమే. విదేశీయులకాళ్ళమీద పడి బాంచన్ దొర అని పులకరించిపోయే తత్త్వం కూడా ఎక్కడికీ పోలేదు - ఎక్కడికీ పోదు కూడా. అదీ‌ మన భ్రారతీయుల ప్రత్యేకలక్షణమే నేమో!

    ReplyDelete