Friday, February 14, 2014

శ్రీ చదువు

                                               


                 ఏమోయ్ రాజూ! ఏమి చేస్తున్నావు?
                ఇంజనీరింగ్ చదువుతున్నాను, బాబాయ్!
                మరి, నీ సంగతేమిటోయ్, చందూ!
                ఇంజనీరింగ్ చదువుకుంటున్నాను
              రాజేమో ఎదో చదువుతున్నానన్నాడు. మరి, చందూ  ఏమో చదువు కుంటున్నా నన్నాడు.  మరో వ్యక్తీ     చదువు కొంటున్నానన్నాడు. ఇందులో ఎవరిదీ సరి అయిన జవాబు?
        ఇక్కడ చదువు విషయములో ఎవరికీ ఏ అనుమానము రాదు, ఈ రోజుల్లో  అందరూ చదువుకొంటున్నారు, నిజమే చదువును కొంటున్నారు.
      కొన్నాళ్ళ క్రిందట  విద్యార్థి అనే పదాన్ని అందరూ వాడే వారు, ఇప్పుడు కూడా వాడుతున్నారు. అర్థము మాత్రము మారి పోయినది. విద్యనూ అర్థించే వాడు, అంటే విద్యనూ భిక్షగా ఇమ్మని యాచించే వాడు విద్యార్థి. అటువంటి విద్యలలో ఉన్నత స్థాయికి చెందిన ఒక విద్యనూ శ్రీ విద్య అనే వారు. దీనిని అందుకోవాలంటే, శిష్యుడు గురువు దగ్గిర చాలా కఠిన మయిన లేదా తీవ్రమయిన సాధనను చేయ వలసి యుండేది. ఎందుకంటే మంత్ర శాస్త్రములో యే యొక్క బీజము మారి పోయినా ప్రభావము మారి పోతుంది. అందు వలన వచ్చే ఫలితానికి నేర్చుకున్న వాడు బాధ్యుడవుతాడు. ఉచ్చారణ చాలా ప్రాధాన్యతను కలిగి యుంటుంది. ఏ మాత్రము తేడా వచ్చినా ఫలితాలు చాలా తీవ్రముగా యుంటాయి. విత్ ధాతువుకు అర్థము జ్ఞానము. య కు ఎక్కడ యున్నదో అన్న అర్థము వస్తుంది. యథా రాజా తథా ప్రజా లాంటి వాక్యాలు ఇలా శబ్దము నుండి వచ్చినవే. ఎక్కడయితే జ్ఞానమున్నదో అదే విద్య.  అంతే గానీ, జపాన్ రాజధాని టోక్యో యని, మనకింతకు ముందు ఇంతమంది మంత్రులున్నారని, అశోకుడు రహదారుల కిరువైపులా చెట్లని నాటించినారని  చెప్పేది, విద్యార్థులకు నేర్పిస్తే అది చదువు అవుతుంది కానీ, విద్య కాదు.
          ఇక్కడ నుండి శ్రీకాకుళం కు పని మీద బస్సు లో వెళుతున్నామని అనుకుందాము.  మనస్సు పని మీద మాత్రమే యుంటే రహదారి కి ఇరు వైపులా ఏమి జరుగుతున్నదనే విషయము దృష్టి కి రాదు. అది లేనపుడు  ప్రక్కనున్న వాటిని కూడా చూచుకుంటూ వెళుతాము. ఇదే విధముగా మనము లక్ష్యము వైపు వెళుతున్నపుడు దారిలో కనిపించేవి గుర్తు సంభాలు, అంతే కానీ, అవి మన లక్ష్యాలు కాదు.

          భౌతిక శాస్త్రము అభ్యసించేటపుడు డెమోక్రటేస్, న్యూటన్ మరియు ఐన్ స్టీన్న్ లాంటి వారు శాస్త్రము నేర్చుకొనే దారిలో కనిపించే స్తంభాల లాంటి వారే కానీ, వారు శాస్త్రము కాదు. ఈ విషయములోనే భారతీయ మరియు పాశ్చాత్య
శాస్త్ర గ్రంథాల్లో తేడా కనబడుతుంది.  ఉదాహరణకు చరక సంహిత ఒక ఆయుర్వేద గ్రంథము. పాశ్చాత్య సంప్రదాయము నకు అలవాటు పడిన వారు, ఆ గ్రంథాన్ని చరకుడు అనే వ్యక్తీ వ్రాసినారు అని అన్నారు.  కానీ,  ఒక చోటి నుండి, మరొక చోటికి, మందులు తీసుకొని వెళ్లి వైద్యము చేసే వాళ్ళను ప్రాచీన భారతీయ సాంప్రదాయములో చరకులు అంటారు అని, వారికొరకు వ్రాసిన సంహితను చరక సంహిత అనెదరని మరొక వాదన యున్నది.  కానీ, నిజానికి ఆ గ్రంథాన్ని వ్రాసినదెవరో ఎవరికీ తెలియదు. మన భారతీయ శాస్త్ర విజ్ఞాన ద్రష్టల గురించి మనకు ఎటువంటి సమాచారము దొరకదు.
ఈ అద్భుత నిర్మాణమును ఎవరూ చేసినారో ఎవరికీ తెలియదు. వారందరికీ వందనములు. కానీ, వారి ఉనికి అప్పుడప్పుడు కనబడుతూనే ఉంటుంది.
          ఒక సాధకుడికి ఒక కొబ్బరి తోట ఉన్నది. అందు లోకి ఒక  పేద వాడు వచ్చినాడు. మంచి ఆకలి మీద యున్నాడు. చెట్టి ఎక్కి కొబ్బరి కాయ కోయ బోయినాడు. దీనిని యజమాని అయిన సాధకుడు గమనించి అతడిని అక్కడే బంధించినాడు.  ఇంటికి వెళ్లి, పాత్ర నిండా ఆహార పదార్థములు, కొన్ని కొబ్బరి కాయలు తెచ్చి వాటిని తీసుకొమ్మని చెప్పి వెళ్లి పొమ్మని చెప్పినాడు. దీనిని చూచిన ఒక వ్యక్తి, నీకు పిచ్చి పట్టిందా ఏమిటి? దొంగను ఇలా ఎవరయినా సత్కరిస్తారా? అని అడిగినాడు. అప్పుడా సాధకు డన్నాడు,అవసరము లేదు, అతడికి ఎక్కడ శిక్ష పడాలో అక్కడ పడింది, ఇంకా అతడు దొంగ తనము చేయ లేదు. అన్నాడు. నిజమే అతడికి భౌతిక మయిన శిక్ష లభిస్తే బహుశా దొంగగా ఉంది పోయే వాడేమో? కానీ, దెబ్బ మనసుకు తగిలినది. ఆ సాధకుడు మరో మాట అంటాడు. ఇటువంటి విద్యను నేర్పే శాస్త్రాలు కను మరగు అయి పోయినాయి అని. ఈ సంఘటన అయ్యర్ నిర్మించిన శంకరాచార్య  చిత్రములో చూపించ బడినది.
          ఇందులో శ్రీ సత్య సాయి బాబా భక్తుడయిన హోల్ హోనిగ్ న్యూయార్క్ లో పెట్టుకున్న ఆహార వితరణ కార్యక్రమమును ప్రస్తావిస్తాను. బాబా యొక్క ప్రభావము వలన అయన రోజూ సాంద్ విచ్ లను, కుకీ లను ఆకలి మీద యున్న పేద వారికి న్యూయార్క్ నగరములో నున్న మూలలలో నున్న ప్రదేశాలలో పంచడము అలవాటు చేసుకున్నాడు. ఒక సారి రైలు బండిలోవీటిని పంచుతుంటే, ఒక బలముగా కనిపించే వ్యక్తీ ఎగుడు దిగుడు జుట్టుతో, ఇష్టము వచ్చినట్లు కదులుతూ కనిపించినాడు. అనాగరికంగా కథినము గా కనిపిస్తున్న అతడు డబ్బులు అడుగుతున్న విధానము అందరికి భయము వేస్తున్నాది. పైన చెప్పిన భక్తుడిని కూడా ప్రక్కనున్న వారు అతడి గురించి హెచ్చరించినారు. అయినా ధైర్యము చేసి, నీకు సాండ్ విచ్ కావాలా? అని అడిగినాడు. అతడు నాకు చాలా ఆకలి గా ఉన్నది అని, ఆత్రము గా తీసుకొని గబగబా తిని ముందుకు వెళ్లి పోయినాడుట. ఆహారము తీసుకున్న తరువాత అతడి ముఖములో అంతకు ముందున్న క్రూరత్వము మాయమయి పోయిందని  హోల్  హోనిగ్ చెబుతాడు.
          చిన్నప్పుడు నా జీవితములో జరిగిన సంఘటను ఒక దానిని ప్రస్తావిస్తాను.  నేను పుట్టి, పెరిగిన ఊరు పేరు
 పైనాం పురం. నేను చదువుకున్న ఉన్నత పాథ శాల ఈదూరు అనే గ్రామములో యున్నది. ఈ రెండిటి మధ్య దూరము సుమారుగా మూడు మైళ్ళు లేదా అయిదు కిలో మీటర్లు. మరో వసతి లేనందు వలన రొజూ నడచి వెళ్ళాలి. దారిలో అన్నీ పంట పొలాలు. ఒక రోజు నేనూ నాతొ బాటు వారు, దారిలో ఒక వేరు శనగ వేసి యున్న ఒక పంట పొలములో దిగినాము. వేరు శనగ మొక్కలను పెకలించి కాయలను అందరూ తింటున్నారు. ఇంతలో ఆ పొలానికి సంబంధించిన వ్యక్తి అందరిని తిట్టి బయటికి పంపించినాడు, కానీ, నన్నేమి అన లేదు. నన్ను ఒక చూపు చూచి నాడు అంతే. అతడు మా నాన్న దగ్గిరకు తరచు వస్తూ యుంటాడు. నిజానికి అతడు మా నాన్నకు నా మీద ఎలాటి పితూరీ చెప్ప లేదు. కానీ, అతడి ఈ ప్రవర్తన నన్ను ఎంత బాధ పెట్టిందంటే, ఆ తరువాత నేను ఆ విధముగా ఎవరి పొలములో దిగ లేదు.
          మరొక సంఘటన. ఒక సారి మా వారి పోలములో పనను దొంగిలించినారు. ఈ పని మాదగ్గిర పని చేసే వారే చేసినారని మా దాయాదులు వదంతులు రేపినారు. ఆ పని చేసే వ్యక్తికీ ఏబది ఏండ్ల పైనే యుంటుంది. భయముతో దిగులు పెట్టుకుని జ్వరము తెచ్చుకున్నాడు. అప్పుడు అతడిని మా అమ్మ పిలిపించింది. వేడి వేడి గా అన్నము పెట్టింది. మా అమ్మ , నాన్న ఇద్దరూ, ఇన్నాళ్ళు పని చేస్తున్న మిమ్ములను నమ్మక పొతే ఇంక ఎవరిని నమ్ముతాము? ఎవరేమన్నా పట్టించు కోవద్దు.. అని చెప్పి పంపించినారు. అప్పటి, ఆ ప్రేమలు, ఆపేక్షలు ఇప్పటి జనానికి అర్థము అవుతాయా?    
          ఈ విధముగా మనము చెప్పే విద్యలు ఎక్కవలసినది బుర్రకు కాదు, మనసుకు.  మా మాస్టారు ఒక ఉన్నత విద్యా సంస్థలో పని చేసి పదవీ విరమణ చేసినారు. ఆయన చెప్పిన ఒక విషయము: ఒక జర్మన్ ప్రొఫెసర్ తో సోక్రటిక్ విద్యా విధానము గూర్చి అడిగితే ఆయన మీరు పూర్తిగా మరిచి పోయిన ఉపనిషదిక్ పధ్ధతి మించిన విద్యా విధానము ఎక్కడుంది? అని తిరిగి ప్రశ్నించినాడుట. అందులో శాస్త్ర విదానముతోబాటు శీల గుణాలకుఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినారు.
          కృష్ణ యజుర్వేదములో శిష్యుడికి చదువు అయిపోయిన తరువాత కొన్ని నియమాలను బోధిస్తాడు. అందులో కొన్ని,
మాతృ దేవో భవ|
పితృ దేవో భవ|
ఆచార్య దేవో భవ|
  అందులో మనకు అంతర్లీనముగా తన బిడ్డలు ఎక్కడ ఎలా కష్ట పడుతున్నారో,తపన పడే తల్లి ని,
బిడ్డ ఎలా కష్ట పడినా ఫరవాలేదు, విద్యావంతుడు కావాలనుకొనే తండ్రిని,  శిష్యుడికి ప్రధానమయినది  జ్ఞానార్జన,దాని కోసము నిప్పుల్లో పడినా ఫరవాలేదు, నేను రక్షించుకోగలను అన్న ధీమాతో జీవించే గురువును ఏ రీతిలో గౌరవించాలో
చెబుతారు. వీరే శిష్యుడికి మొదటి దేవుళ్ళు. ఇదే మన ప్రాచీన భారతీయ సాంప్రదాయానికి మూల స్తంభాలు. ఈ నాదు మన  పిల్లలకు ఇటువంటి ఆలోచనలను ఈయ గలుగుతున్నామా?
          అందులోనే సత్యం వద , ధర్మం చర  అని శిష్యుడిని ఆదేశిస్తాడు. అంటే సత్యమునే పలుకుము, ధర్మమునందే సంచ రింపుము,అని.
          స్వాధ్యాయాన్మా ప్రమదః అని బోధిస్తారు, అంతే కాదు. స్వాధ్యాయ ప్రవచానాభ్యాం నా  ప్రమదితవ్యం అని ఆదేశిస్తారు. మొదట నిరంతరమూ, చదువుకొనుట మరియు అవగాహన చేసుకొనుటలో పొరపాటు పడ వద్దు. అంటే కాదు,నీవు నేర్చుకున్న దానిని ఇతరులకు చెప్పుటలో కూడా పొరపాటు పడ వద్దు. అని చెబుతారు. ఇక్కడ స్వాధ్యాయము అంటే పుస్తక/విజ్ఞాన భాండాగారాలను బుర్రకు ఎక్కించడము మాత్రమే కాదు, శీల గుణ వ్యవహారాలలో తనను కూడా నిరంతరము తనను అధ్యయనము చేసుకోవాలి. ఇవి అన్నీ కూడా కలిస్తేనే విద్య అవుతుంది.
          ఇవి అన్నీ లేక పొతే అది చదువు అవుతుంది. విద్య చదువు ఒకటి కాదా? వేర్వేరేనా? అంటే ఆంగ్ల భాషలో కూడా వేర్వేరు పదాలున్నవి. రీడ్ అంటే చదువుట, స్టడీ అంటే అధ్యయనము చేయుట. స్టూడెంట్ అంటే అధ్యయనము చేసే వాడు, అంతే, కానీ, రీడ్ చేసే వాడు కాదు. ఒక పాఠ్య గ్రంథాన్ని మొదటి నుండి అర్థము చేసుకోకుండా అప్ప చెప్పే వాడిని స్టూడెంట్ అని అన కూడదు, రీడర్ అని అన వచ్చు అనుకుంటాను. 
          ఒకప్పుడు మంచి శిష్యుడి కొఱకు గురువులు ఎంతో ఎదురు చూచే వారు. తరువాత కాలము లో మంచి గురువు కోసము శిష్యులు వారణాసి, ఉజ్జయిని లాంటి స్థలాలకు వెదుకుతూ వెళ్ళే వారు. కానీ ఈ నాడు, పాథ శాలలు బాగా పెరిగినవి, కానీ, మంచి, గురువు, మంచి శిష్యుడు, దొరకడము కష్టముగానే యున్నది. కారణము ఒకటే, మన విద్యా వ్యవస్థ లో శీల నిర్మాణము పై తగ్గిన శ్రద్ధ.
          విద్య లక్ష్మి తో కూడుకున్నది. అందుకనే దానికి శ్రీ విద్య అని పేరు వచ్చినది. ఆ లక్ష్మి, మనము సృష్టించినది కాదు. ధనమగ్ని ర్ధనం వాయు ధనం భూతాని పంచచ అన్న ఋషి వాక్యమును గమనిస్తే మనము సక్రమముగా యుంచిన ప్రకృతే మన సంపద. మనము సృష్టించుకున్న కోట్ల రూపాయల సంపద యున్నా కంపు కొట్టే వాతావరణములో ఉండ లేము కదా!

          కానీ ఈ నాడు చదువు భౌతిక మయిన సంపదతో సంబంధాన్ని కలిగి మానవత్వానికి దూరముగా పోతున్నది.  అందుకే దాన్ని శ్రీ చదువు అందాము. ఇది త్వరలో శ్రీ విద్యగా మారే రోజు కోసము ఎదురు చూస్తాము.  

No comments:

Post a Comment