Friday, December 20, 2013

సిధ్ధార్థ

                                                                                     

           సిధ్ధార్థ అందగాడే కాదు, గుణవంతుడు కూడా, పసి తనములో తల్లి దండ్రులను కోల్పోయినాడు. కానీ అనాథ గా మాత్రము లేడు. ఊళ్ళో అందరికి సాయము చేస్తూ, వారి అండతో, వారిలో ఒకరిగా పెరిగినాడు. తను ఎవ్వరి మాటను కాదనడు. అందుకని పెద్ద వాళ్ళ ప్రేమకు పాత్రుడయినాడు. బాగా మృదు స్వభావి, అందరితో ప్రేమగా మాట్లాడుతాడు. అది కూడా అవసరముంటేనే. స్త్రీలతో కూడా లల్పించుకొని మాట్లాడే వాడు కాదు. అందుకని, వారు కూడా సిధ్ధార్థ మీద ప్రేమాభిమానాలు చూపేవారు.
           వయస్సు పెరిగే కొద్దీ, ఆకర్షణ పెరుగుతున్నది. కానీ, మాట తీరు, స్వభావములో మార్పు రాలేదు.
అందుకని, ఆ వూళ్ళో, చాలా మంది చిన్నప్పటి నుండి తమ మధ్య పెరిగిన సిధ్ధార్థను అల్లుడిగా చేసుకోవాలని భావిస్తున్నారు. తల్లి దండ్రుల మాటలను విన్న అమ్మాయిలు కూడా సిధ్ధార్థ చేత ఆకర్షితులయినారు, కానీ సాంప్రదాయము కట్టుబాటు వలన వారు బయట పడ లేదు.
            ఊరంతా కోలాహలముగా ఉన్నది, జనమంతా చాల సంబరముగా యున్నారు. దీపంకర బుధ్ధుడు ఊరికి వచ్చి యున్నాడు. కొంతమంది ఆయన మీద ప్రేమతో అభిమానముతో వస్తే, మరి కొందరు ఆయన ప్రవచనము వినాలని వచ్చినారు. కొందరు ఆయన సాన్నిహిత్యము కొఱకు వచ్చినారు. ఎక్కువ మంది మాత్రము వాళ్ళ కష్టాలను ఆయనకు విన్నవించుకొనుటకు అవకాశము వస్తుందని, లేదా ఆయన దర్శనముతోనే తమ కష్టాలన్నీ తీరి పోతాయనీ వచ్చినారు. ఆయన కొఱకు ఒక వేదిక నిర్మించ బడినది. వేలాది మంది జనము ఆయన దివ్య దర్శనము కొఱకు వేచి చూస్తున్నారు.
            సిధ్ధార్థకు దీపంకర బుధ్ధుడిని దర్శనము చేసుకోవాలని యున్నది. కానీ, పెద్ద వారి దగ్గిఱకు వట్టి చేతులతో వెళ్ళ గూడదనే నియమాన్ని పాటిస్తున్నాడు. ఆ నాడు తన దగ్గిఱ ఏ మాత్రము డబ్బు లేదు. ఎవరినీ అడుగ లేక పోయినాడు. నెమ్మదిగా సమావేశ స్థలానికి నడుస్తున్నాడు. దారిలో ఒక అమ్మాయి తామర పూల కట్ట తో సమావేశము వైపు వెళ్ళుతున్నది.
            సిధ్ధార్థ ఆ అమ్మాయిని ఒక తామర పూవును ఇమ్మని అడిగితే బాగుంటుందని అనుకున్నాడు. దగ్గిఱకు వెళ్ళి, లౌక్యము తెలియని రీతిలో,
             " అన్ని పూవులు తీసుకొని వెళ్ళుతున్నావు. ఒకటి నాకు ఇవ్వ వచ్చు కదా" అని అడిగాడు.
             "బాగుంది, నేను నీకు ఎందుకు ఇవ్వాలి?"
             "బుధ్ధుడికి సమర్పణ చేసుకుందామని."
            "అలాగా! అయితే నాకేమిటి లాభము?"                       
            "ఇంతకూ, నీకు ఏమి కావాలి?"
            "ఏమి అడిగినా ఇస్తావా? అయితే, నన్ను పెళ్లి చేసుకో"              
          ఆ అమ్మాయి అడిగినది. తను కూడా ఒక పేద అమ్మాయి అయినప్పటికి సిధ్ధార్థ ఆకర్షణ లో ఉన్నది.
తనది అత్యాశ అనిపించినా అతడిని పెళ్ళి చేసుకొని జీవితము పంచుకోవాలన్న కోరిక ఎంతో లోతుగా యున్నది.
ఆ అమ్మాయికి ఇంకో విషయము తెలుసు, సిధ్ధార్థ మాటకు కట్టుబడే వ్యక్తి అని.
            "అలాగే " ,అంటూ ఒక పూవును తనే లాగేసుకున్నాడు. ఆమె చెప్పిన దానికి ఒప్పుకున్నాడు, కాబట్టి, అలా చేయడము తప్పని అతడికి అనిపించ లేదు.
            సమావేశము దగ్గిఱకు వెళ్ళినాడు. వేలాది మంది, వేర్వేరు ఉన్నతమైన స్థితులలో యున్న వారు
ముందు వరుసలలో యున్నారు. వారి దృష్టి అంతా బుధ్ధుడిమీదే యున్నది. సిధ్ధార్థకు ముందుకు వెళ్ళాలని అనిపించినది. కానీ, అలా వెళితే, చాలా మంది భాధ పడుతారని అనిపించినది. అందుకే ఏమి చేయ వలనో తెలియ లేదు. పుష్పాన్ని తన చేతులతో ఈయ వలెనన్న కోరిక ఎంత కష్టమో తెలిసినది.
            తన బలమంతా ఉపయోగించి ఆ తామర పూవును బుధ్ధుడి మీదకు విసరి వేచినాడు. అప్పుడే ఒక విచిత్రము జరిగినది. మామూలుగా అయితే పది అడుగులు కూడా ముందుకు వెళ్ళని తామర పూవు నేరుగా ముందుకు వెళ్ళినది. దీపంకర బుధ్ధుడి తల పైన అలంకారము వలె గాలిలో నిల బడినది. అందరూ అది చూచి ఆశ్ఛర్య పోయినారు.
            అపుడు బుధ్ధుడు ఆ యువకుడిని తన శిష్యుడికి చూపించి దగ్గిఱకు పిలువమని ఆదేశించినాడు.
అన్ని వేల మందిలో అతడిని చూపించినాడు.
                సిధ్ధార్థ కు ఒక అద్భుతమైన అవకాశము వచ్చినది. బుధ్ధుడికి దగ్గిఱగా నిలబడినాడు. బుధ్ధుడు అతడిని ఆశీర్వదించినాడు, ఏవో చెప్పినాడు. తనున్న తన్మయ స్థితిలో బుధ్ధుడు చెప్పినవేవీ సిధ్ధార్థకు అర్థము కాలేదు. బుధ్ధుడు ఇక వెళ్ళి రమ్మన్నాడు. సిధ్ధార్థ ఒక మైకములో యున్నాడు. అక్కడ జరుగుతున్న విషయాలేవీ అతడికి తెలియుట లేదు. అదే మైకముతో తనున్న గదికి వచ్చినాడు.  లోపలికి వెళ్ళి పద్మాసనములో కూర్చున్నాడు.
            ఆ స్థితిలోనే ధ్యానములోనికి వెళ్ళినాడు. తన జీవితమంతా ఒక నాటకము వలె కనబడినది. తనకు తెలియని ఎన్నో లోకాలు కనబడినవి. అక్కడంతా తన ఉనికి కనబడినది. చివరలో దీపంకర బుధ్ధుడు దర్శనము ఇచ్చినాడు. ఆయన మాటలు ఇప్పుడు స్పష్టముగా వినబడుతున్నవి.
            "సిద్ధార్థా! నీవు ఉన్నతమైన పరిణామ స్థితిలో యున్నావు. నా తరువాత ఈ బుధ్ధత్వము అందుకొనే వాడవు నీవే. ఎంతో మందిని ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి లోనికి తీసుకొని వెళ్ళుతావు.
            ఇంత వఱకు నీ సాధనలో ఇతరులతొ ఉన్న కర్మ బంధాలను అన్నీ ఛేదించుకున్నావు. ఆ విధముగా నీవు ముక్తుడివే. కానీ, ఇంకా కొన్ని జీవితానుభవాలకోసము నీ కింకా వైవాహిక జీవితము అవసరము. నీవు  ఎవరి దగ్గిఱ అయితే మాట ఇచ్చి పుష్పాన్ని తీసుకున్నావో, ఆ అమ్మాయితో నీకు కర్మ బంధము ఏఱ్పడినది. అది నీ పొరపాటు వలన కాకుండ మా సంకల్పము వలన జరిగినది. ఇంక నీవు బుధ్ధత్వము అందుకొనే జన్మ వఱకూ తనే నీకు భార్యగా యుంటుంది. ఆమె కూడా ఉత్తమురాలు. నీవడిగినపుడు ఆ పుష్పము నాకు సమర్పణ కోసమని ఎంతో సంతోష పడినది. అందు వలన ఇద్దరి మధ్య యున్న బంధము పైకి లౌకికముగా కనిపించినా అది ఆధ్యాత్మికముగానే యుండి ఇద్దరి యున్నతికి తోడ్పడుతుంది. మీకు నా ఆశిస్సులు."
                        సిధ్ధార్థ మత్తులోనుండి బయట పడినాడు. దైవ సంకల్పము వలన ఏమో ఆ పూలు అమ్ముకొనే అమ్మాయి మీద ఆకర్షణ ఏర్పడినది. కానీ, తటస్థముగా యుండి పోయినాడు.
            ఉదయాన్నే సాధనను పూర్తి చేసుకున్నాడు. బయటకు వెళ్ళ పోతుంటే ఒకరు వచ్చి, ఇలా చెప్పినాడు.         
"నాయనా! సిధ్ధార్థా!  ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. నేను చాలా పేద వాడిని. నిన్న బుధ్ధుడు నన్ను పిలిచి చెప్పినాడు. మా అమ్మాయి యశొధరను నీకు ఇచ్చి పెళ్ళి చేయాలని అది ఆయన సంకల్పమని."
            ఆ రకముగా సిధ్ధార్థుడికి ఆ పూలు అమ్ముకొనే అమ్మాయికి పెళ్ళి జరిగినది. అది జన్మ జన్మల బంధముగా నడచినది.
                         ************************
(ఇది లలిత విస్తారము అంబడు బౌధ్ధ పురాణము లో నున్న గౌతమ బుధ్ధుడి పూర్వ జన్మ  కథ.. శ్రీ ఎక్కిరాల వేదవ్యాస గారి రచన నుండి స్వీకరించ బడినది. ఆ జన్మ లో వారి పేర్లు మాత్రము గౌతమ బుధ్ధుడి జన్మ లో పేర్లతో వ్రాయ బడినది.
          అజంతా చిత్రాలలో బుధ్ధుడికి పైన ఒక తామర పూవు గాలిలో నిలబడి యుంటుంది. అది ఈ కథకు సంబంధించిందే          అజంతా చిత్రాలలో బుధ్ధుడికి పైన ఒక తామర పూవు గాలిలో నిలబడి యుంటుంది. అది ఈ కథకు సంబంధించిందే)
                   

No comments:

Post a Comment