Thursday, March 29, 2018

ప్రస్థానము 5



బెంగుళూరు లో తన  తాతగారి దైనందినుల లోని విషయాలను అప్పుడప్పుడు తన స్నేహితుల తో చర్చించే వాడు. కొంత మంది దీనిని చాదస్తమని అనే వారు. ఒకరిద్దరు  మాత్రము తన అభిప్రాయాలను బాల పరచే వారు. అప్పుడే మరి కొన్ని విషయాలు చర్చకు వచ్చినాయి.
రాజేంద్ర సింగ్ అను పేరు గల ఒక యువకుడు సాధించిన విషయము రాజస్థాన్ లో కను విప్పు కలిగించింది.
ఆరావళీ పర్వతాలలో క్రమ క్రమముగా కొండల పై  నుండే  చెట్లు ఎండి పోవడము జరిగింది. వర్షాలు కూడా తగ్గి పోయినాయి.  ఇది మరొక సమస్యకు దారి తీసింది. కొండల  క్రింద ప్రవహించే  చంబల్  నదిలో కూడా క్రమ క్రమముగా నీరు తగ్గి సన్న బడింది. చివరకు పంటలకు నీరే గాక  త్రాగు నీటికి కూడా ఎద్దడి ఏర్పడింది. రాజేంద్ర సింగ్ కొన్ని ప్రజాహిత కార్య క్రమాలను తరుణ్ భారత్ సంఘ్ అణా బడు సేవా సంఘ్ ద్వారా నడిపే వాడు. కాస్త దూకుడు స్వభావము ఎక్కువ. మొట్ట మొదట ఇటువంటి కార్య క్రమాలను ఉత్తర ప్రదేశ్ లో నడుపుతూ పోలీస్  వ్యవహారాలలో ఇరుక్కొని  తప్పించు కొనడానికి రాజస్థాన్ చేరినాడు. ఆయన నడుపుతున్న సేవా సంస్థలో సభ్యుల ఆశయాలు చాలా గొప్పవి. కాని  ప్రజల దృష్టిలో వారందరూ పని చేయని జులాయీ ల క్రిందే లెక్ఖ.
చంబల్ నది చాలా ప్రసిద్దమయినది. కాళిదాసు తన మేఘ సందేశము లో దీనిని  చర్మణ్వతి అన్న  పేరుతొ ప్రస్తావించినారు. “ఆ ప్రముఖ నది యొక్క పరిస్థితిని  ఏ విధముగా మార్చాలి?” తరుణ్ భారత్ సంఘ్  సభ్యులు ఆలోచించినారు. పారలు గునపాలు తీసుకొని కొండలు ఎక్కినారు. జనం వద్దంటున్నా అక్కడక్కడ పై నుండి  క్రింద వరకు నీరు పూర్తిగా కొండలు దిగకుండా అడ్డు కట్టలు వేసినారు. ఈ విధముగా చేయడాన్ని ప్రజలే  కాక ప్రభుత్వమూ కూడా వ్యతిరేకించింది. ఎందుకంటే ఇంకా క్రిందకు దిగే నీరు తగ్గి పోతుందని భయము. కానీ కట్టలు వేసేసి నారు కాబట్టి వాటిని తీయించే ఓపిక ఎవరికీ లేదు. ఆ ప్రాంతములో కురిసే వర్షాలు చాలా తక్కువ. ఆ కొద్ది వర్శానికీ  ఆక్కడక్కడ కట్టల దగ్గర నీరు నిలిచింది. క్రమముగా ఎండి మోడులు అవుతున్న చెట్లు చిగురించినవి. పచ్చ దనము పెరిగింది. మరో వర్షా కాలము వచ్చేసరికి పెరుగు తున్న చెట్లను చూచి వరుణుడికి హుషారు పెరిగింది. వర్షము బాగా పెరిగింది. మరో సంవత్సరానికి చంబల్ నది బాగా పెరిగి అక్కడ నీటి అవసరాలను తీర్చ సాగినది. దీనితో అప్పటి వరకు జులాయి అనిపించుకున్న రాజేంద్ర సింగ్ కు ప్రజలలో గౌరవము పెరిగింది.
ఏ సమస్యకు తక్షణ పరిష్కారముండదు.  సరి అయిన పరిష్కారము కూడా  వెంటనే ఫలితాన్ని ఇవ్వదు. అందుకే మనకు ప్రధానముగా రెండు లక్షణాలు కావాలి. అవే శ్రద్ధ, సబూరి అంటే విశ్వాసము.
బౌద్ధ కథలలో ఒక కథను చెప్పుకోవాలి. బోధిసత్వుడు ఒక ఊరిలో పుట్టి పెరుగుతున్నాడు. ఆ ఊర్లో శుభ్రతను అసలు ఎవరూ పాటించుట లేదు. ఇంక పిల్ల వాడు అయిన బోధి సత్వుడి  మాటను ఎవరు వింటారు? ఇందుకు బోధి సత్వుడు తన పద్ధతిని ఎన్నుకున్నాడు. ఒక రోజు ఊరి చావడి దగ్గిరకు వెళ్లి తను కూర్చోడానికి అన్నట్లుగా కొంత స్థలాన్ని శుభ్రము చేసుకున్నాడు. ఇంకా కూర్చో బోతుండగా ఒక పెద్ద మనిషి వచ్చినాడు.  బోధి సత్వుడు పక్కకు జరిగినాడు. ఆ పెద్ద మనిషి ఆ శుభ్రము  చేసిన స్థలములో కూర్చున్నాడు. బోధిసత్వుడు పక్కనే మరికొంత స్థలాన్ని శుభ్రము చేసుకున్నాడు. ఇంతకు ముందు వలెనే అందులో మరొకరు కూర్చున్నారు. ఈ విధముగా కొన్ని నాళ్ళు చేసి ఆ వూరి వారిని సుభ్రమయిన స్థలములో కూర్చునే అలవాటు చేసినాడు. ఇది ఒక పధ్ధతి.
ఇటువంటిదే ఇటీవల జరిగిన మరొక సంఘటన. సిఖ్ గురువు  గురు నానక్ రోజూ కాలీబెన్ అనే నదిలో స్నానము చేసి, సుల్తాన్ పూర్ లోధీ అనే ఊరి దగ్గిర ఒక చెట్టు క్రింద అనుస్థానము చేసుకొనే  వాడట. అందుకనే సిక్ఖు సమాజానికి ఆ  నది  ఎంతో పవిత్రమయినది, ప్రాణ ప్రదము అయినది. కానీ, చుట్టూ ప్రక్కల మురుగు నీరును ఆ నదిలోనే కలిపే వారు. బల్బీర్ సింగ్ అనే వ్యక్తీ ఈ స్థితిని భరించ లేక పోయినాడు. తోటి వారి సహాయము అడిగితె ఎవ్వరూ ముందుకు రాలేదు. ఒక  సారి నదిలోనికి దిగి, చెత్తనంతా బయటకు తీసి వేయడము మొదలు పెట్టినాడు. సంకల్ప బలము ఎంత గొప్పదంటే, అతడిది మూర్ఖత్వముగా భావించి పరిహాసము చేసిన వారందరూ అతడితో బాటు నదిలోనికి దిగి , మురుగు నీరు నదిలో కలపకుండా ఆపడమే  గాక నదిని పూర్తిగా శుభ్రము చేసినారు.ఇది యొక  అద్భుతముగా భావిస్తూ ఒక విదేశీయుడు, జోర్డాన్ నది క్రిస్టియన్లకు అత్యంత పవిత్రమయినదని, కానీ అది కూడా ఒక మురుగు కాలువ గా మారిందని, అక్కడ కూడా బల్బీర్ సింగ్ లాంటి వాళ్ళు పూనుకుంటే  తప్ప  జీసస్ కు బాప్తిఇజం ఇచ్చిన జోర్డాన్ నది శుభ్రము కాదని వాపోయాడు. ఇటీవలే బల్బీర్ సింగ్ కు కేంద్ర ప్రభుత్వ పురస్కారము కూడా లభించింది.
గోపీ మిత్రుల మధ్య మరొక విషయము ప్రస్తావనకు వచ్చింది. ఒకప్పుడు గోదావరి జిల్లాలో నేలలు చవిటి నేలలు ట.  ఇసుకలో ఉప్పు చాలా యున్నది. అందుకే ఏ పంటలూ  సరిగ్గా పండవు. కాటన్ దొర ధవళేశ్వరము దగ్గిర  అడ్డు కట్ట కట్టిన  తరువాత ఉప్పు నెలల లోని ఉప్పు పోవడానికి కొంత కాలము ఏ పంట  వేయకుండా నీటిని  పారించినారుట. అప్పుడా నెల వ్యవసాయ యోగ్యము అయిందిట.
కానీ నేటి  పరిస్థితి మళ్ళీ దారుణముగా తయారు అయింది.  పంట పొలాలలో రొయ్యల చెరువులు త్రవ్వి  సముద్రపు నీటిని రెండు  మూడు కిలో మీటర్ల  లోపలి తీసుకొని వస్తున్నారు. దీని వలన చుట్టూ ప్రక్కల భూ గర్భ జలాలు,బావులతో సహా ఉప్పు నీరు అయి పోతున్నది. విదేశీ డాలర్ల  మోజు  లేదా ప్రజా ప్రతినిదులనబడే  వారి ఒత్తిడి వలన ప్రభుత్వమూ దీనిని పట్టించుకోవడము లేదు. అందు వలన తీర ప్రాంతాలలో త్రాగు నీటికి కూడా కరువు ఏర్పడుతున్నది. ఈ కారణము వలన కొన్ని తీర ప్రాంతాలు ఖాళీ అయి పోతున్నాయి. ఆ ప్రాంతాలను తిరిగి నివాస యోగ్యము చేయుట కుదురుతుందా? నేలలో చేరిన ఉప్పును ఎలా తగ్గించాలి?
ఎవరికీ వారు తమ వరకు రాలేదని  భావిస్తున్నారు తప్ప  ఈ ముప్పు తమ వరకు వచ్చిన తరువాత  చేసేది ఏమీ ఉండదని  వారికి అర్థము అవుట లేదు.
ఈ చైతన్యమును ఎవరు తీసుకొని వస్తారు? తరచుగా ఎలుకల మీద దాడి చేసే పిల్లి మేడలో గంటను ఎవరు కడతారు? ఎలుకల సమాఖ్య తగ్గే కొద్దీ  వాటిలో ధైర్యము కూడా తగ్గి పోతుంది. పూర్తిగా మునిగి పోక ముందే తెరుకోవాలి.  కొద్ది మంది  స్వార్థము కొరకు  ఒక చెర్నోబిల్, ఒక ఫుకుషిమా... మొత్తము భూ గ్రహాన్నే కుదిపి వేసే పరిస్థితులు.
ఆకు పచ్చని ప్రకృతిని భూమి మీద ఎదగ నీయకుండా అడవులు తగ్గిపోతున్నాయి,  వేడి పెరిగి పోతున్నది. కొంత మంది ఈ విషయము మీద హెచ్చరిస్తూనే ఉన్నారు. మరి కొంత మంది వ్యాపార వేత్తలకు అమ్ముడు పోయిన వారు పెరిగే వేడికి వీటికి సంబంధము లేదని ఘంటా పథముగా చెపుతున్నారు. ఇటువంటి శక్తులను ఎదురుకోవడానికే  భారత దేశములో చిప్కో ఉద్యమము, గ్రీన్  పీస్  లాంటి ఉద్యమాలు బయలు దేరినవి. కానీ సామాజిక స్పృహ తీసుకొని రావటానికి , పోరాటానికి శక్తి సరి పోవటము లేదు.
తాతయ్య గారి దైనందినులలో ఉన్న విషయాలన్నీ మిత్రుల మధ్య చర్చకు వచ్చేవి. వీటితో బాటు భారత దేశములోని ప్రాచీన సామాజిక వ్యవస్థను గురించి కూడా చర్చ జరిగింది.
ఒకప్పుడు గృహస్థ ఆశ్రమములో ఆశ్రమ నియమాలన్నీ పాటిస్తున్న వారికి, ఈ నాటి సమస్యలు ఏర్పడ లేదు.  వాతావరణ  కాలుష్యము, పారిశుధ్యము గురించి సమస్యలు లేవు. అందు వలన ధర్మ ప్రచారమునకు  ఎక్కువ ప్రాధాన్యము లేదు. ఆ రోజులలో సమాజమును ప్రభావితము చేసిన ప్రతి ఋషి కూడా గృహస్థే. అందు వలన వారు ఎక్కడికి వెళితే అక్కడ ధార్మిక చర్చలు జరిగేవి. అంతే గాక  విద్యా వ్యవస్థలో ప్రతి శాస్త్రమునకు పునాది ధార్మిక వ్యవస్థ మీదే ఉండేది. కాలము గడిచే కొద్దీ ఇందులో మార్పులు వచ్చినవి. ప్రాధాన్యత ధర్మమూ నుండి అర్థము(సంపద/ఆస్తి) లోనికి మారిన తరువాత  మధ్య తరగతి గృహస్థు ధర్మమునకు క్రమముగా దూరము గా జరిగినాడు. ధర్మాచరణ తగ్గే కొద్దీ లౌకిక జీవితానికి ప్రాధాన్యత పెరిగింది. జీవితములో వేగము పెరిగింది. ఉన్న సమయము సరిపోవుట లేదు. స్వార్థము పెరిగిన తరువాత తరిగిన సామాజిక న్యాయాన్ని పునరుద్ధరించుటకు గౌతమ బుద్ధడు ప్రవేశించినాడు. అహింస, ప్రేమ ల గురించి ఆత్మా విశ్వాసము పెంచినాడు. ప్రజలలో  ఆత్మా విశ్వాసమును పెంచుటకొరకు వ్యావహారిక భాషలలో బోధన చేసినాడు. తరువాత ప్రాధాన్యత ధర్మాచరణకా , ఉపాసనకా అన్న అంశము మీద విభేదాలు వచ్చి బౌద్ధము హీన యాన  మహా యానములుగా చీలి పోయినది. ఇక్కడ మరొక సమస్య తలెత్టినది. ధర్మ్మాచరణ ప్రధానమే. కాని సరిహద్దుల దగ్గిర అహింసా బోధన పనికి రాదన్న విషయాన్ని మరచి పోయినందు వలన దేశపు సరిహద్దులు బలహీన పడినవి.
ఈ సమయములో అద్వైత బోధతో శ్రీ శంకరాచార్యులు సమాజమును పటిష్ట పరిచినారు. ప్రతి మనిషిలో ఉన్న దివ్యత్వ్వాన్ని తెలియ చెప్పియా శంకరుడిని ప్రచ్చన్న  బుద్ధుడిగా కొంత మంది  హిందువులు భావించినారు. ఈ సమయములో అంత  వరకు కనిపించని సన్యాస ధర్మమూ ప్రవేశించినది. సమాజము  యొక్క మేలు కోలుపుకు రోజంతా పని చేసే ఆధ్యాత్మిక సేవకులుగా సన్యాసులు ఏర్పదినారు.
కాలము నడిచే కొద్దీ సన్యాస వ్యవస్థ సమాజము మోక్షము కొరకు గాక వ్యక్తిగత మోక్షమే లక్ష్యముగా పని చేయడము మొదలయింది. సమాజములో తిరిగి బలహీనతలు పెరిగినాయి.
ధర్మమూ అర్థముల ప్రాధాన్యత మీద నిరంతరమూ  యుద్ధము కొన సాగుతూనే యుంది.
ఒక చిన్న కథ యున్నది. భారత దేశము పై దండ  యాత్రకు వచ్చినపుడు అలేక్జాందర్ ఒక  సన్యాసిని కలిసినాడు.ఆ  సన్యాసి అతడికి ఒక చిన్న చాప ఇచ్చి కూర్చోమన్నాడుట. అలేక్జాందర్ ఒక వైపు చాపను పరుస్తుంటే రెండవ వైపు ముడుచుకొని పోతున్నదట. “నేను గెలిచినా సామ్రాజ్యము ఎంత కాలము నిలుస్తుంది?” అని ఆ సన్యాసిని అడిగితె “ఇప్పుడు మీరు కూర్చున్న చాప వలెనె ఉంటుంది.”అని ఆ సన్యాసి జవాబు చెప్పినాడుట.
అదే  విధముగా ఒక వైపు ధర్మమూ విస్తరిస్తూ ఉంటె, మరొక వైపు ముడుచుకొని పోతున్నది. గోపీ మిత్ర బృందము ఈ విషయము మీద ఎన్నో చర్చలు జరిపినారు. ఆ సమయములో ఒక ప్రస్తావన వచ్చింది,” ఈ చర్చల వలన ఉపయోగమేమిటి? నీటిలో దిగకుండా ఈత మీద ఎన్ని పుస్తకాలు చదివినా  ఈత రాదు.ఇప్పుడు మనము చేస్తున్న పని అదే.” అంటూ గోపీని ఒక సారి అక్కడ పరిస్థితులను అధ్యయనము చేసి రమ్మని ప్రేరేపించినారు.
మొదటి ప్రస్థానము మొదలయింది.      


No comments:

Post a Comment