Monday, December 6, 2010

కీర వాణి 7

అడుగు లోన అడుగు వేసి నడచినాను ప్రతి పదము
ప్రమాదమును సూచింపగ నీ కొరకై వేచినాను
గమ్యము ఏదో తెలియక ఆకసమున రంగులన్ని
క్షణ మాత్రమె నిలుచునని ఎరుగనైతి స్వామి! నేను
అందుకొనగ తలచినాను సొంతమని అరచినాను
అడుగు లోన అడుగు వేసి ఆ వైపుకు నడచినాను
రంగులవే వెలసి పోయె నా మార్గము మారి పోయె
గత స్మృతుల నీడలలో ఆడుకొనుచు నిలిచినాను
అంతు లేని ఆశలతో నా భాధ్యత మరచితినా?
భాధ్యతల భారముతో గమ్యమునే వదిలితినా?
నియమిత మార్గమునెరుగక నిలకడగా మెలగ లేక,
ఈ విధి నేకాకినైతి ఎవరు నాకు తోడు రారు.
నా ధర్మము నెరుగ లేక నీ కొరకై నిలిచినాను
నా మార్గము సూచింపగ  రా రమ్మని వేడినాను
ప్రభూ! ఏల రాజాలవు? ఎద భాధను మాంపవా?
గతి తప్పిన పాంథుడి కొక వెలుగు రేఖనీయవా?

No comments:

Post a Comment