Wednesday, February 18, 2015

ఉడత 3

                     ఆకాంక్ష ఇంటికి రాగానే ఈ చర్చ గురించి వాళ్ళ అమ్మకు మళ్ళీ మళ్ళీ వివరించి చెబుతున్నది. ఇంతలో పక్క ఇంటి నుండి  ఆదిత్య యొక్క అమ్మగారు ఏదో అవసరము మీద అక్కడికి వచ్చింది.
“ఆకాంక్షా! ఆంటీ కి నమస్కారము చెప్పు. నీవు చెప్పే ఆదిత్య అమ్మగారు ఈవిడే.” ,పరిచయము చేసింది. 
“నమస్కారము అత్తయ్య గారూ! “ఆకాంక్ష సీతమ్మ పాదాలకు నమస్కరించింది.
“మా అమ్మాయి కి మమ్మీ డాడీ లాంటి ఇంగ్లీష్ పదాలు ఇష్టము లేదు. రండి కూర్చోండి. “
చాలా బాగుంది. ఏమి చదువుతున్నావమ్మా?”, అడిగింది.
“ఫిజిక్సు పిజి చేస్తున్నానండీ”, చెప్పింది.
తన కాళ్ళు ముట్టుకొని నమస్కరించిన ఆ అమ్మాయి మీద సీతమ్మకు ఆసక్తి పెరిగింది. “నీకు వీలున్నపుడు మా ఇంటికి కూడా వస్తూ ఉండమ్మా!” , అని చెప్పింది.
“ ఈ రోజు మీ అబ్బాయి పరిమితత్వము, అపరిమితత్వము , దైవత్వము లాటి విషయాల మీద చాల బాగా మాట్లాడినాడు. ఇదంతా ఎక్కడ నేర్చుకున్నాదండీ?” , అడిగింది.
“ఎప్పుడూ ఏవో  పుస్తకాలు చదువుతూ ఉంటాడు. లేక పొతే  పిల్లులతో లేదా ఉడతల తో ఆడుతూ ఉంటాడు. నీకు వచ్చిన ప్రశ్న నాకు ఎప్పుడూ వచ్చే అవసరము రాలేదు. ఎందుకంటే వాడి ఉపన్యాసాలు నేను  ఎప్పుడూ విన లేదమ్మా! “
తిరిగి మళ్ళీ అన్నది. “నీకు ఏమయినా అనుమానాలు వస్తే వాడినే నేరుగా అడగమ్మా. మొహమాటము ఏమీ అక్ఖర లేదు. వాడు కెమిస్ట్రీ చదువుకున్నా తెలుగు సంస్కృతాల లో మెళకువలు అన్నీ వాళ్ళ తాతయ్య దగ్గర పట్టేసినాడు.
ఆకాంక్ష కు అనిపించింది. తను కూడా ఆసక్తి గానే తెలుగు లో పంచ కావ్యాలు చదివింది. తనకు చాలా విషయాలు తెలుసు అనుకున్న ది. కానీ, ఇటువంటి విశ్లేషణ శక్తి తనకు రాలేదు. అంటే తనకు తెలుసు కో వలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఆదిత్య  విశ్లేషణ ను మరిచి పో లేక పోతున్నది.
తనకు వచ్చిన కల నిజమే అయితే .. ఈ జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. తనకు తెలుసు. సహా జీవనము లో జీవితాన్ని అనుభవిస్తూ, ఎదగడానికి ఉపయోగ పడితేనే జీవితానికి సార్థకత ఏర్పడుతుంది.
మర్నాడు ఉదయాన్నే మళ్ళీ వినిపించినది.
“ ఐ లవ్ యూ....................     “, కా సేపు ఆగి “ఉడుతా!” , అన్నాడు. ఆకాంక్ష సందు లోకి పరుగెత్తుకుంటూ వెళ్ళింది. పక్క ఇంటి సందు లోకి చూచింది. ఆదిత్య గుప్పెడు జీడి పప్పు  గోడ మీద వదిలి వేసి ముచ్చట గా చూస్తున్నాడు. ఒకటి కాదు, అయిదో, ఆరో ఉడుతలు ఎగ బడి జీడి పప్పును తింటున్నాయి.
“ఏమిట్రా, నీవు చేసేది? అంతే సి జీడి పప్పు వాటికి పెట్టాలా?”, వాళ్లమ్మ కసురుకుంది.
“పోనీ లేమ్మా. వాటికి మాత్రము ఎవరు పెడతారు చెప్పు.”, అన్నాడు  ఆదిత్య.
మాట మార్చడానికి మళ్ళీ అన్నాడు. “అమ్మా! రాముడి కథలో అన్నీ విశేషాలే కదా!”
“ ఏమిట్రా?”
“చిన్న ఉడుత నీళ్ళలో తడిసి ఇసుకలో పొర్లి  మళ్ళీ నీళ్ళలో తడవడము. తన వలన నాలుగు ఇసుక రేణువులు వారధిలో ఉంటాయని.” 
“అయినా ఈ కథను వాల్మీకి ఎప్పుడూ చెప్పా లేదు కదరా.”
“లేదమ్మా! రాముడు మర్యాదా పురుషోత్తముడు. ఆయనను మనసులో నింపుకున్న వాల్మీకి కి మరొక జీవి కనిపించే అవకాశము లేదు. అందుకే ఆ స్థితిలో ఉన్న వాల్మీకి నుండి అన్నీ కథలు అంద లేవు. నీకు మరో విషయము తెలుసా? కృష్ణుడి గూర్చి ఎంతో అద్భుతముగా వ్రాసిన వ్యాసుడు తన భాగవతములో రాధ గురించి అసలు ప్రస్తావించ లేదు. ఎందుకో తెలుసా?”
“ చెప్పు మరి.”
“రాధ పేరు వింటేనే వ్యాసుడు భక్తి భావము లో కరగి పోతాడుట. ఆ స్థితి లో ఇంక ఏమీ వ్రాయ లేడుట.”
“మరి ఉడుత కథ ఎక్కడ నుండి వచ్చింది?”
“కంబర్ అన బడే తమిళ కవి తను వ్రాసిన రామాయణము లో ఈ కథను చెప్పినాదుట.”
“ఇది కవి చాతుర్య మేమో?”
“ఉండ వచ్చు అమ్మా! కానీ కంబర్ ఇంకో విషయము చెప్పినాడు. ఆ ఉడుత ప్రయాసను చూచి రాముడు ముచ్చట పడి, దానిని చేతుల్లోనికి తీసుకొని రెండో చేతి వ్రేళ్ళతో నిమిరినాడు. అందుకని దాని మీద చారలు ఏర్పడినాయిట.”
“ఔనా?”
గోడ అవతల నుండి ఆకాంక్ష ఈ సంభాషణ అంతా వింటున్నది. ఆదిత్య ఏదీ వృధాగా మాట్లాడటము లేదు. అయినా తను నిర్మించుకున్న లోకములో నే తను ఉంటాడు. ఆ లోకము లోకి తను ప్రవేశించ కలదా? ఈ ప్రశ్నకు జవాబు తనకు తెలియదు.
ఈ లోపల గోడ అవతల సంభాషణ మరో కోణము లోనికి వెళ్ళింది.“మన ప్రక్కింట్లో ఉండే అమ్మాయి వాళ్ళ తాతయ్య దగ్గిర ఉండేదిట.  ఇప్పుడు ఇక్కడ చదువుకుంతున్నాదటారా. చాలా మంచి అమ్మాయి లాగుంది. వాళ్ళ గోత్రాలు కూడా వేరే. పేరు ఆకాంక్ష.”
తల్లి ఉద్దేశ్యము ఆదిత్యకు అందింది. తనకు ఇపుడు ఎలాంటి ఆలోచనా లేదు. అయినా సరదాగా అడిగినాడు.
“ఆకాంక్ష  ఏమిటమ్మా? కాంక్ష అంటే సరి పోదా?”
సీతమ్మకు ఏమని చెప్పాలో తెలియ లేదు. “ఆ తేడా ఏమిటి రా?”
“కాంక్ష అంటే కోరిక అమ్మా. ఆకాంక్ష అంటే ....   అక్కడి నుండి వచ్చిన కోరిక అనుకోవచ్చు ను. ఎక్కడి నుండి అంటే , బహు శా గుండె లోతుల్లో నుండి ఏమో?”
ఆకాంక్ష ఒక్క సారి కంగారు పడింది. తన  పేరుకు కూడా ఇంత విశ్లేషణా? అంతే కాదు సీతమ్మ ప్రస్తావనకు జవాబు వస్తుందేమో అన్న ఆశ కలిగింది. ఎంతకూ జవాబు రాలేదు.
“ఇంక కాలేజి వెళ్ళాలమ్మా” అంటూ లోపలి వెళ్ళినాడు.
ఆకాంక్షకు  అనిపించింది, రోజూ ఉడుత తో కబుర్లు చెబుతున్నాడు, తనే ఆ ఉడత అయితే ఎంత బాగుంటుంది? ఒక పాట ఉంది, రాముడు కాలి తో తాకిన శిల ను అయితే ఎంత బాగుంటుంది, అని.
ఈ లోపల పక్క గోడ నుండి పక్కన ఉన్న పూల చెట్టు మీదికి దూకి మళ్ళీ తమ ఇంటి గోడ మీదికి దూకింది ఉడత. దాని ప్రయాణములో గుప్పెడు పూలు తన నెత్తి మీద పడినాయి. తన ఆలోచనకు దేవుడు ఇచ్చిన సమాదానమేమో అనిపించింది. 

No comments:

Post a Comment