Thursday, December 5, 2019

జన్యు సాంకేతికత




రాజు అడిగినాడు,” స్వామీ! ఇటీవల జన్యు సాంకేతికత మీద మరియు ఆ రకముగా ఉత్పత్తి చేయ బడిన పదార్థాల మీద  ప్రపంచ మంతా ఎన్నో విమర్శలు వస్తున్నాయి. శాస్త్ర వేత్తలు పంట దిగుబడి పెంచుటకు ఎంతో కష్టాలు పడుతున్నారు. కానీ అదే స్థాయిలో వారి మీద వ్యతిరేకత వస్తున్నది.  ఎందుకంటారు?”
“మార్పు  వచ్చిన ప్రతి సారి  సమాంతరముగా సమస్యలు వస్తాయి. అది సర్వత్రా సహజము. అయితే ఆ మార్పు మంచిదా కాదా అనేది అది తయారు చేసిన వారి విజ్ఞత మీద ఆధార పడుతుంది. ఒక ధాన్య పదార్థము కావచ్చును. ఒక రసాయనము కావచ్చును.  ముందు అది పరీక్షల్లో నెగ్గితేనే అందరికీ నచ్చుతుంది. ఇందుకు ఒక ఉదాహరణగా వారి ధాన్యాన్ని తీసుకుందాము. చాలా కాలము క్రిందట నెల్లూరు జిల్లాలో  ముఖ్యముగా మూడు  రకాల పంటలు ఉండేవి. అందులో ఒకటి మొలగొలకులు. దీనినే రాజనాలు అనే వారు. ఈ ధాన్యము రాజా లాంటిదని అనే వారు. చాలా రుచిగా ఉండేది. ఒక ప్రముఖ తెలుగు ప్రతినాయకుడు ఇంటి పేరు కూడా ఇదే. ఆయన పేరు చివరకు రాజనాల అయింది. తరువాత కేసర. ఇందులో తెల్ల కేసర మరియు ఎర్ర కేసర అని రెండు రకాలు  ఉండేవి. మధ్య తరగతి వాళ్ళు తెల్ల కేసర అన్నము తింటే  శ్రమ ఎక్కువ పడే వారు ఎర్ర కేసర అన్నము తినే వారు.  నిజానికి ఎర్ర కేసర బియ్యము ముతక బియ్యము అయినా ఎక్కువ బలాన్ని ఇవ్వడము వారు గమనించినారు.  ఈ రెండు బియ్యపు గింజల సైజు పెద్దది. ఇవి పంటకు వచ్చుటకు సుమారుగా అయిదు నెలలు పట్టేది. గింజ ప్రమాణము ఎక్కువ కాబట్టి  వంటకు కూడా సమయము ఎక్కువ పడుతుంది.
ఇంకా హరిత విప్లవము అనీ, తక్కువ కాలములో పండించాలని, తక్కువ కాలములో ఆహారము అందించాలనే ఉద్దేశ్యములో ప్రభుత్వము భారతీయ పద్ధతులను పరిశీలించ కుండా విదేశీ వ్యవసాయ పరిశోధనలను ఆధారము చేసుకొని ముందుకు వెళ్ళింది.  ఇది జన్యు సాంకేతికతను ఉపయోగించుటలో మొదటి మెట్టు అయింది. ఇందులో భాగముగా జీబీ అనే పేరుతొ ఒక పంట వచ్చింది. ఇది సన్న బియ్యము.  తక్కువ కాలము పంట. వెంట వెంట నే ఐ ఆర్  అనే పేరు వెంట సంఖ్యలతో కొన్ని పంటలు వచ్చినాయి. కారణము తెలియదు. బహుశా ఈ పంట ప్రకృతి సహజమయిన ఎరువులు స్వీకరించ లేక పొయినాయా? లేదా రసాయనిక ఎరువులు అయితే మంచి దిగుబడి  త్వరగా వస్తుందని అనుకున్నారా? క్రమ క్రమముగా సేంద్రియ ఎరువుల వాడకము తగ్గి పోయింది. దీని ప్రభావము వలన గ్రామీణ వ్యవస్థలో మరొక చెడ్డ మార్పు వచ్చింది. రైతులకు పశు సంరక్షణ పైన ఆసక్తి తగ్గడము మొదలయింది.
మనిషి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ జ్ఞానమును తెలివి తేటలను పెంచుకుంటూ ఒకప్పుడు నియాండర్తల్  స్థితి నుండి ఇప్పటి స్థాయికి ఎదిగినాడన్న విషయాన్ని ఆధునిక మానవుడు అంగీకరిస్తాడు. ఆధ్యాత్మికతలో కూడా వేరు వేరు మూల జాతులు ఒక దాని వెంట మరొకటి మరింత శక్తివంతమయిన దేహముతో మనిషి ఎదుగుతాడని ఆధ్యాత్మికత కూడా ఒప్పుకుంటుంది. ఇది మనుషులకే కాదు ప్రతి జీవ జాతికి జరుగుతుంది. వారి లాంటి ధాన్యానికి కూడా ఇది జరుగుతుంది. ఆ విత్తనాలకు కొన్ని లక్షల సంవత్సరాల పరిణామము ఉంది. ఈ విషయాన్ని శాస్త్రజ్ఞులు అని చెప్ప బడే వారు అంగీకరిస్తారా? ప్రతి జీవికి మూల సాంకేతికతను దాని లోని మూల కణము నిర్దేశిస్తుంది. ఆధునిక సాంకేతికతలో దానిని డీ ఆక్సీ రిబో నూక్లీ యాసిడ్ లేదా  డీఎన్ఏ  అని అంటారు. దీనిని మార్చి వేస్తె ఈ కొన్ని లక్షల సంవత్సరాల పరిణామ చరిత్ర ఆ కణము లో లుప్తము అవుతుంది. అందు వలన వచ్చే ప్రభావము వెంటనే బయట పడదు. కానీ ప్రభావము మాత్రము ఉంటుంది. ఈ కాల వ్యవధి ఎంత ఉంటుందంటే ఆ మార్పులు వచ్చినపుడు అవి ఇందు వలన వచ్చినాయన్న విషయము గుర్తుకు రాదు.
అనుకున్న పంట రావడానికి ఇప్పుడు ఒక క్వింటాల్  ఎరువు అవసరమయితే మరో రెండేళ్లలో అదే దిగుబడికి రెండు క్వింటాల్ ల ఎరువు అవసరమవుతుంది. ఈ విధముగా ప్రతి ఏడూ రైతుకు పెట్టుబడి పెరుగుతుంది. రైతుకు వచ్చే ఆదాయములో పెద్ద వాటా ఎరువుల పరిశ్రమలకు పోతున్నది. కొత్తగా మరొక సమస్య ఏర్పడింది. ఈ పంటలకు రోగ నిరోధక శక్తి తగ్గింది. వివిధ కీటకాల దాడి కూడా పెరిగింది. మొత్తము పంట పోకుండా ఆ కీటకాలను నిరోధించడానికి విష పదార్థాలను వాటి మీద చల్ల వలసి వస్తున్నది.  అందుకోరకు విష పదార్థాలను తిరిగి తయారు చేయ వలసి వచ్చింది.  అందు కొరకు మళ్ళీ రైతుకు ఖర్చు పెరుగుతుంది.  ఆ విష పదార్థాలు పొలములో ఆహ్లాద కర మయిన వాతావరణాన్ని పాడు చేసి అక్కడ మనము ఉండ లేని స్థితిని ఏర్పరుస్తున్నాయి. ఇంకా పండిన ధాన్యములో కూడా విష పదార్థాలు చేరుతున్నాయి. ఈ విధముగా వినియోగ దారుడు ఎంతో కొంత విషాన్ని దేహము లోనికి చేర వేస్తున్నాడు. దీనితో అతడిలో రోగ నిరోధక శక్తి తగ్గి రోగాల బారిన పడుతున్నాడు. క్రమ క్రమముగా వైద్యాలయాల అవసరము పెరుగుతున్నది.
మరొక మార్పు కూడా వస్తున్నది.  విష పదార్థములు చల్లబడిన కీటకాలలో ఆ ప్రభావము వలన బలహీన మయిన  జీవులు చనిపోతున్నాయి. బలము కలిగిన వాటికి అందు వలన ఎక్కువ ఆహారము దొరికి  వాటి శక్తి ఇంకా పెరుగుతున్నది. ఇప్పుడు శాస్త్రజ్ఞులే ఒప్పుకుంటున్నారు, వాటిలో జన్యు మార్పిడి జరిగినందు వలన అవి విష ప్రభావమును తట్టుకుంటున్నాయని. ఈ జన్యు మార్పిడిని మ్యుటేషన్ అని అంటారు. ఇక్కడ ఒక్క ప్రశ్న ఉంది. కీటకాలలో జన్యు మార్పిడిని తీసుకొని వచ్చే విష పదార్దాలు ధాన్య గింజలలో తీసుకొని రావా? ఇంకా ఈ విష పదార్థాలను తయారు చేసే పరిశ్రమలకు తమ వ్యర్థాలను ఎలా వదిలించు కోవాలో తెలియదు.. అందుకని పెద్ద గుంట లోతుగా త్రవ్వి దానిని వీటితో నింపి వేస్తున్నారు. దీని వల ఒక రాష్ట్ర రాజధానిలో కొన్ని ప్రాంతాలో భూగర్భ జలాలు విష పూరితమయిన విషయము చాలా మందికి తెలిసినదే.
ఈ ఫలితాల వలన పరిశోధన ఇంకొక మెట్టు ఎక్కింది. ముందు ప్రత్తి పంట తో మొదలు పెట్టినారు. వాటి  DNA లో కొన్ని తేలు, సాలె పురుగు లాటి విష జంతువుల నుండి కొన్ని కణ భాగాలను తీసి అంటిస్తున్నారు. అలా చేస్తే ఈ పంటల జోలికి కీటకాలు రావని వారు చెబుతున్నారు. ఇలా చేసిన పంటలను వారు బిటి పంటలని అంటున్నారు. ఒక అమెరికన్ కంపెని ప్రవేశ పట్టిన ప్రత్తి విత్తనాలను వాడి మన రైతులు చావు దెబ్బ తిన్నారు. ఇప్పుడు వారు మొదట బి టి బ్రింజాల్ అంటే వంకాయ అని కొత్తగా బి టి మస్టర్డ్ అంటే ఆవాలు అని అంటున్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో ఈ బి టి పంటల మీద తీవ్రమయిన వ్యతిరేకత వచ్చింది.  మన దేశములో ఇంకా రావాలి. ఇంకా దేశము కొరకు తపన పడే పర్యావరణ శాస్త్ర వేత్తలు(వందనా శివ లాటి వారు) సీడ్ బాంక్స్  లేదా విత్తనాల నిధులు అని మూల మైన విత్తనాలు పూర్తిగా పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వీటి ప్రభావము వలన రైతులు చాలా నష్ట పోతున్నారు .కానీ ప్రభుత్వాలు కొన్ని ఒత్తిడుల వలన వీటిని అనుమతిస్తున్నాయని అనిపిస్తుంది. రైతుకు చేర వలసిన సొమ్ము చేర కూడని చోటికి చేరుతున్నది. కానీ కంపెనీలు తమ కుటిల ప్రయత్నాలను మాత్రము మాన లేదు. విత్తనాలలో కొన్ని మార్పులు చేసినందు వలన పంటలో వచ్చిన గింజలు తిరిగి మొలకెత్తవు. సుమారుగా నలుబది ఏళ్ల క్రిందట రైతుకు విత్తనాలు కొనే అవసరము ఉండేది కాదు. ఈ నాడు విత్తనాల కోసము దళారీల చేతిలో మోస పోతున్నారు.
ఈ విష ప్రభావము ఇంకా పెరిగింది. అన్ని రకాల పండ్లు త్వరగా పక్వము కావాలని వాటి మీద విష పదార్థాలు చల్లుతున్నారు. కొన్ని సంస్థలనుండి కల్తీ పాలు వస్తున్నట్లు వార్తల ద్వారా తెలుస్తున్నది. నాలుగు రోజులు నిలువ ఉండే పండ్లు ఈ విష పదార్థాల వలన త్వరగా కుళ్ళి పోతున్నాయి. ఈ పండ్లు ఎక్కువగా తిన్న వారికి వచ్చే ఆరోగ్య స్థితి ఎలా ఉంటుందో చెప్పనక్ఖర లేదు అన్నిటికి కారణము ఆశ మాత్రము కాదు. ధనార్జన మీద అత్యాశ. కూలి పోయిన నైతిక విలువలు.
మరి దీనికి విరుగుడు ఏమిటి? రైతు ఈ విష వలయము నుండి ఎలా బయటికి వస్తాడు? మన ప్రాచీన సంప్రదాయాన్ని తిరిగి వెలుగు లోనికి తీసుకొని వచ్చిన మహానుభావుడు మహారాష్ట్రకు చెందిన  సుభాష్ పాలేకర్ గారు. తను ఎన్నో ప్రయోగాలు చేసి ఆయన చెప్పి ప్రచారము చేసినారు. ఒక దేశి ఆవు నుండి వచ్చే పేడ ౨౫ ఎకరాల పొలానికి ఎరువుగా సరిపోతుందని ఆయన రుజువు చేసినాడు. రసాయనిక ఎరువులు లేకుండా పూర్తి సేంద్రియ  ఎరువు ద్వారా ఆయన ఆధునిక రైతు పండించే పంటను సాధించినాడు. వ్యవసాయాన్ని తన పిల్లలకు అప్పగించి దేసమంతటా ఈ విషయము ప్రచారము చేస్తున్న కర్మ యోగి ఆయన. ఈ పద్ధతిని అనుసరిస్తే మన రైతు తిరిగి పూర్వ వైభవాన్ని అందుకుంటాడు.
కొస మెరుపుగా ఇంకొక విషయము. కొంత కాలము క్రిందట  యూరప్ లో థాలిడోమైడ్ అనబడు ఒక రసాయనాన్ని తయారు చేసి పరీక్ష చేసి దానిని సర్వ రోగ నివారిణి గా ప్రచారము చేసినారు. ఇంకా గర్భిణీ స్త్రీలు కూడా ఆ మాత్రలను విపరీతముగా వాడినారు.  చాలా పెద్ద సంఖ్యలో వారికి పుట్టిన పిల్లలు కాళ్ళు, చేతులు లేకుండా చేప దొప్పల లాంటి దోప్పలతో జన్మించినారు. చివరకు ఒక పరిశీలనలో ఇలా పిల్లలు పుట్టిన వారందరిక ఉన్న విషయమేమంటే వాళ్ళు  ఈ మందును వాడినారుట. ఇంకొక విషయము ఉంది. విపరీతముగా నొప్పులకు అల్లోపతి మందులు వాడిన వారి మూత్ర పిండాలు నాశనమవుతున్నాయి. ఈ విషయము ప్రతి వైద్యుడికీ తెలుసు. కానీ నియంత్రణ ఎక్కడుంది?
చివరలో మన ప్రాచీన శాస్త్ర వేత్తల్లో గొప్ప జెనెటిక్ ఇంజనీర్ ఎవరు? బహుశా రావణుడేమో? లంక సీతమ్మ చుట్టూ కూర్చున్న రాక్షస స్త్రేల వర్ణన చూసి నాకు ఈ అనుమానము వచ్చింది.
ఒక చిన్న జెనెటిక్ జోక్.ఒక జెనెటిక్ ఇంజనీర్ జన్యు మార్పుల వలన గుమ్మడి కాయంత వంకాయను పండించి ఒక ప్రదర్సనకు పెట్టినాడుట. ఒక్క రైతు అడిగినాడు”దీనికి ఎంత ఖర్చు అయింది?” అని. ఆ ఖర్చును విని “ఇంత ఖర్చు పెట్టాలా? నేను ఒక గుమ్మడి పాదు ఇస్తాను. ఎందుకీ దండగ మారి ఖర్చులు?” అన్నాడుట.
ఈ మార్పులు రావాలంటే ఎదో అద్భుతము జరగాలి. అది జరిగే వరకూ ఎవరూ నమ్మరు. జరిగిన తరువాత దానిని అందరూ మర్చిపోతారు.
              ఓం  స్వస్తి


No comments:

Post a Comment