Thursday, December 19, 2019

దేవులపల్లి కృష్ణ శాస్త్రి



 (కళా ప్రపూర్ణ శ్రీ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్ర్తి గారు కేంద్ర సాహిత్య  అకాడమి ఆవార్డు పొందిన సందర్భముగా  తెలుగు సాంస్కృతిక సమితి, ఐ. ఐ. టి., మద్రాసు,30-1-79 న ఏర్పాటు చేసిన అభివందన సభలో సమర్పించ బడినవి.)
భావ కవితా సారథి
(సినీ  గాయకుడు పి. బి. శ్రీనివాస్ గారు )
కమనీయ మృదుల పథ  మధుర భావ
కవితా సారథి దేవులపల్లి
నీదు కవిత రస హృదయ నవ జీవ
కారుణ్య పద  స్వర  కల్పవల్లి
ప్రాచీనార్వాచీన సురచనా
ప్రజ్ఞా  వారధి  దేవులపల్లి
కృష్ణ శాస్త్రి  దౌ విమల కల్పనా
కృతి కళల  అలల మురిపాల వెల్లి
సహజౌదార్య  సుగుణ  రత్నాకర
సమతా వారధి  దేవులపల్లి
శారదా  పదారాధనా ప్రచుర
సాధనా ప్రసవ  మణి హారమల్లి
మల్లి పరిమళముల వేదం జల్లెడు
మహిత యశోనిధి దేవులపల్లి.
విజ్ఞాన ప్రభయై  విలసిల్లేదు
వీరిని భ్రామాత కళ గన్న తల్లి.  
              
                  ( కార్య దర్శి,  గోపీచంద్‌ గారిచేత సమర్పించ బడినది)
          కొమ్మ మీద కోయిలమ్మ
          కూతలోని కులుకులు
          నింగిలోని రాయంచల
          నడకలోని తళుకులు
          చెట్ల మీద చిలకమ్మల
          చక్కని చిరు పలుకులు
        నీ గీతికలో నివశిస్తాయి
        నీ గొంతుకలో నిదురిస్తాయి.

          కొలను లోని కలువ భామ
          జలం మీద అలల భామ
          నేల మీద నెమలి భామ
          అంబరాన చంద మామ
          ఆడుకున్న ప్రతి మాటా
          పాడుకున్న ప్రతి పాటా
        నీ తలపు లోన మెదులుతున్న కవితా రావం
        నీ గుండె లోన ఊరుతున్న కమ్మని భావం.
             కురుస్తున్న వెన్నెలలో చల్లదనాలు
           మెరుస్తున్న మెరుపులలో  తెల్లదనాలు
           విరుస్తున్న జాజులిలో కొత్తదనాలు
           సాటి రావోయి ఎన్నడూ నీ కవితకు
           మేటి నీ వోయి ఎప్పుడూ ఈ జగతికి
         కాని ఒక్క మాటా దేవులపల్లి
         మరిచి పోకు మళ్ళీ మల్లీ
         కరుణ చిందు కవితలల్లి
         మమత జల్లు మాటలల్లి
       నాది నాది నాదంటూ  -లోకమే తనదంటూ
         కామాన్నే నంచుకుంటూ- క్రోధాన్నే నంజుకుంటూ
         అజ్ఞానం భుజిస్తున్న _ ఆవేదన మ్రింగుతున్న
         సాంఘిక సమాజం లో -సమతను రూపొందించు
         మానవాళి మనసులలో -మమతను రేకెత్తించు.
       ఇదేనోయి నాదు మాట దేవులపల్లీ!
       మరిచి పోకు ఎన్నడూ మళ్ళీ మళ్ళీ.


 (గోపిచంద్‌ గారిని ఈ బ్లాగ్‌ మూలముగా అనుమతి తీసుకున్నట్లు భావించి దీనిని వాడుకుంటున్నాను)                                                        

         (సుబ్బ రామయ్య /నా చేత  సమర్పించ బడినది.) 
 ఒకనాడు:-
                             పాల సముద్రాన్ని సురలు, అసురులు మథియించు వేళ
                             వెలువడిన బడబాగ్నిని ఈశ్వరుడు నిగ్రహింప
                             వెలికి వచ్చె ఏ నాడో, ఏ మహా  సంగ్రామపు
                             ఫలితముగా లోన మునిగి యుండు దివ్య సంపదలు.
                             మహా యజ్ఞమది నిజముగ సంకుల సాగరమునుండి
                             అచ్చరలు, అమృతము, అమరత్వము అవతరించె
                             ఆనందపు తెమ్మెరలు ఎల్లెడలా తొంగి చూచె.
                             కలక తేరినట్టి మహా సముద్రంపు లోతునుండి.
              ఈనాడు:-
                              కలతలలో కలగినపుడు కరగుతుంది మనసు
                              అంతరంగ మథనమ్మె అమృతాన్ని ఇస్తుంది
                              మనలో మన ఎదలో నొక మాథుర్యము నొలకించి
                              మన మాతృక మన నేస్తము మన ప్రకృతి నొక కృతిగా
                             అందిం చి తెలుగు వారికొక మాలిక నిచ్చాడు,
                             ఊర్వశిలో ప్రణయము, ప్రేయసికై విరహము,
                             కృష్ణ పక్ష నిశీధిలో, నిలిచిన నైరాశ్యమును,
                            పంపినారు పల్లకిలో మన కొఱకై శాస్త్రి గారు.
                                  ఉత్తరంపు గవని నుండి వెలికి ఉరుకు హేమవంతపు
                             ఛాయలలో శర్మిష్ఠను, చేరునట్టి యయాతిని,
                             కార్తిక రాత్రులలోన కృష్ణుడి కొఱకై వెదికే
                             గోపికలను గానమాల చేసి ఇలకు పంపినారు.
                             ప్రకృతిలో మాధుర్యము పదపదమున చిలికించి,
                             ప్రకృతిని మురిపింప, ప్రతి హృదయము స్పందింప,
                              కవితామృత ధారలలో, క్రొత్త లోకమందించె,
                             మహా కవీ! మీకు నేడు ఏ సత్కృతి సరిపోవు?





No comments:

Post a Comment