Tuesday, February 14, 2012

శిల్పి 7


            తన మనస్సుకు విశ్రాంతి కావాలి. ఊరి బయటకు బయలు దేరినాడు, శ్రీ నాథుడు. పచ్చని పొలాలు, పక్కనే చెరువు, ఎత్తైన కొండ.  చదువు ఎగ గొట్టి అక్కడ కూర్చున్న రోజులు గుర్తుకు వస్తున్నాయి. రామాచార్యులుకు మాట ఇవ్వడముతోనే తన బ్రతుకొక కొత్త మలుపు తిరిగినది. గురువుగారి ప్రేమ, ఋజు మార్గము మరియు సత్య సంధత తనను ఎక్కువగా ఆకర్షించినవి.  ఆ సూత్రాల మీదనే తను బ్రదుకాలని అనుకున్నాడు. అదే మరొక మలుపును తిప్పినది. తను తిరిగి ఇక్కడున్నాడు.
            ఆ కొండను ఎక్కి చల్లని గాలులను ఆస్వాదించినాడు. తిరిగి నెమ్మదిగా క్రిందికి దిగినాడు. చెఱువు గట్టున రాతి గుట్ట దగ్గిఱకు చేరినాడు. తను సగము చెక్కిన చాలా బొమ్మలు అక్కడ చాలా ఉన్నాయి. తను నాటకాలకు వెళ్ళడము, అక్కడ రూపాలను గుర్తు పెట్టుకొనడము, సుద్దతో ఱాతి పలకల మీద గీయుట, కొన్ని అలాగె వదలి వేయుట, కొన్ని పూర్తి చేయుట..............
                     అక్కడ ఎక్కువ సేపు కూర్చున్నాడు. సూర్యుడు నెమ్మదిగా క్రిందికి దిగుతున్నాడు. ఆకాశము అమ్మ వారిలా ఎఱుపు చీర ధరించినట్లున్నది.  దూరాన చెరువు గట్టుకు ఎవరో వస్తున్నారు. భూము మీద బట్టలతో, మరో ఇద్దరు వస్తున్నారు.
             "శ్రీ నాథా! ఎప్పుడు వచ్చావయ్యా?"
             "ఉదయాన్నే వచ్చాను గురు దేవా!"
             "ఏమిటయ్యా, నీ ముఖము వాడి యున్నది. కళ్ళు లోతుకు పోయి యున్నవి. రాజరికపు మాత్రలు నీ మీద దెబ్బ తీయ లేదు కదా!"
             "మీరూహించ గలరు గురు దేవా! ప్రశాంతమైన పల్లెటూరు జీవనాన్ని వదలి, నగరులో మనగలనా అని ఆ నాడు సందేహించాను. మీ ఆశీర్వాద బలము తోనే ఆ నాడుండ గలిగినాను. వృత్తిలో సంతృప్తిని పొందినాను. వ్యవస్థలో అధికారము మారగనే, మనిషిగా నున్న నేను మర మనిషిగా మార లేక పోయినాను. ఎదురీద గల సత్తువ నాకు లేదు.  అందుకే మరో మార్గము వెదుకుకుంటూ ఇలా మరలి వచ్చినాను. నేను తప్పు చేసానాంటారా?"
"నీ మీద నాకు నమ్మకముందయ్యా. రాజ ధాని నుండి వచ్చే వార్తలను వింటుంటే ఈ రోజు కాక పోయినా, రేపు అయినా ఇలా వచ్చేస్తావని  నేను అనుకుంటున్నాను. కానీ, బ్రదుకు దెరువు చూచుకోవాలి కదా! రోజులు బాగు లేవయ్యా."
              "ఫర్వాలేదు గురు దేవా! నాలో కొండంత ఆత్మ స్థైర్యమున్నది. కానీ, ఇక్కడ మనుషులే నాకు అర్థము కావటము లేదు. నేనేదో పెద్ద పొరపాటు చేశానని అనుకుంటున్నారు. హేళనలు వినిపిస్తున్నవి. నాకు ఎక్కడ కైనా కొంత కాలము వెళ్ళి పోవాలని ఉన్నది."
             "వ్యక్తిత్వానికి గౌరవమిచ్చే రోజులు కావివి. హోదాలను చూచి గౌరవిస్తారు.  అన్ని విధాలా నీ నిర్ణయము మంచిదేనయ్యా. పెద్దల అనుమతిని తీసుకొని లోకాన్ని చూచి రా."
             "లేదు గురు దేవా! నాకు ఇంక ఎవరి అనుమతీ అఖ్ఖర లేదు. మీ ఆశీస్సులు చాలు.", అంటూ ఆయన పాదాలకు నమస్కరించాడు. తల్లి దండ్రుల అనుమతి తీసుకొనమని ఎంత చెప్పినా విన లేదు. అక్కడ నుండే లోకము లోకి బయలు దేరినాడు.

No comments:

Post a Comment