Monday, February 13, 2012

దేవులపల్లి


                    
                                                           గోపీచంద్‌
                                                            
          కొమ్మ మీద కోయిలమ్మ
          కూతలోని కులుకులు
          నింగిలోని రాయంచల
          నడకలోని తళుకులు
          చెట్ల మీద చిలకమ్మల
          చక్కని చిరు పలుకులు
        నీ గీతికలో నివశిస్తాయి
        నీ గొంతుకలో నిదురిస్తాయి.

          కొలను లోని కలువ భామ
          జలం మీద అలల భామ
          నేల మీద నెమలి భామ
          అంబరాన చంద మామ
          ఆడుకున్న ప్రతి మాటా
          పాడుకున్న ప్రతి పాటా
        నీ తలపు లోన మెదులుతున్న కవితా రావం
        నీగుండె లోన ఊరుతున్న కమ్మని భావం.
             కురుస్తున్న వెన్నెలలో చల్లదనాలు
           మెరుస్తున్న మెరుపులలో  తెల్లదనాలు
           విరుస్తున్న జాజులలో కొత్తదనాలు
           సాటి రావోయి ఎన్నడూ నీ కవితకు
           మేటి నీ వోయి ఎప్పుడూ ఈ జగతికి
         కాని ఒక్క మాటా దేవులపల్లి
         మరిచి పోకు మళ్ళీ మల్లీ
         కరుణ చిందు కవితలల్లి
         మమత జల్లు మాటలల్లి
నాది నాది నాదంటూ  -లోకమే తనదంటూ
         కామాన్నే నంచుకుంటూ- క్రోధాన్నే నంజుకుంటూ
         అజ్ఞానం భుజిస్తున్న _ ఆవేదన మ్రింగుతున్న
         సాంఘిక సమాజం లో -సమతను రూపొందించు
         మానవాళి మనసులలో -మమతను రేకెత్తించు.
       ఇదేనోయి నాదు మాట దేవులపల్లీ!
       మరిచి పోకు ఎన్నడూ మళ్ళీ మళ్ళీ.


        (కళా ప్రపూర్ణ శ్రీ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్ర్తి గారు కేంద్ర సాహిత్య
        అకాడమి ఆవార్డు పొందిన సందర్భముగా  తెలుగు సాంస్కృతిక సమితి, ఐ. ఐ. టి., మద్రాసు,
        30-1-79 న ఏర్పాటు చేసిన అభివందన సభలో సమర్పించ బడినది.)
(గోపిచంద్‌ గారిని ఈ బ్లాగ్‌ మూలముగా అనుమతి తీసుకున్నట్లు భావించి దీనిని వాడుకుంటున్నాను)

No comments:

Post a Comment