Monday, August 22, 2022

వాయు నియంత్రిత

 

ఇదేదో కొత్త పదములా ఉంది. లేదా పలకడానికి చాలా కష్ట మయిన పదములా ఉంది. ఎందుకంటే మనము అటువంటి ప్రభావములో ఉన్నాము.  తెలుగు గ్రాంధిక భాష వ్రాస్తే  చాలా కష్టమండీ,  మాకది అర్థము కాదు అనే వారు ఉన్నారు. లేదా రైలు సిగ్నల్ కు ధూమ గమనా గమన సూచిక  అని నిర్వచించే ఛాందసుల తో బాటు దానిని ఎగతాళి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలా మందికి తెలియని విషయము ఏమిటంటే ప్రముఖ గణిత శాస్త్ర విభాగము న్యూటన్ మహాసయుడి ద్వారా  పరిచయము చేయబడినది అని చెప్ప బడిన కాల్కులస్ కు ఆ భాష లో  అర్థము గులక రాయి.

భయ పడుటకు మరి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. నేను పుస్తకాల షాపు లో ఉన్నపుడు ఒక వ్యక్తీ  ఒక సంస్కృత పారాయణ  గ్రంథాన్ని పేజీలు  తిప్పి, సంస్కృతములో తప్పులు చదివితే  పాపమండీ  అని అన్నారు.”ఏమండీ, అప్పుడే నడవటానికి  ప్రయత్నిస్తు తప్పటడుగులు  వేస్తున్న   పసి పిల్ల వాడు తప్పు చేస్తున్నాడంటారా? భగవంతుడు అంత కఠినముగా ఉంటాడంటారా?” అని అడిగినాను. జవాబు రాలేదు. ఈ తత్త్వము కొన్ని భాషలకు మనము ఇచ్చిన శాపము.

సంస్కృతము వలెనె విపరీతముగా ఒత్తులు ఉన్న భాష జర్మన్ భాష. ఒత్తులు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు  Journal of applied physics అని ఆంగ్లములో ఉంటె  Zeischrift fur angewadte fiziks అని జేర్మన్లో  journal de physique అని  ఫ్రెంచ్ భాషలో పిలుస్తారు. ఈ విధముగా జేర్మన్లో ఒత్తులు  ఎక్కువగా ఉంటాయి. ఆంగ్ల భాష మధ్యలో ఉంటుంది. ఇంకా ఫ్రెంచ్  భాషలో అసలు ఒత్తులు ఉండవు. బాగా మద్యము సేవించినందు వలన మందమయిన నాలుకతో మాట్లాడినట్లు ఉంటుంది. ఎవరి అవసరాలను అనుసరించి వారి భాష ఏర్పడుతుంది. భాష కష్టము , మాట్లాడలేము అని పలికించే కరటకులు దమనకులు వెనుక ఉండి ఆడిస్తూ ఉంటారు.

నేను చేయలేను అనే పదము భారతీయ సాంప్రదాయములో ఉండేది కాదు వారి వృత్తికి వ్యాపృత్తికి  ఎంత అవసరమో ఆ భాషను అంత వరకు నేర్చుకొనే వారు. ఆ నాడు ఏది ఎక్కువ సంపాదన ఇస్తుంది , అదే చేద్దాము అనే భావన ఉండేది కాదు. ఎ శాస్త్రము అయినా ఉన్నత స్థాయికి వెళ్ళినపుడు జీవన భృతి ని ఇచ్చేది. జీవితమయినా యుద్ధ రంగమయినా ఒకే మానసిక స్థితి ఉండేది. సంస్కృత వ్యాకరణము వ్రాసిన వారి పరంపరలో  ఆఖరున ఉన్న వాడు ఈ నాడు పాకిస్తాన్ కు చెందినా తక్షశిలలో జన్మించిన పాణిని. సంస్కృతము  సరిగా రాక పొతే గురువుగారు నీకంత శక్తి లేదని,హస్త సాముద్రిక రేఖలలో విద్య రేఖ అసలు లేదని చెప్పినాడుట.  అప్పుడు పాణిని అర చేతి మీద విద్యా రేఖ ప్రస్ఫుటముగా కనబడేటట్లు కత్తితో గాటు పెట్టుకున్నాడుట. శివుడి  గూర్చి తపము చేసి ఆయన అనుగ్రహముతో డమరుక సబ్దాలనుండి ఆధునిక సంస్కృత వ్యాకరణాన్ని నిర్మించినాదుట.ఈ నాటి కంప్యూటర్ శాస్త్ర వేత్తలు పాణిని నిర్మించిన భాష కంప్యూటర్ కు సహజమయిన భాష అవుతుందని పలికినారు. ఇటువంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో సాధనాలతో లక్ష్యాన్ని చేరుకున్న యుగ పురుషులు ఈ నేల లో జన్మించినారు. పొలాన్ని దున్నే రైతు ఎంత చెమట కారుతున్నా తన దృష్టి పొలము మీదే ఉంచుతాడు. కలాన్ని పట్టుకున్న కవి ఎంత కష్టమైనా తన దృష్టి తన రచన మీదే ఉంటుంది. తన బాధలే తను అయిన వాడు యోగ సాధనకు పనికి రాడనీ మహా యోగి పతంజలి చెబుతారు. నిప్పులో దూకినా నిప్పులాంటి వాతావరణములో ఉన్నా సాధకుడు తన్ను తాన మరిచి పోడు.

ఇంక అసలు విషయానికి వద్దాము.  పల్లెటూర్లలో ఇళ్ళకు  మధ్య  ఎక్కువ  దూరమున్నందు వలన  గాలి చక్కగా వీచేది. మురికి గూర్చి ఎక్కువ జాగ్రత్త తీసుకొనక పోయినా ఎండ పడినందు వలన చెడు ఫలితాలు వచ్చేవి కాదు. ఆవుల పోషణ ఉన్నంత కాలము వాటి పేడ  మూత్రము వలన  దోమల బాధ ఉండేది కాదు. పగలంతా నిద్ర పోయినా రాత్రి పూట హాయిగా ఆరు  బయట మంచాలు వేసికొని  చల్లని గాలిలో విశ్రమించే వారు. ఇంక విద్యుత్తు అవసరము ఉండేది కాదు.

సాంకేతికత పెరిగే కొద్దీ కొత్త పరికరాలు వచ్చినవి. వ్యాపారము పెంచు కొనుటకై  కొత్త అలవాట్లు, అవసరాలు వచ్చినవి. ఇరుకు గదులలో అయినా గాలి చక్కగా వీచుటకు వాతాయనములు/ పంఖాలు/ఫాన్లు వచ్చినవి. ఇందు వలన విద్యుత్తు ఖర్చు పెరిగింది తప్ప కొత్త గా ఏ  విధము  అయిన నష్టము రాలేదు. అటు తరువాత మొదటగా వచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలు మన దేశపు ఉష్ణోగ్రతలలో పాడు కాకుండా పని చేయాలంటే వాటిని తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచ వలసిన అవసరము వచ్చి, వాతావరణము చల్ల బరచుటకు వాత నియంత్రణ యంత్రాలు, లేదా  వాత నియంత్రితాలు లేక పొతే ఎయిర్ కండిషనర్లు వచ్చినవి. ఇవి మొదట పరిశోధన శాలలకు మాత్రమె పరిమిత మయి ఉండేవి. వాటిని తయారు చేసే వారి వ్యాపారము పెంచు కొనుటకు వీటిని జనానికి అలవాటు చేసినారు. వీటితో బాటు లేదా కొద్దిగా అటు ఇటు కాలములో వస్తువులను చల్లని వాతావరణలో ఉంచుకొనుటకు ఫ్రిజిడేర్లు తయారయినాయి. ఈ రెండిటికి ఒకే లక్షణము ఉంది.

ఫ్రిజిడేర్ లేదా ఫ్రిజ్ లోపల వస్తువులలో చేరే వేడి నంతటను కలిపి తన వెనుక భాగము గుండా బయటికి విసర్జిస్తుంది. అందుకే దాని వెనుక వైపు చాలా వేడి గా ఉంటుంది. ఇంకా ఎయిర్ కండిషనర్  లోపల చల్ల బరచి, వేడినంతా బయటకు పంపించి  వేస్తుంది. ఇందు వలన ప్రకృతికి మరియు మనిషికి  రెండు నష్టాలు ఉన్నవి. మొదటిది, చల్లబడుటకు వాడే రసాయనాలు కొంత వరకు అయినా వాతావరణములో కలుస్తాయి. భూమికి రక్షణను ఇస్తున్న ఓజోన్ పొర ఈ రసాయనాల వలన విఘటన చెంది, క్రమక్రమముగా ఇక్కడ ఉన్న జీవ జాలానికి హాని కలిగించే అవకాశముంది. ప్రపంచములో చాలా దేశాలు వీటిని నియంత్రించాలని ప్రయత్నములు చేస్తున్నవి. ఈ రెండిటి వాడుక మరింత పెరిగి పోవుతతో బాటు, అడవులు మరియు చెట్ల సంఖ్య తగ్గి పోయి భూ తాపము అపరిమితముగా పెరిగి పోతున్నది. భూతాపము పెరిగే కొద్దీ వీటి అవసరము మరింత పెరుగుతున్నది. తెలుగులో ఒక సామెత ఉంది. ఒకడికి పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు. పిచ్చి కుదిరితే గానీ పెళ్లి కాదు. అదే విధముగా ఈ యంత్రాల వాడుక తగ్గితే గాని భూ తాపము తగ్గదు. భూ తాపము తగ్గితే గానీ వీటి వాడుక తగ్గదు.

మనిషి జీవితమూ పూర్తిగా యాంత్రికము అవుతున్నది. ఏ పని కూడా తను చేయ లేని పరిస్థితికి వస్తున్నాడు. కూర్చుంటే లెవ లేడు. ఏ పనినీ చేయ లేడు, ఏ వేడికీ తట్టుకోలేదు. పరిశోధన  శాలలలో తప్ప మిగిలిన వాడుకలో వీటిని నియంత్రిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయము తగ్గ వచ్చును, కానీ భూ తాపము తగ్గుతుంది. ఇందు వలన భూమి మీద ఉన్న ఇతర జీవ రాసులకు కూడా సాయము చేసిన వారవుతారు.

నీతి:మన దేహాన్ని ప్రేమించుటే కాదు, మనలను కూడా మనము ప్రేమించ గలగాలి

No comments:

Post a Comment