Saturday, March 25, 2017

ప్రస్థానము 1

                                                               

     అప్పటి వఱకు దైవికమయిన అనుభవములో నున్న కాంతి కిరణము అప్పుడే కళ్ళు తెఱచినది. ఎన్నో రకాల జీవ జాతులు, మనుషులు, దేవతలు కనిపిస్తున్నారు. వీరెవ్వరు? ఇంత వైవిధ్యత ఎందుకు ఉండాలి? అని ప్రశ్న వేసుకున్నది.
  వెంటనే జవాబు వచ్చినది,"అనుభవిస్తేనే తెస్తుంది."
  "ఎలా?", మరో ప్రశ్న వచ్చినది.
  "అనుభవానికి సిధ్ధమేనా?"
  "సిధ్ధమే."
  వెంటనే తను అక్కడినుండి మాయమయినది.
  తను ఒక రాతి బండలో జడత్వముతో ఉన్నది. కానీ,అంతా గమనిస్తూనే యున్నది. ఆ రాయి బ్రద్దలు గొట్ట బడినది. ఆ బాధను అనుభవించినది. తరువాత ఒక మాంస కృత్తువు యొక్క కేంద్రకములో చేరినది. దాని చుట్టూ మరికొన్నీ అణువులు చేరినవి.ఒక మొక్కలా ఎదిగినది. నీరు, గాలి, సూర్యుడి  కాంతి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నవి. కానీ, ఇంతలో  తనను ఎవరో పీకి వేసినారు. మళ్ళీ, జడత్వము లోనికి పోయినది. ఆ అనుభవము తనలో కోపాన్ని పెంచినది.
      మళ్ళీ, ఇంకో రూపము వచ్చినది. అది యొక ముళ్ళ మొక్క. గత జన్మలో ద్వేషము తనకు ముళ్ళుగా రక్షణ నిచ్చినది. తనను స్థలాలకు హద్దుగా నున్న చోటుల్లో కంచె మీద వేసినారు. ఎవరో తనను దాటి వెళ్ళే వారు కాదు. ఎవరైనా వెళ్ళినా వారి ప్రయత్నములో ముళ్ళు గుచ్చుకొని భాధ పడితే తనకు సంతోషము కలిగేది. ఒక సారి మంట పెట్టి తనను తగుల పెట్టినారు. తనకు మనుషుల మీద ఇంకా కోపము పెరిగినది.
      తరువాత జన్మలో ఎన్నో ఊడలతో నున్న మొక్కగా పెరిగినది. ఏ జీవ రాశి దగ్గిఱకు వచ్చినా ఊడలు చుట్టుకొని రక్తాన్ని పీల్చి వేసేవి.గత జన్మలో తన ద్వేష ప్రవృత్తి ఇటువంటి జన్మకు కారణమయినది. అప్పుడు కూడా ఏదో ప్రేలుడులో తను చని పోయినది."ద్వేషము ఎటువంటి జన్మ కలిగిస్తున్నది?" అని ఆలోచించినది. కానీ ఆ అనుభవము తనలో జీర్ణము కాలేదు. కానీ ఆ భావన తనలో పరిణామ స్థాయిని పెంచినది. వృక్ష స్థాయినుండి జంతు స్థాయికి వచ్చినది. ఎన్నో జన్మలు గడచినవి.ఒక చిరుతగా పుట్టి, వేటాడి పొట్టను నింపుకున్నది.వయసులో ఉన్నపుడు తను రాజా లాగా బ్రదికినది.కానీ, వయస్సు రాగానే తన బలహీనత బయట పడినది. అందు వలన మనుషుల మధ్య బ్రదికితేనే తనకు రక్షణ   ఏర్పడుతుందని  అనిపించినది. విశ్వాసముతో బ్రదికే కుక్క లాగా పుట్టినది. కానీ, మనుషులు తనను వేటకు వాడుకున్నారు. ఇందువలన కొంత మార్పు వచ్చినా క్రూరత్వము తగ్గే అవకాశము పూర్తిగా రాలేదు. మళ్ళీ కొన్ని జన్మలు గడిచినవి.
     తనతో బాటు కొన్ని జీవులు త్వరగా మానవ జన్మ కావాలని కోరుకున్నవి.వాటికి ఆ స్వతంత్రము ఈయ బడినది. కానీ పరిపూర్ణత లేని సంస్కారాల వలన అవి దుర్మార్గాలు చేసి, తిరిగి జంతువుల స్థాయికి తిరిగి వచ్చినవి. అందుకని తను తొందర పడ లేదు.
     జన్మలు గడిచే కొద్దీ, కోపము పగ, ఆక్రోశము.. ఇవన్నీ అర్థము అయినట్లు అనిపించినది. కానీ అవి తనను వదిలి పెట్ట లేదు. చివరకు ఒక రోజు తనను పైవారే అడిగినారు, "మనిషిగా పుడతావా?"అని.

  మనిషి, మనిషి తరువాత దైవీ మానవుడు,.. ఇవి రావడానికి ఎన్ని జన్మలు పడుతందో? ఎన్ని జన్మల సాధన ముందున్నదో? యాత్ర మాత్రము ముందుకు సాగి పోతున్నది.
(To be continued)

No comments:

Post a Comment