Wednesday, March 22, 2017

రెండు చిలుకలు



ఈ రోజు అమ్మ వస్తుందిట నాన్న చెప్పినారు. ఎన్ని సంవత్సరాలు  అయిందో అమ్మను చూచి.  నేను అమ్మను మఱచి పోయినానా?  లేదే అమ్మ ఎప్పుడూ నాకు గుర్తు ఉంది. అయితే అమ్మకు ఎన్ని పనులో? అందుకే అయింది ఎన్ని సంవత్సరాలో.
మరి నాన్న అమ్మను మరిచి పోయినాడా? లేదు. మరచి పోయినట్లయితే అమ్మ వస్తుందని చెప్పినపుడు నాన్న ముఖములో సంతోషము ఎందుకు కన బడుతుంది?
“మీ అమ్మ రేపు వస్తుందిట ఏమి చేస్తావో చేయి.” అన్నాడు.
“అత్తయ్యను అడుగుదామని అనుకుంది, “ఏమి చేస్తే బాగుంటుందో?”కాదు తను ఆలోచించి తనే చేయాలి. ఈ మొద్దు బుఱ్ఱకు  ఏమి చేయాలో తెలియుట లేదు. నెత్తిన ఒక మొట్టి కాయ వేసుకున్నది. వెంటనే పండుగలకు  ఏమి చేస్తారో గుర్తుకు వచ్చింది. పక్కన ఉన్న మామిడి చెట్ల నుండి ఆకులు కోసి తోరణాలుగా వాకిట్లో కట్టింది. చాలా కష్ట  పది తనకు వచ్చిన ముగ్గులన్నీ వాకిట్లో పెట్టింది. తన కిష్టమయిన గులాబీ మొక్క దగ్గిరకు వెళ్లి రేపు ఉదయాన్నే మా అమ్మ వస్తుంది అని చెప్పింది. అమ్మకు ఏమి ఇష్టమో, ఏమి చేయాలో నాన్న గారు వచ్చిన తరువాత కనుక్కోవాలి. అమ్మకు ఇష్టమయిన కూరలు చేసి ఇవన్నీ నేనే చేసాను అమ్మా అని చెప్పాలి.
రామచంద్రమూర్తి ఒక్క సారి తన గతములోనికి వెళ్ళినాడు. అమ్మ వస్తుందని తన కూతురికి చెప్పినపుడు వాణి ముఖములో సంతోషాన్ని గమనించినాడు.  రోజా లేదా సరోజ తన భార్య పేరు. తను మాస్టర్ డిగ్రీ కోసము చదువుతున్న రోజుల్లో తనే తన వెంట బడినది. ఆఖరికి ఇంటికి వచ్చి నాన్న గారితో కూడా పరిచయము పెంచుకుంది. పెళ్లి వరకు తీసుకొని వచ్చింది. అమ్మ, నాన్న కూడా తనకు లోబడి పోయినారు. కాని, ఆమె లోతుగా ఉన్న ఆలోచనలను వారు పసి గట్ట లేక పోయినారు. తమకు ఇద్దరు పిల్లలు. పెద్ద పిల్ల పేరు శ్రీ వాణి. తనే ఆ పేరు పెట్టినాడు.  రెండవ పిల్లకు తనే పేరు పెట్టింది, రాణి సంయుక్త అని. పిలిచే పేరు మాత్రము రాణి అయింది.  చివరకు తను దూరముగా వెళ్లి పోయింది. వాణి తన తోనే ఉండి పోయింది. రాణిని తన వెంట తీసుకొని వెళ్ళింది.
గతమంతా ఒక్క సారి కనుల ముందు తిరిగి కళ్ళల్లో నీళ్ళు నిలిచినాయి. ఒక్క  సారి గతమంతా సినీమా రీలు లాగా కన్పించినది. 
అవి రామ చంద్ర మూర్తి అలియాస్ రాము తిరుపతి శ్రీ వెంకటేశ్వర  విశ్వ  విద్యాలయములో  ఫిజిక్స్  పిజి  చదువుతున్న రోజులు. తండ్రి గారికి కాస్త  ఛాందస మెక్కువ.  హాస్టల్ లో ఎటువంటి తిండి తింటాడో అని ఒక భయము. అంతే  కాదు, సంధ్యా వందనము చేసుకుంటాడో లేదో అన్నది మరో భయము. చివరకు ఎట్లో ఒప్పుకున్నాడు. హాస్టల్  లో కాకుండా బయట ఒక గది తీసుకొని అందులో ఉండే ఏర్పాటు చేసినాడు. దగ్గిర లోనే కాశీపతి పేర ఒక బ్రాహ్మణ మెస్ లో భోజనము.
తన ఇంట్లో పరిస్థితులు, పరిమితులు తనకు  బాగా తెలుసు. తనకు ఉపనయనము అయింది. రోజూ  సంధ్యా వందనము చేసుకోవాలి. అదే తనకు రక్ష యని నాన్నగారి నమ్మకము.  ఉదయాన్నే అయిదు గంటలకు లేచి , స్నానము చేసి, కార్యక్రమములు పూర్తి చేసు కొనే వాడు. మిగతా సమయమంతా చదువు కోసమే. ప్రతిదీ చదవడము మాత్రమె కాకుండా క్షుణ్ణంగా అర్థము చేసుకోవడానికి ప్రయత్నమును చేసే వాడు. మొదటి సంవత్సరము మంచి రాంకే వచ్చింది. తనకు బి యస్సి లో వచ్చిన మార్కుల వలన మెరిట్ స్కాలర్షిప్  కూడా వచ్చింది. అందు వలన తండ్రికి ఎక్కువ భారము లేకుండా చూచు కోవాలని  అనుకున్నాడు.
తను చాలా మిత భాషి. ఎవరితో కలిసే వాడు కాదు. ఖాళీ ఉంటె గ్రంధాలయములో గడిపే వాడు.
రెండవ సంవత్సరము లో కూడా తను అదే గదిలో ఉన్నాడు. ఆ గదికి బాల్కనీ కూడా ఉంది. అందులో కూర్చొని రోడ్డును చూస్తూ తను చదువు కొనే వాడు. ఎదురుగా ఉండే ఇంటిలో కొత్తగా ఒక కుటుంబము చేరింది. అందరూ రాలేదు. ఒక పెద్దావిడ ఒక అమ్మాయి అందులో చేరినారు. కొన్ని రోజుల తరువాత ఆ అమ్మాయి తననే గమనించడము గమనించినాడు.  తన ప్రత్యేకమయిన మనస్తత్వము వలన బాల్కనీలో కూర్చోవడము  మాని వేసినాడు.
తను ఎవరినీ ప్రత్యేకముగా గమనించే వాడు కాదు. ఒక రోజు డిపార్ట్  మెంట్లో తను క్లాసు వెళ్ళుతుంటే “ఏమండీ” అంటూ ఆ అమ్మాయి ఎదురు వచ్చింది. “మీరు మాకు సీనియర్ అన్న మాట” తను నవ్వి ఊరుకున్నాడు. “నా పేరు  సరోజ. మీరున్న ఎదురు బిల్డింగు లోనే ఉంటున్నాను.”
“నేను చూచాను.” అని, వెంటనే తను వేగముగా క్లాసు లోకి వెళ్లి పోయినాడు.
అప్పటినుండీ ఎప్పుడు ఎదురయినా నమస్తే చెప్పి పలకరించేది. అది ఎంత  అలవాటు అయిందంటే ఆమె అలా కనిపించని రోజు  “ఈ రోజు ఏమయింది, తనకు ఒంట్లో బాగు లేదా?” అని యనిపించేది. అది తనకు సంబంధము లేని విషయమని తనకు తాను సర్ది చెప్పుకొనే వాడు.
ఆ రోజు ఆది వారము. ఆ రోజు ఉదయాన్నే తన గది లోనికి పుస్తకాలతో వచ్చేసింది. “ మీ సంధ్యా వందనము  అన్నీ అయినాయి కదా.” అని, “ నాకు పూర్తిగా అర్థము కాలేదు. కాస్త క్లాసికల్ మెకానిక్స్ చెప్పరా?” అని అడిగింది. ఏదో తెలియనివి చెప్పించు కోవడము కాదు, తనకు ఉన్న అనుమానాలన్నీ స్పష్టముగా ఉన్నాయి. చాలా శ్రద్ధగా విన్నది.  ఉత్సుకత ఉన్న వాళ్ళకు చెప్ప వలసిన భాద్యత తెలిసిన ప్రతి యొక్కరికీ ఉందని నాన్నగారు చెప్పే వారు. అందు వలనే సంశయించకుండా తనకు తెలిసినంత వరకు చెప్పినాడు. ఇలా తాము ఇద్దరము మాత్రమే ఉండడము చూస్తే ఎవరయినా ఏమనుకుంటారో అని భయము తనను పీకుతూనే ఉంది. అంతా అయిన తరువాత టైం  చూచుకున్నాడు.  తన మెస్ మధ్యాహ్నము మూసి వేసే సమయము దాటి పోయింది. ఇంక తనకు హోటల్  లో టిఫినే గతి అనుకున్నాడు.
“ఏం మెస్ కు వెళ్ళటము లేదా ?”అని అడిగింది.
“మెస్ టైం అయిపొయింది.  బయటకు వెళ్లి టిఫిన్ చేసి వస్తాను” అంటూ లేచినాడు.
“అయ్యయ్యో! ఎంత పని చేసినాను. ఇంత సేపు కూర్చొని మీకు తిండి లేకుండా చేసినాను. పది నిముషాలుండండి. ఇప్పుడే వస్తాను” అంటూ బయటికి పరుగు తీసినట్లుగా వెళ్ళింది.
ఆ అమ్మాయి వచ్చే లోపల తాళం వేసుకొని బయలు దేరాలని  అనుకున్నాడు. ముఖము కడుక్కొని బట్టలు మార్చుకోవటానికి కాస్త సమయము పట్టింది. బయటకు వచ్చి తాళము  వేస్తున్నాడు. సరోజ తనకు అడ్డము వచ్చేసింది కారియర్ తీసుకొని.
“మీరు అంత కష్టపడి నా అనుమానాలన్నీ తీర్చినారు. మీకు ఆ మాత్రము చేయ లేనా? ముందు తలుపు తాళము తీయండి.” గదమాయించినట్లు అన్నది.   తను అసలే బెదురు గొడ్డు లాంటి వాడు. ఇంక గతి లేక తిరిగి లోపలి వెళ్ళినాడు.  తను  ఒక పేపర్ ప్లేట్ కూడా  తెచ్చింది. తనే  వడ్డించింది. మామూలుగా కంటే  ఎక్కువ తిన్నాడు. పొట్ట నొప్పి కూడా వచ్చింది.
పేపర్ ప్లేట్ బయట పడేసి  మళ్ళీ థాంక్స్ చెప్పింది. “మీరు చెప్పినపుడు  అర్థమయినంత బాగా క్లాస్  లో అర్థము  కాలేదు. మిమ్ములను బాగా ఇబ్బంది  పెట్టేసినాను. ఇంకో సారి  వీలు చూచుకొని క్వాంటం  మెకానిక్స్ గూర్చి చెప్పరూ?”, అడిగింది. కడుపు నిండా తిన్నాడు. మొహమాటము వచ్చేసింది. నెమ్మదిగా”అలాగే” అన్నాడు.
ఆ అమ్మాయి  బయటకు వెళ్లేసరికి  తన నాడి ఒక సారి చూచుకున్నాడు. “అమ్మయ్య ! మామూలు  స్పీడుకు వచ్చేసింది”, అనుకున్నాడు.
తనకు ఎటువంటి ఆకర్షణ  కలుగ లేదు. దానికి  కారణము తనకున్న ఒకే లక్ష్యం. తను మంచి డిగ్రీ తీసుకోవాలి. తన క్లాసు లో  ఏంతో మంది అమ్మాయిలు పలకరించే వారు. అన్నిటికీ ముక్త సరిగా జవాబు చెప్పే వాడు.  వారు తనకు పెట్టిన పేరు, “పప్పు సుద్ద”. పేరేమి పెట్టినా వారు తన జోలికి రాకుండా ఉంటే చాలు అనుకున్నాడు.
సరోజ విషయములో ఇంకో నిజము కూడా ఉంది. తను ఫిజిక్స్ తప్ప మరో విషయము మాట్లాడేది కాదు. అందు వలన బ్రదికి పోయానని తనకు అనిపించింది. మామూలుగానే రోజూ డిపార్ట్  మెంట్లో తనను పలకరించేది. తను నవ్వి ఊరుకొనే వాడు. ఇంక వేరే మాటలు ఉండేవి కాదు.
ఇంత వరకు వారి కుటుంబము  గురించి తనకు తెలియదు. తన కుటుంబము గురించి వారికి తెలియదు. అది అంతటితో ఆగి పోలేదు.
సరోజ ఒక ఆదివారము ఉదయాన్నే హడావుడిగా వచ్చింది. అప్పటికి తన అనుష్ఠానము కూడా పూర్తి కాలేదు. ఎదురుగా వచ్చి ఒక నిముషము ఆగింది. తన అనుష్ఠానము ఆపి ఏమిటన్నట్లు ముఖము పెట్టినాడు.
“ఈ రోజు నా పుట్టిన రోజు.”
“కంగ్రాట్యులేషన్సు”
“అంతే కాదు. ఈ రోజు మా నాన్న గారు కూడా వచ్చినారు. మిమ్ములను తప్ప ఇంకెవరినీ పిలుచుట లేదు.”
“చాలా మంచిది”
“ మీ ద్వారా చాలా నేర్చుకున్నాను కదా. నాన్నగారు కూడా మిమ్ములను చూడాలని అంటున్నారు.”
“ఈ రోజు  చాలా పని ఉంది. నేను చాలా వ్రాసుకోవాలి.”
“ఎక్కువ సేపు ఉండ వలసిన పని  లేదు. అయినా మీకంత  ఖాళీ లేక పొతే నాన్నగారే వస్తారు”
“అక్ఖర లేదు. నాకోసము ఆయనను కష్ట పెట్టడమెందుకు? ఒక గంట ఆగి నేనే వస్తాను.” చివరకు మర్యాద కోసమయినా ఒప్పుకోక తప్పింది కాదు.
అక్కడకు వెళ్ళగానే  తన అమ్మ, నాన్నలకు పరిచయము చేసింది. ఆయన పేరు కృష్ణ శాస్త్రి. దిల్లీ  విశ్వ విద్యాలయములో ఫిజిక్స్  ప్రొఫెసర్ అట.  అంటే తండ్రి ప్రభావములో తను ఫిజిక్స్ తీసుకున్నదన్న మాట. అంతే కాదు. సరోజ తాతగారు నెల్లూరు వారేనట. ఆయన ధిల్లీ వెళ్లి అక్కడ స్థిర పడినారుట. ఇంక వాళ్ళ  నాన్న గారి బాల్యము చదువు ధిల్లీ లోనే జరిగిందిట. తన ఊరు, ఇంటి పేరు గోత్రము అన్నీ అడిగినారు. ఇదంతా ఏదో కబుర్ల వలెనె జరిగింది. అప్పుడే వాళ్ళ అభిప్రాయమేమిటో అని తనకు అనుమానము వచ్చింది. తనకు ఊహకు అందని ప్రణాలికలు వారి మనస్సులో ఉన్నాయని అనిపించింది.
అక్కడ కేకు కోయడము, దీపాలు ఆర్పడము ఏమీ జరుగ లేదు. అక్షతలు వేసి ఆశీర్వదించినారు. కొంచెము సాంప్రదాయ కుటుంబము వలెనె అనిపించినది. మర్యాద కోసము ఒక గంట ఉండి తన గదికి వచ్చేసినాడు. భోజనానికి ఉండమన్నా ఉండ లేదు. మర్నాడు తను మళ్ళీ సాయంత్రము వచ్చింది. వాళ్ళ నాన్న గారు, అమ్మగారు ఐ .యస్. మహల్లో ఎదో సినీమా చూడాలనుకుంటున్నారుట. నేను కూడా వాళ్ళతో వస్తే బాగుంటుందని.
తను చూచినా సినిమాలు చాలా తక్కువ . ఇది అందరికీ తెలుసు. కొన్ని శాంతారామ్ హిందీ సినిమాలను చూచినాడు. ఇంకా  విశ్వనాథ్ బాపు సినిమాలను కూడా అన్నీ చూడ లేదు. ఇంకా తను సినిమాకు వెళితే ఎంత సమయము వృథా అయిందా అనిపిస్తుంది. మానేసి మధ్యలో వెనక్కు రాలేదు. అందుకే వాటిని చూడటము తగ్గించి వేసినాడు. అందుకే తను రాలేనన్నాడు.
‘ మా నాన్న కోసము కాదు. నా కోసము ఒక్క సినిమా రాలేరా?”
“నాకు చాలా పని ఉంది. సెమినార్  కు సిద్ధము కావాలి. అన్నీ వ్రాసు కోవాలి.”
“అంతగా అవసరమయితే మీరు చెబితే నేను వ్రాసి పెడతాను. పిపిటి కూడా చేసి పెడతాను.”బ్రదిమాలుకుంది.
“నీవా సబ్జెక్ట్ చదవ లేదు, వ్రాయలేవు”
చాలా సేపు వాదించింది, బ్రదిమాలుకుంది. ఇంక ఒత్తిడి తట్టుకోలేక ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నానా అని తనకే ఆశ్చర్యమేసింది. అంతే , అప్రయత్నముగా తన చేయి పట్టుకొని లాక్కు వెళ్ళింది.
అసలు అలా లాక్కు వెళుతుందని తను ఊహించ లేదు. ఒక విధమయిన షాక్ కు గురి అయినాడు.
అటు తరువాత తను వస్తే  పాఠాలయితే చెప్పే వాడు. మరి ఏ  ఇతరమయిన ప్రతిపాదనలను తెచ్చినా తెలివిగా తప్పించుకొనే వాడు.  తమ మధ్య దూరము పెరిగినట్లే అనిపించినది. అందుకు తానేమీ బాధ పడ లేదు.
పరీక్షలు అయిపోయినాయి. అన్నీ చాలా బాగా వ్రాసినాడు. ఇంకా ఒకే ఒక లేబరేటరీ పరీక్ష ఉంది.  తనకు పై చదువులు వెళ్ళాలనే ఆలోచనలు ఏ కోశానా లేవు. దగ్గిరలో ఉన్న కళాశాలలో పాఠాలు చెప్పుకుంటూ తల్లి దండ్రులను దగ్గిరుండిది చూచుకోవాలని అనుకున్నాడు.
తను ఈ ఆలోచనలో ఉండగానే సరోజ వచ్చింది. ముఖము చాలా దీనముగా ఉంది.
“రేపటితో మీ పరీక్షలు అయి పోతాయి. మీరు వెళ్లి పోతారు. నేను ఇంకా ఒక సంవత్సరము ఉండాలి. మనము విడి పోతున్నాము. మీకు దిగులుగా లేదా?”
“ఏమో ? నేనెపుడూ  ఆలోచించ లేదు. నా ధ్యాస అంతా ఎప్పుడు ఊరికి వెళ్లి పోదామా అని ఉంది.”
“అవును మీ మగ వాళ్ళంతా ఇంతే. మీకు ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు. అయినా కాన్వోకేషన్కు వస్తారు కదా.”
ఒక నిముషము ఆగి మళ్ళీ అడిగింది,”మీరు డాక్టరేట్ చేయ వచ్చును కదా.”
“”నేను అటువంటివి ఏమీ ఆలోచించ లేను. ముందు మా అమ్మా నాన్నలను చూచుకోవాలి.” అన్నాడు. అక్కడే తన ముఖము వైపు చూస్తూ చాలా సేపు కూర్చుంది. తరువాత తనకు అనుమానాలున్నాయని కాస్త సబ్జెక్ట్ చెప్పించుకుంది. ఇంకా మాట్లాడుటకు ఏమీ లేనందు వలన దిగులుగా ఇంటికి వెళ్ళింది. మర్నాడు కూడా అతడిని గమనిస్తూనే ఉంది.

తను గదిని ఖాళీ చేసి సామానుతో బయటకు వచ్చినాడు. తను అడగకుండానే ఆటో  తీసుకొని వచ్చింది. అంటే కాదు. “నేను కూడా బస్ స్టాండ్ కు వస్తున్నానని అతడి కంటే ముందు ఆటో ఎక్కి బస్ స్టాండ్ చేరింది .అక్కడే వీడ్కోలు 

No comments:

Post a Comment