Thursday, March 23, 2017

యంత్రాలు వస్తున్నాయి-తస్మాత్ జాగ్రత్త.


రాజాకు వళ్ళు బాగా బరువు ఎక్కి పోతున్నది. అంతే కాదు, తిండి కూడా ఇంతకూ ముందు తినే మాత్రము తినుట లేదు. అజీర్తి ఎక్కువయి పోయింది. అల్లోపతి వైద్యుడి దగ్గిరకు వెళితే ఏవో  మాత్రలు ఇచ్చినాడు. వాటి వలన ఆకలి పెరిగినట్లనిపించింది. కాస్త తిండి పెరిగింది. దానితో బరువు కూడా పెరిగింది. దానితో మోకాళ్ళ నొప్పులు మొదలయినాయి. మోకాళ్ళ నొప్పుల కోసము మందులు మొదలు పెట్టినాడు. ముందు కాస్త తగ్గినట్లు అనిపించింది. తరువాత మామూలే. తిరిగి మందుల మోతాదు పెంచ వలసి వచ్చింది. విపరీతముగా నొప్పులకు మాత్రలు వాడితే మూత్ర పిండాలు దెబ్బ తింటాయని స్నేహితులు  చెప్పినారు.  దీనితో ఏమి చేయాలో తెలియ లేదు.
సెలవు రోజుల్లో ఒక స్నేహితుడి పిలుపు పై శివాలయానికి వెళ్ళినాడు. దర్శనము అయిన తరువాత  అక్కడ గుడిలో ఉన్న ఒక స్వామిని దర్శించుకున్నారు. ఆయన పేరు స్వామి శివానంద. తన సుదీర్ఘ తీర్థ యాత్రలలో ఆ రోజు అక్కడ ఉన్నారు. ఇద్దరినీ కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు వేసినారు. తన స్నేహితుడు మాట్లాడడము అయిన తరువాత  తను కూడా మాట్లాడదామనుకుంటూ తటపటాయించినాడు.  ఆయనే  “ఏమిటో అడగాలనుకుంటున్నట్లు ఉన్నావు. అడుగు బాబూ!” అన్నారు.
రాజు తన సమస్యను వివరించినాడు. “స్వామీజీ! ఇది మొదట నా తిండితో మొదలయిందని అనుకుంటున్నాను. పెద్ద సమస్య అయింది.”
“ఒక్క నిముషము బాబూ! నీకు వృకోదరుడు ఎవరో తెలుసా?”
“భీముడి పేరు కదా స్వామీ!”
“ఆ పేరుకు అర్థము తెలుసా?”
“వృకము అంటే తోడేలు కదా స్వామీ! అంటే తోడేలు పొట్ట లాంటి పొట్ట కలిగిన వాడు కదా.”
“ఎక్కడయినా ఎప్పుడయినా తోడేలు  పొట్టను చూసినావా?, తోడేలు బొమ్మలలో అయినా.”
“బాగా పొట్ట లోపలికి  ఉంటుంది కదా.”
“ అంతే కాదు. తోడేలు  బాగా తిండి పోతు. అయితే దానికి పొట్ట మాత్రము రాదు. నిజమేనా?”
“నిజమే స్వామీ!”
“ఎందుకో తెలుసా?”
“తెలియదు స్వామీ!”
“అది చాలా చలాకీగా ఉంటుంది. చాలా వేగముగా పరుగిస్తుంది. బాగా అలసి పొతే తప్ప విశ్రాంతి తీసుకోదు. అందు వలన తిన్నదంతా ఆరగి రక్తములో కలుస్తుంది. ఇక భీముడు కూడా పెద్ద తిండి పోతే. అయితే అందుకు తగ్గట్టుగా భౌతిక పరిశ్రమ చేస్తాడు. అందు వలననే భీముడికి కూడా పొట్ట ఉండదు. ఇక మన సినిమాల్లో భీముడిని పెద్ద పొట్టతో చూపిస్తున్నారంటే అది మన దర్శకుల అవివేకము.
“మనకు ఒక పరికరముంటే దానిని వాడవలసిన పద్ధతిలో లోపము ఉండకూడదు. భగవంతుడు ఇచ్చిన ఈ దేహము కూడా అటువంటిదే.”
“మొదట్లో ప్రతిదానిని కష్టపడి సంపాదించుకొనే వాడు ఎక్కువగా తిన్న ఆహార పదార్థములు జీర్ణమయి  శక్తిగా మారి,  వృధా  పదార్థములు స్వేదము, మలము రూపములో బయటికి వచ్చేవి. అందు వలన అనారోగ్యముండేది కాదు.”
“ఇంకా మనుషులకు ఆహారము అంటే భౌతిక పదార్థమే కాదు. ఆలోచనలు కూడా ఆహారమే. మన ఋషులు చెప్పిన విషయాలను పట్టించు కోవడము మనకు పూర్తిగా పోయింది. వ్యాధులు మన ఆలోచనల ద్వారా కూడా వస్తాయని లూయీస్  ఎల్ హి చెప్పేటంత వరకు ఈ ఆధునిక కాలములో  ఆలోచనల ప్రభావము అర్థము కాలేదు.”
“కొంత మంది ఉంటారు. ఎంత తిన్నా సన్నగా ఉంటారు. మరి కొంత మంది  చాలా కొద్ది తిండికే లావు ఎక్కి పోతూ ఉంటారు. అందరికీ ఇలా ఉండదు. అంటే తిన్న ఆహారానికి వాళ్ళ దేహ భారానికి అన్ని వేళలా సంబంధము ఉండదు.”
“నా సమస్య అదే స్వామీ!”, రాజు అన్నాడు.
“నీవు నీలో పెంచుకున్న ఆలోచనల భారాన్ని వదిలించుకో.  లేక పొతే అది కూడా నీ భారాన్ని పెంచుతుంది. కొంత మంది ఆలోచనలను వదిలించుకోవాలని ఎక్కువ తింటారు. వారికి రెండు బరువులు కలుస్తాయి. మరి కొంత మంది ఆహార నియంత్రణ అంటే డైటింగ్ చేస్తారు. అయినా వాళ్లకు కూడా బరువు పెరగ వచ్చును.”
“మరి డైటింగ్ వలన చాలా మందికి బరువు తగ్గుతుంది కదా.”
“అందరికీ అలా తగ్గినట్లు ఋజువులు లేవు. మనస్సు భారము లేని వాళ్లకు పని చేస్తుంది. కానీ డైటింగ్ ఒక్కటే సరి పోదు. భౌతిక సాధన తో బాటు ఆధ్యాత్మిక సాధన కూడా అవసరమే.”
“మరి ఈ నాటి జీవన విధానములో మేము ఏమి చేయాలో చెప్పండి స్వామీజీ!”
“మనిషి తోటి మనిషిని సరిగా గౌరవించడము నేర్చుకోవాలి. ఇంకా సమ సమాజమంటే సంపదను అందరికి సమానముగా పంచడము కాదు. అలా జరిగితే క్రమ క్రమముగా ఏమీ పని చేయని సోమరికి కూడా సంపద అందుతుంది. కష్ట పడుటకు ఇష్ట పడనీ వారు కూడా సోమరులై సిద్ధాంత కర్తలవుతారు.  సోవియట్  దేశాలు కూలి పోవడానికి ఇదే ప్రధాన కారణము.  సామర్థ్యమున్న ప్రతి వారికి సంపాదించు కొనే అవకాశము ఉండాలి. ప్రతి యొక్కరికీ వారి కున్న తత్వమును అనుసరించి వేరు వేరు వృత్తులలో శిక్షణను ఈయ వలసి ఉంటుంది.”
“మరొక్క విషయము సంస్కారము. ప్రతి వ్యక్తీ ఎల్లప్పుడూ సత్య మార్గములో నడవాలి. అంటే విశ్వసనీయుడుగా ఉండాలి. శీలవంతుడిగా ఉండాలి. స్తేయ బుద్ధి ఉండకూడదు. అంటే తనది కాని దానిని తను ఆశించకూడదు.”
“సంపాదన అంతా తమకే కావాలని పని చేసే వాళ్లకు, నాలుగు రూకలు పడేస్తే పని చేస్తారు అనుకొనే యజమానికి తేడా లేదు. అటువంటి యజమాని, యజమాని స్థితికి మించి జీతాలు కోరుతున్న ఉద్యోగి ఇద్దరూ దొంగలే. ఒకరి మీద ఒకరికి విశ్వాసము ఉండాలి. ఈ విశ్వాసము పోయినపుడు వచ్చే పరిణామాలు మొత్తము వ్యవస్థనే కూల్చి వేస్తాయి.”
“ఈ సమయములోనే సాంకేతికత లేదా టెక్నాలజీ కొత్త  దారులు పట్టినది. విద్యుత్తూ సరికొత్త ప్రకంపనాలను తీసుకొని వచ్చింది. నూనె దీపాలు వెలిగించ వలసిన అవసరము పోయింది. బటన్ నొక్కితే దీపము వెలుగుతుంది. బటన్ నొక్కితే గాలి వీస్తుంది. ఈ విధముగా ప్రకృతి నుండి వచ్చే వెలుతురుకు గాలికి దూరమయినాడు. పొలాలలో పని చేయుటకు మనుషులు దూరమయినారు. దుక్కి చేయుటకు ట్రాక్టర్లు రంగ ప్రవేశము చేసినవి. ఇప్పుడు పదిమంది చేసే పని ఒక్కడు చేస్తున్నాడు. ఇంట్లో పిండి రుబ్బ వలసిన అవసరము కూడా పోయినది. ఆ పనిని యంత్రము పది నిముషాలలో పూర్తీ చేస్తుంది.”
“ఇదంతా మనిషి సుఖ పడతానికే.అయితే మనిషికి ఇంతకు ముందు ఉన్న ఖాళీ సమయము కూడా లేకుండా పోయింది.”
“ఇంతకూ ముందు మంచి శ్లోకాలు, పాటలు , పద్యాలు పాడుకొనే ఖాళీ ఉండేది. మంచి గ్రంథాలు చదువు కొనే వాడు. కూలీ పని చేసే వాడు కూడా చక్కటి పద్యాలు చదవ గలిగే వాడు. తరచుగా దేవాలయాలకు వెళ్ళే వాడు. అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో  తరచుగా పాల్గొనే వాడు. ఇప్పుడు అన్నీ పోయినాయి. ఉదయము నుండి మనిషికి కొద్ది ఖాళీ కూడా లేదు. అతని సమయాన్ని అంతా దూర దర్శినులు/విడియోలు ఆక్రమించి వేసినాయి. ఇపుడు ఇంట్లో పని తగ్గింది. కానీ, ఖాళీ లేదు.”
“ఇంతకూ ముందు విద్య అంటే సాధనతో కూడి ఉండేది. సత్యం వద. సత్యాన్నే పలకాలని చదివిన వారు ఎప్పుడూ సత్యాన్నే పలికే వారు. ఇప్పుడలా కాదు. చదువు వేరు, జీవితమూ వేరు. సత్యము చెప్పాలనేది చదువు లేదా ఉత్తీర్ణ పత్రము కొరకు, సత్యము చెప్పేది లేనిది జీవితమూ కొరకు. అందుకే మనిషి నటిస్తున్నాడు, జీవించుట లేదు. ఇంకా వ్యాపారములో అబద్ధాలు లేకుండా ఎలా కుదురుతుందనే వారు ఉన్నారు.”
“నిజమే స్వామీ! అబద్ధాలు చెప్పకుండా ఎలా వ్యాపారము చేయాలంటారు నా స్నేహితులు. లాభాలు రావాలంటే సరకు బాగా లేకున్నా అది అద్భుతముగా ఉందని అబద్ధాలు చెప్పాలి.”
“ఇది మనము కొత్తగా నేర్చుకున్నది. విశ్వాసము కావలసిన చోట సత్యముండాలి. సత్యమును ఎవరిని నొప్పించకుండా చెప్ప గలిగే నేర్పు కూడా ఉండాలి. సత్యమును చెబితే నష్ట పోతాయన్నది ఆధునిక సంస్కృతీ. ప్రాచీన కాలములో అబద్ధాలు చెప్పి ఎవరూ వ్యాపారము చేయ లేదు. ఇంకా సత్యానికి బద్ధులయిన వారు యుగ పురుషులు ఆదర్శ ప్రాయులయినారు.”
“ఇంక జీవితములో మరో కోణము ఉంది. సూర్యుడు ఎప్పుడయినా ఆలస్యముగా ఉదయించినాడా?”
“లేదు స్వామీ!”
“ఆయనను చూచి పనులు చేసే మనము ఉదయాన  ఎనిమిది లేక తొమ్మిది గంటలకు కూడా నిద్ర లేవడము లేదు.”
“మరి రాత్రి ఎక్కువ పని చేయ వలసి ఉంటున్నది”
“రాత్రి సమయానికి విశ్రమించి, ఆ పనిని ఉదయాన్నే చూచుకోవచ్చు కదా. అయినా త్వరగా లేస్తామో లేదో అన్న భయము మీలో ఉంది.”
“ఇంకొక విషయమున్నది. మన ప్రకృతి పంచ భూతాత్మకము. ఈ ప్రక్రుతి తో చేయ బడిన  మన దేహము కూడా పంచ భూతాత్మకము. అంటే పంచ భూతములతో చేయ బడినది.”
“భూతములంటే  ఏమిటి స్వామీ?”
“మన ఋషులు ఈ ప్రకృతి అయిదు స్థితులలో ఉన్నట్లు ఒక్కొక్క స్థితికి ఒక్కొక్క లక్షణము ఉన్నట్లు  గ్రహించినారు. మొదటిది పృధ్వీ స్థితి. ఘన రూపములో నిర్మాణము ఉపయోగ బడే స్థితి. రెండవది జల స్థితి, ద్రవము వలే నుండు పదార్థమునకు సంబంధించిన స్థితి. మూడవది అగ్ని. ఇది ప్రతి చర్యకు ప్రేరేపణ  కలిగించే స్థితి. నాల్గవది స్పర్శను కలిగించే వాయు స్థితి. ఇక అయిదవది మనలను విశ్వానికి అనుసంధానించే ఆకాశ స్థితి.”
“ఇక భూతము అంటే దయ్యము లాటిది అని కాదు. అతి ప్రాచీన కాలమునుండి మనిషి పరిణామానికి ఉపయోగ పడే మూల పదార్థము. అందుకే పరిణామము కావాలంటే దేవతలయినా ఈ మూల పదార్థములను ఉపయోగించి జీవించాల్సిందే. అంటే మానవులుగా పుట్ట వలసిందే.”
“ ఈ స్థితులను అనుసరించే మానవుడి దేహములో అయిదు తత్వాలు ఏర్పడినాయి.    పృధ్వీ స్థితి  నిలకడను ఇస్తుంది. ఇది సరిగా లేని వాడు ఎక్కడా స్థిర పడ లేడు. ఇది పెరగాలంటే  మనకు భూమితో స్పర్శ లేదా సంబంధము ఉండాలి. జల స్థితి లేని వారికి తక్కువ స్థాయి కళాత్మకమయిన పనులు చేయ లేరు. అగ్ని తత్త్వము లేని మనిషి క్షీణించి మరణిస్తాడు. సముద్రము, నదులు మరియు కొండలనుండి వీచే గాలులు వాయు స్థితిని పెంచి  ప్రేమానుభూతులను పెంచుతాయి. ( పైకి చూస్తూ) ఈ ఫాన్ల  గాలికి అంత శక్తి లేదు. ఇంకా ఆకాశ స్థితి ఉన్నతమయిన సృజనాత్మకతను పెంచుతుంది. ఉన్నతమయిన తలాల నుండి జ్ఞానమును అందుకోవాలంటే, ఆకాశ తత్త్వము పుష్టిగా ఉండాలి.  ఈ అయిదు తుల్య స్థితిలో ఉన్న వ్యక్తికీ ప్రకృతి గురుత్వము వహిస్తుంది. శిష్యుడుగా ఋజువు చేసుకున్న వాడు   దైవీ తలాలను దాట గలుగుతాడు.”
“అయితే స్వామీ! మనిషి ఎందుకు మరో రకముగా తయారు అవుతున్నాడు?”
“అదే సమస్య. ఇంతకూ ముందు తోటలలో, నదీ పరిసరాలలో మట్టి నేల మీద నడిచే వాడు. ఈ విధముగా భూమితో సంబంధము ఉండేది. ఇప్పుడు తిరిగే కొద్ది సేపు కూడా పాద రక్షలతో, బూట్లతో నడుస్తూ  పృథ్వి తో సంబంధాన్ని తెంపుకున్నాడు.
నెల, నెలా అమావాస్య , పూర్ణిమ లేదా పర్వ దినాలలో నది, లేక సముద్ర స్నానాలను చేసే వాడు. అది కూడా ప్రకృతి మీద  గౌరవముతో చేసే వాడు. ఇప్పుడు ఆ అలవాటు తగ్గి పోయింది. పొలాల మధ్య ఈ నాడు నడవాలంటే భయము. పొలాల్లో చల్లబడిన విష పదార్థాల దుర్వాసనను భరించ లేము. వేగముతో కూడిన జీవన విధానము వలన బయట ఆకాశము క్రింద ఆనందించే సమయము తగ్గిపోయింది. ఆకాశ తత్త్వము క్షీణించినది. భౌతిక సంపదను పెంచుతున్నాడే కాని, ఆధ్యాత్మిక పరిణతికి అవకాశము పోగొట్టుకున్నాడు. “
“జీవితమూ అంతా సంపదను పెంచుకోనుటే గాక మానవీయ లక్షణాలను పోగొట్టుకుంటున్నాడు. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అన్న యావతో తన్ను తాను మరచి పోయినాడు. తృప్తి లేక  శాంతి లేక మనిషి ఒక యంత్రముగా పని చేస్తున్నాడు. హృదయ  స్పందన లేని మనిషికి యంత్రానికి తేడా లేదు. రాబోయే రోజుల్లో యంత్రాలు పాలిస్తాయంటే, అవి రోబో లే కానక్ఖర లేదు. అటువంటి హృదయ స్పందన లేని మనిషి కూడా కావచ్చును. ఏమయినా యంత్రాలు తయారయినట్లు మనుషులు తయారు అవుట లేదు.”
“ప్రకృతి దీనిని ఎదుర్కొనుటకు ఏమి చూస్తుందో మనమే చూద్దాము.”
 ఓం  స్వస్తి.
  


No comments:

Post a Comment