Saturday, March 25, 2017

రెండు చిలుకలు 3



 “ఏమండీ! మన వాళ్ళలో ఇలా ఎవరూ నిర్ణయము తీసు కోలేదు. నేను ఏదో తొందర పడినానేమో  యని అనిపించింది. ఈ అమ్మాయి మనలో ఇమడ గలదా? ఇదే నాకు భయముగా ఉంది.” శ్యామలమ్మ నెమ్మదిగా అన్నది.
“మొదట్లో నీ అనుమానము నాకూ అనిపించినది. నేను విడిగా అమ్మాయితో మాట్లాడినాను. అమ్మాయి చాలా మంచిది. ఇలా నిర్ణయము తీసుకోడానికి అమ్మాయికి ఏవో కారణాలు ఉంటాయి. మరొక మాట కూడా చెబుతాను. నీవు  ఏమీ కంగారు పడ వలసిన అవసరము లేదు. ఈ సంబంధము శివయ్య నిర్ణయించినది. ఆ అమ్మాయి మన ఇంటికి వెలుగు తెస్తుంది.” లింగయ్య గారు చెప్పినారు.
ఇంక తరువాత అన్నీ పద్ధతిలో నడిచినాయి. లింగయ్య గారికి , శ్యామలమ్మకు అమ్మాయి నచ్చింది.
తరువాత అన్నీ వరుసగా శుభాలే జరిగినవి. అమ్మాయి నచ్చింది రాముకే కాదు, అమ్మా నాన్నలకు కూడా నచ్చింది. మే  నెలలో  తన పరీక్షలు కాగానే సరోజ తల్లి తండ్రులు పైనాంపురము వచ్చినారు. ఇరువురు దంపతులు కబుర్లు చెప్పుకున్నారు. వివాహాన్ని నిశ్చయము  చేసుకున్నారు. మరో నెలలో రాముకు సరోజకు పెళ్లయింది. అప్పుడే రాముకు తెలిసింది, సరోజకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడని. డిల్లీ లో ఒక ప్రైవేట్  కంపెనీ లో పని చేస్తున్నాడు. పెళ్లి కూడా అయింది. భార్య డిల్లీకి సంబంధించిన అమ్మాయే. పేరు నందినీ చతుర్వేది. హిందీ తప్ప తెలుగు రాదు. పెళ్ళయిన తరువాత తనను నందిని అనే పిలుస్తున్నారు.
పెళ్లి తరువాత సరోజ పైనాంపురము వచ్చేసింది. తన నాన్నగారు” సరోజ ఇటువంటి ఊర్లో ఎలా ఉంటుంది, నెల్లూరు లో ఇల్లు తీసుకుని కాపురము పెట్ట వచ్చును కదా” అని  యనుకున్నాడు. ఆ మాటకు భార్య ద్వారా చెప్పించాలని అనుకున్నాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు.  వారి విషయములో వేలు పెట్టడము తప్పని చెప్పింది. ఇంకా కోడలు నందిని ద్వారా చెప్పించినాడు. ఆ సలహాకు సరోజకు చాలా కోపము వచ్చింది. కోపమును అణచుకొని  నెమ్మదిగానే “ మా ఆయన పని చేయాలంటే ఆయన  తల్లిదండ్రులు ఎప్పుడూ సంతోషముగా ఉండాలి. వారికి కష్టము కలిగించే పని ఏదీ  నేను చేయను.” అని చెప్పింది. ఇంకా వాళ్ళు మాట్లాడ లేదు.
అంతా వెళ్లి పోయినారు. ఇంకా ఇంట్లో నలుగురు మాత్రమే ఉన్నారు. ఇంక అత్తగారిని వంట చేయ నీయడము లేదు. కానీ చిన్న పనులు మాత్రము చేయ నిచ్చేది. ఎందుకంటే తనకు కూడా కాస్త  కాలక్షేపము కావాలి కదా. పని వాళ్ళను పిలిచి ఇంటి చుట్టూ కాస్త శుభ్రము చేయించి పూల మొక్కలు వేసింది. అవసరమయితే బయటనుండీ మొక్కలను తెప్పించింది. రోజూ వాటికి వీలయినంత వరకూ తనే నీళ్ళు పోయడానికి ప్రయత్నమూ చేసేది. కానీ రైతులు ఆ అవకాశము పూర్తిగా ఇచ్చే వారు కాదు.  ఇంకా కూర గాయాలు లాటివి కూడా వేయించింది.  అత్త గారూ మామగారూ ఆ పనిని చూచి మురిసి పోయినారు.
ఇంకా మామ గారికి పూజకు ఇతర కార్య క్రమాలకు అన్నీ అవసరాలకూ తనే చూచుకొనేది. ఒక రోజు అత్తగారికి చాలా కోపము వచ్చింది.” మా ఆయన పనులన్నా చూడక పొతే నాకేమి తోస్తుంది?” అని యన్నది.  ఆ మాట భర్త తో అంటే, “పోనీ  లేవే? మనకు కోడలు కానీ కూతురు గానీ ఆ పిల్లే కదా!” అని యన్నారు. ఈ తోట పనుల వలన తనకు ఊళ్ళో చాలా మంది పరిచయము అయినారు. అందరూ తోట చూడడానికి వచ్చి కాలక్షేపము చేయాలని చూచే వారు. కానీ తన పనికి ఎ అడ్డము లేకుండా చూచుకొనేది. ఊళ్ళో తన గౌరవము కూడా పెరిగింది.
సరోజ తెలుగు బాగా మాట్లాడుతుంది. కానీ తను డిల్లీ లో చదువుకున్నందు వలన చదవడము వ్రాయడము వచ్చేది కాదు. చాలా కష్టపడి అది కూడా నేర్చుకుంది.
ఒక రోజు లింగయ్య గారు,”అమ్మా౧ సరోజా! కాస్త భాగవతము పద్యాలు చదివి వినిపిస్తావా?” అని యడిగినారు. సరోజకు గుండెల్లో రాయి పడినట్లు అయింది.  ఏదీ తనకు చేత కాదు అనే అలవాటు తనకు లేదు. బిక్క ముఖముతో,”తప్పకుండా మామయ్యా గారూ! కొద్ది రోజులు సమయము ఇవ్వండి.” అన్నది. ఆయనకు అర్థమయింది. రాము సాయంత్రము నెల్లూరునుండి, ఊరికి వచ్చేస్తున్నాడు. తనముందు తను రోజూ పద్యాలు చదివి సరి చేయించు కొనేది. కొన్నాళ్ళ తరువాత తనే వెళ్లి కొన్ని పద్యాలు చదివి వినిపించినది. దీనితో తెలుగు సాహిత్యము మీద దృష్టి మళ్ళింది. ఇంట్లో ఉన్న గ్రంథాలన్నీ తిరగ వేసేది  అనుమానాలన్నీ మామయ్య గారి దగ్గిర తీర్చుకోనేది. ఈ విధముగా ఆయనకు మంచి కాలక్షేపము ఏర్పడింది.
ముందు సంవత్సరము రాముకు రెండవ స్థానము వచ్చినట్లే తనకు కూడా రెండవ స్థానము వచ్చింది. ఇద్దరూ కలిసి పతకము తీసుకొనుటకు తిరుపతి వెళ్ళినారు. మిత్ర బృందమును అందరినీ కలిసి వచ్చినారు.
    ----------------------------------------
ఎంత పని యున్నా సాయంత్రము రాము వస్తే చాలా హడావుడి పాడేది. ఇంకా  ఏమి చేయాలి అని ఆలోచించేది.
యమ్ యస్స్సి. లో తన మార్కు చూచి కొన్ని కాలేజీలలో తనను ఉపయోగించుకోవాలని నెల్లూరు నుండి వచ్చినారు. వాళ్లకు తన పని యంతా చూపించి ఇంక చేయ లేనని చెప్పింది. అత్తగారు అడిగితె,”మిమ్ములను చూచుకోవడము నా ప్రథమ భాద్యత. అంతకు మించి నాకు ఏమీ అక్ఖర లేదు. నేను సంపాదించ వలసిన అవసరము ఉందంటారా?” అని అడిగింది. అట్లా యని తన సబ్జెక్ట్ ను వదిలి పెట్ట లేదు మంచి ఫిజిక్స్ పుస్తకాలు దొరికితే పేజీలు  తిప్పేది. రోజూ అన్ని విషయాలతో బాటు రాముకు ఫిజిక్సు బోధనలో అనుభవాలన్నీ తెలుసుకొనేది. రాము తన ఫిజిక్స్ అనుభవాలన్నే చెప్పే వాడు. అటువంటి మనస్తత్వాన్ని తను ఎప్పుడూ తన నాన్న లో చూడ లేదు. అప్పుడప్పుడు తను ఎంతో అదృష్ట వంతురాలనని అనిపించేది. తన అదృష్టము మీద తనకే గర్వము వేసేది. తన ఇష్ట దైవమయిన కృష్ణుడికి తను  కృతజ్ఞతలు చెప్పుకొనేది.
సెలవులు వస్తే ఒక సారి కాటేపల్లి శివాలయానికి ఎడ్ల బండి కట్టించుకొని వెళ్ళినారు. అత్త గారిని, మామగారిని గుడిలో ఉంచేసి, సముద్రానికి వెళ్ళినారు. అప్పుడు సముద్రము ముందు ఎత్తయిన ఇసుక గుట్టలు ఉండేవి. పెద్ద వాళ్ళయితే కాస్త ఇబ్బంది పడ వలసి వస్తుంది. రాము తను చేతులు పట్టుకుని ఎక్కి దిగే వారు. అక్కడే రాము తనకు నక్కేరు పండ్లు కోసి ఇచ్చినాడు. తనకు అవి అసలు తెలియవు. అవి నోట్లో వేసుకుంటే చెక్కు అదే ఊది పోయి బంక లాగా నాలుకకు అతుక్కొని పోయేది.  కానీ చాలా తియ్యగా ఉండేది. అంతే గాక కలే  పండ్లు , గోలిజ పండ్లు  ఇటువంటివి అన్నీ తను తింటూ నా చేత గూడ తినిపించే వాడు. ముందుకు వెళ్లి సముద్రము ముందు కూర్చున్నాము. స్నానానికి ఏమీ తెచ్చుకోనందుకు నేను ప్రత్యేకముగా ఎంతో బాధ పడ్డాను. రాము, ”ఏముంది? స్నానానికి ఇంకో సారి వద్దాము అన్నారు.” సముద్రపు అలలను చూస్తుంటే అందులో ఎన్నో జన్మల చరిత్ర దాగి ఉందని అనిపించింది. ఒక్క గంట కూర్చున్న తరువాత “ ఇంకా ఆలస్యము చేస్తే అత్తయ్య గారు కంగారు పడతారు. లేవండీ” అని ఆయనను లెవ దీసినాను.  మళ్ళీ ఇసుక దిబ్బలు ఎక్కుతూ దిగుతూ  గుడికి వచ్చేసినాము. సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరినాము.
డిల్లీ లో ఎన్నో చోట్ల తిరిగినాను. కానీ ఈ విధముగా ప్రకృతికి దగ్గిరగా తిరిగిన ఆనందము నాకు ఇంత వరకు కలుగ లేదు. అదే మాట రాముకు చెప్పినాను.
మరో సారి నెల్లూరిలో వేణు గోపాల స్వామి, మూల స్తానేశ్వరుడు, రంగనాయకుల స్వామి దేవాలయాలకు వెళ్లి రావాలనుకున్నాము. రాము అమ్మా నాన్నలను కూడా పిలిచినాడు. అత్తయ్యగారు, ”రామూ! నెల్లూరు చుట్టుప్రక్కల అన్నీ చూచినాము. ఆ పిల్లకు నీవు అన్నీ దగ్గిర ఉండి చూపించు నాయనా!” అని ప్రేమగా చెప్పింది. అలా తిరుగుతున్నంత సేపూ చాలా హుషారుగా ఉండేది.
రంగ నాయకుల స్వామి ఆలయాన్ని చూచినాము. వెనుకనే  తిక్కన సోమయాజులు వ్యాస భారతములో పదిహేను పర్వాలను కమ్మని తెలుగులో వ్రాసినాడుట.  శివ కేశవులకు తేడా లేదన్నట్లుగా ప్రక్కనే ఉన్న వేణు గోపాల స్వామి ఆలయము, మూల స్థానేశ్వర ఆలయము, శివాలయానికి ఎదురుగా బ్రహ్మాండమయిన వినాయకుడి విగ్రహము, అక్కడ నుండీ కదలాలని అనిపించ లేదు.  నెల్లూరుకు పడమట వైపు పినాకిని ని దాటితే పరాశక్తి  జొన్న వాడలో కామాక్షమ్మగా వెలిసిన చోటు. గ్రహ బాధలు ఉన్న వారు అక్కడ నిద్ర చేస్తారుట. అక్కడ నిద్ర చేసిన గ్రహ ఆవేశము  ఉన్న వారు రాత్రి అయేసరికి,”అమ్మా! కామాక్షమ్మా! మమ్ము వదిలి పెట్టమ్మా! మేము వెళ్లి పోతామమ్మా!” అని కేకలు వేస్తారుట.  ఉదయానికి వారికి అంతా నయమై పోతుందట. ఏ ఆధునిక మనస్తత్వ  శాస్త్రజ్ఞుడికీ అర్థము కాని విషయమది. ఆ విగ్రహానికి యంత్ర ప్రతిష్టాపన ఆది శంకరాచార్యులు చేసినారుట.
నేనెంత అదృష్టవంతురాలిని? అన్నీ తీసుకొని వెళ్ళడమే కాదు. అన్నీ విశేషాలు  రాము వివరించి చెప్పే వారు.
అక్కడే ఒక సాధువు కనిపించి దగ్గిరకు పిలిచినాడు. దక్షణను ఇమ్మన్నాడు. తీసుకున్న తరువాత, “మీరు చాలా అదృష్ట వంతులమ్మా! ఇద్దరూ కలిసి చాలా మంచి పనులు చేస్తారు. అయితే.....” అని ఆపినాడు.
“చెప్పండి స్వామీ! ఏమవుతుంది?” సరోజ కంగారుగా అడిగింది.
“మధ్యలో మీకు తెలియని అర్థము కాని పరిస్థితుల వలన అబ్బాయికి దూరమవుతావు. నీ పరిస్థితి ఏమిటో నీకే అర్థము కాదు. శని చాలా క్రూరముగా చూస్తున్నాడు. అమ్మను నమ్ముకో. ఏ నాడూ ఆమెను మరవ  వద్దు. అంతా పోతుంది. ఆ తరువాత అంతా సంతోషమే.” అని నెత్తి మీద చేయి పెట్టినాడు. ”ఎవ్వరికీ చెప్ప వద్దు ఈ విషయాన్ని.” అని యన్నాడు. కళ్ళు మూసి తెరిచే లోగా ఆ సాధువు అక్కడ లేడు.  ఆత్రముగా గుడి అంతా తిరిగింది. ఏడుపు ముఖముతో అక్కడే నిలబడింది. “ ఎప్పుడూ వర్తమానములో ఉంటే అంతా మంచి జరుగుతుంది. కంగారు పడ వద్దు.” రాము చెప్పినాడు. తిరిగి వెనక్కు వచ్చినారు.
          ----------------------------------
శ్రీ శైలము వెళ్ళినారు. తల్లిని తండ్రిని వెంట తీసుకొని వెళ్ళినారు.  శ్రీ మల్లికార్జునుడు, భ్రమరాంబికల  వైభవము మనసులో నిలిచి పోయింది. ఇంటికి వచ్చిన తరువాత తను గర్భవతి యని తెలిసింది.  అత్తయ్య గారు తనను  విశ్రాంతి తీసుకోమంటారు. కానీ తను అందుకు అంగీకరించా లేదు. శివాజీ గర్భములో ఉన్నపుడు  తన కుమారుడు పరాక్రమ వంతుడు కావాలని  జిజియా బాయి కొండలను ఎక్కి దిగి ఎంత కష్ట పడేదో తను చెప్పేది. అప్పటికీ కొంత విశ్రాంతి తప్ప లేదు. మామయ్యా గారు రోజూ సరస్వతీ మంత్రముతో పవిత్రము చేయ బడిన తీర్థమును ఇచ్చే వారు. అంతే కాదు ఆరోజుల్లో రోజూ క్రమము తప్పకుండా పోతనామాత్యుని భాగవతమును చదివించే వారు.  ఇంకా రాము ఇంట్లో ఉన్నంత సేపూ తన చుట్టూ తిరుగుతూ ఉండే వాడు. సరోజ యొక్క తల్లి దండ్రులు అన్నయ్య వదినలు సీమంతానికి వచ్చి నారు. కాన్పుకు తనను డిల్లీ తీసుకొని వెళ్తానని అమ్మ అంటే తను ఒప్పుకోలేదు. అత్తయ్య గారు చెప్పినా ఒప్పుకోలేదు. ఇక్కడున్న పవిత్రమయిన వాతావరణాన్ని వదిలి పెట్టి వెళ్ళదానికి తను ఇష్ట పడ లేదు.
జొన్న వాడలో సాధువు చెప్పిన మాటలను అనుసరించి రోజూ లలితా అమ్మవారికి పూజ చేసుకొనేది.
మొదటి కాన్పులో ఆడ పిల్ల పుట్టింది. రాము, వాళ్ళ నాన్న గారు ఆ పిల్లకు చదువుల తల్లి పేరున “శ్రీ వాణి “ అని పేరు పెట్టినారు. దిల్లీ నుండీ అందరూ వచ్చి చూచి వెళ్ళినారు.
పాపకు రెండు సంవత్సరాలు రాగానే తిరిగి గర్భవతి అయ్యింది. ఈ సారి మామగారు గాయత్రి మరియు లలితా మంత్రాలతో మంత్రించిన జలాన్ని రోజూ ఇచ్చే వాడు. ఈ సారి పుట్టిన పిల్లకు “రాణి షంయుక్త “ అనే పేరు తనకు పెట్టాలని అనిపించింది. అలాగే పేరు పెట్టినారు.
ఇద్దరు పిల్లలతో కాస్త పని పెరిగింది.అత్తగారు లేక పొతే తను న్యాయము చేయ గలనా యన్న భావన వచ్చేది. అందుకే రోజూ అత్తా, మామలకు మనస్సులో నమస్కారము చేసుకొనేది. రాము కూడా వీలయినంత సాయము చేస్తుండే వాడు.
                        --------------------------------------
ఋతువులు మారుతున్నాయి. జీవితాలు మార్పుకు సిద్ధమవుతున్నాయి. ఆ రోజు ఆది వారము. ఉదయాన్నే లింగయ్య గారు లేచి కూర్చున్నారు.
“ అమ్మాయ్ వాణీ! అందరినీ ఒక సారి పిలవమ్మా!” ఉదయాన్నే ఆయన అలా అనేసరికి అందరికీ ఆశ్చర్యము వేసింది.
వాణి,  రాణి  లను  దగ్గిరకు పిల్చి నెట్టి మీద చేయి బెట్టి  ఆశీర్వదించినాడు. “ఎప్పుడూ అమ్మా, నాన్న  మాటలను వినాలమ్మా!” అని యన్నారు.
ఇంకా సరోజ రాములను దగ్గిరకు పిల్చి, తల మీద చేయి పెట్టి ఆశీర్వదించినాడు. సరోజ తో, “నిన్నొక సారి నీ నక్షత్రము గురించి అడిగినాను. నీది కన్యా రాసి. శని సింహ రాశిలో ప్రవేశించిన తరువాత నీకు విపరీతమయిన ఒత్తిడి వస్తుంది. అందరూ నిన్ను నిందిస్తారు. కానీ, నీ తత్త్వము నాకు తెలుసు తల్లీ! జగన్మాతను నమ్ముకో. అంతా చక్క బడుతుంది.” అని అన్నాడు.
రాముతో, “రామూ! సరోజ నిన్ను వదలకుండా పట్టు పట్టి పెళ్లి చేసుకుందని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకు. పైకి తెలియక పోయినా ఆమె అంతరాత్మకు తన భర్త ఎవరో తెలుసు.  ఆమెకు తెలియదు. నీ కోసము డిల్లీ నుండి, తిరుపతి వచ్చి, అక్కడి నుండి, ఈ చిన్న ఊరికి కూడా వచ్చింది. మొదట్లో తనను అనుమానించాను. ఆ రోజు రాత్రి ధ్యానములో అంతా తెలిసింది. నీకు మరో విషయము చెప్పాలి. తను కష్టాలలో ఉన్నపుడు ఎవరు తనను ఏమన్నా  నీవేమీ చేయ లేవు. అది కాల పురుషుడి తీవ్రత.” కోడలిని పట్టుకొని,” కానీ ఏ నాడూ ఈ నా తల్లిని అనుమానించకు, నిందించకు. ఆ తరువాత నీ జీవితములో తన సహాయము వలన చాలా మంచి పనులు చేయ గలుగుతావు. గుర్తుంచుకో  నాన్నా!” అని యన్నాడు.
భార్యను పిలిచి,”శ్యామలా!  నాకు శివయ్యనుంది పిలుపు వచ్చింది. వెళ్లి పోతున్నాను. నీవు మరో మూడేళ్ళు ఉండాలి. పిల్లలను జాగ్రత్తగా చూచుకో.” అని యన్నాడు.
అందరికీ పరిస్థితి అర్థమయింది. అందరి కళ్ళల్లో నీళ్ళు కారి పోతున్నాయి. పిల్లలకు అర్థము కావటము లేదు. ఇంకా సరోజకు తన మామ గారు ఏ  స్థాయి వ్యక్తో తనను ఎంత ప్రేమించాడో తెలిసి తట్టుకోలేక పోయింది. ఆయన వళ్ళో తల పెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది.
“అమ్మా! సరోజా! ఏడవకమ్మా! నిన్ను అలా చూడ లేక పోతున్నాను. నేను నీ కోసము మళ్ళీ వస్తానుగా. వాణీ, రాణీ లకు తమ్ముడిగా వస్తాను. నీ ప్రేమను అప్పటి వరకు కాస్త దాచుకో తల్లీ!”

అందరినీ నవ్వుతూ పలకరిస్తూనే తల వాల్చి వేసినాడు. అందరూ ఏడుపులో మునిగి పోయినారు. ఇంటికి ఒక వెలుగు ఆరి పోయింది.
(To be continued)

No comments:

Post a Comment