Thursday, March 23, 2017

రెండు చిలుకలు 2



          రాము   సరోజ ఇంక తనతో కలిసే అవకాశము లేదనుకున్నాడు. తనకు ప్రేమలు అంటే నమ్మకము లేదు. అందుకనే ప్రతి సంఘటనను తన ఆలోచనలనుండి తుడిచి వేసినాడు. అయినా అప్పుడప్పుడు అవన్నీ తన ఆలోచనల లోనికి జొర బడేవి.
తను నెల్లూరు లో ఒక కళా శాలలో ఉపన్యాసకుడుగా చేరినాడు. ఫిజిక్స్  పాఠాలు చెబుతూ వాలతో బాటు తను కూడా ఆనందించే వాడు. నెల్లూరు లో ఒక గదిని అద్దె కు తీసుకొని వారాంతములో పైనాంపురము వెళ్ళే వాడు.
డిశంబరు నెలలో ఒక ఆది వారము తను ఇంట్లో కూర్చొని పరీక్ష పేపర్లు  దిద్దుకుంటున్నాడు. వాకిట్లో ఏదో సందడి. ఊరిలో పిల్లల హడావుడి వినిపించినది. ”ఏమిటా?” అని తను బయటకు వచ్చినాడు. అప్పుడే బస్సు దిగిందేమో సరోజ తమ ఇంటి వైపే వస్తున్నది. చుట్టూ పిల్లలు “ఈ ఇల్లే అక్కా!” అని చూపిస్తున్నారు.
అమ్మ కూడా వాకిట్లోకి వచ్చింది. సరోజను చూచి, ”ఎవరమ్మా! ఏమి కావాలి?” అని మాట పూర్తి చేసిందో లేదో ముందుకు వంగి పాదాలు ముట్టుకొని మళ్ళీ లేచి ,”నమస్కారం ఆంటీ” అని పలకరించినది. ఇంకా అమ్మ ఆ మర్యాదను చూచి మురిసి పోయిందేమో, ”లోపలి రామ్మా”  అంటూ పిల్చుకొని వచ్చేసింది. తన గుండె బేజారు అయింది.
లోపలి వెళ్లి మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చి అమ్మ కుర్చీ చూపించింది. ”కూర్చో అమ్మా!” అని చెప్పింది.
“మీ అబ్బాయికి  యూనివర్సిటీ లో  రెండవ  రాంక్ వచ్చిందండీ. నాకు అక్కడ  తెలిసింది. ఇంకా మీకు వ్రాయ లేదు. ఇంతకూ నేనెవరో చెప్పా లేదు కదా. నా పేరు సరోజ. మీ అబ్బాయికి జూనియర్నండీ.”
రాము ఈ మాటలు విని స్టన్ అయినాడు. ఇప్పుడు ప్రకటించినారా? సరోజ అబద్ధాలు చెప్పడం కూడా మొదలు పెట్టిందా?
“చాలా మంచి మాట చెప్పావమ్మా!  ఉండు నీ నోరు తీపి చేస్తాను.”  ఇంట్లోకి వెళ్లి ఒక బెల్లము ముక్క తెచ్చి నోట్లో పెట్టింది. అది అమాయకపు తత్త్వము.
“ఇంత మంచి వార్త చెబితే కూడా  కదల్రేమిటి?”  రాము వైపు చూచి అడిగింది. “మీ అమ్మగారు నాకు ట్రీట్ ఇచ్చినారు.  మీ నుండి ఒక మాట కూడా రాలేదు.”
“ఆ అమ్మాయికి థాంక్స్ చెప్పరా.” వాళ్ళమ్మ గదమాయించింది.
“థాంక్స్”,చెప్పి “అక్కడ అయి పోయింది. ఇక్కడ కూడా  దొరికి పోయినానా?” రాము చిరాకు ముఖము పెట్టుకున్నాడు.
వాళ్ళమ్మ  శ్యామల అడిగింది. “ఇది చెప్పడానికి ఇంత దూరము వచ్చినావా?”
“లేదాంటీ!. నెల్లూరు మా తాతయ్య గారి ఊరు.  అక్కడ నుండి ఇది దగ్గిరే కదా.”
“నెల్లూరు లో నీ బంధువులు ఉన్నట్లు  ఎప్పుడూ చెప్ప లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చారా ఏమిటి? లేక పొతే నన్ను వదల కూడదని తిరుపతి నుండే వస్తున్నావా?” పైకి అన లేదు. కానీ,  లోపలనే గొణుక్కున్నాడు. “తను ఏమి మాట్లాడితే ఎటు వెళుతుందో” అని నోరెత్త లేదు.
“ఇంతకూ మీ తాత గారు ఎవరమ్మా?” శ్యామల అడిగింది.
“దీపాల  రామ శాస్త్రి గారండీ.  వాళ్ళ అబ్బాయి కృష్ణ  శాస్త్రి గారు  మా నాన్న గారు. డిల్లీ  లో పని చేస్తున్నారు. ఇంక మా అమ్మగారు ప్రస్తుతము నాతోనే ఉన్నారు.”
బ్రాహ్మణులీ అన్న మాట. శ్యామల సంతోష పడింది.
“సరే, ఉదయాన్నే బస్సు ప్రయాణము. వాళ్ళంతా దుమ్ము దుమ్ముగా ఉంటుంది. కాస్త స్నానము చేసి రామ్మా.  టిఫిన్ చేద్దువు గానీ.” తనే వెళ్లి స్నానపు గది చూపించింది.
తను స్నానము చేసి డ్రెస్ మార్చుకుంది. తిరిగి హాల్లోకి రాకుండా వంటింట్లోకి దూరింది.
“ఇంతకూ ఏమి చేస్తున్నారు అంటీ!”
“ఉప్పు పిండి చేస్తున్నానమ్మా!”
“ఆంటీ! మీరు కాస్త ప్రక్కకు జరిగి కాస్త కబుర్లు చెప్పండి. ఉప్మా నేను చేసేస్తాను” ఆ చొరవకు శ్యామల ఆశ్చర్య  పోయింది.
“వద్దమ్మా! ఎదో చూడడానికి వచ్చిన నీతో పనులు చేయిచ్చేదా? ఇలా వచ్చి ప్రక్కన కూర్చో.”
“ఒక సారి అవకాశము ఇవ్వండి ఆంటీ!”
ఇంక  మాట్లాడ లేక శ్యామలమ్మ ప్రక్కకు తొలగి చెక్క బల్ల మీద  కూర్చుంది.
తన పనిలో చాకచక్యము చూచి ఆశ్చర్య పోయింది. ఉప్మా అయి పోయింది.
“రామ్మా! నీవు కూడా మాతో తిందువు” అంటే, “లేదాంటీ. కాస్త ప్రార్థన చేసుకొని వస్తాను. “ అంటూ ప్రక్కనే దేవుడి పటాల దగ్గిరకు వెళ్ళింది.
“అమ్మా! ఆకలిగా ఉంది.” రాము కేక వేసినాడు.
ఉప్మా తిని ,”చాలా బాగుందమ్మా!” అని యన్నాడు.
“నేను చేయ లేదు నాన్నా! తిరుపతి నుండి వచ్చిన మీ జూనియర్ చేసింది”
ఆ మాట విన్న రాముకు పొల మారింది. ఈ సరోజ అప్పుడే అమ్మను పట్టేసిండా? ఆశ్చర్య పోయినాడు. ఇంతలో లింగయ్య గారు, రాము నాన్నగారు వస్తూ, “శ్యామలా! మనింటికి ఎవరు వచ్చినారు?” అడిగినారు.
“రాము జూనియర్ ట అండీ! ఇంకా తిరుపతిలో చదువుతున్నదట. అయినా అమ్మాయి మహా లక్ష్మి లాగుందండీ. ఎంత చొరవో.”
“ఇంతకూ ఆ అమ్మాయి ఎవరుట?” అడిగినారు.
“”వాళ్ళ తాతయ్య గారు  నేల్లూరేనటండి. దీపాల రామ శాస్త్రి గారుట. నాన్నగారు డిల్లీ లో పని చేస్తున్నారుట.”
ఈ లోపల సరోజ బయటకు వచ్చింది. “ఉదయాన్నే వచ్చినానండీ!” అంటూ ముందుకు వంగి పాదాలు ముట్టుకుంది.
“చాలా మంచిదమ్మా!” అన్నారు ఆయన.
“ఆంటీ! మీరు ఏమి చేయాలో చెబితే మధ్యాహ్నము వంట నేనే చేసేస్తాను.”
“వద్దమ్మా! నేనున్నాను కదా. నీవు వచ్చిన తరువాత అబ్బాయితో మాట్లాడ లేదు.”
“ఆయన అంతే ఆంటీ! అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడడు.” ఒక చురక వేసి రాము వైపు చూచింది.
“నేనొక మాట చెబుతాను ఏమనుకోవు కదా!”
“చెప్పండి ఆంటీ!”
“ఏమీ లేదు. మీకు ఆంటీ అనేది అలవాటు. నాకు అలా పిలిపించుకోవడము ఎందుకో బాగులేదు. అమ్మా అని లేదా అత్తయ్య గారూ! అనో పిలువా రాదూ?”
“అలాగే, అత్తయ్యగారూ! అంతకంటేనా?”
బిత్తర పోవడము రాము వంతయింది.
ఇంకా శ్యామలమ్మకు ఈ అమ్మాయి కోడలయితే ఎంత బాగుంటుందో అనిపించింది.
“అత్తయ్య గారూ! మీ వూళ్ళో గుడులను చూపించరా?” నెమ్మదిగా అడిగింది.
“అదేం భాగ్యమమ్మా!  మా రాము ఉన్నాడు కదా! అన్నీ చూపిస్తాడు.”
రాముకు తెలిసింది. తను ఎంత దూరముగా ఉండాలనుకుంటే తను అంత దగ్గిరగా అవడానికి ప్రయత్నము చేస్తున్నది.
“రామూ! సరోజకు రామాలయము, మహాలక్ష్మమ్మ గుడి చూపించి తీసుకొని రారా.” ఆర్డర్ పాస్ అయింది.
రాముకు తప్పించు కోవడానికి దారి లేదు. ఇద్దరూ బయలు దేరినారు. ముందు ఊరి చివరలో ఉన్న గ్రామ దేవత మహాలక్ష్మమ్మ గుడికి వెళ్ళినారు. గుడి ముందు ఒక చావడి కూడా ఉంది. వెళ్లి ఇద్దరూ అమ్మ వారికీ నమస్కారము చేసినారు. మరో వంద అడుగులలో రామాలయము ఉంది. ప్రాకారము లోపలి వెళ్ళినారు. వెళ్తుంటే దారిలో ఒకరి మాట వినిపించింది,”చూడ ముచ్చటగా ఉంది జంట” అని. దర్శనము కాగానే పూజారి తీర్థము ప్రసాదము ఇచ్చినారు. శఠ గోపము పెడుతూ, ”రామూ! అమ్మాయి ఎవరు?” అని యడిగినాడు.
“మా బంధువుల అమ్మాయి” అని చెప్పినాడు,  తను తెలివిగా సమాధానమిచ్చానని అనుకుంటూ.
“మీకు వరసైతే అమ్మాయి బాగుంది నాయనా!”
ఈ వరస ఏమిటో రాముకు అర్థము కాలేదు. సరోజ మాత్రము ముసి ముసిగా నవ్వుకుంది.
రాము గుడి బయటకు వచ్చేస్తుంటే చేయి పట్టుకొని ఆపి, ”మీకు ఆ మాత్రము తెలియదా?” అని అడిగింది.
“ఏమిటి?” కంగారుగా అడిగినాడు.
“గుడికి వచ్చినపుడు కాస్సేపు కూర్చొని వెళ్లాలని తెలియదా?” అన్నది.
“అవును కదూ.” అంటూ అక్కడే కూర్చున్నాడు. సరోజ పక్కనే కూర్చుంది. ఎటూ తమ మీద బయట మాట వచ్చేసింది. అందుకే ధైర్యము కూడా వచ్చేసింది.
“ఏమండీ!”
“ఆ  ఏమిటి చెప్పు.”
“అలా మాట్లాడటము ఏమిటి? సరోజా అని పిలవ వచ్చు కదా! ఎటూ మీ ఆమ్మ గారు అత్తయ్య గారు అయినారు. ఇంకా మీకు బెరుకు ఎందుకు?”
రాము కాస్త మెత్త బడినాడు.
“అది కాదు సరోజా! నీవు నెల్లూరికి వచ్చి ఇక్కడికి వచ్చినావా? లేక నా కోసమే నేరుగా వచ్చినావా?”
“ఎంత అమాయకులండీ మీరు? ఆ మాత్రము అర్థము చేసుకోలేరా? నెల్లూరులో నా బంధువులు ఎవరూ నాకు తెలియదు. ఇంకా తాతయ్య గారు ఎప్పుడో వెళ్లి పోయినారు. మిమ్ములను చూడాలి అనుకుంటూనే ఆరు నెలలు గడిపి వేసినాను. నాలుగు రోజులు సెలవులు వచ్చినాయి  ఇంక మీ అడ్రస్ నాన్న గారికి ఇచ్చినారు కదా! ఇంక ఉండ లేక పోయినాను. అమ్మను బంధువుల ఇంటికి పంపి నేను ఇటు వచ్చేసినాను.” మాట చాలా హుషారుగా ఉంది.
“ఒక్క దానివే ప్రయాణము చేసినావా? భయము వేయ లేదా?”
“భయమెందుకు?”
“నేనంటే నీకంత ఇష్టమా?”
“ఈ ప్రశ్నకు నేను జవాబు ఈయ లేను. అక్కడ చదువుతున్న వారిలో మీకున్న స్వచ్చత, సభ్యత  వేరే ఎవరిలో కనిపించ లేదు. అమ్మాయి కాస్త మాట్లాడితే చాలు  కబుర్లు చెప్పుదామా? అనే వారే అక్కడ ఎక్కువ. ఆ శ్రద్ధ వారికి చదువులో లేదు. ఇంకా మీ విషయములో మీకున్న క్రమ శిక్షణ, నిబద్ధత నాకు ఏంటో నచ్చింది.”
“మరి నీవు ఎప్పుడూ అలా కనిపించ లేదే?”
మీరు నాకు మాట్లాడటానికి అవకాశము ఎప్పుడిచ్చారు మహానుభావా! నేను నిన్ను ప్రేమిస్తున్నానని  నేను చెబితే, నీవు ఎక్కడ మాయలో పడతావో అని, నీ లక్ష్యము చెదిరి పోతుందేమో అని భయ పడినాను. అదే సమస్య నాకు కూడా రావచ్చును. మనకున్న ప్రధాన లక్ష్యము మనము ఏమి చేసినా చెక్కు చెదర కూడదు. కానీ నిన్ను వదులు కో కూడదు. అందుకే నీ చుట్టూ తిరుగుతూనే నీ లక్ష్యము చెదర కుండా నడుచు కోవాలని, అనుకున్నాను. మీరు మీ అమ్మా, నాన్నల మీద చూపించే ప్రేమ భాద్యతలను చూచి, మీరు మీ జీవిత భాగస్వామిని కూడా అలాగే చూస్తారని అనిపించినది. మీ దగ్గిర నేర్చుకున్నంత ఫిజిక్స్  క్లాసులో నేర్చుకోలేక పోయినాను. అదే నన్ను క్లాసులో అందరి కంటే ముందు నిలబడేటట్లు చేసింది. కొన్ని పరిమితులు పెట్టుకుంటేనే జీవితములో విజయాన్ని సాధించ గలము.  ఇంకా నేను చేసినదొకటే, మీలో ఎటువంటి కలతను రేపకుండా మిమ్ములను నా వాడిగా చేసుకోవాలనుకున్నాను.”
“మా అమ్మా నాన్నలను ఎలా ఒప్పించ గలనని అనుకున్నావు?”
“మిమ్ములను చూస్తె వాళ్ళు ఎంత మంచి వాళ్ళో తెలిసి పోతుంది. కానీ ఏదో మొండి ధైర్యము నన్ను ఇలా చేయించింది.”
తనకు తెలియకుండానే సరోజ చేతిని తన చేతిలోనికి తీసుకున్నాడు. సరోజ కు ఒక వైపు సంతోషము మరో వైపు సిగ్గు కలిగింది. రాము అన్నాడు.
“”ఏమో నాకూ అనిపించింది. నా మీద నాకు ఎంత నియంత్రణ ఉన్నా కాస్త పని తగ్గితే నీవే కళ్ళ ముందు కనిపించే దానివి. ఈ విషయములో నీకున్న ధైర్యము నాకు లేదు.”
“మీకు మరొక్క విషయము చెప్పాలి.”
సరోజ అన్నది, ”చలాకీ గా, ఆకర్షణీయముగా తిరిగే అబ్బాయిలంటే నాకు చాలా కోపము. నా డిల్లీ జీవితములో ఇటువంటి వారిని చాలా మందిని చూచినాను. ఎవరికీ జీవితముపై నిబద్ధత లేదు. అందుకే ఎటువంటి వాడయితే నాకు నచ్చుతాడో అని ఆలోచించే సమయములో తిరుపతికి వచ్చినాను. మీ కళ్ళలో ఖచ్చితమయిన లక్ష్యముండేది. నేను ఆశిస్తున్నది ఇటువంటి వ్యక్తినే అని నాకు అనిపించింది. మళ్ళీ మీరెక్కడ జారి పోతారో అన్న భయము. అందుకే మీ చుట్టూ తిరిగాను. ఇవి నా తెలివి తేటలు మాత్రము కాదు. తెలియని ఆరాటము. మీ గురించి నా అభిప్రాయము మా అమ్మకు చెప్పినాను. మా అమ్మకు కూడా నా ఆలోచన సరైనదే అని అనిపించింది. మా నాన్నగారు కూడా మీ గోత్ర వివరాలు అడిగింది ఈ ఉద్దేశ్యముతోనే. మీ గోత్రము ఏమవుతుందో అని చాలా కంగారు పడినాను.”
“ఎప్పుడూ నగరాలలో ఉండే పై పై మెరుగులు నాకు నచ్చ లేదు. కొంత మూర్ఖత్వము కనిపించినా పల్లెటూరి వాళ్ళలో ఉన్న ప్రేమ అక్కడ కనిపించదు. నాకు నిజానికి జీవితమంతా పచ్చని పొలాల మధ్య పల్లెటూర్లలో ఉండాలని ఉంది. మా నాన్న గారికి  పల్లెటూర్ల మీద సదభిప్రాయము లేదు. అందుకే పెద్ద వాళ్ళ ప్రమేయము లేకుండా నేనే ముందుకు దిగినాను. మీరు నెల్లూరు వెళ్లి ఆరు నెలలయింది. అందుకే మీరు ఎక్కడ జారి పోతారో అన్న భయము ఏర్పడింది. ఇంక ఉండబట్ట లేక వచ్చేశాను.”
“నీకు తెలుసు కదా మా అమ్మ ఎటువంటిదో?”
“”చూచినాను. మీ అమ్మలో అమాయకత్వమే కాదు, విపరీతమయిన ప్రేమ ఉంది. కానీ మీ నాన్నగారిని మీరేమి అర్థము చేసుకున్నారో నాకు తేలియదు. కాని,  నాకు ఆయన  ఒక జ్ఞాని లా కనిపించాడు.”
“అన్నట్లు మీ ఊర్లో ఇంకేమీ చూపించరా? ఇంతట దూరము వచ్చినాను కదా!”
“ఈ రోజంతా ఉండేటట్లయితే ఉప్పు కాలువ చూపిస్తాను . సముద్రము కూడా వెళ్ళ వచ్చును.”
“సముద్రానికి వెళ్దాము.”
“అయినా వద్దు. అందరి దృష్టిలో అపుడే పడటము మంచిది కాదు. అయినా రానూ పోనూ రెండు మైళ్ళు నడవాలి. ఇంతకూ ఈ రోజు ఉంటావా?”
“లేదు సాయంత్రం  నెల్లూరు వెళ్లి ఎదో ఒక బస్సు ఎక్కి ఉదయానికి తిరుపతి చేరుకోవాలి.  మీ లాగే నాకూ చాలా పని ఉంది.. అన్నట్లు మీకు తెలియకుండా ఒక దొంగ తనము చేసినాను.”
రాము కంగారు పడినాడు, ”ఏమి  చేపావు?”
మొదటి సంవత్సరము మీరున్నారు కాబట్టి అన్నీ మీరు చెప్పినారు. రెండవ సంవత్సరానికి ఎలా? మీ ఫైనల్ యియర్ నోట్సులను అడుగుదామని అనుకుంటే  మీరు సరిగా మాట్లాడ లేదు .నేరుగా అడగాలంటే భయము వేసింది. మీ ప్రాక్టికల్ పరీక్షలపుడు మీకు తెలియకుండా మీ నోట్సులను కాజేసి, అన్నీ జెరాక్స్   చేయించుకొని , గుట్టుగా మీ నోట్సులను మీ పుస్తకాల్లో సర్దేసాను.”
“పెద్ద దొంగ వయ్యావు.”
“మరి నా పరిస్థితి క్లాసు లో తగ్గ కూడదు కదా! ఏమో అప్పుడు నాకు ఆ హక్కు ఉందని అనిపించింది.”
“ఈ నీ మాటలు విన్న తరువాత నీ ప్రణాళిక, నీ పధ్ధతి నాకు చాలా నచ్చినాయి. అందుకే ఏమో ఈ రోజు నీవు చాలా అందముగా ఉన్నట్లు అనిపిస్తున్నావు. అయినా నాకు ఒక్క మాట ఇవ్వాలి. మా అమ్మ, నాన్నలను...”
“ఇంక ఆపండి, వారిని మా అమ్మ నాన్నలకంటే ఎక్కువగా చూచుకుంటాను. ఇది మీకు నేను ఇస్తున్న మాట.”
ఇద్దరూ పైకి లేచి నారు. ఇద్దరి మనసులు చాలా తేలిక పడినవి.

                 --------------------
మధ్యాహ్నము భోజనాల తరువాత లింగయ్య గారు కూడా సరోజ తో మాట్లాడినారు. వారి కుటుంబ వివరాలు అన్నీ కనుక్కున్నారు. సాయంత్రము బయలు దేరుతుంటే, రామును కూడా వెళ్లి నెల్లూరులో తిరుపతి బస్సు ఎక్కించ మన్నాడు.


No comments:

Post a Comment