Thursday, March 16, 2017

శ్లేష


ఒక వైపు  భారతీయులు  గంగి గోవు  లాంటి  వారు , అమాయకులు. మరొక కోణము  కూడా ఉంది. భారతీయులు మేధావులు. రెండూ  నిజమే కావచ్చును. గొప్ప శాస్త్ర వేత్త  లౌకికత్వానికి ఎంత దూరముగా  ఉంటారో తెలియని విషయము కాదు. మరి భారతీయుల విషయములో రెండూ నిజమేనా?
ఆంగ్లేయులు వారి అనుయాయులు  భారత దేశము గురించి  చాలా పరిశోధనలు చేసినారు. శాస్త్ర  విజ్ఞానము వచ్చి, వాటిని బోధించే విశ్వ విద్యాలయాలు రాక పూర్వము, యూరోప్ లో ఉన్న విద్యలో ఎక్కువ భాగము మత విద్య మాత్రమె. మనకు తెలిసిన చాలా మంది శాస్త్ర వేత్తలు మొదట చదువుకున్నది  మతమును గూర్చి మాత్రమె.  అందు వలన వారి ఆలోచనా కోణము కూడా అందుకు అనుగుణముగా ఉంటుంది.
స్థాన విలువ గలిగిన అంకెలు మన దేశములో వేల సంవత్సరాలకు ముందే వాడుకలో ఉన్నవి. ఇందుకు మూల స్థానము దశము అంటే పది. అందుకే దీనిని దశాంశ పధ్ధతి అని అన్నారు. ప్రపంచములో మరెక్కడా ఇటువంటి పధ్ధతి లేదా అని అడుగ వచ్చును. యూరోపియన్ల ప్రకారము మధ్య ప్రాచ్యములో (మెస పోటేమియయా లేదా బాబిలోనియా దేశాలలో) పదహారు (౧౬) ఆధారముగా గలిగిన అంకెలను వాడినట్లు తెలుపుతున్నవి. కాని, అది ఇప్పుడు లేదు.  మన జ్యోతిష గ్రంథాలను మొదట అరబ్బీ భాష లోనికి హరూన్ అల్ రషిద్ కాలములో అనువాదము చేయబడినవి. వారి ద్వారా మన అంకెలు యూరోప్ లోకి ప్రవేసించినవి.  ఫిబోనాక్సీ, కోపెర్నికస్ ల కాలములో మన ప్రాచీన గ్రంథాలలో ప్రస్తావించ బడిన హేమ చంద్ర సంఖ్యలు  ఫిబోనాక్సీ సంఖ్యలుగా మారినవి. కోపెర్నికాస్ ద్వారా  ఖగోళ గణితము అక్కడ ప్రవేశించింది.
గ్రీకు, లాటిన్ అంకెలు వాడుతున్న వారు ఈ అంకెలలో సులభత్వాన్ని అందులో శూన్యము లేదా  సున్నకు  ఉన్న ప్రాధాన్యతను చూచి వారు ఆశ్చర్య పడినారు. వారు చెప్పిన మాట ఏమిటంటే ‘ ప్రపంచ గణిత సామ్రాజ్యములో  భారతీయుల విశిష్ట ప్రతిపాదన శూన్యము/సున్న.  “India’s contribution to the world of mathematics is zero’. ఇక్కడ ఉన్న శ్లేష  భారతీయ మేధావులకు ఎవరికీ అంతు బట్టదు. మనకు సున్నా అనేది గొప్ప ప్రతిపాదన అనీ,  బయటి వారికి మన  పాత్ర శూన్యము అంటే ఏమీ లేదని. చాలా మందికి ఇందులో  ఎటువంటి శ్లేష కనిపించదు. అందుకే  భారతీయులు నిజముగా గంగి గోవులే.
మరొక ఉదాహరణ. అది ప్రధానముగా తెలుగు భాష మాట్లాడే వారి గురించి. విజయ నగర సామ్రాజ్య కాలములో వచ్చిన విదేశీ రాయ బారులు వాలు విన్న తెలుగు భాషను  Italina of the east అంటే ప్రాచ్య దేశాలలో ఇటాలియన్ భాష వలే ఉన్నదనీ చమత్కరించినారు. ఈ మాటను ఒక పొగడ్త గా తీసుకొన్న వారు చాలా మంది ఉన్నారు. అతి ప్రాచీన యూరోపియన్ భాషలు గ్రీకు మరియు లాటిన్.  వారి మొట్ట మొదటి గ్రంథాలన్నీ ఈ భాషల లోనే వచ్చినాయి. ఇంకా హోమర్ నాటి గ్రీకు భాషకు, ఇప్పటి గ్రీకు భాషకు చాలా తేడాలు ఉన్నాయి. అలాగే లాటిన్  నుండి ఇప్పటి ఇటాలియన్ భాష వచ్చినది. ఇంకా ఇటాలియన్ కు తెలుగు భాషకు ఉన్న సమాంతర ధర్మమూ ఒకటుంది. రెండు భాషలు అజంతములే. అంటే అచ్చులతో పదము పూర్తి అవుతుంది. హిందీ లో రామ్  అంటే తెలుగులో రాము లేదా రాముడు అని పలుకుతాము. అదే విధముగా పాపా, రోమా లాంటి పదాలు అజంతములు. అజంతము అయిన పదము కలిగి ఉండుట  ఆ భాష లక్షణమే గాని దానిని విశిష్ట  లక్షణముగా పొగుడుతున్నారని అనుకోవడము  మన వారు అల్ప సంతోషులని చెప్పకనే చెబుతున్నది.
మరొక ఉదాహరణ. బ్రిటిషు వారు మన సాంస్కృతిక మూలాలను దెబ్బ గోడితే తప్ప మనను తమ గుప్పిట్లో పెట్టుకోలేమని చెయ్యని ప్రయత్నమూ లేదు. అందులో చరిత్ర భాగాన్ని విలియం జోన్స్ తీసుకుంటే పవిత్ర గ్రంథాల భాద్యతను మాక్స్ మూలార్ తీసుకున్నాడు. అతడు ఏనాడూ భారత దేశాన్ని సందర్శించ లేదని కొందరు చెబుతారు. అందులో నిజము తెలియదు. ఆయన కొంత మంది సంస్కృత  పండితులను పట్టుకొని విరివిగా డబ్బు ఇచ్చి వేదాలను ఆంగ్ల భాష లోని అనువదింప చేసినాడు. అంతే గాక తనను మోక్ష మూలరు గా చెప్పుకున్నాడు.  ఇంత చేసీ తన భార్యకు ఒక ఉత్తరములో ఇలా వ్రాసినాడు,” నేను చేయించిన అనువాదాలను అనుసరించిన భారతీయుడు వేదాలను గౌరవించడు”  దీనితో అతడి వ్యక్తిత్వము మరియు లక్ష్యము ఏమిటో తెలుస్తుంది. దీని వలన అతడి లక్ష్యము నెరవేరక పోయినా సంస్కృతము, వేదాలు అనబడేవి పాశ్చాత్య ప్రపంచానికి పరిచయము చేయ బడినాయి. ప్రధానముగా జర్మన్లు సంస్కృతాన్ని ఎక్కువగా అభిమానించినారు. ప్రముఖ జర్మన్ కవి గోతే  కాళిదాసు యొక్క అభిజ్ఞాన శాకుంతలాన్ని ఎంతో అభిమానించినాడు. ఇంకా కాళిదాసును ఎలా పొగడాలో తెలియక ఆంగ్లేయులు  కాలిదాసుకు ఒక బిరుదును ఇచ్చినారు. అది ఏమిటంటే Shakespeare of the East.. అంటే ప్రాచ్య షేక్స్పియర్. ఎవరయినా ప్రాచీనులయిన వారి పేరుతొ ఇప్పటి వారిని గౌరవిస్తారు. నిజానికి కాళిదాసు కాలానికి ఆంగ్ల భాషకు ఉనికే లేదన్న విషయాన్ని వారు మరిచిపోయినారు. ఆ పదాన్ని అలాగే వాడుతున్న మన పండితులను చూస్తే బాధ వేస్తుంది.
ఒక సర్దార్జీ యొక్క  హాస్య ప్రహేళిక లేదా జోక్ ఉంది. ఇంగ్లాండ్ వెళ్లి వచ్చిన ఒక సర్దార్జీ ని మిత్రులు అంతా చుట్టుముట్టి ప్రశ్నించినారుట, ”అక్కడ విశేషాలు ఏమిటి?” అని.  ఆ సర్దార్జీ చెప్పినాడుట,” మన పిల్లలు నాలుగేళ్ళు వచ్చిన తరువాత చాలా కష్ట పడి నేర్చుకొనే ఇంగ్లీష్ భాషను ఇంగ్లాండ్ లోని పిల్లలు పుట్టిన మొదటి సంవత్సరమే చక చకా మాత్లాదెస్తారు. ఆ..” మన దేశములో చాలా మంది తల్లి దండ్రులు అదే ప్రయోగాన్ని వాళ్ళ పిల్లల మీద చేస్తున్నారు. “అమ్మా!” అనే పదాన్ని మరిపించి, ”మమ్మీ” అని పిలవక పొతే మండి పడే తల్లులు, కాన్వెంట్లలో

తెలుగు మాట్లాడితే శిక్షించే  అధ్యాపక వర్గము, యాజమాన్యము భారతీయ భాషలను, భారతీయతను భ్రష్టు పట్టిస్తున్నారు. మన దేశములో ప్రతి  భాషదీ ఇదే పరిస్థితి. దీనికి కారణము అమాయకత్వము కాదు, కరుడు కట్టిన స్వార్థము.
ఇటువంటి స్థితినుండి బయట పడాలి, బయట పడుదాము. సంస్కృతములో భారతీయ భాషలలో అద్భుత విన్యాసాలను ప్రదర్శించిన  భారతీయుల సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకండి.
                                                 ఓం శాంతి.


No comments:

Post a Comment