Monday, April 3, 2017

ప్రస్థానము 2

                                             
           
            గోపీ, లేదా గోపాల కృష్ణ వరకవి పూడి బస్సు దిగినాడు. సుమారు ముప్పది ఏళ్ళ క్రిందట తూర్పుకు ఇంకా ముందుకు బస్సులు ఉండేవిట. అక్కడా తన తాత గారి ఊరు  ఉండేదట. పేరు పైనాంపురము. ఇప్పుడు అక్కడ పెద్దగా ఇళ్ళు ఏమీ లేవు. అప్పుడప్పుడు చేపలు పట్టుకొనడానికి వచ్చే పల్లె వాళ్ళు అక్కడ కనిపిస్తారు. మళ్ళీ వేరే చోటుకు మకాము మార్చేస్తారు. మళ్ళీ నిర్మానుష్యముగా కాంతి హీనముగా ఉంటుంది ఆ వూరు. నేలటూరు, కచ్చి వారి ఖండ్రిగ, వాగర్త,.. ఇవన్నీ ప్రక్కన ఉండే ఊర్లు. సుమారు అయిదు కిలోమీటర్ల దూరములోముత్తుకూరు, కృష్ణా పట్ణము మున్నగు ఊళ్ళు ఉన్నాయి.  అక్కడ జనాభా తగ్గి పోయినది.
            నెమ్మదిగా తూర్పు వైపుకు నడుస్తున్నాడు. మధ్యలో ఒక ఊరు రెండు మూడు పాకలతో కనిపించినది. ఆ ఊరు పేరు కుమ్మరి పాళెము. ఒకప్పుడు అక్కడా కుమ్మరి వారు చాలా మంది ఉండే వారుట, ఇప్పుడెవ్వరూ లేరు. పేరు మాత్రమున్నది. ఇంకా ముందుకు వెళ్ళినాడు.
            పైనాంపురము అనంతపురము జంట గ్రామాలు. నిజానికి వాటి సరిహద్దు మీద కూడా ఇళ్ళు ఉండేవి. కానీ రెండూ వేర్వేరు మండలాలకు సంబంధించినవి. అనంతపురము కూడా ఇంచు మించు ఖాళీ అయినాది. పాత కాలపు గుర్తులుగా అక్కడ గ్రామ దేవత గుడి మహలక్ష్మి ఆలయము, దగ్గిరలోనే సీతా రామాలయము ఉన్నవి. అక్కడ అయిదు లేక ఆరు ఇళ్ళు ఉన్నవి.
            ఎవరో అడిగినారు,"ఏమి కావాలి బాబూ!", అని.  ఆ ప్రశ్నలో ఇంకో ప్రశ్న ఉన్నది." ఇక్కడ ఏమున్నదని చూడటానికి వచ్చావు ", అని.
            "సముద్రానికి వెళ్ళాలని ఇలా వచ్చేను",  అన్నాడు. తన మాట నమ్మరని తెలుసు. ఎందుకంటే, సముద్రానికి వెళ్ళె వాళ్ళు మైపాడు కానీ, కోడూరు కానీ వెళ్తారు. ఈ మార్గానికి రారు.
            మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళినాడు. తలుపు మూసేసి ఉన్నది. పూజారి కూడా ఊళ్ళో
ఉండరుట. రోజూ ఉదయాన్నే వచ్చి పూజ చేసి వెళ్ళుతాడుట. వాళ్ళ పూర్వీకులు ఆ గుడిలో పూజ చేసే వారుట.
ఆ అనుబంధము వదులు కోలేక ఇప్పటికీ రోజూ ఉదయన్నే వచ్చి పూజ చేసి వెళ్ళుతాడుట. ఆదరణ లేక గుడి వెల వెల బోతున్నది.
 తాతగారు వ్రాసిన దైనందినులలో కామయ్య అనే వారిని గురించి వ్రాసినాడు. ఆయన రోజు మండపము అనే గ్రామములో ఉండే వారు. ఒక రోజు సముద్ర స్నానానికి వెళ్ళి వస్తుంటే అక్కడ ఇసుక తిప్పలలో ఒక శివ లింగము కనిపించినది. ఆ స్థలాన్ని శుభ్రము చేసి రోజు వెళ్ళి పూజ, అభిషేకము చేసి వచ్చే వాడుట. కొన్నాళ్ళలో అక్కడ దేవాలయము వెలిసినది. అది కాటేపల్లి అనే ప్రాంతములో ఉన్నది. ఇది పైనాంపురానికి ఈశాన్య దిశలో సముద్ర తీరములో ఉంటుంది.
            . అటునుండి దక్షణముగా కొంత దూరము వెళ్ళినాడు. అక్కడ ఒకప్పుడు ఉన్న ఇళ్ళ ఆనవాలు కనిపిస్తున్నవి. ఒక చోట రోడ్డుకు తూర్పుకు తిరిగి వెళ్ళినాడు. అక్కడ ఒక రాళ్ళ గుట్ట కనిపిస్తున్నది. చాలాకాలము క్రింద అక్కడ ఒక ఇల్లు ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తున్నది. అక్కడ తన మోకాళ్ళ మీద కూర్చున్నాడు.ఇది తన పూర్వీకుల వారసత్వము. ఒకప్పుడు  తాతగారు వాళ్ళు ఇక్కడే ఉండినారు.
ఒక్క సారి మనస్సు గతము లోనికి వెళ్ళినది.
            -----------------------------------------------------
            గోపి నాన్న గారి పేరు శ్రీనివాస మూర్తి. ఆయన తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయములో
భౌతిక శాఖాధిపతి. గోపి పై చదువుల కొఱకు అమెరికా వెళ్ళినాడు. నిజానికి ఈ నాడు ఈ నాడు అమెరికా వెళ్ళి నేర్చుకొన వలసిన అవసరము ఏ భారతీయుడికి లేదు. అయితే విదేశాలలో చదువుకొనుట ఒక ప్రతిస్థాత్మక విషయముగా మారినది.
            ప్రపంచమంతటా వ్యాపార ధోరణి నుండి నైతిక విలువల పునరుద్ధరణ వైపు మరలుట ఒక ప్రధాన చర్చనీయాంశముగా మారినది. కానీ, మార్పు అంటే మాత్రము అందరికీ భయము. అందుకే ప్రపంచ వ్యవహారమంతా ఒక త్రిశంకు స్వర్గముగా మారినది. సరిగ్గా ఇటువంటి పరిస్థితులలో గోపీ అమెరికా లో ఉన్నాడు. అక్కడ వారానికి ఐదు రోజులే సంస్థలన్నియు పని చేస్తున్నవి. దేశీయులందరు చేతిలో డబ్బు చేరిందంటే వారాంతానికి  శని, ఆది వారాలుఖఛ్ఛితముగా బయటికి వెళుతారు. కొంత కాలము డబ్బు లేక పోయినా ప్రభుత్వము కల్పించిన క్రెడిట్‌ కార్డులను బాగా వాడే వారు. కానీ దేశము ఆర్ధికముగా దెబ్బ తిన్నందు వలన, ఖర్చు తగ్గించుకొనుటకు, కొన్ని నియంత్రణలను పెట్టినది. అందువలన వారిని కట్టి పడేసినట్లు అయినది. అవసరాలకు  సర్దుకొనుటకు చాలా ఇబ్బంది పడే వారు.
ఇంక భారత్ , చైనా మరియు ఇజ్రాయెల్ దేశీయులు  శని, ఆది వారాలు కూడా బయటికి వెళ్లి ,ఖర్చు పెట్టారు. యూదులు స్వతహాగా పిసినారులు. డబ్బును పొదుపు చేయుటలో వారికి ఉండే ఆనందము ఖర్చు పెట్టుటలో ఉండదు. చైనా దేశీయులు కష్ట పడటములో ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. భారతీయులకు ఆత్మ విశ్వాసము కాస్త ఎక్కువ. అందుకే చైనా వారి వలే కష్ట పడక పోయినా అవసరమయితే ఎంతయినా కష్ట పడతారు. అటువంటి పరిస్థితులలో తమకు సాంప్రదాయకముగా వచ్చిన అలవాట్లను కూడా మరచి పోతారు. వాటిని గుర్తు చేసుకోనుట కొరకేమో అప్పుడప్పుడు కొన్ని సాంస్కృతిక  సంఘాలు కలయిక సభలను జరిపేవి.
గోపీ  లేదా గోపాల కృష్ణ తనతో లుంగీలు, పైజమాలు తప్ప వేరే ఏవీ తీసుకొని రాలేదు. కానీ, తెలిసిన వారి ద్వారా ప్రయత్నము చేసి ఒక ధోవతిని సంపాదించినాడు. ఈ కలయిక సభకు ధోవతి, లాల్చీ  తో వెళితే  అక్కడున్న వారందరూ చాలా విచిత్రముగా చూచినారు. ఆసియా, ఆఫ్రికా మరియు కొన్ని యూరప్  దేశాలకు చెందిన యువకులు , యువతులు వారి వారి  సాంప్రదాయ వేష ధారణలో వచ్చి అందరికీ కను విందు చేసినారు.
ఒక్కొక్కరు తమను పరిచయము చేసుకుంటూ ఒక కవితను కానీ ప్రముఖ సూక్తాన్ని గానీ వారి వారి భాషలలో చెప్పి, ఆంగ్లములో వివరించి మెప్పించినారు. ఇంకా గోపీ కి అవకాశము వచ్చింది. వేదికను ఎక్కి శాంతి మంత్రాన్ని ఇలా
పఠించినాడు
                     సర్వేషు  సుఖినః సంతు
                      సర్వే సంతు నిరామయా
                      సర్వే భద్రాణి పశ్యంతు
                       మా కశ్చిత్  దుఃఖ  భాగినః|
ఇంకా అర్థాన్ని ఈ విధముగా వివరించినాడు.”అందరూ సుఖముగా ఉండ వలెను. అందరూ వ్యాధులు లేకుండా ఉండ వలెను. అందరూ సరి అయిన రక్షణ తో యుండ వలెను. ఎవ్వరికీ దుఃఖము ఉండ కూడదు.
          ఇంకా ఇలా చెప్పినాడు, ”ఋషులు ఇటువంటి సమాజాన్ని ఆశించినారు. ఈ భావన ప్రతి యొక్కరిలో నిరంతరమూ ఉండాలని మంత్రముగా చదివించినారు. ఈ భావన ప్రతి యొక్క రక్త కణములో నిలిచి పోవాలని కోరుకున్నారు.”
          ఈ భావన అందరికీ నచ్చింది. వెంటనే భారతీయులలో యున్న కులాలు, విభేదాలు ఇటువంటి వాటి మీద ఎన్నో ప్రశ్నలు వచ్చినవి. వీటన్నిటికీ నిజానికి గోపి సిద్ధముగా లేడు. అయినా జవాబు చెప్పడానికి ప్రయత్నమూ చేసినాడు.
          ఇంతలో ఒక విద్యార్థి తన కొక పరిచయ పత్రము(visiting card) ఇచ్చి ఈయన నిన్ను ఒక సారి చూడాలని అనుకుంటున్నాడు.  ఫలానా గదిలో ఉన్నాడు” అని చెప్పినాడు.
          విందు భోజనాలతో సభ ముగిసింది. తన దగ్గిర యున్న పరిచయ పత్రమును ఒక సారి చూచుకున్నాడు. పేరు చిదానంద భారతి. ఒక భారతీయ సన్యాసి పేరు వలే యున్నది. సభా వేదికకు దగ్గరలో యున్న హాస్టల్  గదులలో ఒకరి దగ్గరకు వచ్చి యున్నాడు. ఈ పరిచయము కొత్తగా చాలా వింతగా యున్నది.
          వెంటనే అక్కడికి వెళ్ళినాడు.స్వామీజీ గది మధ్యలో కూర్చొని యున్నాడు. చుట్టూ కొంత మంది విద్యార్థులు ఉన్నారు. దేహము, ముఖము చూస్తె భారతీయుడిగా లేదు. కానీ వేష భాషలు అన్నీ భారతీయ సన్యాసి వలే యున్నాయి. అందుకే ఆయనను చూడగానే “హలో” లేదా “గుడ్ ఈవినింగ్”  అని రాలేదు. రెండు చేతులు జోడించి నమస్కారము పెట్టినాడు.
          “hello, you are Gopala Krishna?”(హలో! గోపాల కృష్ణ వు నీవే కదా?)
          “Yes, Sir”(అవును.)
          “I see in you some light, some splendour in your face.Yes, yes, it appears, you are going to build up a model village, no, no  a town, in India. Yes, it is going to be true, I see it before my eyes.”
(నీ కళ్ళలో ఏదో వెలుగు, ఏదో తేజస్సు ను చూస్తున్నాను. నాకు కనిపిస్తున్నది.నీవు ఇండియా లో ఒక నమూనా గ్రామాన్ని, కాదు, కాదు ఒక నగరాన్ని  నిర్మించ బోతున్నావు. ఇది నిజమవుతుంది. అవును, నా కాళ్ళ ముందు  దానిని చూస్తున్నాను.)
          గోపీ కి ఒక్క సారి షాక్ తిన్నట్లు అయింది. తను ఏమిటి? ఒక నగరాన్ని నిర్మించుట ఏమిటి?
          “I don’t know how. I can not undestand anything.”(ఎలా? నాకేమీ అర్థము కావటము లేదు.)
          “Yes, yes, you are not ready to get it. come over here. please be seated.”(అవును. ఇప్పుడే నీకిది అర్థము కాదు. రా వచ్చి కూర్చో.)
          ఆయన తనను పరిచయము చేసుకున్నాడు.  తాను ఒకప్పుడు  ఈ విద్య సంస్థ లోనే విద్యార్థి గా ఉండే వాడు. తల్లి దండ్రులు జన్మతః  అమెరికా జాతీయులు. మొదట ఆర్థికముగా బాగుండేది. స్నేహితుల ప్రాపకము ఎక్కువయింది. తల్లి దండ్రులు తరువాత విడాకులు తీసుకున్నారు. తనను, తన ఆలోచనలను అర్థము చేసుకొనే వారు  కరువయినారు. తండ్రి మాత్రము తనకు ఖచ్చితముగా అవసరానికి మించి డబ్బు పంపించే వారు. అదే తనను పూర్తిగా పాడు చేసినది. చివరకు విద్యా సంస్థనుండి బహిష్కరింప బడినాడు.
          ఒక రోజు ఇదే సభా వేదికలో సంస్కృతీ సంగమము  క్రింద  వేదాంత శాఖ ఒక భారతీయ సన్యాసిని ఆహ్వానించినది. ఎదో ఆతృత కొద్దీ  ఆ ఉపన్యాసము వినుటకు తను కూడా వెళ్ళినాడు. ఆయన ఉపన్యాసములో ప్రధానముగా మానవ సంబంధాల గురించి ప్రస్తావించ బడినది.
          “ భారతీయ సాంప్రదాయము ప్రధానముగా కర్మ, పునర్జన్మల మీద ఆధార పడుతుంది. వాటి గురించి మీకు తెలుసు  అనుకుంటాను. ప్రతి వ్యక్తీ తను ఎందుకు వచ్చినాడో, ఎక్కడికి వెళ్ళాలో మరచి పోగూడదు. పుట్టినపుడు తన చుట్టూ యున్న పరిసరాలు అతడి సంస్కారాన్ని తాకి, ప్రభావితము చేయుటకు ప్రయత్నమును చేస్తాయి. కొన్ని జన్మలుగా అతడిలో విభిన్న సంస్కారాలు ప్రోగు చేసుకొని ఉంటాయి.  జన్మల వెంబడి అతడిలో ఆ  సంస్కారాల చరిత్ర పెరుగుతూ ఉంటుంది. అంటే అతడిలో అన్ని లక్షణాలూ అంతర్నిహితముగా పెరుగుతూ ఉంటాయి. ప్రతి లక్ష్యాన్ని అతడు పరీక్ష చేసుకోవాలి. ఫలితాన్ని బట్టి దానిని ఉంచు కోవడమో వదిలించు కోవడమో జరుగుతుంది. ఆ విజ్ఞత వచ్చే నాటికే  అతడిలో కర్మ పరమయిన బరువు పెరుగుతుంది. అతడిలో ఏ సంస్కారమయితే  ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందో  అది తరువాత జన్మలో అవకాశాన్ని తీసుకుంటుంది.
          ఎదురుగా మధుర పదార్తములున్నవి. కడుపులో ఆకలిగా ఉంది. ఒకరికి ముందు తన ఆకలి గుర్తుకు వస్తుంది. రెండవ వాడికి ముందు రోజునుండి తిండి లేకుండా యున్న తన స్నేహితుడు గుర్తుకు వస్తాడు, తనకెంతో ఆకలిగా యున్నప్పటికీ. ఇదే సంస్కారాలలో పరిణత స్థితిని తెలియ చేస్తుంది.
          తిరిగి పుట్టినపుడు అక్కడ వాతావరణము తనలో  అత్యంత ప్రభావాన్ని చూపించే సంస్కారానికి  అనుగుణముగా ఉంటుంది. అయినప్పటికీ అక్కడ వాతావరణములో  మార్పు వచ్చి, వేరొక సంస్కారానికి అనుగుణముగా  మారినట్లు అయితే , ఆ సంస్కారము కూడా తనలో ఉన్నదయితే, అది శక్తిని పుంజుకొని పైకి లేస్తుంది. ఈ విధముగా మొదటి  సంస్కారముతో ప్రయోగము ఆగి పోతుంది. అందుకే ఒక ఆత్మలో ఎన్ని దుష్ట  సంస్కారాలు గత జన్మ నుండి వచ్చినప్పటికీ పరిసరాలు మంచి సంస్కారాలతో ప్రభావితము చేస్తే, ఆ సంస్కారాలు పైకి లేచి దుష్ట సంస్కారాలను బలహీన పరుస్తాయి. అది ఆ జీవి చేసిన సత్కర్మ మీద ఆధార పడుతుంది.”
తరువాత ఆయన పురుషార్థాలను గురించి మాట్లాడినాడు.
“ధర్మము, తను చేయుటకు నిర్దిష్టమయిన పని, అర్థము, దానికి కావలసిన ఉపకరణము, లేదా పరిసరాలు, కామము, తనలో ప్రభావాన్ని చూపుతున్న కోర్కెలు, అవి న్యాయమయినవి లేదా అన్యాయమయినవి, మోక్షము, మోహ క్షయమే మోక్షము. ఈ నాలుగు నడుస్తున్న దారిలో మానవ సంబంధాలను ప్రభావితము చేస్తాయి.....”ఈ పద్ధతిలో ఉపన్యాసము నడచింది. మన నడవడిక శ్రీ కృష్ణుడు చెప్పినట్లు “పరస్పరం భావయంతః “ అనే ధోరణిలో సాగాలని చెప్పినారు.
వింటున్న వారిలో అన్ని మతాల వారు యున్నారు. ఉపన్యాసము అయిన తరువాత విన్న వారికి ప్రశ్నించే  అవకాశము ఇచ్చినారు.
“మీరు అంటున్న ఇన్ని జన్మలు ఎక్కడివి? చని పోవడము తోనే అతడి యాత్ర ఆగి పోతుంది కదా.” ఒకరు ప్రశ్నించినాడు.
“ఇంతకూ మీరు ఏ మాట సాంప్రదాయమునకు చెందిన వారు?” ఉపన్యాసకుడు అడిగినాడు.
“క్రైస్తవము” జవాబు వచ్చింది.
“ఎలిజా నే జాన్ గా పుట్టిన విషయము బైబిల్ లో మీరు చదవ లేదా?’ జవాబు వచ్చింది.
మరొకరు అడిగినారు. “అర్థము అంటే ఉపకరణము అని అన్నారు. అర్థము అంటే ధనము కదా.”
“ ఇప్పటి వాతావరణము లో మీరు చెప్పినది సరి పోతుంది. కానీ ఋషులు అలా చెప్ప లేదు. వారు, ధనమగ్నిః, ధనం వాయుః, ధనం భూతాని పంచచ  అంటే మన చుట్తో యున్న పంచ భూతాలే ధనమని చెప్పినారు .దీన్ని బట్టి, మనము సృష్టించిన డబ్బును పెంచు కోవటానికి వాతావరణాన్ని కల్మషాలతో నింపుతున్న వారు, అర్థము లేదా ధనమును పెంచే వారు కాదు, వాటిని నాశనము చేసే వారు. ఈ విధముగా పరిసరాల రక్షణ జీవన విధానములో భాగముగా తీసుకోవాలి.”
ఇప్పుడు జార్జి అడిగినాడు, ”బిడ్డలకు డబ్బు ఇచ్చి భాద్యత తీరి పోయిందనుకొనే తల్లి దండ్రులను గూర్చి చెప్పండి.”
“డబ్బు ఉపకరణాలను ఇస్తుందే గానీ సంస్కారాలను పెంచదు. తల్లి దండ్రులు తమ పిల్లల మీద చూపించే ప్రేమ , ఎదిగిన పిల్లలు తమ కుటుంబీకుల మీద, తరువాత పరిణతి చెందే కొద్దీ , విశ్వమంతా తన కుటుంబమనే స్థాయికి ఎదిగి, ప్రతి జీవ రాసి మీద చూపిస్తాడు. మొదట్లోనే ఆ ప్రేమ కరువయితే ఆ జీవి పరిణామము ఎలా జరుగుతుంది?”
జార్జికి ఆ ఉపన్యాసము ఎంతగానో నచ్చింది. అంతే గాక తన జీవితములో జరిగిన పొరపాట్లు కొట్ట వచ్చినట్లు  కన్పించినాయి. ఆ వక్త వెళ్లిపోతుంటే వెంట బడి చిరునామా తీసుకున్నాడు. తన భావాలను, తన బాధలను ఆయనతో పంచుకున్నాడు. ఆయన పర్యవేక్షణలో ఎన్నో ఆధ్యాత్మిక సాధనాలను చేసినాడు. తను కోరుకున్న ఆనందము కొరకు వెదికి, వెదికి, చివరకు అందుకొని, తన గురువుద్వారా “చిదానంద భారతి” గా సన్యాస దీక్ష తీసుకున్నాడు.
ఆయనకు ఉన్నది ఒకటే కోరిక. తను బాధ పడినట్లు, విషమ పరిస్థితులలో ఉన్న వారికి మార్గ దర్శనము చేస్తాడు. దీనినే ఆంగ్లములో కౌన్సేల్లింగ్ అని అంటున్నారు. ఆ కారణము గానే ఆయన అక్కడికి వచ్చి యున్నారు.
స్వామీజీ తన కథనంతా చెప్పినాడు. తను ఎక్కువ రోజులు ఉండనని, తన గురువు దగ్గిరకు భారత దేశము వెల్లుతున్నానని చెప్పినాడు. గోపీ తో కొద్ది సమయము గడపాలని అనిపించింది అని చెప్పినాడు.
“నన్ను చూడగానే మీకు ఎందుకు అలా అనిపించింది?” గోపి అడిగినాడు.
“మా గురువు గారు నా చేత చేయించిన సాధనలు నన్ను ఒక స్థాయికి తీసుకొని పోయినవి. సంకల్పము చేసుకొని చూస్తె, దేహములో వర్ణముల కలయిక ఆ వ్యక్తీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది. దీనినే మనము ఆరా  అంటున్నాము. నీవు చదివిన శాంతి  శ్లోకము వినగానే ఆ భావము నిజముగా నీలో యున్నదా , లేక సమయానికది గుర్తుకు వచ్చి చదివినావా అని అనుమానము వచ్చినది. ఒక్క సారి ధ్యాన స్థితి లోనికి వెళ్లి  నిన్ను గమనించినాను. నీలో కొన్ని జన్మల ఉన్నత సంస్కారాలు నిద్రాణ స్థితి లో  ఉన్నాయి. సమాజానికి ఏదయినా చేయాలంన్ కోరిక నీలో గత జన్మ నుండీ ఉన్నది. అది కూడా నిద్రాణముగా ఉంది. వాటిని నీకు గుర్తు చేయ వలసిన అవసరము కనిపించి నిన్ను పిలిపించాను. ఈ పరిశీలనలో నీవు చేయ బోయే పనులు లీలా మాత్రముగా కనిపించినాయి. అవే నీకు నేను చెప్పినాను. ఈ సామర్థ్యము మా గురువు గారు ఎంతో ప్రేమతో నా చేత చేయించిన సాధనల వలన వచ్చింది” ఒక సారి తన గురువుకు నమస్కారము చేసుకున్నాడు.
“నేనెప్పుడూ ఈ విధముగా ఆలోచించ లేదు.” అన్నాడు గోపి.
“ నీ పేరేమిటి అన్నావు?”
“గోపాల కృష్ణ”
“గోపాల కృష్ణ. పేరు కూడా సరి పోయింది.”తనలో తను అనుకున్నాడు.
మళ్ళీ పైకి అన్నాడు.” గోపాల కృష్ణుడు ఎన్నో నగరాలను నిర్మించినాడు. అంటే కాదు. వ్యసన లోలురయిన  పాలకులను యుద్ధ రంగానికి రప్పించి, వధింప చేసి, ఒక విశాల సామ్రాజ్యాన్ని నిర్మించిన్నాడు. ఆయన అంతరంగము ఎవరికీ అంతు బట్టడు. ఇంతకూ కృష్ణుడిని గూర్చి చదివావా?”అన్నాడు.
ఔనన్నట్లు తల ఊపినాడు.
“తను  ఒకరికి సాయము చేయాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. తెలుసా?”
గోపీ యే కాదు అక్కడ యున్న అందరూ అనుమానముగా చూచినారు.
“సర్వ సత్తాక స్వతంత్రత. ఇది యొక స్థితి. తను ఎవరి మీద ఆధార పడని స్థితిలో నున్న వాడే ఎటువంటి పరిస్థితులలో నైనా , ఎవరి కైనా సహాయము అందించ గలడు. నిరంతరమూ ఆహారము సంపాదించుకొనుటకు అలమటించే వాడు అందరి ఆకలి తీర్చ లేడు.  అనారోగ్య వంతుడు మరొకరికి ఆరోగ్యము పెంపొందించే సలహా ఇవ్వ లేడు. ఎప్పుడూ అప్పులలో మునిగిన వాడు,  మరొకరికి ఆర్ధిక సహాయము చేయ లేడు.  తన అవసరాలను తగ్గించుకొని లోకానికి సాయము చేయ గలిగిన వాడు  ఆ స్థితిలో ఉంటాడు. భారతీయ ఋషులందరూ ఆ స్థాయి వారే.”
“అటువంటి వ్యవస్థ వీలవుతుందని నేనంటే మీరు నమ్మ లేరు. ఇప్పుడు కాదు, అయిదు వేల సంవత్సరాల క్రిందట  కృష్ణుడి కాలములోనే నమ్మ లేక పోయినారు. అందుకే గోకులములో తన చిన్న వయసులోనే గడపినాడు. వారికి కృష్ణుడు ప్రసాదించినది ఇటువంటి వ్యవస్థే.”
“అప్పటి సామాజిక పరిస్థితులను చూచి భయము వేస్తున్న వారికి ఈ మాటలు నమ్మ శక్యముగా ఉండవు.”
“మధుర మీద పదిహేడు సార్లు దండ యాత్ర జరిగితే కృష్ణుడు ఎదుర్కొన్నాడు. నిరంతర సంఘర్షణలో ఉన్న సమాజములో సృజనాత్మకత లోపిస్తుంది. భయము పెరుగుతుంది. దీని ప్రభావము పెద్ద వాళ్ళ కంటే  ఎదుగుతున్న పిల్లల మీద ఎక్కువ ఉంటుంది. అంటే ఒక తరము నాశనమై పోతుంది. అందుకే సముద్ర ములో ద్వారకా నగరాన్ని నిర్మించి  ఆ భయాన్ని తొలగించినాడు.”
“హస్తినాపురాన్ని పాలించే వాడంటే భూమిని పాలించే వాడితో సమానము. ద్రోణుడు, భీష్ముడు లాంటి శాస్త్ర వేత్తలు హస్తినాపురానికి పెట్టని కోట వంటి వారు. అక్కడ ధృత రాష్ట్రుడి లుబ్దత్వము, శకుని కుటిలత్వము, దుర్యోధనుడి అహంకారము, అసూయా ద్వేషాలు, నిండు సభలో ఇంటి కోడలినే అవమానించిన సంస్కార హీనత ,ఇటువంటి వాటిని చక్క దిద్ద గలిగిన శక్తి  సామర్థ్యాలు ఉండి కూడా భీష్ముడు పూనుకొన లేదు. తన ఇంటి కుల స్త్రీ కే రక్షణ ఈయ లేని వ్యవస్థ లో సమాజములో మిగిలిన స్త్రీలకూ ఎంత రక్షణ ఉందొ గమనించమన్నాడు వ్యాస మహర్షి. అందుకే అక్కడ కృష్ణుడి అవసరము ఏర్పడింది. ఇదే మహాభారత యుద్ధానికి దారి తీసింది. “
“ఇవి సామాజిక భద్రతకు సంబంధించిన వి. ఏ ఒక్కటి లోపించినా మనిషి అశాంతిలో నలిగి పోతాడు. అవసరాన్ని అనుసరించి మహాత్ములు ప్రపంచములో అన్ని చోట్లా జన్మించినారు. వారి జీవితాలను అర్థము చేసుకోండి. దేనికీ భయ పడకండి. మన పని మనము చేసుకుంటూ వెళ్ళడమే, తిరిగి చూడడముండదు.”
గోపీ కి అంటా విచిత్రముగా ఉంది.తను చిన్నప్పటినుండీ కృష్ణుడి గురించి ఎన్నో విన్నాడు. ఎన్నో మహిమలు విని మురిసి పోయినాడు. వీటన్నిటికి ఒక చక్కని ప్రణాళిక యున్నదని ఇప్పుడు తను వినే వరకు, ఆ భావన తనలో రాలేదు. ఒక విదేశీయ యువకుడు సన్యాసిగా మారి ఇంత పరి జ్ఞానాన్ని సంపాదించినాడంటే అతడిని తయారు చేసిన గురువు ఎంత గొప్ప వాడో? ఒక సారి మనస్సు లోనే నమస్కారము పెట్టుకున్నాడు.
స్వామీజీ మళ్ళీ ఉపన్యాసము కొనసాగించినాడు.
“ప్రపంచములో ప్రతి యుద్ధమూ భారత దేశము వైపు నడచింది. ప్రతి యొక్క విజ్ఞానము భారత దేశము నుండి అందినది. అందుకే ఈ నాడు ప్రపంచమంతా భారత దేశము వైపు ఆశగా చూస్తున్నది. ఇక్కడ మీరు నేర్చుకొనే సమాచార ప్రసార విజ్ఞానము మరియు మేనేజ్మెంట్ కోర్సులతో బాటు భారతీయ ప్రాచీన వ్యవస్థను గమనించి చదవండి. ఋషుల ప్రవచనాలలో మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి.”
ఇవి అన్నీ అయేసరికి రాత్రి పన్నెండు గంటలు అయింది. అందరూ లేచినారు. గోపీ కూడా వచ్చి గదిలో పండుకున్నాడు.  ఎంతకూ నిద్ర పట్ట లేదు. ఒకటే ఆలోచనలు. స్వామీజీ చెప్పిన మాటలే  గుర్తుకు వస్తున్నాయి.
మర్నాడు గ్రంథాలయానికి వెళ్ళినపుడు  భారతీయ పురాణ ఇతిహాస  రచనలను కూడా చదవాలని అనుకున్నాడు. ప్రతి గ్రంథము యొక్క ఆంగ్లానువాదములు గ్రంథాలయములో ఉన్నాయి.
ముందు మహాభారతము చదివినాడు.  ఒక్కొక్క  విషయాన్ని ఒక్కొక్కరు ఎలా అర్థము చేసుకుంటారో, ఎలా చేస్తే ఎటువంటి ప్రయోజనాలు వస్తాయో  అటువంటి విశ్లేషణ తనకు బాగా నచ్చింది. తమ పెద్ద తండ్రి  పిల్లల వలన  రక్షణ లోపించినపుడు  పాండవులు అయిదు మంది తల్లి కుంతీ తో బాటు ఎటువంటి ఆధారము  లేకుండా అడవులలో తిరుగుట చూస్తే వారు ఏ  నమ్మకముతో పని చేసినారో తెలుస్తుంది. దుర్యోధనుడి  బలగాన్ని అర్జునుడు మొదటి సారి ద్రౌపదీ స్వయంవరములో  ఎదుర్కొని నిలువరిస్తాడు. భీష్ముడి లాటి పెద్దల ప్రయత్నము వలన  తొండలు కూడా తిరుగ లేనటువంటి  ధృత రాష్ట్రుడు  తమ కిస్తే, అక్కడ యమునా నది ఒడ్డున ఇంద్ర ప్రస్థ నగరాన్ని  నిర్మించ్కుంటారు. (ఇంద్ర ప్రస్థానికి  ద్వారము లాటి  ప్రదేశమునే దేహళి అంటే  కడప యన్నారు. ఈ నాడు ఇంద్ర ప్రస్థము అనే పేరు పోయి దేహళి మాత్రము ధిల్లీ అనే పేరుతొ ఒక రాజదాని గా మిగిలి పోయింది.)పరమ వైభవముగా రాజ సూయ యాగము చేసినారు. ఆ యాగము యొక్క వైభవమే దుర్యోధనుడికి కన్ను కుట్టేతట్లు చేసి మాయ ద్యూతానికి ప్రేరేపించ చేసినది. ఆ మయ సభలో ద్రౌపది నవ్వింది అనే విషయము వ్యాసుడు వ్రాయ లేదు. అది తరువాత కల్పించ బడినది. కొద్ది ఏళ్ళలో కలి ప్రవేశాన్ని సూచిస్తూ నిండు సభలో కుల స్త్రీ ని అవమానిస్తే  అశ్వత్థామ, యుయుత్సుడు, వికర్ణుడు లాంటి వారు తప్ప భీష్మ ద్రోణాదులు నోరెత్తి మాట్లాడ లేదు. విదురుడు మనసు లోనే క్రుంగి పోయినాడు. చివరకు వన వాసము , అజ్ఞాత వాసము పాండవులకు తప్ప లేదు.
ఎన్ని కష్టాలు పడినా పాండవులు మానసికముగా కృష్ణుడి  ఆశ్రయము లోనే జీవించినారు. అదే వారికి కష్ట  కాలములో రక్షణగా నిలిచింది. అడవులలో పాండవులను అవమానించుటకు  ఘోష యాత్ర పేరుతొ  అడవికి వెళ్ళిన దుర్యోధనాదులను గంధర్వులు బంధిస్తే  అర్జునుడే తిరిగి వారిని రక్షిస్తాడు.
అజ్ఞాత వాస సమయములో విరాట రాజు గోవులను అపహరించిన దుర్యోధనాదులను తిరిగి అర్జునుడే ఓడిస్తాడు. ఈ మూడు సమయాల్లోనూ ఒడి పోయిన దుర్యోధనుడి పరివారములో కర్ణుడున్నాడు. కానీ తను ఖచ్చితముగా అర్జునిడి  ఓడించ గలనన్నధీమాయే మహా భారత యుద్ధానికి దారి తీసింది.
యుద్ధము ముగిసిన తరువాత  ధర్మ రాజు ఎన్నో విషయాలను అంప శయ్య మీద ఉన్న  భీష్ముడి ద్వారా తెలుసుకుంటాడు. ఈ విధముగా పాండవుల జీవిత యాత్రను పూర్తగా తెలుసుకోవాలంటే  మహాభారతమును చదవక  తప్పదు.
శ్రీ కృష్ణుడి జీవితమే ప్రధాన అంశము గా హరివంశము. శ్రీ మద్భాగవతము, సాధనా సామర్త్యమును పెంచే ఉపనిషత్తులు, మరెన్నో ఉపాఖ్యానాలు ఖాళీ ఉన్నపుడల్లా చదివినాడు. ఈ జ్ఞానము తన మేనేజ్మెంట్  స్టడీస్  లో ప్రాజెక్ట్  పనికి ఏంటో ఉపయోగ పడింది.
ఒక రోజు తమ ప్రొఫెస్సర్ అన్నాడు,” ఏ గ్రంథాన్ని అయినా వీలయినంత వరకు  అది మొదట వ్రాయ బడిన భాషలో  చదువుటే మంచిది. ఎందుకంటే అనువాదము చేసే వారు తమ వ్రాతలలో తమ అభిప్రాయాలను కూడా జోడించే అవకాశము ఉంది.” ఈ మాటను విన్నప్పటి నుండి, గోపీకి సంస్కృతము నేర్చుకొని మూల గ్రంథాలను చదవాలనే కోరిక పెరిగింది.
ఈ విధముగా తన జీవితములో అవగాహనలో  వస్తున్న మార్పులను  వివరముగా వ్రాసి, మెయిల్ లో తల్లికి తండ్రికి పంపే వాడు. వారినుండి వచ్చిన జవాబులు తనలో ఉత్తేజాన్ని  నింపేవి. తండ్రి శ్రీనివాసమూర్తి  సంప్ర దాయకమయిన జీవితములో యున్నా ప్రాచీన గ్రంథాలను ఎక్కువ చదువ లేదు. తల్లి శారద  మాత్రము ఇటువంటి అవగాహన ఉన్న కుటుంబము నుండి వచ్చినందు వలన  ఆమె జవాబులు తనకు ఇంకా చదవాలని కోర్కెను పెంచేవి. తల్లి సహకారముతో క్రమముగా సంస్కృతములో ప్రవేశమును సాధించినాడు.
(To be continued)

                 

No comments:

Post a Comment