Monday, April 3, 2017

పిచ్చి మొక్క



నా ఆత్మ కథను వింటారా? నా వ్యథ ను తీరుస్తారా? నేనొక  పిచ్చి మొక్కను. నా లాంటివి చాలా ఉన్నాయి. అన్నిటికి అదే బాధ.  మీకు మేము ఏమి అపకారము చేసినాము? మమ్ములను బ్రదుక నీయరా?
ఒకప్పుడు పొలాల గట్లపై ,కాలువ  గట్లపై, ఇళ్ళ  మధ్య ఖాళీ స్థలాలలో ఎక్కడ బడితే అక్కడ ఉండే వారము. అంతే కాక, మీకు వచ్చిన చిన్న వ్యాధుల నివాతనకు మా సహకారముఉండేది.
అడవులలో నివసించే వారు ఏ  చిన్న గాయమైనా ఎదో ఒక ఆకు పసరు రుద్దుకొని నయము చేసుకొనే వారు. అందుకే మా బ్రతుకుకు ఒక ప్రయోజనము ఉండేది. ప్రతి చెట్టుకు ఒక ప్రాధాన్యత ఉండేది. కొన్ని చెట్లు/మొక్కలు దైవములా పూజను అందుకోనేవి. ఆయుర్వేద వైద్యమునకు ఆదరణ ఉన్నంత కాలము మా పరిస్థితి బాగుగానే ఉండేది. ఉత్తరేణి ఆకులను ఉపయోగించి నాగు పాము విష ప్రభావము కూడా తగ్గించ గలిగిన  సత్తా ఉన్న వారు ఉండే వారు. సరస్వతి ఆకు ఇళ్ళ మధ్యనే ఉండేది. మేధస్సు పెరగడానికి సరస్వతీ ఆకులను తేనే లో నిల్వ ఉంచి దానిని తీసుకొనే వారు. ఏ  మాత్రము గాయము తగిలినా ఉత్తరేణి లేదా నేల పొగడ (దీనిని గాయపు ఆకు అని కూడా పిలుస్తారు) మన అవసరాలను తీర్చేది. ఈ రకముగా పల్లెటూళ్ళలో చాలా మందికి చాలా మొక్కలు  తెలిసి ఉండేవి. తులసి దేవతా మొక్కగా గుర్తింపు వలన  దానికి ప్రత్యెక రక్షణ ఉన్నది.
ఒక ప్రాచీన గురుకులములో గురువు శిష్యులను పిలిచి అడవి అంతా వెదికి ఎవరికీ పనికి రాని ఒక మొక్కను పట్టుకొని రమ్మన్నారట. ఒక్కరు తప్ప అందరూ తలా ఒక మొక్కను పట్టుకొని వచ్చినారుట. ఆ ఒక్కడు తనకు పనికి రాణి మొక్క ఏదీ కనిపించ లేదని చెప్పినాడట. ఆ గురువు అతడినే ఉత్తమ శిష్యుడిగా గుర్తించినారుట. అంతే కాక ప్రాచీన ఆయుర్వేద వైద్యులు  ఒక్కొక్క మొక్క దగ్గిర ధ్యానము చేసి  ఆ మొక్కల సముదాయానికి ప్రయోజనాన్ని ఆ మొక్క అధిదేవత ద్వారా తెలుసు కొనే వారుట. ఇది ఒకప్పటి ఆయుర్వేద వైద్యుల స్థితి.
ఈనాడు ఇళ్ళ  పెరళ్ళలో నున్న మొక్కలని పిచ్చి మొక్కలని  మమ్ములను తొలగించి వీధిలో పడేస్తున్నారు. ఇంటి ప్రాంగణమంతా సిమెంటు చేసి, మాకున్న కొద్ది స్థలాన్ని కూడా మాకు పనికి రాకుండా చేస్తున్నారు. రోడ్డుకు ఇరు వైపులా ఉన్న మొక్కలను  కూడా శుభ్రత పేరు తొ పీకి వేస్తున్నారు. ఇంత శుభ్రత కోరుకునే వారు కాలువల నీటిని అపార్టుమెంట్ల వ్యర్థాలతో మరియు పరిశ్రమల వ్యర్థాలతో నింపి పాడు చేస్తుంటే ఎవరూ అడగరేమి? ఇంకా వారి శుభ్రతకు మేమే అడ్డము వచ్చినామా? అలా అని మమ్ములను ఎవరయినా విడిగా పెంచుతున్నారా? కొన్ని మొక్కలను నిర్మూలించడానికి  ఒక్కొక్క సారి మా మొక్కలపై విష పదార్థాలను చల్లుతున్నారు.  మీరు ఒక విషయము గుర్తించు కోవాలి. సున్నితమయిన మొక్కలు వాటి వలన పోతున్నాయి. ఇంకా మిగిలిన మొక్కలు మీకు విషాన్నే అందిస్తాయి. (ఆలోచించండి)
ఒకప్పుడు రోడ్లకు ఇరు వైపులా బ్రహ్మాండమయిన చెట్లు ఉండేవి. వాటి వలన ప్రయాణీకులకు చల్లని గాలి తగిలేది. ఈ నాడు వాటిని పూర్తిగా నిర్మూలించి వేసినారు. ఈ నాడు ఆ రోడ్లలో ప్రయాణము ఎంత వేడిగా ఉంటుందో? మీలో స్వార్థము పెచ్చు పెరిగి పోయింది. అది మమ్ములను నిర్మూలించడమే కాదు, వృక్ష సంపదను నాశనము చేసి భూమిని  అగ్ని గుండము గా మార్చి వేస్తుంది. ఆలోచించండి, ఇదే పరిస్థితి కొన సాగితే  చివరకు మీరూ మిగలరు.
జెనెటిక్ ఇంజనీరింగ్
ఒక జెనెటిక్ ఇంజనీర్ హడావిడిగా వాళ్ళ బాస్ ను కలిసి, “సార్! గ్రాండ్ సక్సేస్. తియ్యటి నిమ్మకాయలను సృష్టి చేసినాను.’
అప్పుడు బాస్ యొక్క అతిథి ఆన్నాడు. ”దానికి ఇంత కష్ట పడడము ఎందుకు. నిమ్మ కాయకు బదులు కమలా కాయను తింటే సరి పోదా ఏమిటి?”  
జెనెటిక్ మ్యుటేషన్:
రాము: రావణాసురుడు గొప్ప జెనెటిక్ ఇంజనీర్ తెలుసా?
భీము:  నీకెలా తెలుసు?
రాము:  ఆశోక వనములో సీతమ్మ చుట్టూ కూర్చున్న  స్త్రీలు అంతా జెనెటిక్ ఇంజనీరింగ్ ఫెయిల్యూర్ లే కదా.
ఇంకొక ప్రశ్న. ఆధునిక కాలములో మొట్ట మొదటి గొప్ప జెనెటిక్ ఇంజనీర్ ఎవరో తెలుసా?
భీము: నీవు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది?
రాము:  థాలోమైడ్ రసాయనాన్ని తలనొప్పికి మందుగా ప్రయోగించిన వ్యక్తీ.
భీము: ఎందుకని?
రాము: అప్పుడే కదా, కొంత మందికి కాళ్ళు లేకుండా కొంత మందికి చేతులు లేకుండా పిల్లలు పుట్టినారు.

(రావణుడి లంకలో సీతమ్మ చుట్టూ ఉన్న స్త్రీలలో చాలా మందికి జన్యు  విపరిణామాలు ఉన్నాయి. చూడండి వాల్మీకి రామాయణము.)

No comments:

Post a Comment