Tuesday, April 11, 2017

రెండు చిలుకలు 6


                                      
 ఆ రోజు ఆదివారము. రాము వాకిట్లో కూర్చొని యున్నాడు.  వాణి కూడా ఎంతో హడావుడిగా ఉంది.
వయస్సు పదమూడు  ఏళ్ళే అయినా నాన్నకు అన్ని పనులలో ఇంట్లో సాయము చేసేది. కూతురు హుషారు చూచి రాము కూడా అడ్డము చెప్ప లేదు. అమ్మ వస్తుందని నాన్న చెప్పినాడు. అమ్మకు రాగానే ఏమయినా చేసి పెట్టాలి. పక్క ఇంట్లో అత్తయ్య గారిని  వంట ఇంట్లో కూర్చో పెట్టుకొని తనే స్వీట్ ఏదో చేస్తున్నది. తను చేయ గలనన్న నమ్మకము ఇంకా ఏర్పడ లేదు.
          తొమ్మిది గంటల బస్సు వచ్చింది. పల్లెటూర్ల లో ఏ కొత్త వ్యక్తీ వచ్చినా వింతగా చూడటము రివాజే.
          “సరోజమ్మ వచ్సిందిరో” ఎవరో అంటున్నారు.
“అయ్య గార్ని వదిలేసిందనుకున్నాము కదా. మళ్ళీ వచ్చిందేమిటి?” మరొకరు అంటున్నారు.
“ఆయనను అంత కష్ట బెట్టి  ఏమి బావుకుంది?” మరొకరు.
ఈ మాటలు అన్నీ సరోజకు వినబడుతూనే ఉన్నాయి. చేతిలో చిన్న సంచితో నేరుగా ఇంటికి వచ్చింది.
ఈ హడావుడి చూచి అందరి కంటే ముందు వాణి పరుగెత్తుకొని వచ్చింది.
“అమ్మా! వచ్చేశావా?” అమ్మను కావిలించుకుంది.
రాము లేచి నిలబడినాడు.
సరోజకు కళ్ళల్లో  నీరు కారి పోతున్నాయి.
“ఇంకా రాము కు తన మీద కోపముగా ఉందా?”
“తను ఏమి చేసిందని తనకు చెప్పకుండా ఎటో వెళ్లి పోయినాడు?”
“ఒక్క సారి డిల్లీ వచ్చి ఉండ వచ్చును కదా.” ఎన్నో ప్రశ్నలు.
“రాణీ ఏదమ్మా!” వాణి  ప్రశ్న.
“బాగున్నావా?” రాము ప్రశ్న.
“చూస్తున్నారు కదా నేను ఎలా యున్నానో?”
“లోపలికి  రావచ్చునా?” ప్రశ్నించింది.
సరోజ కళ్ళలో శక్తి లేదు. కళ్ళు లోపలి పోయి యున్నాయి. ముఖములో కనిపించే నవ్వు కృత్రిమముగా ఉంది. ఇవన్నీ రాముకు అర్థమవుతున్నాయి. అందరూ లోపలిక్ వెళ్ళినారు.
అత్తగారి పటాన్ని చూచి “అత్తయ్యా!” అంటూ మోకాళ్ళ మీద కూల బడి పోయింది.” అవసరానికి లేని ఈ బ్రదుకు ఎందుకండీ?” అంటూ వెక్కివెక్కి ఏడవ సాగింది. తనతో బాటు వాణీ కూడా ఏడుస్తున్నది.
“సరోజా! ఏడవ వద్దు. ఒక్క సారి వాణి ముఖాన్ని చూడు. బిక్క చచ్చి పోయింది.”అంటూ భుజాలు పట్టుకొని లోపలి గది లోనికి తీసుకొని వెళ్ళినాడు.
“ఏమండీ! ఏమయిందండీ? మీరిన్నాళ్ళు ఏమయినారండీ?”
“ఇదంతా ఎలా జరిగిందండీ? ఎటు వంటి సమాచారము మీరు ఇవ్వ లేదు. ఒక్క టెలిగ్రామ్ ఈయ లేక పోయినారా?”
“సరోజా!నీకు రెండు టెలిగ్రాం లు ఇచ్చినాను రెండేసి సార్లు ట్రంక్ కాల్ లు చేసినాను. దేనికీ జవాబు లేదు. నీవు ఒక్క జాబు కూడా వ్రాయ లేదు. డిల్లీలో కాక మరెక్కడ యున్నావో అనుకున్నాను. అయినా ప్రయాణపు బడలిక మీద యున్నావు. ముందు ముఖము కడుక్కొని రా. నెమ్మదిగా మాట్లాడుకుందాము.” రాము నెమ్మదిగా యన్నాడు.
“వద్దండీ! ముందు నన్ను మాట్లాడనీ. నా గుండెల్లో బాధను ముందు దింపేసుకోనీ. అత్తయ్య గారు పోయిన సమాచారము నాకు అందనే లేదు. మీ నుండీ ఏ సమాచారమూ లేదు.” రాము ఎదో చెప్పా బోతుంటే,
“నన్ను మాట్లాడనీయండి. నేను ప్రతి నాల్గు రోజులకొక ఉత్తరము వ్రాసినాను. మీ నుండీ ఏ జవాబు రాలేదు. మీరు ఫోన్  చేసిన విషయము నాకు తెలియదు. అమ్మ చాలా బాధతో యుంది. ఒంట్లో బాగా లేదు. మీ సమాచారము ఏమీ తెలియ లేదు. నేను కారణము ఊహించ లేక పోయినాను. ఒక రోజు నందిని ముందు గది లోనుండి కొన్ని చిత్తూ కాగితాలు తీసుకొని వచ్చి నాకు చూపించింది.”
“అన్నీ ముక్కలుగా ఉన్నాయి. చాలా కష్ట పడి పేర్చుకొని చూస్తే అది మీ ఉత్తరమే. అందులో మీరు ఫోన్ చేసిన విషయము కూడా ఉంది. అంతే కాదు, నానుండి ఒక్క ఉత్తరము కూడా లేదని ఉంది. నేను ఖంగు తిన్నాను. నేను వ్రాసిన ప్రతి ఉత్తరము పోస్ట్ బాక్స్ లో వేయమని అన్నయ్యకు ఇచ్చే దాన్ని. నేను గొడవ పెడితే చెప్పినాడు వాటిని బాక్స్ లో వేయమని రాహుల్ కు ఇచ్చినాడుట. అంత వరకే నాకు తెలుసు. అప్పుడర్థమయింది. నా మీద కోపముతో రాహుల్ వాటిని చింపి వేసి ఉంటాడని. ఇంకా ఫోన్ విషయమై  అన్నయ్యను గదమాయించినాను. ఒక రోజు ఫోన్లు రెండు సార్లు వస్తే రాహుల్ “ఎవరూ లేరని” ఫోన్ పెట్టేసినాదుట. నేను, నందిని ఇంకా రాహుల్ ఇంట్లోకి రావడము కుదరదని గట్టిగా చెప్పినాము.”
“ఈ విషయము తెలిసి మీ దగ్గిరకు రావాలనుకుంటే వెంటనే రిజర్వేషన్  దొరక లేదు. రిజర్వేషన్ లేక పోయినా  బయలు దేరాలనుకుంటే మా అమ్మ ఒప్పుకోలేదు. రిజర్వేషన్ దొరికి  ఊరికి వస్తే ఇల్లు తాళము వేసి ఉంది. ఎవరిని అడిగినా సమాధానము చెప్పా లేదు. అంతే గాక నా మీద వ్యాఖ్యానాలు చేసినారు. అయినా అది కూడా వారి తప్పు కాదు. వారికి మీ మీద యున్న ప్రేమ గౌరవము వలననే అలా చేసినారు. నాకు ఏమి చేయాలో తెలియ లేదు., పూజారి ఇల్లు కూడా తాళము  వేసి యుంది. ఎవరింటికి వెళ్ళాలి తెలియ లేదు. నా స్నేహితులు కూడా నెల్లూరు లో ఎవరూ లేరు. చివరకు జనరల్ కంపార్టుమెంట్లో డిల్లీ చేరినాను. మీరు ఇంటికి వస్తే చూస్తారని పిచ్చి దానిలా ఉత్తరాలు వ్రాసినాను. వేటికీ జవాబు లేదు.”
“ నిజానికి నామీద కోపముతో రాహుల్ చేసిన వెధవ పనుల వలన  మన మధ్య సంబంధము పోయింది. ఆ పాపము తనకూ కొట్టింది. ఒక రోజు అన్నయ్య రాహుల్ స్కూటర్ మీద వెళుతుంటే ప్రమాదము జరిగి రాహుల్ కు రెండు కాళ్ళు తీసి వేసినారు. అన్నయ్యకు ఒక కాలు కుంటిదయింది. వారిద్దరి మధ్య స్నేహము చెడింది. అన్నయ్యకు ఉద్యోగము పోలేదు. కానీ చెడు సహవాసము పోయింది. అప్పటి నుండీ నేరుగా ఇంటికి వస్తున్నాడు. మా వదిన ముఖములో కాస్త సంతోషము విరిసింది.”
“”అమ్మకు మీరు ఎక్కడున్నారో తెలియక రోజూ బాధ పాడేది. ఈ పరిస్థితులలో రాణి కి కూడా చిరాకు ఎక్కువయింది. ప్రతి దానికీ ఇప్పటికీ రుస రుస లాడుతూనే ఉంటుంది.”
“అన్నయ్య వలన నేను నష్ట పోయినాను. అందుకే తనది ఒక్క పైసా కూడా ముట్టుకోవడము నాకు ఇష్టము లేదు. ఇక్కడకు వచ్చి ఉండాలని యుంది. కాని మీ సమాచారము లేదు. అందుకే ధైర్యము చేయ లేక పోయినాను. అందుకే ఒక కార్పోరేట్ విద్యా సంస్థ లో చేరినాను. నేను  రోజూ పోగొట్టుకుంటున్న ఆనందాన్ని ఆ పిల్లల మధ్య వెదుక్కున్నాను. వాళ్లకు ఫిజిక్సు పాఠాలు చెబుతున్నపుడు మీరు నా ముందున్నట్లే ఊహించుకొనే దాన్ని. ఒక్కొక్క సారి వాణిని చూడాలని తీవ్రముగా అనిపించేది. రాత్రి పొద్దు పోయిన తరువాత అత్తయ్యను, మిమ్ములను, వాణిని తలచుకొని ఏడ్చే దాన్ని.”
“ మా విద్యా సంస్థల వాళ్ళు ఒకరిని ఇక్కడికి పంపించాలని అనుకున్నారు. వెంటనే ఆ వూరు నాకు బాగా తెలుసు నేనే వెళ్తానని బ్రదిమాలుకున్నాను. నా అదృష్టము కొద్దీ వారు ఒప్పుకున్నారు. ఇక్కడికి వచ్చే వరకు నా మనస్సు మనస్సులో లేదు. కానీ ఏదో నమ్మకము, మీరే ఆ పని చేస్తున్నారని అనిపించినది.”
ఇంతలో వాణి తీపి పదార్ధమును చేతిలో పట్టుకొని, ”అమ్మా! నీ కోసము నేనే చేశాను. ఎలాగుందో చెప్పమ్మా!” అంటూ వచ్చింది.
దాన్ని తీసుకొని రాముకు, వాణికి పెట్టి తనూ తీసుకొని, ”చాలా బాగుందమ్మా!” అని చెప్పింది. తరువాత రాము జరిగిన విషయాలు తాము తిరిగిన ప్రదేశాలు అన్నీ వివరించి చెప్పినాడు. తిరిగి వచ్చిన తరువాత తను సరోజ డైరీ చూచి, ఆ ప్రేరణ తోనే ఈ పని మొదలు పెట్టినానని చెప్పినాడు.
కొంచము భావావేశాలు  తగ్గిన తరువాత “అన్నయ్య గారూ!”అంటూ లలితమ్మ వచ్చింది.”వదినమ్మా! స్నానాదులు పూర్తీ చేసుకోండి. ఈ పూట  మా ఇంట్లోనే మీ భోజనము.” అని అన్నది.
మధ్యాహ్నము భోజనాలయిన తరువాత  రాము అడిగినాడు,”మళ్ళీ డిల్లీ ప్రయాణము ఎప్పుడో?”
కొంచెము ముఖము తేట పడింది సరోజకు. వెంటనే అంది.” ఎక్కడికి వెళ్ళినా మీతోనే. నేను ఒంటరిగా వెళితే మీరు ఎక్కడ జారి పోతారో?”
రాము అన్నాడు, ”రాణి సంగతి?”
“ఇప్పుడు పరిస్థితి అర్థము కాక రాణిని తీసుకొని వచ్చే ధైర్యము చేయ లేక పోయినాను.  ఇద్దరమూ వెళ్లి రాణిని తీసుకొని వద్దాము.. ఇంకా నేను కూడా మిమ్ములను విడచి డిల్లీలో ఉండ లేను. వెళ్ళగానే రాజీనామా చేస్తాను. అయితే ఒక్క షరతు” ఆగింది.
“ఏమిటి?” అన్నాడు.
“”మా విద్యా సంస్థల వారు మనలను కలిపినారు. మీరు వారి కోసము కొన్ని ఉపన్యాసాలు ఇవ్వాలి.”
“అలాగే! రాణీ వారి ఆజ్ఞ”
    ---------------------------------------------
వాణీ తో కలిసి ఇద్దరూ వెళ్లి నాలుగు రోజులు అక్కడే యున్నారు. సరోజ అన్నయ్య ప్రవర్తన చాలా సౌమ్యముగా మారింది. దానితో ఇంట్లో నందినికి కూడా గౌరవము పెరిగింది.  సరోజ అమ్మగారు కూడా ఈ మార్పులతో చాలా సంతోషముగా యున్నారు. ఇంక నందిని ఆమె చేత చిన్న పని కూడా చేయించుట లేదు.
ఇంతకూ ముందు భర్త ప్రవర్తన వలన సరోజను తన పుట్టింటికి రమ్మని ఎప్పుడూ పిలవ లేదు. మారిన పరిస్థితులలో సరోజను, రామును తన నాన్న ఇంటికి పిలుచుకొని వెళ్ళింది. వృద్దులయిన ఆ తల్లి దండ్రులు ఎంతో సంతోష పడినారు. వారి ఆశీస్సులు తీసుకొని ఇంటికి వచ్చినారు. సరోజ అమ్మను తనతో రమ్మని పిలిచింది. ఆమె,”నందిని కాస్త సంతోషముగా ఉంది. దానికి తోడుగా ఉంటాను. అందరమూ ఒక సారి వస్తాము” అన్నది. తిరిగి, సరోజ తన అన్నయ్యను , నందినిని బాబు తో సహా పైనాం పురము రమ్మని ఆహ్వానించి బయలు దేరింది తమ వెంట వాణి, రాణిలతో.
                   ---------------------------
రాము వేసిన షెడ్ ఒక విద్యా సంస్థ గా మారింది. కొంత మందిని టీచర్లు గా తీసుకున్నా వారి కి శిక్షణ ఇచ్చినారు. విద్య వ్యాపారము కాకుండా భవనాలు, జీతాలకు సరి పోయేంత మాత్రమేమె పిల్లల వద్ద జీతాలుగా తీసుకున్నారు. బాగా పేద వారు, తెలివి, మంచి లక్షణాలు ఉన్న పిల్లలకు మొత్తము జీతము వెనక్కు ఇచ్చేసే వారు. తమ పొలము మీద వచ్చే దానితో మాత్రమె ఇంటిని నడుపుకొనే వారు. తను అనుకున్న విద్యా విధానము అమలు పరిచినందుకు సరోజకు చాలా సంతోషముగా ఉంది.  తాము నిజముగా నేర్చుకుంటున్నామన్న భావన పిల్లలో ఉంది.  

వాణి ఎప్పుడూ హుషారుగా ఉన్నది. రాణి  చాలా మారింది, కానీ అప్పుడప్పుడు తెలియకుండా చిరాకు వచ్చేది. ఇద్దరూ వాళ్ళు పెరిగిన వాతావరణమును అనుసరించి అలా తయారయినారు. మరో రెండేళ్లకు రాముకు ఒక కొడుకు  పుట్టినాడు. మామయ్యా గారే పుట్టినారని సరోజ సంతోష పడింది. ఇంకా వాణి, రాణి లు ఆ తాతయ్య అంటూ వాడిని వదలి పెట్టడము లేదు.
ఒక ప్రణాళిక భూమిపై విరిసింది. కాలము మాత్రము నడిచి పోతూనే ఉంది.
                                                 తథాస్తు.



No comments:

Post a Comment